అట్లాంటిక్ మహాసముద్రంలో, గడ్డకట్టే చలిలో తిరగబడ్డ బోటు అడుగున 16 గంటలు, ఆ నావికుడు చివరికెలా బయటపడ్డాడు

అట్లాంటిక్‌లో తిరగబడ్డ బోటు

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, మాలు కుర్సినో
    • హోదా, బీబీసీ న్యూస్

అట్లాంటిక్ మహాసముద్రంలో ఓ బోటు తిరగబడింది. అందులో ప్రయాణిస్తున్న ఓ 62 ఏళ్ల నావికుడు తిరగబడిన బోటులో చిక్కుకుపోయాడు. ఆ బోటులో ఉన్న ఒక ఎయిర్ బబుల్ (గాలి బుడగ)ను 16 గంటల పాటు ఉపయోగించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు.

12 మీటర్ల పొడవున్న ఆ పడవ పోర్చుగల్ రాజధాని లిస్బన్ నుంచి బయలు దేరింది. సోమవారం సాయంత్రం పొద్దుపోయాక అట్లాంటిక్ మహాసముద్రం మీది నుంచి ఆ బోటు ప్రమాదంలో చిక్కుకున్న సంకేతం పంపించింది.

తిరగబడిన బోటును స్పెయిన్ కోస్ట్‌గార్డులు కనుగొన్నారు. కానీ సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో అతడిని రక్షించటానికి వీలుపడలేదు. దీంతో బోటులో చిక్కుకున్న వ్యక్తి ఉదయం వరకూ నిరీక్షించక తప్పలేదు.

ఆ నావికుడు ప్రాణాలతో బయటపడటం నమ్మశక్యం కాని ఉదంతమని కోస్ట్‌గార్డ్ డైవర్లు చెప్పారు.

తిరబడ్డ బోటులోని నావికుడిని రక్షిస్తున్న సహాయ సిబ్బంది

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, అట్లాంటిక్‌లో తిరగబడ్డ బోటు నుంచి నావికుడిని రక్షించటానికి తెల్లవారే వరకూ నిరీక్షించాల్సి వచ్చింది

ఆ బోటు నుంచి స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 8:23 గంటలకు డిస్ట్రెస్ సిగ్నల్ వచ్చింది. స్పెయిన్‌కు వాయువ్యంగా ఉన్న గాలీసియా ప్రాంతానికి సమీపంలో సిసర్గాస్ దీవులకు 22.5 కిలోమీటర్ల దూరంలో ఈ బోటు తిరగబడింది.

ఆ బోటును కనిపెట్టి, అందులోని నావికుడిని రక్షించటానికి ఐదుగురు డైవర్లతో ఒక రక్షణ నౌక, మూడు హెలికాప్టర్లు బయలుదేరాయి.

తిరగబడిన బోటు వద్దకు చేరుకున్న నౌక నుంచి ఒక డైవర్ తాడు సాయంతో బోటు హల్ మీదకు చేరుకుని.. ఆ బోటులో ఎవరైనా సజీవంగా ఉన్నారేమో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. బోటులో చిక్కుకుని ఉన్న నావికుడు బోటు లోపలివైపు గట్టిగా బాదుతూ తాను ప్రాణాలతోనే ఉన్నానని తెలియజేశాడు.

అయితే అప్పటికే సూర్యుడు అస్తమించటంతో పాటు సముద్రం చాలా అల్లకల్లోలంగా ఉంది. దీంతో.. సహాయ సిబ్బంది తిరగబడిన బోటు సముద్రంలోకి మునిగిపోకుండా ఉండేలా దానికి గాలి బెలూన్లు కట్టారు. తెల్లవారే వరకూ నిరీక్షించారు.

అట్లాంటిక్‌లో తిరగబడ్డ బోటు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, బోటు నుంచి ప్రాణాలతో బయటపడ్డ నావికుడిని హెలికాప్టర్‌లో ఆస్పత్రికి తరలించారు

ఉదయం ఇద్దరు డైవర్లు ఈదుకుంటూ బోటు కిందకు వెళ్లారు. అక్కడ ఆ బోటు నావికుడు సింథటిక్ రబ్బర్‌తో తయారు చేసిన సర్వైవల్ సూటు ధరించి మోకాళ్ల వరకూ నీటిలో మునిగి ఉన్నాడు.

డైవర్లు రావటంతో ఆ నావికుడు బోటు నుంచి.. గడ్డకట్టుకుపోయేంత చల్లగా ఉన్న నీటిలోకి దూకి సముద్రం పైవైపుకు ఈదుతూ వచ్చాడు.

స్పెయిన్ మారీటైమ్ సేఫ్టీ అండ్ రెస్క్యూ సొసైటీ ఒక ట్వీట్ చేస్తూ.. ''కాపాడిన ప్రతి ప్రాణం మాకు అతి పెద్ద రివార్డు'' అని పేర్కొంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఆ నావికుడు తనకు తానుగా నీటిలోకి దిగాడని కోస్ట్‌గార్డ్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ సభ్యుడు విసెంటి కోబెలో చెప్పారు.

అయితే ఆ నావికుడు తన సూట్ నుంచి బయటకు రావటం కష్టం కావటంతో ఆయనను బయటకు లాగటానికి డైవర్లు సాయం చేశారని తెలిపారు.

ఆ నావికుడిని సహాయ సిబ్బంది హెలికాప్టర్‌లో ఆస్పత్రికి తరలించారు. ప్రాధమిక తనిఖీ అనంతరం పంపించారు.

వీడియో క్యాప్షన్, సముద్రపు దొంగల్ని పట్టుకునే విమానం లాంటి పక్షి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)