చేపలకు శ్వాస తీసుకోవడం ఎందుకు కష్టం అవుతోంది?

వాతావరణం వేడెక్కడంతో ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లోని సముద్రాల్లో ఆక్సిజన్ స్థాయులు పడిపోతున్నాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వాతావరణం వేడెక్కడంతో ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లోని సముద్రాల్లో ఆక్సిజన్ స్థాయులు పడిపోతున్నాయి
    • రచయిత, నికోలా జోన్స్
    • హోదా, బీబీసీ ఫ్యూచర్

ఆగ్నేయా చైనా తీరంలో ఒక ప్రత్యేకమైన చేప జాతి విజృంభిస్తోంది. సన్నగా జెల్లీలా కనిపించే ఈ చేప పేరు ‘బాంబే డక్’. ఇక్కడి తీరంలో గంటకు 200 కిలోలకుపైగా బాంబే డక్‌లు పరిశోధక నౌకలకు చిక్కుతున్నాయి. దశాబ్దం మునుపటితో పోలిస్తే, ఇది పది రెట్లు ఎక్కువ.

‘‘ఇది చాలా భయానకంగా అనిపిస్తోంది’’ అని బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీ ఫిషరీస్ రీసెర్చర్ డేనియేల్ పాలీ చెప్పారు.

ఇంత భారీగా ఇక్కడ బాంబే డక్‌ల సంఖ్య పెరగడానికి ఇక్కడి నీటిలో ఆక్సిజన్ స్థాయులు పడిపోవడమే కారణమని పాలీ చెప్పారు. చాలా చేపలు ఆక్సిజన్ స్థాయులు పడివడంతో ఇక్కడి నుంచి వెళ్లిపోయాయి. అయితే, ఇలాంటి వాతావరణాన్ని తట్టుకుని మనుగడ సాగించగలిగే బాంబే డక్‌ లాంటి చేపలు మాత్రమే ఇక్కడ జీవిస్తున్నాయి.

ఇక్కడ బాంబే డక్‌ల సంఖ్య విపరీతంగా పెరగడంతో కొంతమంది సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వీటిని ఆహారంగా తీసుకోవచ్చు. అయితే, ఇక్కడి పరిస్థితులు భవిష్యత్ ఎలా ఉండబోతోందో అర్థం పడుతున్నాయి.

వాతావరణం వేడెక్కడంతో ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లోని సముద్రాల్లో ఆక్సిజన్ స్థాయులు పడిపోతున్నాయి. దీంతో చాలా చేపల జాతులు తమ సొంత ప్రాంతాలను వదిలి వేరేచోటకు వలస వెళ్లాల్సి వస్తోంది. కఠినమైన పరిస్థితులను తట్టుకొని నిలబడగలిగే కొన్ని జాతులే మిగలడంతో చాలా ప్రాంతాల్లో జీవ వైవిధ్యం దెబ్బ తింటోందని పరిశోధకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇక్కడ వైవిధ్యం పడిపోవడం అంటే, మొత్తం పర్యావరణ వ్యవస్థే కుప్పకూలే ముప్పు ఉంటుంది. ‘‘ఆక్సిజన్ స్థాయులు తగ్గిపోవడం అనేది చాలా పెద్ద సమస్య’’ అని పాలీ చెప్పారు.

భవిష్యత్‌లో సముద్రాలు మరింత వేడెక్కడంతోపాటు, ఆక్సిజన్‌ స్థాయులు పడిపోవడంతో చేపల సంఖ్య తగ్గిపోతుంది. అంతేకాదు, చేపల పరిమాణం కూడా తగ్గుతుంది. దీనికి తోడు గ్రీన్‌హౌస్ వాయువులను ఉత్పత్తిచేసే బ్యాక్టీరియా కూడా పెరుగుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా ఉష్ణమండల జలాల్లోని చేపలు ఆక్సిజన్ ఎక్కువగా ఉండే ప్రాంతాలవైపు వెళ్లిపోతాయని పాలీ చెప్పారు. మరోవైపు ధ్రువాల దగ్గర కనిపించే చాలా రకాల చేపలు అంతరించిపోయే ముప్పు ఉంటుందని ఆయన అన్నారు.

1960ల నుంచి 2010 మధ్య ప్రపంచ సముద్రాల్లో ఆక్సిజన్ స్థాయులు రెండు శాతం కంటే ఎక్కువే తగ్గిపోయాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1960ల నుంచి 2010 మధ్య ప్రపంచ సముద్రాల్లో ఆక్సిజన్ స్థాయులు రెండు శాతం కంటే ఎక్కువే తగ్గిపోయాయి

ఎవరూ పట్టించుకోవడం లేదు..

సముద్రంలో ఆక్సిజన్ స్థాయులు తగ్గిపోవడంపై ఎవరూ దృష్టిపెట్టడంలేదని పరిశోధకులు అంటున్నారు. సముద్రంలో కార్బన్ డైఆక్సైడ్ స్థాయులు పెరగడంతో జరిగే ఓషన్ యాసిడిఫికేషన్, గ్లోబల్ వార్మింగ్‌పైనే ప్రస్తుతం ఎక్కువగా పరిశోధనలు జరుగుతున్నాయని వివరిస్తున్నారు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రపంచ ఉపరితల సముద్ర ఉష్ణోగ్రతలు మునుపటితో పోలిస్తే, ప్రమాదకరంగా సగటున 21 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పెరిగినట్లు వార్తలు వచ్చాయి. సముద్ర జీవులకు ఇది అసలు మంచిది కాదు. కానీ, ఇక్కడ వార్మింగ్, యాసిడిఫికేషన్, డీఆక్సిజనేషన్‌లను పోల్చినప్పుడు.. ఆక్సిజన్ స్థాయులు తగ్గిపోవడంతో ఎక్కువ దుష్ప్రభావాలు వస్తాయి.

‘‘ఇదేమీ ఆశ్చర్యానికి గురిచేయడం లేదు’’ అని నెదర్లాండ్స్‌లోని ర్యాడ్‌బౌండ్ యూనివర్సిటీ ఎకో-ఫిజిసిస్ట్ విల్కో వెర్బెర్క్ అన్నారు. ‘‘ఆక్సిజన్ స్థాయులు పడిపోతే ఇతర ప్రభావాలు కూడా తీవ్రం అవుతాయి. ఇక్కడ చేపలు, ఇతర సముద్ర జీవులు మనుగడ సాగించడానికి అసలు ఆక్సిజన్ అనేది మొదట ఉండాలి కదా’’ అని వెర్బెర్క్ అన్నారు.

1960ల నుంచి 2010 మధ్య ప్రపంచ సముద్రాల్లో ఆక్సిజన్ స్థాయులు రెండు శాతం కంటే ఎక్కువే తగ్గిపోయాయి. వచ్చే శతాబ్దంలో 1960ల నాటితో పోలిస్తే, మొత్తంగా ఇవి ఏడు శాతం వరకూ తగ్గొచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఆక్సిజన్ స్థాయులు చాలా వేగంగా పడిపోతున్నాయి. వీటిలో 15 శాతానికిపైగా తగ్గుదలతో ఈశాన్య పసిఫిక్ మొదటి స్థానంలో ఉంది.

ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ) 2019లో విడుదలచేసిన ప్రత్యేక నివేదిక ప్రకారం, 1970ల నుంచి 2010 మధ్య పెద్ద జీవులు మనుగడ సాగించలేని ‘‘ఆక్సిజన్ మినిమమ్ జోన్స్’’ మూడు శాతం నుంచి ఎనిమిది శాతానికి పెరిగాయి.

ఆక్సిజన్ స్థాయులు పడిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. వీటిలో మొదటిది భౌతిక శాస్త్ర సూత్రం.. అదే చల్లని నీటితో పోల్చినప్పుడే వేడి నీరు అంతగా ఆక్సిజన్‌ను ఒడిసిపట్టి ఉంచలేదు. దీంతో భూమి వేడెక్కినప్పుడు, సముద్రంలోని ఉపరితల జలాల్లో ఇతర గ్యాస్‌లతోపాటు ఆక్సిజన్ స్థాయులు కూడా పడిపోతాయి. సముద్రంలోని 1,000 మీటర్ల లోతు నీటిలో తగ్గిపోతున్న సగం ఆక్సిజన్ స్థాయులకు ఇదే కారణం.

మైక్రోప్లాస్టిక్ కాలుష్యం కూడా ఆక్సిజన్ స్థాయులు పడిపోవడానికి కారణం అవుతున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మైక్రోప్లాస్టిక్ కాలుష్యం కూడా ఆక్సిజన్ స్థాయులు పడిపోవడానికి కారణం అవుతున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు

సముద్రం లోతుల్లో ఏం జరుగుతోంది?

కాస్త లోతుకు వెళ్తే, ఇక్కడి ఆక్సిజన్ స్థాయులను సముద్ర ప్రవాహాలు నియంత్రిస్తాయి. పైనుంచి కిందకు వచ్చే జలాలపై ఇక్కడి ఆక్సిజన్ స్థాయులు ఆధారపడి ఉంటాయి. వీటిని కూడా వాతావరణ మార్పులు ప్రభావితం చేస్తున్నాయి. కరిగిపోతున్న మంచు ఫలకాలతో భారీగా మంచి నీరు సముద్రంలో కలుస్తోంది. అయితే, తక్కువ సాంధ్రత కలిగిన ఈ నీరు కొన్ని ప్రాంతాల్లో అడుగున ఉండే నీటితో సరిగ్గా కలవడం లేదు. మరోవైపు భూమధ్య రేఖతో పోలిస్తే, ధ్రువాల దగ్గర వాతావరణం మరింత ఎక్కువగా వేడెక్కడంతో సముద్ర ప్రవాహాలను నడిపించే గాలులు తీవ్రత కూడా తగ్గుతోంది.

చివరగా నీటిలో జీవించే బ్యాక్టీరియా గురించి చెప్పుకోవాలి. ఇవి ఫైటోప్లాంక్టన్‌లు, ఇతర సేంద్రీయ పదార్థాలపై ఆధారపడి జీవిస్తుంటాయి. అయితే, ఇవి సముద్రం అడుగుకు చేరుకున్నప్పుడు, అక్కడి ఆక్సిజన్‌ను కూడా స్వాహా చేస్తాయి. తీర ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ పొలాల్లోని ఎరువుల నుంచి వచ్చే నీటితో ఆల్గే స్థాయులు పెరుగుతాయి. వీటి వల్ల అక్కడ ఆక్సిజన్‌ను స్వాహా చేసే బ్యాక్టీరియా స్థాయులు కూడా పెరుగుతాయి. దీని వల్ల గల్ఫ్ ఆఫ్ మెక్సికో సహా చాలా ప్రాంతాల్లో ‘‘డెడ్ జోన్‌’’‌లు ఎక్కువ అవుతున్నాయి.

మరోవైపు మైక్రోప్లాస్టిక్ కాలుష్యం కూడా ఆక్సిజన్ స్థాయులు పడిపోవడానికి కారణం అవుతున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. జూప్లాంక్టన్‌లు ఫైటోప్లాంక్టన్లకు బదులుగా మైక్రోప్లాస్టిక్స్‌ తీసుకోవడంతో సముద్రంలో ఫైటోప్లాంక్టన్ల స్థాయులు పెరుగుతాయి. ఫలితంగా ఆక్సిజన్ స్వాహా చేసే బ్యాక్టీరియా స్థాయులు పెరగడానికి ఇది కారణం అవుతోంది.

ఆక్సిజన్ స్థాయులు పడిపోవడంపై దృష్టి పెట్టేందుకు 2018లో వందల మంది పరిశోధకులు ‘‘కీల్ డిక్లరేషన్’’పై సంతకం చేశారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆక్సిజన్ స్థాయులు పడిపోవడంపై దృష్టి పెట్టేందుకు 2018లో వందల మంది పరిశోధకులు ‘‘కీల్ డిక్లరేషన్’’పై సంతకం చేశారు

పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంది?

1960ల నుంచి సముద్రంలో ఆక్సిజన్ తక్కువగా ఉండే ప్రాంతం మొత్తంగా 1.7 మిలియన్ చదరపు మైళ్లుకు పెరిగిందని గ్లోబల్ ఓషన్ ఆక్సిజన్ నెట్‌వర్క్ (జీవోవోఎన్) తెలిపింది. అంటే ఇది కెనడాలో సగం భూభాగం కంటే కాస్త ఎక్కువే. 2080 నాటికి సముద్రాల్లోని 70 శాతం ప్రాంతాల్లో ‘‘డీఆక్సిజనేషన్’’ కనిపించొచ్చని 2021లో నిర్వహించిన ఒక అధ్యయనం తేల్చింది.

ఆక్సిజన్ స్థాయులు పడిపోవడంపై దృష్టి పెట్టేందుకు 2018లో వందల మంది పరిశోధకులు ‘‘కీల్ డిక్లరేషన్’’పై సంతకం చేశారు. కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్‌తోపాటు ఈ సమస్యపైనా అత్యవసరంగా దృష్టిసారించాలని వారు పిలుపునిచ్చారు. ప్రస్తుతం గ్లోబల్ ఓషన్ ఆక్సిజన్ డేటాబేస్, అట్లాస్ (జీవో2డీఏటీ)ను రూపొందించేందుకు పరిశోధకులు కృషిచేస్తున్నారు.

జీవో2డీఏటీ స్టీరింగ్ కమిటీలో సభ్యుడైన మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) బయోకెమిస్ట్ ఆండ్ర్యూ బాబిన్ 2021లో పసిఫిక్‌లో విపరీతంగా ఆక్సిజన్ స్థాయులు పడిపోయిన కొన్ని ప్రాంతాలను గుర్తించారు. ‘‘ఇవి చాలా ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి’’ అని బాబిన్ అన్నారు. పరిస్థితులు ఎలా మారుతున్నాయో అర్థం చేసుకునేందుకు అయిన మళ్లీ మరోసారి మ్యాపింగ్ నిర్వహించాలని చెబుతున్నారు. ‘‘ఆక్సిజన్ స్థాయులు తగ్గిపోవడంతో మీథేన్ లేదా నైట్రస్ ఆక్సైడ్‌ను ఉత్తత్తిచేసే ప్రమాదకర బ్యాక్టీరియా స్థాయులు పెరుగుతున్నాయి’’ అని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, జెల్లీ చేప ఎంత తిన్నా అంతరించిపోదు... డైటింగ్ చేసే వారికి ఇదో వరం

పెద్ద చేపలకు ఎక్కువ ముప్పు..

సముద్ర జీవులపై దీని ప్రభావం అనేది చాలా సంక్లిష్టతలతో ముడిపడి ఉంది. అయితే, జీవులకు మాత్రం దీనితో చాలా చెడు జరుగుతోందని పరిశోధకులు చెబుతున్నారు.

సాధారణంగా వేడి చేపల జీవక్రియా రేటు వేగంగా ఉంటుంది. ఫలితంగా వీటికి ఎక్కువ ఆక్సిజన్ అవసరం అవుతుంది. ఉదాహరణకు ట్రౌట్ చేపను తీసుకోండి, నీరు చల్లగా ఉన్నప్పటి (5 డిగ్రీల సెంటీగ్రేడ్)తో పోలిస్తే కాస్త వేడిగా ఉన్నప్పుడు (24 డిగ్రీల సెంటీగ్రేడ్) వద్ద వీటికి ఐదు నుంచి ఆరు రెట్ల ఎక్కవ ఆక్సిజన్ అవసరం అవుతుంది. కాబట్టి నీరు వేడెక్కేటప్పుడు, ఆక్సిజన్ తగ్గిపోవడంతో ట్రౌట్ లాంటి చేపలకు దెబ్బ మీద దెబ్బ పడినట్లు అవుతుందని బాబిన్ అన్నారు.

ప్రస్తుతం ఉష్ణ మండల ప్రాంతాల్లో లీటరు నీటిలో ఆరు మి.గ్రా.ల ఆక్సిజన్ ఉంటోంది. అదే ధ్రువాల దగ్గర ఇది 11 మి.గ్రా.లుగా ఉంటోంది. అయితే, ఇది 2 మి.గ్రా.కు పడిపోతే, చాలా జీవులు మనుగడ సాగించడం కూడా కష్టం అవుతుంది. కొన్నిసార్లు ఆక్సిజన్ స్థాయులు కొంచెం తగ్గినా ప్రభావాలు తీవ్రంగా ఉండొచ్చు. మనుషులతో పోలిస్తే, శ్వాస తీసుకోవడానికి చేపలు పది రెట్లు ఎక్కువ శక్తిని ఖర్చుపెడుతుంటాయని పాలీ చెప్పారు.

ఆక్సిజన్ తగ్గిపోతే పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉంటాయో పర్వతారోహకులకు బాగా తెలుసు. ఎందుకంటే ఎత్తైన ప్రాంతాల్లో ఆక్సిజన్ తగ్గినప్పుడు వీరికి విపరీతమైన తలనొప్పి, వికారం లాంటి సమస్యలు వస్తుంటాయి. చాలాసార్లు ఆక్సిజన్ తక్కువగా ఉండే ప్రాంతాల నుంచి చేపలు వేరే ప్రాంతాలకు వెళ్లిపోతాయి. ఒకవేళ వెళ్లేందుకు మార్గం లేకపోతే, అవి చాలా సమస్యలు ఎదుర్కొంటాయి. పెరుగుదలతో మొదలుపెట్టి ప్రత్యుత్పత్తి, క్రియాశీలంగా కదలడం ఇలా చాలా అంశాలపై ఇది ప్రభావం చూపుతుంది. అయితే, కొన్ని జన్యుపరమైన, జీవక్రియా చర్యలతో చేపలు కొంతవరకు శక్తిని ఆదా చేసుకుంటాయి. అయితే, దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయి.

ఇక్కడ పెద్ద చేపలు ఎక్కువ ప్రభావితం అవుతుంటాయి. ఎందుకంటే వాటి శరీరం పెద్దది, వాటికి కావాల్సిన ఆక్సిజన్ కూడా ఎక్కువ ఉంటుంది. అతిగా చేపల వేట వల్ల ఇప్పటికే సముద్రంలో పెద్ద చేపలు తగ్గిపోతున్నాయి. ఇప్పుడు ఆక్సిజన్ స్థాయులు తగ్గిపోవడంతో వాటి సంఖ్య మరింత పడిపోతోంది.

వీడియో క్యాప్షన్, చేపలు మనుషులను చంపాలనుకుంటాయా.. ఏ చేపలు ప్రమాదకరం?

ఆక్సిజన్ వెతుక్కుంటూ చేపలు

ఇప్పటికే చేపలు ఆక్సిజన్ ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వలస వెళ్తున్నాయి. లోతైన జలాల్లో జీవించే చేపలు చల్లని ప్రాంతాల వైపుగా కదలి వెళ్లిపోవచ్చు. మరోవైపు ఉపరితల జలాల్లో జీవించే చేపలు కాస్త లోతులకు వెళ్లిపోవచ్చు. ఈ విషయంలో కాలిఫోర్నియా తీరంలో 1995 నుంచి 2009 మధ్య ఒక అధ్యయనం నిర్వహించారు. దీంతో 23 రకాల చేపలు దశాబ్ద కాలంలో 8.7 మీటర్ల లోతుకు వెళ్లిపోయినట్లు తేలింది.

ఇక్కడ వార్మింగ్, డీఆక్సిజనేషన్ కలిసి ప్రభావాలను తీవ్రం చేస్తున్నాయి. వీటి తీవ్రత ఒక్కచోట ఒక్కోలా ఉంటోందని వెర్బెర్క్ అన్నారు. భిన్న రకాల చేపలపై వీటి ప్రభావం ఎలా ఉంటోందో.. చేపల ఆవాసాలపై ఉష్ణోగ్రత, ఆక్సిజన్ ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో కనుక్కొనేందుకు పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు.

ఒకసారి ఆక్సిజన్ దొరికే వాతావరణానికి చేపలు వెళ్లినప్పుడు, అక్కడ ఎలాంటి ఆహారం దొరుకుతోందో చేపలు చూసుకోవాలి. ఆ తర్వాత అక్కడ తమను ఆహారంగా తీసుకునే జీవులేమైనా ఉన్నాయో లేదో చూడాలి. ‘‘ఆక్సిజన్ తక్కువగా ఉండటంతో చేపలు వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వస్తోంది. కానీ, ఆ ప్రాంతాలేమీ ఇప్పుడు ఖాళీగా లేవు’’ అని వెర్బెర్క్ అన్నారు.

‘‘మొదట అక్కడుండే జీవులతో అవి పోరాడాల్సి ఉంటుంది’’ అని పాలీ అన్నారు. ‘‘ఇప్పుడు పీతలు అంటార్కిటావైపుగా కదులుతున్నాయి. ఎందుకంటే అక్కడి నీరు వేడెక్కుతోంది. అక్కడ ఆహారం కూడా దొరుకుతోంది. అయితే, అక్కడ జీవులు వీటి రాకతో తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి’’ అని ఆయన అన్నారు.

అతిగా వేటాడటం వల్ల సముద్రపు జీవులపై తీవ్ర ఒత్తిడి పడుతోందని, ఫలితంగా వాటి సంఖ్య వేగంగా తగ్గిపోతోందని పాలీ అన్నారు. అయితే, దీనిలో మార్పులు రావచ్చు. అతి చేపల వేటను నియంత్రణలోకి తీసుకొచ్చినప్పటికీ, వాతావరణ మార్పులు అనేది అతిపెద్ద సమస్యగా మారబోతోంది. కార్బన ఉద్గారాలను వెంటనే నిలిపివేసినప్పటికీ, సముద్రాల్లో ఆక్సిజన్ తగ్గిపోవడం అనేది కొనసాగుతూనే ఉంటుందని 2021లో ప్రచురితమైన ఒక పరిశోధన పత్రం వెల్లడించింది.

‘‘సముద్రంలో ఇప్పటికే అక్కడక్కడా ఆక్సిజన్ స్థాయులు విపరీతంగా పడిపోయిన జోన్‌లు ఉన్నాయి. అయితే, ఇలాంటి డేడ్ జోన్‌లన్నీ కలిసిపోతే, అదే అంతం అవుతుంది. గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించకపోతే అదే తప్పక జరుగుతుంది’’ అని పాలీ అన్నారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)