న్యూయార్క్‌ నగరం భూమిలోకి కుంగిపోతోంది, ఆపడం ఎలా?

777 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని న్యూయర్క్ నగరంపై 762 మిలియన్ టన్నుల కాంక్రీటు, గాజు, ఉక్కుతో భారీ భవనాలు నిర్మించినట్లు యూఎస్‌జీఎస్ అంచనా వేసింది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 777 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని న్యూయర్క్ నగరంపై 762 మిలియన్ టన్నుల కాంక్రీటు, గాజు, ఉక్కుతో భారీ భవనాలు నిర్మించినట్లు యూఎస్‌జీఎస్ అంచనా వేసింది
    • రచయిత, టామ్ ఆగ్
    • హోదా, బీబీసీ ఫ్యూచర్

1889, సెప్టెంబరు 27న న్యూయార్క్ ‘‘టవర్ బిల్డింగ్’’కు కార్మికులు తుది మెరుగులు దిద్దారు. 11 అంతస్తుల ఆ భవనమే ఇక్కడి తొలి ఆకాశహర్మ్యం. ఆ టవర్ బిల్డింగ్‌ ఇప్పుడు లేదు. కానీ, కొత్తతరం నిర్మాణ శైలికి ఆ భవనం నాంది పలికింది. నేటికీ ఆ ఆకాశహర్మ్యాల నిర్మాణ పరంపర కొనసాగుతోంది.

777 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని న్యూయర్క్ నగరంపై 762 మిలియన్ టన్నుల కాంక్రీటు, గాజు, ఉక్కుతో భారీ భవనాలు నిర్మించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) అంచనా వేసింది. అయితే, కాంక్రీటు విషయంలో ఇది ఒక అంచనా మాత్రమే.

ఇక్కడ పది లక్షల పైచిలుకు భవనాల్లోని ఫర్నీచర్‌లు, ఇతర ఫిట్టింగ్‌లు దీనిలో కలపలేదు. మరోవైపు ఈ భవనాలను కలిపే మౌలిక సదుపాయాలు, ఇక్కడ జీవించే 85 లక్షల మందిని కూడా ఈ లెక్కల్లో పరిగణలోకి తీసుకోలేదు.

ఇవన్నీ కలిపితే, న్యూయార్క్ నగరం నేలపై ఎంత విపరీతమైన ఒత్తిడి పడుతోందో తెలుస్తుంది. మే నెలలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం ఏడాదికి 1-2 మి.మీ. చొప్పున ఇక్కడి నేల కుంగడానికి భవనాల ఒత్తిడి కూడా ఒక కారణం.

ఇక్కడ సముద్ర మట్టం ఏడాదికి 3-4 మి.మీ. చొప్పున పెరుగుతోంది. ఇది అంత పెద్ద సమస్యగా మీకు అనిపించకపోవచ్చు. కానీ, కొన్ని ఏళ్లలో ఇదే ఈ తీర నగరానికి చాలా సమస్యలను తెచ్చిపెట్టొచ్చు.

తీర ప్రాంత నగరాలు కుంగిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. వీటిలో మనుషులు నిర్మించిన మౌలిక సదుపాయాల ఒత్తిడి ప్రధాన పాత్ర పోషిస్తోంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇండోనేసియా రాజధాని జకార్తా లాంటి కొన్ని నగరాలు మిగతా వాటి కంటే చాలా వేగంగా కుంగిపోతున్నాయి

ఇది న్యూయార్క్‌కు మాత్రమే పరిమితం కాదు

‘‘ఐస్ ఏజ్’’ ముగిసినప్పటి నుంచీ న్యూయార్క్ ప్రాంతం కుంగుతూనే ఉంది. ఒకప్పటి మంచు ఫలకాల ఒత్తిడి నుంచి ఉపశమనం లభించిన తర్వాత, ఇక్కడి తూర్పువైపు తీర ప్రాంతం నెమ్మదిగా విస్తరించింది. అదే సమయంలో న్యూయార్క్ నగరానికి కేంద్రమైన ఇతర తీర ప్రాంతాలు నెమ్మదిగా స్థిరపడుతూ వచ్చాయి. భూమిలో ఈ మార్పులు కూడా నగరం కుంగడానికి ఒక కారణం’’ అని కాలిఫోర్నియా మోఫెట్ ఫీల్డ్‌లోని యూఎస్‌జీఎస్‌ పసిఫిక్ కోస్టల్ అండ్ మెరైన్ సైన్స్ సెంటర్ (పీసీఎంఎస్‌సీ)కు చెందిన జియోఫిజిసిస్ట్, ఆ అధ్యయనంలో పాలుపంచుకున్న నలుగురిలో ఒకరైన టామ్ పర్సన్స్ చెప్పారు.

నగరం బరువు ఈ కుంగుబాటును మరింత తీవ్రం చేస్తోందని పర్సన్స్ వివరించారు.

అయితే, ఇది కేవలం న్యూయార్క్‌కు సంబంధించిన సమస్య కాదు. ‘‘ప్రజలు ఎక్కువగా వలసవెళ్తున్న అమెరికాతోపాటు ప్రపంచ వ్యాప్తంగా చాలా నగరాల్లో ఇలాంటి కుంగుబాటు కనిపిస్తోంది. పట్టణీకరణ, పెరుగుతున్న సముద్రపు నీటి మట్టం పరిస్థితిని తీవ్రం చేస్తున్నాయి’’ అని ఆయన అన్నారు.

తీర ప్రాంత నగరాలు కుంగిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. వీటిలో మనుషులు నిర్మించిన మౌలిక సదుపాయాల ఒత్తిడి ప్రధాన పాత్ర పోషిస్తోంది. 2020లో మనుషులు చేపట్టిన నిర్మాణల బరువు మొత్తం జీవరాశుల బరువును మించిపోయిందని ఓ పరిశోధనలో వెల్లడైంది.

కోట్ల మంది ప్రజలు జీవిస్తున్న ఈ నగరాలు నీటిలో మునిగిపోకుండా ఏమైనా చేయొచ్చా?

మనీలా (ఫిలిప్పీన్స్), చిట్టగాంగ్ (బంగ్లాదేశ్), కరాచీ (పాకిస్తాన్), తియాంజిన్ (చైనా) కూడా వేగంగా కుంగుతున్నాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మనీలా (ఫిలిప్పీన్స్), చిట్టగాంగ్ (బంగ్లాదేశ్), కరాచీ (పాకిస్తాన్), తియాంజిన్ (చైనా) కూడా వేగంగా కుంగుతున్నాయి

ఆగ్నేయాసియా నగరాల్లోనూ

ఇండోనేసియా రాజధాని జకార్తా లాంటి కొన్ని నగరాలు మిగతా వాటి కంటే చాలా వేగంగా కుంగిపోతున్నాయి. ‘‘కొన్ని నగరాల్లో ఈ నేల కుంగుబాటు ఏడాదికి కొన్ని సెంటీ మీటర్ల వరకూ ఉంటోంది’’ అని నరగాన్‌సెట్‌లోని రోడ్ ఐలండ్‌ యూనివర్సిటీకి చెందిన ఓషనోగ్రఫీ ప్రొఫెసర్ స్టీవెన్ డీహాంట్ అన్నారు.

న్యూయార్క్‌పై అధ్యయనంలో పాలుపంచుకున్న వారిలో డీహాంట్ కూడా ఒకరు. 2022లో ప్రపంచ వ్యాప్తంగా 99 తీర ప్రాంత నగరాల్లో నేల కుంగుబాటుపై ఉపగ్రహ చిత్రాల ఆధారంగా చేపట్టిన అధ్యయనంలోనూ ఆయన పాలుపంచుకున్నారు.

‘‘ఇదే రీతిలో నేల కుంగుతూపోతే ఈ నగరాలను అనుకున్నదానికంటే ముందుగానే వరదలు ముంచెత్తుతాయి’’ అని తన పరిశోధన పత్రంలో డీహాంట్ రాసుకొచ్చారు. రోడ్ ఐలండ్ యూనివర్సిటీ పరిశోధకులు పీ చిన్ వూ, మాట్ వీ కూడా ఈ అధ్యయనంలో పాలుపంచుకున్నారు.

వేగంగా కుంగిపోతున్న నగరాల్లో ఆగ్నేయాసియా నగరాల పేర్లను ఈ జాబితాలో ప్రధానంగా ప్రస్తావించారు. జకార్తా ఏడాదికి రెండు నుంచి ఐదు సెం.మీ. చొప్పున కుంగుతోంది. మరోవైపు మనీలా (ఫిలిప్పీన్స్), చిట్టగాంగ్ (బంగ్లాదేశ్), కరాచీ (పాకిస్తాన్), తియాంజిన్ (చైనా) కూడా వేగంగా కుంగుతున్నాయి. ఈ నగరాల్లో మౌలిక సదుపాయాలు కూడా దెబ్బతింటున్నాయి, తరచూ వరదలు కూడా వస్తున్నాయి.

వీడియో క్యాప్షన్, బావులు తవ్వించడమే లక్ష్యంగా పెట్టుకున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్

మెక్సికో సిటీ కుంగడానికి కారణం ఏమిటి?

తీర ప్రాంతంలో లేనప్పటికీ మెక్సికో సిటీ కూడా ఆశ్చర్యకరంగా ఏడాదికి 50 సెం.మీ. (20 అంగుళాలు) చొప్పున కుంగుతోంది. స్పెయిన్ వలస పాలిత ప్రాంతంగా ఉన్నప్పుడు ఇక్కడి భూగర్భ జలాలను విపరీతంగా తోడేయడమూ దీనికి ఒక కారణం. ఇక్కడ మరో 30 మీటర్ల కుంగుబాటు జరిగిన తర్వాతే, అంటే 150 ఏళ్ల తర్వాతే పరిస్థితులు నియంత్రణలోకి రావచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.

అయితే, డీహాంట్ బృందం ప్రధానంగా తీర ప్రాంత నగరాలపైనే దృష్టి సారించింది. వీరి పరిశోధనలో ఇండోనేషియాలోని సెమరాంగ్ ఏడాదికి 2-3 సెం.మీ., ఫ్లోరిడాలోని టాంపా బేకు ఉత్తర ప్రాంతాలు ఏడాదికి 6 మి.మీ. (0.2 అంగుళాలు) చొప్పున కుంగుతున్నాయని తేలింది.

ఈ కుంగుబాటులో కొంతవరకు సహజంగానే జరుగుతుందని వీ అన్నారు. అయితే, ‘‘మానవుల చర్యలు దీన్ని వేగవంతం చేస్తున్నాయి. దీనికి మనం నిర్మించే భవనాల బరువు ఒక్కటే కారణం కాదు. భారీగా భూగర్భ జలాలను తోడేయడం, భూఅంతర్భాగంలోని చమురు, గ్యాస్‌ను తవ్వితీయడం లాంటి చర్యలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి’’ అని వీ చెప్పారు. ‘‘అయితే, ఈ అంశాలు ఒక్కోచోట ఒక్కోలా ప్రభావం చూపిస్తున్నాయి. కాబట్టి మొత్తంగా తీర ప్రాంతాలు ఎలా కుంగుతున్నాయో ఒక అంచనాకు రావడం సవాల్‌గా మారుతోంది’’ అని అన్నారు.

వీడియో క్యాప్షన్, ప్లాస్టిక్ కవర్లతో అందమైన ఇల్లు కట్టిన యువకుడు

నీటి మట్టం పెరుగుదలతో ముప్పు

అయితే, సముద్రంలో నీటి మట్టం పెరుగుదలతో తీరం మాత్రమే ప్రభావితం అవుతుందని అనుకోకూడదు.

సముద్ర మట్టం పెరుగుదలతో తొలి ప్రభావాలు భూమి ఉపరితలానికి కింద కనిపిస్తాయని డీహాంట్ అన్నారు. ‘‘మీరు మౌలిక సదుపాయాలు, భవనాల పునాదులు, విద్యుత్ స్తంభాలు అన్నీ భూమిలోనే పాతిపెడతారు. పైకి కనిపించే దానికి ముందే వీటిపై సముద్రం నీరు ప్రభావం చూపిస్తుంది. ఆ తర్వాత నెమ్మదిగా వరదలు పూర్తి విధ్వంసం సృష్టిస్తాయి’’ అని ఆయన చెప్పారు.

పరిష్కారం అనేది కుంగుబాటుకు ఏది కారణం అవుతోందనే అంశంపై ఆధారపడి ఉంటుంది.

కొత్త నిర్మాణాలను నిలిపివేయడంతో కొంతవరకూ పరిష్కారం లభించొచ్చు. అయితే, న్యూయార్క్‌ నగరం వేగంగా కుంగిపోవడానికి ఇక్కడి నేలలోని మార్బుల్, నైస్, షెస్ట్ లాంటి రాళ్లు కూడా ఒక కారణమని పర్సన్స్ వివరించారు. అదే సమయంలో లోవర్ మన్‌హటన్‌లోని బంకమట్టి, కొన్ని కృత్రిమ పదార్థాల అక్కడి నేల కుంగుబాటుకు కారణం కావచ్చని ఆయన చెప్పారు. కాబట్టి పెద్ద భవనాలు గట్టి నేలపై నిర్మించేలా చూడటంతో నేల కుంగడాన్ని కొంతవరకూ అడ్డుకోవచ్చు.

ఇక్కడ మరో పరిష్కారం ఏమిటంటే, భూగర్భ జలాలు తోడేయడాన్ని తగ్గించాలి. అయితే, పెరుగుతున్న పట్టణీకరణ వల్ల భూగర్భ జలాల వినియోగం మరింత పెరగొచ్చని, మరోవైపు దీనికి మరిన్ని నిర్మాణాలు తోడైతే పరిస్థితులు మరింత తీవ్రంగా ఉంటాయని పర్సన్స్ హెచ్చరించారు. ఇక్కడ నగరం నీటి అవసరాలకు సుస్థిరమైన మార్గాలను ఎంచుకోవడం, భూగర్భ జలాలు పడిపోకుండా చూసుకోవడంతో కొంతవరకు ప్రయోజనం ఉంటుంది.

అయితే, మనకు ఎక్కువగా కనిపిస్తున్న పరిష్కారాల్లో తీర ప్రాంతాల్లో గోడలు కట్టడం కూడా ఒకటి. కానీ, టోక్యో ఈ సమస్యకు పరిష్కారంగా రెండంచెల విధానాన్ని అనుసరిస్తోంది. ఒకవైపు కాంక్రీటు నిర్మాణాలు, సీవాల్స్, పంప్ స్టేషన్లు, ఫ్లడ్ గేట్లను ఇక్కడ నిర్మిస్తున్నారు. మరోవైపు ముందస్తు హెచ్చరికలు, సహాయక చర్యలపై సన్నద్ధత లాంటి చర్యలు కూడా తీసుకుంటున్నారు.

వీడియో క్యాప్షన్, సముద్రాల్లో పగడపు దీవుల విస్తరణకు యూఏఈ చర్యలు...

ప్రజలే పరిష్కారం చూపిస్తున్నారు..

కొన్నిసార్లు నగరాల్లో జీవించే ప్రజలే పరిష్కారం కోసం నడుం బిగిస్తున్నారు. 2021లో నిర్వహించిన ఒక అధ్యయనంలో జకార్తా, మనీలా, హోచిమిన్ సిటీలలోని ప్రజలు సొంతంగా చర్యలు తీసుకుంటున్నారని వెలుగులోకి వచ్చింది. ఎత్తులో ఉండేలా ఇళ్లను నిర్మించుకోవడం, ముంపు ముప్పు పొంచి వుండే ప్రాంతాల్లో తాత్కాలిక వంతెనలు ఏర్పాటుచేసుకోవడం లాంటివి ఇందులో ఉన్నాయి.

ఇక్కడ మరో పరిష్కరాం ఏమిటంటే భూగర్భంలో ట్యాంకులు నిర్మించుకోవడం. వరద నీటిని వీటి సాయంతో కొంతవరకూ నియంత్రించొచ్చు. పరిసరాల్లో చెరువులు, నీటిని పీల్చుకునే నేలల ఏర్పాటుచేసుకోవడంతోపాటు ఇలాంటి ట్యాంకులను కూడా నిర్మించుకుంటే ఫలితం ఉంటుందని భూగర్భ జలాల నిపుణుడు మార్టిన్ లంబ్లీ చెప్పారు. ‘‘మనం ఇళ్లు కట్టుకునేటప్పుడు నిర్మించుకున్న డ్రైనేజీ వ్యవస్థలు నేటి పరిస్థితులకు సరిపోవు’’ అని ఆయన అన్నారు.

నీటి మట్టం పెరిగేటప్పుడు ఇలాంటి మరికొన్ని పరిష్కారాలు కూడా రావచ్చు. 2019లో తేలియాడే నగరాల పేరుతో ఐక్యరాజ్యసమితి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫెరెన్స్‌ను నిర్వహించింది. దీనిలో చాలా పరిష్కారాలు చర్చకు వచ్చాయి.

అయితే, గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడం ద్వారా వాతావరణ మార్పులకు కళ్లెం వేస్తే సముద్ర మట్టాల పెరుగుదల వేగాన్ని కాస్త నెమ్మదింపచేయొచ్చు.

‘‘ఈ విషయంలో ప్రభుత్వాలు నడుం బిగించాలి. భారీగా మౌలిక సదుపాయాల విధ్వంసం, ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడకుండా ఉండాలంటే వారు ఇప్పుడే మేల్కోవాలి’’ అని డీహాంట్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)