వేసవి: కారు ప్రయాణంలో తీసుకోవాల్సిన 5 జాగ్రత్తలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రవీణ్ శుభం
- హోదా, బీబీసీ కోసం
పరీక్షల కాలం ముగిసి వేసవి సెలవులు వచ్చేశాయి. ఈ సమయంలో చాలా మంది కుటుంబాలతో కారు, ఇతర వ్యక్తిగత వాహనాల్లో లాంగ్ డ్రైవ్‌లకు ప్లాన్ చేసుకొంటుంటారు.
ఎండాకాలంలో రహదారులపై వాహనం టైర్ పేలిపోవడం, ఇంజిన్ ఓవర్ హీటింగ్, వాహనాల్లో ఒక్క సారిగా మంటలు చెలరేగడం లాంటి కారణాలతో ప్రమాదాలు జరగడాన్ని మనం చూస్తుంటాం.
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని ఆలూరు మాజీ ఎమ్మెల్యే నీరజా రెడ్డి ప్రయాణిస్తున్న కారు టైరు పేలిపోవడంతో జరిగిన ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు.
వేసవిలో ప్రయాణం ప్రారంభించే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, ప్రయాణ సమయంలో అప్రమత్తంగా ఉంటే చాలా వరకు రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వేసవిలో వంద కిలోమీటర్ల పైన వ్యక్తిగత ఫోర్ వీలర్ వాహనాల్లో లాంగ్ జర్నీ చేసేవారికి డ్రైవింగ్ ఎడ్యుకేషన్ నిపుణులు కేబీ రాఘవన్ 5 సూచనలు చేస్తున్నారు.
ఆయన తెలంగాణలోని సిరిసిల్ల జిల్లా మండేపల్లిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటుచేసిన ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్ అండ్ రీసర్చ్ (ఐటీడీఆర్)' ఆధ్వర్యంలోని ‘తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్’ ప్రిన్సిపల్‌గా ఉన్నారు. రాఘవన్ ఐదు సూచనలు ఇవీ...

ఫొటో సోర్స్, Praveen Shubham / BBC
1. కూలింగ్ సిస్టం
మన శరీర ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచేందుకు చెమట పట్టే వ్యవస్థ మాదిరే కారు ఇంజిన్‌లో కూలింగ్ సిస్టం ఉంటుంది.
ఇందులో ప్రధానమైనది కూలెంట్.
కూలెంట్ వాటర్ లెవల్ తగ్గితే ఇంజన్ ఓవర్ హీట్ అవుతుంది. ఇలా జరిగినప్పుడు ఇంజన్ సీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రయాణం ప్రారంభించే ముందు కూలెంట్ లెవల్‌ను సరిచూసుకోవాలి.
అదే సమయంలో, ఇంజిన్‌లో రేడియేటర్ చుట్టూ ఉండే వివిధ రకాల పైపుల నుంచి (అప్పర్ హోసెస్, బాటమ్ హోసెస్ ) లీకేజీ లేకుండా చూసుకోవాలి. లీకేజీ ఉన్నట్టుగా గుర్తిస్తే స్వయంగా సరిదిద్దడమో లేదా మెకానిక్‌తో సరిచేయించడమో చేయాలి.

ఫొటో సోర్స్, Getty Images
2. టైర్ ప్రెషర్
వాహనం టైర్లలో సూచించిన పరిమాణంలోనే గాలి నింపాలి. సాధారణంగా డ్రైవర్ సీటులో కుడి వైపు డోరుకు ఆ వాహనం టైర్లలో ఎంత మేరకు గాలిని నింపాలన్న స్టిక్కర్ అతికించి ఉంటుంది.
సాధారణంగా మైలేజీ ఎక్కువ వస్తుందన్న భావనతో నిర్ణీత పరిమాణం కంటే కొందరు ఎక్కువగా గాలి నింపుతారు. కానీ టైర్లలో ఎక్కువ గాలి నింపితే మైలేజీ ఎక్కువ వస్తుందన్నది తప్పుడు అభిప్రాయమని రాఘవన్ చెప్పారు.
ఫ్రెండ్స్, మెకానిక్‌లు చెప్పారని అలా ఎక్కువ మొత్తంలో టైర్లలో గాలి నింపకూడదని ఆయన హెచ్చరించారు.
ఎండాకాలంలో తారు రోడ్డుపై ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. దానిపై వాహనం ప్రయాణించే సమయంలో టైర్లలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. వాహనం హైస్పీడ్‌లో ఉన్నప్పుడు టైర్ పేలిపోయో ప్రమాదం ఏర్పడుతుంది.
ఇలా ఎక్కువగా గాలి నింపడం వల్ల రన్నింగ్‌లో టైర్లు పేలిపోయి వాహనం అదుపు తప్పి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఏ కారణం వల్లయినా సరే టైర్లలో నిర్ణీత పరిమాణం కంటే ఎక్కువగా గాలిని నింపడం మంచిది కాదని రాఘవన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
3. బ్యాటరీ, ఎలక్ట్రికల్ సిస్టం
లాంగ్ డ్రైవ్‌లలో వాహనం బ్యాటరీ, ఎలక్ట్రికల్ సిస్టం పైన ఎప్పుడూ కన్నేసి ఉంచండి.
ముఖ్యంగా వాహనంలో ఎలక్ట్రిక్ సిస్టంకు సంబంధించిన వైరింగ్‌లో లోపాలు లేకుండా చూసుకోవాలి.
వైరింగ్ ట్యాంపరింగ్ చేయడం వల్ల షార్ట్ సర్క్యూట్ ఏర్పడి వాహనంలో మంటలు చెలరేగే ప్రమాదం ఉంది. ప్రయాణం మధ్యలోనే కారులో నిముషాల వ్యవధిలో మంటలు వ్యాపించడానికి ప్రధాన కారణం ఇదేనని నిపుణులు చెబుతున్నారు.
వాహనంలో అదనపు ఉపకరణాలు అమర్చే క్రమంలో ఎక్కువగా వైరింగ్ ట్యాంపరింగ్‌కు పాల్పడుతుంటారు.
వోల్టేజీకి సరిపోయే యాంపియర్ ఫ్యూజ్‌లనే వాడాలి. వాహనం బ్యాటరీలో ఉండే ‘మ్యాజిక్ ఐ’ ఆకుపచ్చ రంగులో ఉండేలా చూసుకోవాలి.
మ్యాజిక్ ఐ ఎరుపు రంగులో కనిపిస్తే బ్యాటరీ లైఫ్ అయిపోయిందని భావించి తక్షణం బ్యాటరీని మార్చాలి.
వైరింగ్, ఫ్యూజ్, బ్యాటరీ కండిషన్ సరిగా లేనప్పుడు వేసవి అధిక ఉష్ణోగ్రతలకు వాహనంలో మంటలు చెలరేగే అవకాశాలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
4. ఎయిర్ కండిషనర్ (ఏసీ):
అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు, వాహనంలో ఏసీ సరిగా పనిచేయకపోతే సౌకర్యవంతంగా డ్రైవింగ్ చేయలేం.
వాహనంలోని ఏసీ సిస్టమ్‌కు సంబంధించిన కండెన్సర్, ఎయిర్ ఫిల్టర్లు సరిగా పనిచేయకపోవడం వల్ల డ్రైవింగ్‌లో చిరాకు కలగొచ్చు. దీంతో త్వరగా అలసిపోయి పరధ్యానంలోకి వెళితే ప్రమాదాలు జరగొచ్చు.
అందువల్ల కండెన్సర్, ఫిల్డర్‌లను శుభ్రపరుచుకోవాలి. ఎండాకాలంలో ఏసీ గ్యాస్ లీక్ అయ్యే అవకాశాలు ఎక్కువ. గ్యాస్ లీకేజీ లేకుండా సరిచూసుకోవాలి.

ఫొటో సోర్స్, Getty Images
5. డ్రైవర్ ఆరోగ్య స్థితి
వాహనమే కాదు, దానిని తోలే డ్రైవర్ ఆరోగ్య, మానసిక స్థితి కూడా రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రధానమే అంటున్నారు నిపుణులు.
ఎండాకాలంలో 3-4 గంటలు నాన్ స్టాప్ డ్రైవింగ్ చేయాల్సివస్తే ప్రతి గంటన్నరకు ఆగి, 10 నిముషాలు విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్నారు.
విరామంలేని డ్రైవింగ్‌లో అధిక ఉష్ణోగ్రతలతో సూర్య కిరణాలతో మెరిసే రోడ్లపై తదేకంగా దృష్టి సారించడం వల్ల కళ్లు అలసటకు గురవుతాయి. అందువల్ల రోడ్‌పై లైన్ తప్పితే ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. అందువల్ల మధ్యలో విశ్రాంతి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
డ్రైవర్‌కు కంటినిండా నిద్ర అనేది అన్ని కాలాలకు వర్తించే సూత్రమని రాఘవన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Praveen Shubham / BBC
ప్రమాదాలు: ఐదో స్థానంలో ఏపీ, ఎనిమిదో స్థానంలో తెలంగాణ
భారత ప్రభుత్వ 'మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ అండ్ హైవేస్' రీసర్ఛ్ వింగ్ 2021లో సమర్పించిన నివేదిక ప్రకారం, జాతీయ రహదారులపై అత్యధిక ప్రమాదాలు జరిగిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 5వ, 8వ స్థానాల్లో నిలిచాయి.
ఈ నివేదిక ప్రకారం, 2021లో భారతదేశంలో మొత్తం 4,12,432 రోడ్డు ప్రమాదాలు జరగగా, అందులో 1,53,972 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 3,84,448 మంది గాయపడ్డారు.
ఈ ప్రమాదాల్లో 31.2 శాతం అంటే 1,28,825 ప్రమాదాలు నేషనల్ హైవేలు, ఎక్స్ ప్రెస్ హైవేలపై, 23.4 శాతం ప్రమాదాలు స్టేట్ హైవేల మీద జరిగాయి.
56,007 మంది నేషనల్ హైవేలపై, 37,963 మంది రాష్ట్ర రహదారులపై రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు.
తెలంగాణలో 2021 హైవేలపై జరిగిన ప్రమాదాల సంఖ్య 7,214 కాగా, ఇది మొత్తం దేశంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 5.6 శాతం. ఏపీలో 8,241 ప్రమాదాలు జరిగాయి. ఇవి దేశంలో జరిగిన మొత్తం ప్రమాదాల్లో 6.4 శాతం.
ఓవర్ స్పీడ్ (74.4 శాతం), రాంగ్ సైడ్ డ్రైవింగ్ (4.3 శాతం), డ్రంక్ అండ్ డ్రైవ్ (2.3 శాతం) వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరిగాయి.
ఇవి కూడా చదవండి:
- నేషనల్ హైవేలపై డ్రైవింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన 5 జాగ్రత్తలు ఇవే....
- డిబ్రూగఢ్ జైలు: అమృత్‌పాల్ సింగ్‌ను బంధించిన ఈ కారాగారం ప్రత్యేకతలేంటి?
- మాంటెవీడియో మారు: 1000 మందితో టైటానిక్ కన్నా లోతులో మునిగిన నౌక, 80 ఏళ్ల తర్వాత ఎలా దొరికిందంటే....
- బిహార్ షరీఫ్ మదరసా: 113 ఏళ్ల నాటి లైబ్రరీని తగలబెట్టేశారు
- తమిళనాడు: రోజుకు 12 గంటల పని, వారానికి మూడు రోజులు సెలవులు... ఈ కొత్త చట్టాన్ని కొందరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి. )














