బిహార్ షరీఫ్ మదరసా: 113 ఏళ్ల నాటి లైబ్రరీని తగలబెట్టేశారు

అజీజియా మదరసా

ఫొటో సోర్స్, MANISH JALUI/BBC

బూడిద, మసిపట్టిన గోడలు, తగలబడిపోయిన ఫర్నిచర్, కాలిపోయిన పేజీలు.. పురాతన గ్రంథాలు, అందమైన చేతిరాతలో ఉన్న ఇస్లామిక్ సాహిత్యం సహా ఒకప్పుడు 4,500కిపైగా పుస్తకాలకు నిలయమైన 113 ఏళ్ల చరిత్ర గల మదరసా లైబ్రరీలో ఇప్పుడు మిగిలింది ఇవే.

బిహార్‌‌లోని అజీజియా మదరసాలో ఉన్న లైబ్రరీ ఇది. బిహార్‌లోని బిహార్ షరీఫ్ పట్టణంలోని ఈ మదరసాను మార్చ్ 31న కొందరు తగలబెట్టారు.

శ్రీరామనవమి రోజున ఈ ఘటన జరిగింది. ఆ రోజు అల్లర్లకు పాల్పడినవారు కర్రలు, రాళ్లు, పెట్రోలు బాంబులు, ఆయుధాలతో వచ్చారు. అంతేకాదు.. మదరసాపై దాడి చేయడానికి ముందు అక్కడ వారు నినాదాలు కూడా చేశారని స్థానికులు బీబీసీతో చెప్పారు.

బిహార్ షరీఫ్‌లో ఆ రోజు జరిగిన అనేక ఘటనలలో ఇది కూడా ఒకటి. ఈ ఘటనలో చాలామంది గాయపడ్డారు. వాహనాలు, దుకాణాలు ధ్వంసమయ్యాయి. మత ఘర్షణలకు సంబంధించి కొందరిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.

కాలిపోయిన మదరసా

ఫొటో సోర్స్, MANISH JALUI/BBC

ఆ రోజు ఏమైందో ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. వందలాది మంది గుంపుగా వచ్చి మదరసా తలుపులు, తాళాలు పగలగొట్టి లోపలికి వచ్చారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. గుంపులో కొందరు తరగతి గదులు, లైబ్రరీలో పెట్రోల్ బాంబులు విసిరి నిప్పు పెట్టారన్నారు.

‘ఒక్కసారిగా నాకు పొగ వాసన వచ్చింది’ అని మదరసాలో వంట పని చేసే అబ్దుల్ గఫార్ చెప్పారు. ‘నేను తలుపు తీసి చూడగా బయట ఆఫీస్ దగ్గర అంతా గందరగోళంగా ఉంది. ఆ గుంపు హాస్టల్ వైపు కూడా వెళ్లింది. నేను భయంతో మంచం కింద దాక్కున్నాను’ అన్నారు గఫార్.

లైబ్రరీలోని 250 చేతిరాత పుస్తకాలు సహా చారిత్రక పత్రాలు, పురాతన ఫర్నిచర్ అంతా మంటల్లో కాలిపోయాయి.

మదరసాలో మొత్తం 500 మంది విద్యార్థులు చదువుతుండగా వారిలో 100 మంది హాస్టల్‌లో ఉంటారు. వారంతా లైబ్రరీని ఎక్కువగా ఉపయోగించేవారు, అయితే.. రంజాన్న కారణంగా తరగతులు లేకపోవడంతో విద్యార్థులు ఎవరూ భవనంలో లేరు.

‘‘లైబ్రరీ భవనం, ఫర్నిచర్‌కు జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోగలం, కానీ, విజ్ఞానం, సాంస్కృతిక వారసత్వం కోల్పోవడం వల్ల శాశ్వత నష్టం జరిగింది’ అని మదరసా నిర్వహించే సోఘరా ట్రస్ట్ అధ్యక్షుడు, ఇస్లామిక్ మేధావి సయ్యద్ సైఫుద్దీన్ ఫిరదౌసీ చెప్పారు.

2017లోనూ ఒకసారి ఈ భవనాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేశారని, దాంతో ఏడాది పాటు పోలీసులు దీనికి రక్షణ కల్పించారని ఫిరదౌసీ చెప్పారు.

బీబీ సోఘరా అనే మహిళ తన భర్త అబ్దుల్ అజీజ్ జ్ఞాపకార్థం ఈ మదరసా నిర్మించారు. మొదట ఈ మదరసాను 1896లో పాట్నాలో ఏర్పాటు చేశారు. అనంతరం దీన్ని బిహార్ షరీఫ్‌కు మార్చారు.

కాలిపోయిన ప్రతులు

ఫొటో సోర్స్, MANISH JALUI/BBC

14 వేల ఎకరాల భూమి సహా తన యావదాస్తిని బీబీ సోఘరా విరాళంగా ఇచ్చారు. ఆ ఆస్తిపై వచ్చే ఆదాయం పేద ప్రజల విద్యకు, ఇతర రూపంలో సహాయానికి పనికొచ్చేలా నిర్వహించేందుకు గాను ఒక ట్రస్ట్‌ను ఏర్పాటుచేశారామె.

ఆ ట్రస్ట్ స్కూళ్లు, కాలేజీలు, హాస్పిటల్స్, హాస్టళ్లు నిర్మించడానికి ఆ డబ్బు ఉపయోగించింది. బిహార్‌లో చాలా చోట్ల ఈ ట్రస్ట్ నిర్మించిన స్కూళ్లు, కాలేజీలు, హాస్పిటళ్లు ఉన్నాయి.

బీబీ సోఘరా తన ఆస్తిని బంధువులకు ఇవ్వడానికి బదులు సమాజానికి, దేశానికి విరాళంగా ఇచ్చారని.. ఆమె ఎంతో సామాజిక స్పృహ ఉన్న తెలివైన మహిళ అని ఫిరదౌసీ చెప్పారు.

సుమారు దశాబ్దం కిందట మొదలైన ఆమె దాతృత్వ ఫలాలు ఇప్పటికీ బిహార్ షరీఫ్ ప్రజలకు అందుతున్నాయి. సోఘరా ట్రస్ట్ మేనేజర్ డాక్టర్ ముఖ్తార్ ఉల్ హక్ మాట్లాడుతూ.. ట్రస్ట్ నుంచి వచ్చే నిధులను ఉపయోగించి గత ఏడాది ఒక అవుట్ పేషెంట్ సెంటర్ నిర్మించినట్లు చెప్పారు. త్వరలోనే సోఘరా పేరుతో ఆసుపత్రి ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

కాగా తగలబడిన లైబ్రరీ మరమ్మతులు చేయలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ వీలైనంత వరకు దాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మే 1 నుంచి మళ్లీ తరగతులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సోఘరా ట్రస్ట్ అంచనాల ప్రకారం ఈ భారీ నష్టాన్ని సరిచేయడానికి రూ. 3 కోట్ల వరకు ఖర్చు అవతుంది. బిహార్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖకు ఈ మేరకు వారు నిధుల కోసం అభ్యర్థిస్తూ నివేదకలు పంపించనున్నారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)