రామచరిత మానస్: తులసీదాస్ రాసిన ఈ గ్రంథం మహిళలను, దళితులను కించపరుస్తోందా... ఎందుకు వివాదం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ న్యూస్
హిందుమతానిక చెందిన దేవుడు రాముడిపై రాసిన 16వ శతాబ్దం నాటి రామచరిత మానస్ రాజకీయ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది.
ప్రపంచంలోని అత్యంత గొప్ప సాహిత్య రచనల్లో ఒకటిగా రామచరిత మానస్‌ను చాలా మంది మేధావులు చెబుతుంటారు.
దీన్ని ‘‘అణువణువునా ఆధ్యాత్మికత ఉట్టిపడే గ్రంథం’’గా ప్రముఖ రచయిత పవన్ వర్మ అభివర్ణించారు.
2,500 ఏళ్ల క్రితం వాల్మీకి మహర్షి రచించినట్లుగా చెప్పే సంస్కృత ఇతిహాసం రామాయణాన్ని ఈ రామచరిత మానస్‌లో తులసీదాస్ మరోసారి వివరించారు. ఇది ఇంచుమించు హిందీలా కనిపించే అవధిలో రాశారు. తద్వారా రాముడి కథ నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు.
అయోధ్య రాముడు లంకాధిపతి రావణుడి మీద సాధించిన విజయాన్ని వివరించే కథలు మనకు చాలా కనిపిస్తాయి. ముఖ్యంగా దసరా సమయంలో రామచరిత మానస్ నాటకాన్ని చాలా ప్రాంతాల్లో ప్రదర్శిస్తుంటారు. న్యాయం, ధర్మాలకు పెట్టింది పేరుగా రాముడి రాజ్యాన్ని చెబుతుంటారు.
ప్రస్తుతం కొన్ని వారాలుగా రామచరిత మానస్ మీద చర్చ జరుగుతోంది. మహిళలు, దళితుల పట్ల దీనిలో వివక్ష కనిపిస్తుందని కొందరు చెబుతుంటే, మరికొందరు మాత్రం ఇలా చెప్పడాన్ని తప్పుపడుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇదేమీ తొలిసారి కాదు..
600 ఏళ్లకు ముందురాసిన ఈ తులసీదాస్ గ్రంథం మీద విమర్శలు రావడం ఇదేమీ తొలిసారి కాదు. కానీ, నేడు దీనికి మద్దతుగా కొందరు, దీన్ని విమర్శిస్తూ ఇంకొందరు నిరసనలు చేపడుతున్నారు.
భారత్‌లో మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. కులాల పేరుతో ఓటర్లను విభజించేందుకు ఈ వివాదాన్ని ఉపయోగించుకుంటున్నారని ప్రస్తుతం రెండు వర్గాల నాయకులూ ఒకరి మీద మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.
నిరసనల్లో భాగంగా రామచరిత మానస్‌లోని కొన్ని పేజీలను తగులబెడుతున్న దృశ్యాలు పోయిన నెలలో కనిపించాయి. ఈ గ్రంథాన్ని విమర్శిస్తున్న వారిని, కించపరుస్తున్న వారిని అరెస్టు చేయాలని రెండో వర్గం నిరసనలు మొదలుపెట్టింది.
ఆ తరువాత రామచరిత మానస్ పేజీలకు నిప్పు పెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న ఐదుగురిని అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరిపై బెయిలుకు కూడా వీలులేని నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ (ఎన్ఎస్ఏ) కింద కేసులు పెట్టారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎలా మొదలైంది?
మొదటగా బిహార్ విద్యా శాఖ మంత్రి చంద్రశేఖర్ సమాజంలో రామచరిత మానస్ విద్వేషాన్ని వెదజల్లుతోందని వ్యాఖ్యానించారు. ఓ యూనివర్సిటీ విద్యార్థుల ఎదుట మాట్లాడుతూ.. ఆ గ్రంథంలోని కొన్ని వాక్యాలను చదువుతూ, తాను చెప్పేది నిజమని అంగీకరించడానికి ఇంత కంటే ఏం రుజువులు కావాలని ప్రశ్నించారు.
‘‘తక్కువ కులాలవారు చదువుకుంటే వారి మనసు విషపూరితం అవుతుందని, ఇది పాముకు పాలు పోసి పొంచినట్టేనని అందులో ఉంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
దీనికి కొన్ని రోజుల తర్వాత ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రముఖ ఓబీసీ నాయకుడు స్వామి ప్రసాద్ మౌర్యా కూడా ఇంచుమించు ఇలాంటి అభిప్రాయాలనే వ్యక్తంచేశారు.
రామచరిత మానస్‌లో కొన్ని వాక్యాలు చాలా ‘‘హానికరమని’’, వాటిని వెంటనే ఆ గ్రంథం నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘మతం పేరుతో దూషణలు ఎందుకు? నేను అన్ని మతాలను గౌరవిస్తాను. ఎవరైనా మతం పేరు చెప్పి ఒక వర్గం లేదా కులాన్ని అవమానిస్తే తప్పకుండా ఖండించాల్సిందే’’ అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మౌర్య చెప్పారు.
మహిళలు, దళితులు, గిరిజనులను అవమానించే కొన్ని వాక్యాలను ఆ గ్రంథం నుంచి తొలగించాలని రాష్ట్రపతి, ప్రధాన మంత్రిలకు తను ఒక లేఖ కూడా రాసినట్లు ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు.
రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ)కి చెందిన చంద్రశేఖర్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)కి చెందిన మౌర్యా వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులతోపాటు కొన్ని హిందూ జాతీయవాద సంస్థలు కూడా నిరసన వ్యక్తంచేయడంతో రాజకీయ వివాదం రాజుకుంది.
మౌర్యాకు మరణ శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ సుప్రీం కోర్టుకు లేఖ రాసినట్లు బీజేపీ నాయకుడు నంద్‌కిశోర్ గుర్జర్ వ్యాఖ్యానించారు. మరోవైపు అయోధ్యకు చెందిన ఒక ప్రముఖ హిందూ మతగురువు వెంటనే చంద్రశేఖర్‌ను మంత్రి పదవి నుంచి తప్పించాలని, దేశం మొత్తానికి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఉత్తరప్రదేశ్‌లో నిరసనకారులు మౌర్యా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆయన్ను వెంటనే అరెస్టు చేయాలని పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
మౌర్యాకు మద్దతుగా కూడా నిరసనలు జరుగుతున్నాయి. లఖ్‌నవూలో ఆయనకు మద్దతుగా అఖిల భారతీయ ఓబీసీ మహాసభ కూడా నిరసన తెలిపింది. అయితే, ఇక్కడ రామచరిత మానస్‌లోని కొన్ని పేజీలను దహనం చేశారు. దీంతో పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు.
ఈ వివాదంతో రామచరిత మానస్‌తోపాటు అసలు వారు చెబుతున్న అంశాల్లో నిజమెంత? అని చర్చలు జరుగుతున్నాయి. అందరికీ సమాన హక్కులు కల్పించే రాజ్యాంగమున్న భారత్‌లో కొన్ని వర్గాలను కించపరిచే చర్యలను ఎలా చూడాలని కూడా చర్చలు పెడుతున్నారు.
అయితే, ‘‘ఒక డప్పు, ఒక నిరక్షరాస్యుడు, ఒక దళితుడు, ఒక మహిళ.. అందరినీ కొట్టాల్సిందే’’అని కూడా కూడా ఆ గ్రంథంలో ఉందని కొందరు ఫెమినిస్టులు ఎప్పటినుంచో రామచరిత మానస్‌ను తప్పుపడుతున్నారు.
‘‘ఒకటి, రెండు లైన్లు కాదు...’’
అయితే, ఇక్కడ కేవలం ఒకటి, రెండు వాక్యాలు కాదు.. రామచరిత మానస్‌లో మహిళలు, దళితులను కించపరిచేలా చాలా వాక్యాలు ఉన్నాయని దిల్లీలోని జామియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ హేమలత మహీశ్వర్ బీబీసీతో చెప్పారు.
‘‘ఎన్ని దుర్గుణాలు ఉన్నప్పటికీ బ్రాహ్మణుడిని పూజించాల్సిందే.. దళితుడు వేద పండితుడు అయినప్పటికీ పూజనీయుడు కాదు.. అని కూడా దానిలో ఉంది. ఇలాంటి పక్షపాతం చూపించే పుస్తకాన్ని మనం ఎలా అంగీకరించగలం?’’ అని హేమలత ప్రశ్నించారు.
అయితే, తులసీదాస్ ఏమీ సంఘ సంస్కర్త కాదు, అందుకే ఆయనకు కూడా కొన్ని పక్షపాతాలు ఉండొచ్చని మరికొందరు అంటున్నారు. ‘‘ఆ వివాదాస్పద వాక్యాలను చెప్పినవి ఆ కథలోని పాత్రలు.. వీటిని రచయిత అభిప్రాయాలుగా మనం భావించకూడదు’’ అని వారు చెబుతున్నారు.
మరోవైపు దళితులు, మహిళలకు వ్యతిరేకంగా ఉన్నట్లుగా చెబుతున్న ఆ వాక్యాలను అసందర్భోచితంగా, నేపథ్యాన్ని చదవకుండా చేస్తున్నారని రామచరిత మానస్‌పై అధ్యయనం చేపట్టిన అఖిలేశ్ శాండిల్య చెప్పారు.
అయితే, రామచరిత మానస్‌ను నేటి దృక్కోణంలో చూడాలని, దీనిలోని అంశాలపై లోతైన చర్చలు జరగాల్సిందేనని విమర్శకులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:
- అప్పర్ భద్ర: ఈ ప్రాజెక్ట్ పూర్తయితే రాయలసీమకు నీళ్లు అందవా... ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకత ఎందుకు
- షార్ట్ సెల్లింగ్- కొనకుండానే షేర్లను ఎలా అమ్ముతారు... లాభాలు ఎలా వస్తాయ్
- బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ ISWOTY: అయిదుగురు నామినీలు వీళ్ళే
- నందాదేవి: ఆ సరస్సులో మానవ అస్థికలు, పర్వత పుత్రిక ఉగ్రరూపం... ఏమిటీ కథ?
- తెలంగాణ: ‘కేజీ టు పీజీ’ ఉచిత విద్య అమలు ఎంత వరకు వచ్చింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.
















