హిందు వర్సెస్ ముస్లిం: సీతారామం, ద కశ్మీర్ ఫైల్స్ సినిమాలు ఏం చాటాయి?

ఫొటో సోర్స్, SITARAMAM/POSTER
- రచయిత, వికాస్ త్రివేది
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఒక కథ, అనేక పాత్రలు, ఎంతోమంది కష్టం... ఇవన్నీ కలగలిస్తేనే సినిమా తయారవుతుంది. సినిమాలను లెక్కలేనన్ని సార్లు ‘సమాజానికి దర్పణాలు’ అని పిలిచారు.
అయితే, ఈ దర్పణం గడిచిన కాలంలో ఎంతవరకు మసకగా మారింది? ఎంతవరకు స్పష్టంగా కనిపించింది?
మతాల మధ్య అనుబంధాన్ని లేదా అగాధాన్ని చిత్రీకరించిన మీరు చూసిన చివరి సినిమా ఏదో గుర్తు చేసుకోండి?
ఈ కథనంలో మతం నేపథ్యంలో రూపొందించి 2022లో విడుదల అయిన కొన్ని చిత్రాల గురించి మాట్లాడుకుందాం.
ఒక పాటలో వేసుకున్న దుస్తుల రంగును మతానికి ముడిపెట్టి చర్చనీయాంశంగా మార్చిన ఈ తరుణంలో మతం ప్రతిపాదికన లేదా మతం నేపథ్యంలో చిత్రించిన కొన్ని సినిమాలను ప్రస్తావించడం ఇప్పుడు అవసరం.
అయితే, తొలుత మత సామరస్యాన్ని పెంపొందించేలా.. సమాజంలో నెలకొన్న చేదును చూపించేలా గతంలో తీసిన సినిమాల గురించి చూద్దాం.

ఫొటో సోర్స్, YRF/TRAILERGRAB
1941లో వి. శాంతరామ్ సినిమా ‘పడోసీ’ విడుదల అయింది. నమాజ్ చదివేందుకు మీర్జా రావడంతో అప్పటికే రామాయణం చదువుతున్న పండిత్ (ఠాకూర్) అక్కడి నుంచి లేచే సన్నివేశంతో సినిమా ప్రారంభం అవుతుంది.
‘ఠాకూర్ ఎందుకు నిల్చున్నావ్. నీకు ఇంకాసేపు రామాయణం చదవాలని ఉంది కదా?’ అని మీర్జా అడగగా దానికి పండిత్ ఇలా సమాధానం చెబుతాడు.
‘నేను ఇంకాసేపు రామాయణం ఇలాగే చదువుతూ కూర్చుంటే, నీ నమాజ్ వేళలు గడిచిపోతాయి. నాకు పాపం తగులుతుంది’ అని మీర్జాతో పండిత్ అంటాడు.
ఈ సన్నివేశానికి మరో అద్భుతమైన నేపథ్యం ఉంది. ఈ సినిమాలో పండిత్ పాత్రను మజహర్ ఖాన్, మీర్జా పాత్రను గజానన్ జాగీర్దార్ పోషించారు.
మత ప్రతిపాదికన పాకిస్తాన్‌ను ఏర్పాటు చేయాలనే సన్నాహాలు ఊపందుకున్న కాలంలో వచ్చిన సినిమా ఇది.
డ్యామ్ కట్టడానికి వచ్చిన ఒక ఇంజినీర్ వ్యూహాల కారణంగా హిందు, ముస్లిం మతాలకు చెందిన ఇద్దరు స్నేహితులు ఎలా శత్రువులుగా మారారనేది ఈ సినిమా కథాంశం. గ్రామంలో నిర్మించిన కొత్త డ్యామ్‌ను ఇద్దరు కలిసి కూల్చేయడంతో వారిద్దరి మధ్య శత్రుత్వం ముగుస్తుంది.
1946లో పీఎల్ సంతోషి తీసిన ‘హమ్ ఏక్ హై’ సినిమా కూడా ఇలాంటిదే. ఈ సినిమాలో జమీందార్ తల్లి పాత్రను పోషించిన దుర్గా ఖోటె వేర్వేరు మతాలకు చెందిన ముగ్గురు చిన్నారులను పెంచుతుంది.
ఈ ముగ్గురు పిల్లలు కూడా తమ మత ధర్మాలను పాటిస్తూ పెరుగుతారు. అలాగే ముందుకు సాగుతారు. ‘హమ్ ఏక్ హై’ సినిమాతోనే దేవానంద్ తన కెరీర్‌ను మొదలుపెట్టారు.
1959లో వచ్చిన ‘ధూల్ కా పూల్’ సినిమాలో అబ్దుల్ అనే ముస్లిం వ్యక్తి, తనకు అడవిలో దొరికిన బిడ్డను సాకుతాడు. ఈ బిడ్డ కారణంగా అతన్ని సమాజం వెలి వేస్తుంది. బిడ్డ కోసం అతను ఒంటరిగా బతుకుతాడు.
ఆ పిల్లవాడిని పెంచుతూ చిత్రీకరించిన ఒక పాటలో అబ్దుల్ ఇలా అంటాడు. ‘‘తూ హిందూ బనేగా నా ముసల్మాన్ బనేగా, ఇన్సాన్ కీ ఔలాద్ హై ఇన్సాన్ బనేగా...’’ అని పాట లిరిక్స్ ఉంటాయి. గత కొన్నాళ్లుగా వచ్చిన సినిమాల్లో ఈ తరహా డైలాగ్ లేదా పాటలు మీరు విన్నారా?
‘అమర్, అక్బర్, ఆంటోనీ’ అనే ముగ్గురు అన్నదమ్ముల కథ కూడా ఈ కోవకు చెందినదే.

ఫొటో సోర్స్, RRR/FILMGRAB
హిందు-ముస్లింల అల్లర్లు, విభజన బాధలను ప్రతిబింబించేలా అనేక సినిమాలు వచ్చాయి. ఈ నేపథ్యంగా చాలా సినిమాలు వచ్చినప్పటికీ, తమదైన ముద్రను చూపించిన సినిమాలు కొన్నే ఉన్నాయి.
బలరాజ్ సాహ్ని సినిమా ‘గరమ్ హవా’, ఉన్న చోటును వదిలి వేరే ప్రాంతానికి వెళ్లడంలో ఉండే బాధలను కళ్లకు కడుతుంది. మతం ఆధారంగా దేశం వదిలి వెళ్లడం కంటే వ్యక్తులకు, జీవనోపాధి అనేది మరింత అవసరమైనది అని ఈ సినిమా క్లైమాక్స్‌లో ప్రభావవంతంగా చూపించారు.
‘పింజర్’, ‘ట్రైన్ టూ పాకిస్తాన్’, ‘తమస్’ వంటి సినిమాలు కూడా ఇలాంటివే.
బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత మణిరత్నం దర్శకత్వంలో ‘బాంబే’, 2002 అల్లర్ల అనంతరం వాటి నేపథ్యంలో ‘ఫిరాక్’, ‘దేవ్’, ‘పర్జానియా’ వంటి సినిమాలు వచ్చాయి.
‘బాంబే’ సినిమా ఆయుధాలను పక్కన పడేసి చేతులు కలిపే సన్నివేశంతో ముగుస్తుంది.
జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలోని సినిమా స్టడీస్ ప్రొఫెసర్ ఇరా భాస్కర్, బీబీసీ హిందీతో మాట్లాడుతూ, ‘‘రెండు వర్గాల మధ్య సామరస్యం ఉండాలనే కోరికను బాంబే సినిమాలో చూపించారు. చేయి చేయి కలిపే సన్నివేశాన్ని చూపించడం ద్వారా హిందు, ముస్లిం మధ్య ఉన్న సమస్యలు దూరం కావు. కానీ, ఆ సన్నివేశంలో చూపించినట్లు నిజ జీవితంలో జరగాలి, అందరూ కలిసి మెలిసి జీవించాలి అనే ఆలోచన మీకు రావొచ్చు’’ అని అన్నారు.
ఆ కాలం నాటి వాస్తవిక పరిస్థితులను ఈ సినిమాల్లో చూపించేందుకు ప్రయత్నించారు.
‘సర్ఫరోష్’ సినిమాలోని ఒక సన్నివేశంలో ఏసీపీ అజయ్ సింగ్ రాఠోడ్ (అమీర్ ఖాన్)తో ఇన్‌స్పెక్టర్ సలీమ్ (ముకేశ్ రుషి) మాట్లాడుతూ ఇలా అంటాడు. ‘‘కాపాడేందుకు పది మంది కాదు, పది వేల మంది సలీమ్‌లు దొరుకుతారు. మీరు దీన్ని నమ్మితే, దయచేసి మరోసారి ‘ఈ దేశం మీ ఇల్లు కాదు’ అని ఇంకో సలీమ్‌తో అనకండి’’ అని రాఠోడ్‌కు చెబుతాడు.

ఫొటో సోర్స్, FILMGRAB
2006లో వచ్చిన ‘రంగ్ దే బసంతి’ సినిమా ప్రారంభంలో లక్షణ్ పాండే (అతుల్ కులకర్ణి), అస్లాం (కునాల్ కపూర్) పాత్రల మధ్య హిందు-ముస్లిం కారణంగా దూరాన్ని చూపిస్తుంటారు. అయితే, సినిమా ముందుకు సాగిన కొద్దీ ఆ రెండు పాత్రల మధ్య దూరం తగ్గిపోయి సన్నిహితంగా మారతాయి.
సినిమా విడుదలపై సంక్షోభం, న్యాయ వివాదాలు వంటి సమస్యలు తలెత్తుతోన్న ఈ తరుణంలో ‘రంగ్ దే బసంతి’ సినిమాకు సంబంధించిన ఒక ఉదంతాన్ని ఇప్పుడు ప్రస్తావించాల్సిన అవసరం ఉంది.
‘రంగ్ దే బసంతి’ సినిమా అధికారం, అధికారంలో ఉన్న వ్యక్తులకు ఉండే గ్యాంగుల గురించి చూపిస్తుంది.
భారత ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఫైటర్ జైట్ల క్రాష్‌కు సంబంధించి, భారత రక్షణ మంత్రిత్వ శాఖకు సంబంధించి కొన్ని వివాదాస్పద సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయన్న వార్తలు బయటకు వచ్చాయి. దీంతో ఈ సినిమాను విడుదల చేయడానికి ముందుగా అప్పటి రక్షణ శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీతో పాటు ఇతర సైనిక ఉన్నతాధికారులకు ఈ సినిమాను చూపించారు.
ఈ సినిమా చూసిన తర్వాత ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూ, ‘‘నా పని దేశాన్ని రక్షించడం, సినమాలను సెన్సార్ చేయడం కాదు. సినిమాలో పిల్లలు చాలా మంచి పని చేశారు’’ అని అన్నారు.
‘‘రంగ్ దే బసంతి’’ సినిమాలో అవినీతికి పాల్పడ్డాడంటూ రక్షణ మంత్రిని హత్య చేస్తారు. అలాంటి సినిమా గురించి అప్పటి రక్షణ మంత్రి ప్రణబ్ ముఖర్జీ తన అభిప్రాయాన్ని చెప్పారు.
2002 అల్లర్ల నేపథ్యంలో వచ్చిన ‘కాయ్ పొ చే’ సినిమా కూడా ప్రజలపై తన ప్రభావం చూపించడంలో విజయం సాధించింది.
ఆ సినిమాలో ముస్లిం బాలుడు ‘అలీ’ని కాపాడే ప్రయత్నంలో ‘ఇషాన్’ అనే కుర్రాడు ప్రాణాలు కోల్పోతాడు. అది తెలుసుకున్న ఓమీ పూర్తిగా అపరాదభావంతో నిండిపోతాడు. ఎంతటి ద్వేషాగ్ని అయిన ఒక్క కన్నీటి చుక్కతో ఆరిపోతుందని అతని కంటి నుంచి వచ్చే కన్నీరుతో తెలిసిపోతుంది.
2012లో వచ్చిన ‘ఓ మై గాడ్’, వివాదాస్పద ‘పీకే’ చిత్రాలు కూడా మతాల మధ్య దూరాన్ని సృష్టించే వ్యక్తులను బట్టబయలు చేశాయి.

ఫొటో సోర్స్, YT/ZEE CINEMALU
ఆర్‌ఆర్‌ఆర్
ఇప్పుడు 2022లో మతం అనే అంశాన్ని ఎక్కడో ఒక చోట చేర్చి రూపొందిన సినిమాలు ఎలాంటి సందేశాన్ని ప్రజలకు చేరవేశాయి? సోషల్ మీడియా తరంలో అవి ఎలాంటి ప్రభావాన్ని చూపించాయి? అలాంటి కొన్ని సినిమాల గురించి చూద్దాం.
రాజమౌళి సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్’లో జూనియర్ ఎన్టీఆర్, చరణ్‌ల మధ్య ఒక డైలాగ్ ఉంటుంది.
ఒక సన్నివేశంలో రాజు (రామ్ చరణ్) తన స్నేహితుడు అక్తర్ (జూనియర్ ఎన్జీఆర్) కోసం రోడ్డుపై మేకులు వేసి జెన్నిఫర్ కారును ఆగిపోయేలా చేస్తాడు.
కారు పంక్చర్ అయిందన్న విషయం తెలియగానే రాజుతో అక్తర్ ఇలా అంటాడు. ‘‘ఇప్పుడు నేను ఆ కారు పంక్చర్‌ను సరిచేస్తాను. అప్పుడు ఆమె నాకు థ్యాంక్యూ చెబుతుంది. ఆ తర్వాత మేం మాట్లాడుకుంటాం’’ అని అంటాడు.
ఆ తర్వాత జెన్నిఫర్‌తో అక్తర్ మాట్లాడుతూ, ‘‘నా దుకాణం పక్కనే ఉంది. అయిదు నిమిషాల్లో దీన్ని నేను సరిచేస్తా’’ అని అంటాడు.
అక్తర్, జెన్నిఫర్ అనే పాత్రలను కలిపేందుకు సృష్టించిన సన్నివేశం ఇది.
అయితే, ముస్లింలను పంక్చర్ పనికి ముడిపెడుతూ వచ్చిన అసంఖ్యాక సందేశాలు, వ్యాఖ్యలను మీరు చదివే ఉంటారు. కాబట్టి ప్రజలు ఈ సన్నివేశాన్ని విభిన్నంగా అర్థం చేసుకున్నారు.
అయితే, అక్తర్ అనే ముస్లిం పాత్రదారితో నేను పంక్చర్ సరిచేస్తాను అనే డైలాగ్ చెప్పించినందుకు కొందరు సోషల్ మీడియా యూజర్లు రాజమౌళికి సెల్యూట్ చేస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ద కశ్మీర్ ఫైల్స్
‘కశ్మీర్’ నేపథ్యంలో ‘రోజా’, ‘హామిద్’, ‘మిషన్ కశ్మీర్’, ‘యహా’, ‘తహాన్’, ‘హైదర్’, ‘షికారా’ వంటి అనేక సినిమాలు వచ్చాయి.
కానీ ఈ నేపథ్యంలో వచ్చిన ‘ద కశ్మీర్ ఫైల్స్’ లాంటి విజయాన్ని ఇతర చిత్రాలు అందుకోలేకపోయాయి.
ఐఎండీబీ వెబ్‌సైట్ ప్రకారం, 20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ‘ద కశ్మీర్ ఫైల్స్’ చిత్రం 340 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
సినిమా చూడాలంటూ స్వయంగా దేశ ప్రధాని విజ్ఞప్తి చేసిన మొదటి చిత్రం బహుశా ‘ద కశ్మీర్ ఫైల్స్’ అయ్యుండొచ్చు.
సినిమాలు లేదా పాటలు మనోభావాలు దెబ్బతీశాయంటూ తరచుగా ఫిర్యాదు చేసే మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా, యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ వంటి వారు ‘ద కశ్మీర్ ఫైల్స్’ సినిమా విషయానికి వచ్చే సరికి ఉదారంగా, చాలా ఉత్సాహంగా కనిపించారు.
చాలా రాష్ట్రాల్లో ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, KASHMIRFILES/FILMGRAB
1990లలో కశ్మీర్ లోయలో కశ్మీరీ పండితుల వలసలకు సంబంధించిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.
రాత్రికిరాత్రే కశ్మీరీ పండితులు, కశ్మీర్ లోయను ఎలా విడిచి వెళ్లాల్సి వచ్చిందో ఈ సినిమాలో చూపించారు.
పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ సినిమాను ఇష్టపడ్డారు. కశ్మీరీ పండితుల కథలను ఏళ్లుగా ఎవరూ పట్టించుకోలేదని చాలా మంది చెప్పారు.
కానీ, ఈ సినిమా ఇచ్చిన సందేశం ఏంటి? దీన్ని మీరు చాలా రకాలుగా అర్థం చేసుకోవచ్చు.
ఈ సినిమాకు సంబంధించిన చాలా అంశాలు మీ చుట్టుపక్కల వారు చర్చించగా మీరు వినే ఉంటారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఈ సినిమా థియేటర్లలో నడుస్తున్నప్పుడు కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందులో కొందరు ప్రజలు సినిమా తర్వాత ఏడుస్తూ వివేక్ అగ్నిహోత్రి పాదాలను తాకడం కనిపిస్తుంది.
మరికొన్ని వీడియోల్లో సినిమా చూసిన వెంటనే కొందరు... ముస్లిం అమ్మాయిలను పెళ్లి చేసుకొని వారితో పిల్లల్ని కనండి అంటూ పలు హింసాత్మక వ్యాఖ్యలు చేస్తూ కోపంగా కనిపించారు.
ఈ వీడియాలు హైదర్ సినిమాలోని ఒక డైలాగ్‌ను గుర్తు చేస్తాయి. ‘‘ఇంతకామ్ సే సిర్ప్ ఇంతకామ్ పైదా హోతా హై’’ అనే డైలాగ్‌ను ఈ వీడియోలు గుర్తు చేస్తున్నాయి.
కశ్మీర్ పండిట్ల నేపథ్యంగా వచ్చిన ‘షికారా’ సినిమా ప్రజలకు నచ్చకపోవడానికి, ‘ద కశ్మీర్ ఫైల్స్’ విపరీతంగా నచ్చడానికి కారణం ఏంటి?

ఫొటో సోర్స్, VIVEK AGNIHOTRI/FACEBOOK
దీని గురించి కశ్మీరీ పండిత్ సంజయ్ కాక్, బీబీసీతో మాట్లాడారు.
‘‘రైట్ వింగ్ ప్రజలు కోరుకున్నట్లుగా ‘ద కశ్మీర్ ఫైల్స్’ సినిమా కథ ఉంది. ఈ విషయంలో ‘షికారా’ దాని ప్రమాణాలకు తగ్గట్లుగా లేదు. అందుకే అది వెనుకబడింది. కానీ, కశ్మీర్ ఫైల్స్ సినిమా విషయంలో ప్రకృతి మొత్తం ఈ విషయాన్ని ప్రపంచానికి బహిర్గతం చేయాలని నిర్ణయించుకున్నట్లుగా అనిపిస్తుంది’’ అని అన్నారు.
బనారస్ హిందూ యునివర్సిటీ ప్రొఫెసర్, సినిమా నిపుణుడు ఆశిష్ త్రిపాఠి మాట్లాడుతూ, ‘‘సమాజం, రాజకీయాల్లో ఇలా ఆలోచించే వ్యక్తులు పెరిగిపోవడంతో కశ్మీర్ ఫైల్స్ సినిమా ఎక్కువ ప్రజాదరణ పొందింది.
రైట్ వింగ్ కోసం మీడియా చాలా బాగా పనిచేస్తోంది. అందులో సినిమా కూడా ఒక భాగం. కశ్మీర్ ఫైల్స్‌లోని కొన్ని సన్నివేశాలు మీకు ఊరటనిచ్చిన మాట నిజమే. కానీ, ఈ సినిమా నచ్చని వారు ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అదేంటంటే సినిమాలో చూపించినట్లుగా ఎవరికో ఒకరికి జరిగి ఉంటుందని విషయాన్ని వారు మర్చిపోకూడదు.
కానీ, కశ్మీర్ ఫైల్స్ ఒక మంచి సినిమా, కళ కాదు. ఎందుకంటే ఇది ఒకవైపు కథను మాత్రమే చెబుతుంది. కేవలం ఇదే జరగలేదు. దానికి వ్యతిరేకంగా కూడా చాలా జరిగాయి. కళ అనేది మానవులు ముందుకు సాగడానికి సహాయపడే కోణాన్ని చూపించాలి.
ఒక ఉద్దేశంతో తెరకెక్కించిన చిత్రాన్ని చెడ్డ సినిమా అనకూడదు. కానీ, కశ్మీరర్ ఫైల్స్ అనేది చెడ్డ ప్రచార చిత్రం. ఎందుకంటే సమాజాన్ని ఏకతాటిపైకి తెచ్చే మూలకాలను ఈ సినిమాలో పూర్తిగా విస్మరించారు. ఈ చిత్రం బలహీన వర్గాలపై దాడి’’ అని ఆయన అన్నారు.
ఈ సినిమాపై అంతర్జాతీయ చలన చిత్రోత్సవం జ్యూరీ చీఫ్ నడవ్ లాపిడ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆయన ఈ సినిమాను ‘ఒక అసభ్యకర’, ‘ప్రచారం కోసం తీసిన చిత్రం’ అని అభివర్ణించారు.
కశ్మీర్ ఫైల్స్ మతపరమైన ఉద్రిక్తతను పెంచడమే కాకుండా ఏకపక్షంగా కథను చూపించిందని ప్రొఫెసర్ ఇరా భాస్కర్ అన్నారు. కశ్మీర్ పండిట్ల చేదు అనుభవాలతో పాటు ముస్లిం ప్రజల పరిస్థితి కూడా తెలపాల్సిందని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, sitaramam trailer grab
సీతా రామం
సీతా రామం సినిమా యుద్ధంతో ముడిపడిన ఒక ప్రేమ కథ. ఈ సినిమాలో లెఫ్టినెంట్ రామ్‌కి ఒక అపరిచితురాలు ‘సీతామహాలక్ష్మి’ పేరుతో లేఖలు రాస్తుంది.
లేఖలు రాసే ఆ అమ్మాయి నిజానికి యువరాణి నూర్జహాన్. ఈ సినిమాలో రామ్, సీతలు ఒకరినొకరు కలుసుకోవడం, ప్రేమలో పడటంతో పాటు కశ్మీర్‌కు సంబంధించిన, హిందూ ముస్లింలకు సంబంధించిన అంశాలు కూడా వచ్చాయి.
సినిమాలోని పాకిస్థానీ పాత్రలను కూడా మానవీయ, భావోద్వేగ కోణాల్లో చూపించిన కొన్ని సినిమాలలో సీతారామం ఒకటి. భారత్‌కు చెందిన రామ్ సందేశాన్ని సీతకు చేర్చడం కోసం తిరిగే ఒక పాకిస్తానీ అమ్మాయి ఈ సినిమాలో కనిపిస్తుంది.
ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో కశ్మీరీ పండిట్ల ఇళ్లను తగులబెట్టిన విధానంతో పాటు, వారిని రక్షించేందుకు ముస్లింలు చేసే ప్రయత్నాలను చూపించడం వల్ల సినిమా విద్వేషాలను రేకెత్తించకుండా సానుకూలంగా సాగుతుంది.
అనాథ అయిన ‘లెఫ్టినెంట్’ రామ్‌ను ప్రజలకు చేరువ చేసే ప్రయత్నాలను ఈ సినిమాలో చూపించారు.
తీవ్రవాదులను చంపే ఒక సన్నివేశంలో రామ్ తన చేతులోకి ఖురాన్‌ను తీసుకుంటూ వారితో ఇలా అంటాడు. ‘‘బహుశా మీరు వచ్చే జన్మలో ఖురాన్ నిజమైన అర్థాన్ని తెలుసుకుంటారు’’ అని అంటాడు.
మతం పేరుతో యువతను ఎలా తప్పుదోవ పట్టిస్తున్నారనే అంశాన్ని కూడా ఈ సినిమా స్పృశించింది.
‘‘మతం పేరుతో మొదలైన యుద్ధం ముగిసిన తర్వాత ఇక మిగిలేది మనుషులే. చేతులో ఆయుధం పట్టుకుని పోరాడేవాడు ఒక సిపాయి. ధర్మాన్ని ఆయుధంగా మార్చేవాడు... రామ్’ అనే డైలాగ్ ఈ సినిమాలో ఉంటుంది.
'వీర్ జరా' సినిమా కథలాగే అనిపించినప్పటికీ ‘‘సీతా రామం’’ సరికొత్తగా అనిపిస్తుంది.
‘‘నన్ను నూర్జహాన్ కాదు, సీతా అని పిలవండి’’ అని నూర్జహాన్ చెప్పడానికి ఎక్కువ సమయం పట్టదు.
‘‘లవ్ జిహాద్’’ పేరుతో విద్వేషాలు చెలరేగుతున్న ఈ సమయంలో రామ్ అనే హిందు అబ్బాయిపై ముస్లిం యువరాణికి ప్రేమ కలగడం, పాకిస్తాన్ అమ్మాయికి రామ్ పట్ల గౌరవం పెరగడం వంటి అంశాలు ‘‘సీతా రామం’’లో చాలా ఉన్నాయి.
ఈ సినిమాలో రామ్ పాత్రను దుల్కర్ సల్మాన్ పోషించగా, యువరాణి నూర్జహాన్ పాత్రను మృణాల్ ఠాకూర్ పోషించారు.
ప్రొఫెసర్ ఐరా భాస్కర్ మాట్లాడుతూ, ‘‘సీతా రామం వంటి సినిమాలు మతపరమైన దూరాలను పెంచడం కంటే తగ్గించే పనిలో పడ్డాయి. హిందూ-ముస్లిం జంటల మధ్య ప్రేమానురాగాలను చూపించే చాలా మధురమైన చిత్రం ఇది.
ద్వేషపూరిత వాతావరణం నెలకొన్న సమయంలో కేవలం ఒక సన్నివేశం ద్వారా ద్వేషాలను తగ్గించలేం. భారత్‌లోని ప్రతీ ప్రాంతం ఒకే రీతిలో లేదనే విషయాన్ని మనం గమనించాలి. దక్షిణాదిన వచ్చిన సినిమాలను పరిశీలిస్తే అక్కడ చాలా మంచి సినిమాలు వచ్చాయి’’ అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, YRF FILMS PR
పృథ్వీరాజ్ చౌహాన్
పృథ్వీరాజ్ చౌహాన్ మరణించిన దాదాపు 350 ఏళ్ల తర్వాత రాసిన ‘పృథ్వీరాజ్ రసో’ అనే పుస్తకం ఆధారంగా తీసిన పృథ్వీరాజ్ చౌహాన్ సినిమాకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పన్ను మినహాయింపు ఇచ్చారు.
ఈ సినిమాకు విపరీత ప్రచారం జరిగింది. హోం మంత్రి అమిత్ షా ఈ సినిమాను ప్రత్యేక ప్రదర్శనలో చూశారు.
అయితే, ఈ సినిమా ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. సాధారణ ప్రేక్షకుల నుంచి విమర్శకుల వరకు ఈ సినిమాను తిరస్కరించారు.
బయటి నుంచి వచ్చిన క్రూరమైన ఆక్రమణదారులుగా ముస్లింలను చిత్రీకరించే సినిమాలలో ఇది కూడా ఒకటి అని విమర్శకులు అన్నారు.
‘‘ఇలాంటి సినిమాలు ఒక ఉద్దేశంతో తీస్తారు. తన రాజ్యాన్ని కాపాడుకోవడం కోసమే పృథ్వీరాజ్ పోరాడాడు. అంతేకానీ ఏ ముస్లిం దండయాత్రకు వ్యతిరేకంగా అతను పోరాడలేదు’’ అని బీబీసీతో చరిత్రకారుడు అరుప్ అన్నారు.
సినిమాలపై నమ్మకం పెట్టుకోవచ్చా?
ఇప్పుడు ఉత్పన్నమయ్యే ప్రశ్న ఏమిటంటే, సినిమా పరిశ్రమ ఎంత మారిపోయింది? సినిమాల ద్వారా మత సామరస్యాన్ని పెంచడం గురించి మాట్లాడటం ఎంతవరకు సరైనది?
ప్రొఫెసర్ ఇరా భాస్కర్ మాట్లాడుతూ, “ప్రధాన స్రవంతి సినిమాల్లో ఇవన్నీ కనిపించవు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సినిమా నిర్మాతలపై ఒత్తిడి ఉంటుంది. మెజారిటీని దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీస్తారు.
ముఖ్యమైన సమస్యలు, ప్రశ్నలను లేవనెత్తుతూ కొన్ని షార్ట్ ఫిల్మ్‌లు కూడా ఉన్నాయి. 'ముల్క్' వంటి సినిమాలు కూడా రూపొందాయి, కానీ పెద్ద స్థాయిలో రాలేదు.
సినిమాలు కేవలం వినోదానికి మూలం కాదు. అవి ఒక కళారూపం. సమాజంలోని ముఖ్యమైన సమస్యల గురించి మాట్లాడే బాధ్యత చిత్రనిర్మాతలపై ఉంది" అని ఆమె అన్నారు.
మతపరమైన దూరాలను తగ్గించడంలో సినిమాల పాత్ర ఏంటి?
ఈ ప్రశ్నకు ప్రొఫెసర్ ఇరా స్పందిస్తూ, “మతాల మధ్య అంతరాన్ని పెంచడంలో లేదా పూడ్చటంలో సినిమాలు ముఖ్యమైనవి. ఇవి రాజకీయ పరిష్కారాలను అందించలేవు, కానీ ఆలోచనా విధానాన్ని మార్చగలవు. ఇది నిజం కాకపోతే ఇప్పటి ప్రభుత్వం, సినిమాలపై ఎందుకు అంత పెట్టుబడులు పెడుతుంది? సోషల్ మీడియా నుంచి సినిమాల వరకు భావజాలాన్ని చాటుతున్నారు.
ప్రధాన స్రవంతి రాజకీయ వాతావరణం ముస్లింలపై ద్వేషంతో నిండి ఉంది. మతాల మధ్య దూరాలు తగ్గించడానికి పనికొచ్చే సినిమాలు తీయడం కష్టం. ఇలాంటి సినిమాలు చేసినా ఏదో ఒక సమస్య ఎదురవుతుంది’’ అని ఆమె వివరించారు.
దీని గురించి ప్రొఫెసర్ ఆశిష్ త్రిపాఠి మాట్లాడుతూ, ‘‘వీర్ హమీద్‌పై ఇప్పటి వరకు ఏ సినిమా రాలేదు. కొడుకుగా తన నిజమైన కర్తవ్యాన్ని నెరవేర్చిన అలాంటి వ్యక్తుల గురించి ఎవరూ మాట్లాడరు. అలాగే దేశద్రోహుల పాత్ర పోషించిన హిందువుల గురించి కూడా ఎక్కడా మాట్లాడరు.
సినిమా చూసే వారిలో పెద్ద సంఖ్యలో మధ్యతరగతి హిందువులే ఉంటారు. వారిని దృష్టిలో పెట్టుకొని కూడా సినిమాలు తీస్తున్నారు.
ఇప్పుడు సెక్యులర్ సినిమాలు తగ్గిపోయాయి. సమాజంలో, రాజకీయాల్లో రాజకీయ, సామాజిక శక్తులు బలహీనపడినప్పుడే సినిమా మారుతుందని నా నమ్మకం’’ అని ఆయన వివరించారు.
ఇవి కూడ చదవండి:
- కరెంటు, తిండీ లేకుండా సముద్రంలోనే నెల రోజులు, చివరికి ఎలా బయటపడ్డారు?
- కోవిడ్-19 బీఎఫ్7: ఆక్సిజన్ సిలిండర్, మందులు కొని ఇంట్లో పెట్టుకోవాలా?
- అమ్మ ఒడి : బడికి వెళ్లే పిల్లలకు ఇచ్చే రూ.15 వేలు తీసుకోవడం ఎలా?
- క్రికెట్: ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 భారత ఆటగాళ్లు వీళ్లే...
- చార్లీ చాప్లిన్ శవపేటికను దొంగతనం చేసి, అతడి భార్యను బ్లాక్ మెయిల్ చేసిన దొంగల కథ మీకు తెలుసా..?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















