సన్నీ లియోన్, దీపికా పదుకొణె వంటి బాలీవుడ్ తారలపై విమర్శలు చేసే నరోత్తమ్ మిశ్రా ఎవరు? ఆయన లక్ష్యం ఏమిటి?

నరోత్తమ్ మిశ్రా

ఫొటో సోర్స్, SHUHAIR NIYAZI/BBC

    • రచయిత, షురైహ్ నియాజీ
    • హోదా, బీబీసీ హిందీ కోసం

మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా ముస్లింలతో కలిసి ఉన్న ఈ ఫొటో 2018లో తీసింది.

ఆ రోజుల్లో ఆయన ప్రతి ఏడాది ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి ముస్లింలను ఆహ్వానిస్తూ ఉండేవారు. ‘ఈ రోజుల్లో తరచూ టీవీల్లో కనిపిస్తున్న నరోత్తమ్ మిశ్రాకు, నాటి నరోత్తమ్ మిశ్రాకు చాలా తేడా ఉంది. గత అయిదేళ్లలో చాలా మార్పు వచ్చింది’ అని భోపాల్‌కు చెందిన ఒక జర్నలిస్టు అన్నారు.

తన నియోజకవర్గంలోని ముస్లిం ఓటర్లను ఆకర్షించేందుకు ఒకప్పుడు నరోత్తమ్ మిశ్రా తరచూ ఇఫ్తార్ విందులు వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉండేవారు.

కానీ ఇప్పుడు నరోత్తమ్ మిశ్రా వైఖరి బాగా మారిపోయింది. ఇటీవల కాలంలో తరచూ ఆయన మీడియా పతాక శీర్షికల్లో కనిపిస్తున్నారు. ఆయన ప్రస్తుతం మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన చేసే వివాదాస్పద వ్యాఖ్యల వల్ల ప్రతి రోజూ జర్నలిస్టులు ఆయన ఇంటి వద్ద వార్తల కోసం వేచి చూస్తుంటారు.

జాతీయం, అంతర్జాతీయం, సినిమా, మతం, రాజకీయాలు.. ఇలా మ్యాటర్ ఏదైనా కానీ దాని మీద నరోత్తమ్ మిశ్రా మాట్లాడతారని చాలా మంది చెబుతుంటారు. ఒకవేళ బాలీవుడ్ సినిమాలు, మతానికి సంబంధించిన అంశం అయితే ఆయన కచ్చితంగా మాట్లాడి తీరతారు.

నరోత్తమ్ మిశ్రా

ఫొటో సోర్స్, SHUHAIR NIYAZI/BBC

బాలీవుడ్ మీదనే దృష్టి

మధ్యప్రదేశ్ హోం మంత్రి అయిన నరోత్తమ్ మిశ్రా, కొన్నేళ్లుగా రాష్ట్రంలోని శాంతి భద్రతల కన్నా బాలీవుడ్ మీద ఎక్కువ దృష్టి పెట్టినట్లు చాలా మంది భావిస్తున్నారు. షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ సినిమా మీద ఇప్పుడు ఆయన విరుచుకుపడుతున్నారు. ఆ సినిమాలోని ఒక పాటలో దీపికా పదుకొణె ధరించిన దుస్తులు ‘చాలా అభ్యంతరకరంగా ఉన్నాయ్’ అని ఆయన అన్నారు.

‘కించపరచాలనే ఉద్దేశంతోనే ఆ పాటను చిత్రీకరించారు. ఆ విషయం స్పష్టంగా తెలుస్తోంది. జేఎన్‌యూలోని తుక్డే-తుక్డే గ్యాంగ్‌కు దీపికా పదుకొణె మద్దతిచ్చారు. కాబట్టి ఆ దుస్తులు మార్చండి. లేదంటే మధ్యప్రదేశ్‌లో ఆ సినిమా విడుదల ప్రశ్నార్థకరంగా మారుతుంది’ అంటూ నరోత్తమ్ మిశ్రా హెచ్చరించారు.

హిందూ మత విశ్వాసాలను వక్రీకరిస్తున్నారంటూ ఆదిపురుష్ సినిమా బృందాన్ని ఆయన అక్టోబరులో హెచ్చరించారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ ఏడాది జులైలో లీనా మణిమేఖలై తీసిన డాక్యుమెంటరీ చిత్రం ‘కాళి’ మీద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిందిగా ఆయన ఆదేశించారు.

సబ్యచాచి ముఖర్జీ ‘మంగళసూత్ర’, డాబర్ కంపెనీ ‘కర్వ చౌతా’ వాణిజ్య ప్రకటనలు సైతం నరోత్తమ్ మిశ్రా ఆగ్రహానికి గురయ్యాయి. ఇలా కొంత కాలంగా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యలతో వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు.

శివరాజ్ సింగ్ చౌహాన్‌తో నరోత్తమ్ మిశ్రా

ఫొటో సోర్స్, TWITTER/DRNAROTTAMMISHRA

శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ప్రత్యమ్నాయం

గ్వాలియర్‌కు చెందిన దేవ్ శ్రీమాలి జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఆయన చాలా కాలంగా నరోత్తమ్ మిశ్రాను గమనిస్తూ వస్తున్నారు. ‘పార్టీ నాయకత్వం ఏ భావజాలం మీద ముందుకు నడుస్తూ ఉందో దానికి అనుకూలంగా నరోత్తమ్ మిశ్రా ఆ వ్యాఖ్యలు చేస్తున్నారు’ అని శ్రీమాలి చెబుతున్నారు.

‘మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కాస్త మధ్యస్థంగా ఉంటారనే ఇమేజ్ ఉంది. అందువల్ల నరోత్తమ్ మిశ్రా దూకుడుగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో యోగి, అస్సాంలో హేమంత్ బిశ్వ శర్మల మాదిరిగా మధ్యప్రదేశ్‌లో తాను గుర్తింపు తెచ్చుకోవాలని ఆయన భావిస్తున్నారు’ అని శ్రీమాలి అన్నారు.

2005 నుంచి నరోత్తమ్ మిశ్రా మంత్రి పదవులు చేపడుతూ వస్తున్నారు. 2018లో బీజేపీ ఓడిపోయింది. ఆ తరువాత జ్యోతిరాథిత్య సింథియా తన వర్గంతో కాంగ్రెస్ నుంచి రావడంతో బీజేపీ మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చింది. నాడు సీఎం రేసులో ఉన్న వారిలో నరోత్తమ్ మిశ్రా కూడా ఒకరు అని వార్తలు వచ్చాయి.

మధ్యప్రదేశ్‌లోని దతియాకు చెందిన నరోత్తమ్ మిశ్రా, తనను తాను శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ప్రత్యామ్నాయంగా భావించుకుంటారు. సుమారు మూడు లక్షల 35 వేల దతియా అసెంబ్లీ జనాభాలో ముస్లింలు 4 శాతం ఉంటారు.

పఠాన్ సినిమా

ఫొటో సోర్స్, Social Media

‘మొదట్లో వాళ్లు ఇలా ఉండే వారు కాదు. ఇప్పుడు బీజేపీ రాజకీయాల ప్రకారం ప్రతి ఒక్కరూ హిందువుల ఓట్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. అది నిజంగా వారి మనసులో ఉందో లేదో తెలియదు. నరోత్తమ్ మిశ్రా ఒక వ్యూహం ప్రకారం ఇలా చేస్తున్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్‌ను రాడికల్‌గా చూడరు. కాబట్టి అటువంటి ఇమేజ్ కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు’ అని సీనియర్ జర్నలిస్ట్ రాకేశ్ పాఠక్ అన్నారు.

మధ్యప్రదేశ్ రాజకీయాల్లో బ్రహ్మణ వర్గానికి ప్రతినిధిగా ఉన్నారు నరోత్తమ్ మిశ్రా. రాష్ట్రంలో ఎప్పుడైతే అధికార మార్పు జరుగుతుందనే చర్చలు మొదలవుతాయో ఆయన వెంటనే దిల్లీకి వెళ్తుంటారు.

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు నరోత్తమ్ మిశ్రా చాలా సన్నిహితునిగా చెబుతుంటారు. ‘ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో నరోత్తమ్ మిశ్రాకు కొన్ని బాధ్యతలు ఇచ్చిన నాటి నుంచి ఆయనను అమిత్ షాకు సన్నిహితునిగా చూస్తున్నారు’ అని దేవ్ శ్రీమాలి అన్నారు.

భోపాల్‌కు వచ్చినప్పుడు అమిత్ షా, ఒకసారి నరోత్తమ్ మిశ్రా ఇంట్లో భోజనం చేశారు. ఇలాంటి వాటి వల్ల ఆయనకు అమిత్ షాతో మంచి సాన్నిహిత్యం ఉందనే ఇమేజ్ వచ్చింది.

గ్వాలియర్‌లో పుట్టిన నరోత్తమ్ మిశ్రా ఎం.ఎ, పీహెచ్‌డీ చేశారు. అయితే పార్టీలతో తన తోటి వారిని ఎదగనివ్వరని స్థానిక బీజేపీ నేతలు చెబుతుంటారు.

వివాదాలు ఆయనకు కొత్త కాదు. 2008 ఎన్నికల్లో ఆయన మీద ‘పెయిడ్ న్యూస్’ ఆరోపణలు వచ్చాయి. నాడు అన్ని పత్రికల్లో వచ్చిన వార్త హెడ్ లైన్, అందులోని విషయం అంతా ఒకేరకంగా ఉన్నాయి. అలాంటి సుమారు 42 వార్తలు ఆ సమయంలో పబ్లిష్ అయ్యాయి.

నాడు ఆయన ప్రత్యర్థి రాజేంద్ర భారతి, ఆ ‘పెయిడ్ న్యూస్’ మీద ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. విచారణలో ఆ వార్తల కోసం డబ్బు చెల్లించినట్లు తేలడంతో మూడు సంవత్సరాలపాటు ఎన్నికల్లో పోటీ చేయకూడదంటూ నరోత్తమ్ మిశ్రా మీద ఎన్నికల సంఘం నిషేధం విధించింది.

ఆ తరువాత దిల్లీ హై కోర్టుకు వెళ్లిన నరోత్తమ్ మిశ్రాకు ఊరట దక్కింది. కానీ ఎన్నికల సంఘం మళ్లీ సుప్రీం కోర్టుకు వెళ్లింది. ప్రస్తుతం ఆ కేసు పెండింగ్‌లో ఉంది.

కానీ నరోత్తమ్ మిశ్రా ఇమేజ్ రోజురోజుకూ పెరుగుతూ పోతోంది. ఇప్పుడు ఆయన మీద పాటలు రాసి కూడా పాడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)