క్రిస్మస్: భారత్‌లో తొలి క్రిస్మస్ కేక్ ఎక్కడ, ఎలా తయారైంది? ఆ కథ మీకు తెలుసా...

ఫొటో సోర్స్, SK MOHAN
- రచయిత, అష్రఫ్ పదాన
- హోదా, రిపోర్టర్, త్రివేండ్రమ్
భారత్‌లో తయారైన తొలి క్రిస్మస్ కేక్ కథ గురించి ప్రకాశ్ మంబల్లీకి బాగా తెలుసు.
అది 1883 నవంబర్ నెల. ముర్డోక్ బ్రౌన్ అనే ఒక వ్యాపారి కేరళలోని ‘రాయల్ బిస్కట్ ఫ్యాక్టరీ’ దుకాణంకి వెళ్లారు. తనకు క్రిస్మస్ కోసం ఒక కేక్ తయారు చేయగలరా? అని ఆ బిస్కట్ ఫ్యాక్టరీ యజమాని మంబల్లీ బాపుని ఆ వ్యాపారి అడిగారు.
అప్పటి బ్రిటీష్ పాలనలో ఉన్న మలబార్ రీజియన్‌లో భారీగా దాల్చినచెక్క తోటల సాగు వ్యాపారం చేసేవారు. ఆయన బ్రిటన్ నుంచి తీసుకొచ్చిన ఒక నమూనా కేక్‌ను చూపిస్తూ దాని తయారీ విధానాన్ని బాపుకు వివరించారు.
బ్రెడ్, బిస్కట్లను బేక్ చేయడం బాపుకు తెలుసు. బర్మాలోని ఒక బిస్కట్ ఫ్యాక్టరీలో బాపు బేకింగ్ చేయడం నేర్చుకున్నారు. కానీ, ఆయనెప్పుడూ కేక్‌ను తయారు చేయలేదు. కానీ, బ్రౌన్ చెప్పిన కొలతలతో కేక్ చేయడం ప్రయత్నించాలని ఆయన నిర్ణయించుకున్నారు.
కొన్ని మార్పులు చేస్తూ బాపు కేక్ ప్రయోగం చేశారు.

ఫొటో సోర్స్, MAMBALLY FAMILY
కేక్ తయారీలో మహే అనే ఫ్రెంచ్ కాలనీలో దొరికే బ్రాందీని ఉపయోగించమని బ్రౌన్ సూచించారు. కానీ, బాపు స్థానికంగా జీడిపప్పు, ఆపిల్‌లతో తయారైన సారాను కలిపి కేక్‌ను తయారు చేశారు.
దీంతో మొత్తం స్థానిక దినుసులు, పదార్థాలతో కూడిన ఒక ప్రత్యేక ప్లమ్ కేక్ తయారైంది.
ఆ కేక్‌ను రుచి చూసిన బ్రౌన్ చాలా సంతోషించారు. మరో డజనుకు పైగా కేకులు తయారు చేయాల్సిందిగా ఆర్డర్ ఇచ్చారు.
‘‘అదిగో, అలా భారత్‌లో తొలి క్రిస్మస్ కేక్ తయారైంది’’ అని ప్రకాశ్ మంబల్లీ చెప్పారు. బాపు మేనల్లుడి మనవడు ప్రకాశ్ మంబల్లీ.
క్రిస్మస్ తొలి కేక్‌కు సంబంధించిన ఈ కథను నిర్ధారించే అధికారిక పత్రాలేవీ లేవు. అయితే మంబల్లీ బాపు, కేరళ రాష్ట్రం కన్నూర్ జిల్లాలోని తలస్సెరీ ప్రాంతంలో ప్రారంభించిన ఈ బేకరీ మాత్రం ఇప్పుడు క్రిస్మస్ సంప్రదాయాల్లో ఒక భాగంగా మారింది.

ఫొటో సోర్స్, SK MOHAN
నాలుగు తరాలుగా బాపు వారసులు ఈ వారసత్వం గురించి గర్వపడుతున్నారు.
‘‘భారతీయుల్లో బ్రిటీష్ రుచులకు బాపు ప్రాచుర్యం తెచ్చారు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో కూడా ఆయన సైనికుల కోసం కేకులు, స్వీట్లు ఎగుమతి చేశారు’’ అని ప్రకాశ్ మంబల్లీ చెప్పారు.
ఆ తర్వాత మంబల్లీ కుటుంబీకులు వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో బేకరీ శాఖలను ప్రారంభించారు. కేక్ ప్రియులకు అవి ఇష్టమైన గమ్యస్థానంగా మారాయి.
తలస్సేరిలో బాపు ప్రారంభించిన అసలు బేకరీని ప్రస్తుతం ప్రకాశ్ నడుపుతున్నారు.
ప్రకాశ్ తాత గోపాల్ మంబల్లీ ఈ బేకరీని తల్లి వంశస్తుల నుంచి వారసత్వంగా పొందారు. అప్పట్లో కేరళలో ఈ సంప్రదాయం ఉండేది. గోపాల్‌కు 11 మంది సంతానం. వారంతా కూడా కుటుంబ వ్యాపారంలోకే వెళ్లారు.
తలస్సేరిలో బాపు ప్రారంభించిన చిన్న దుకాణాన్ని ప్రజలందరికీ చేరువ చేసేందుకు అక్కడే మరో చోటుకు మార్చినట్లు ప్రకాశ్ మంబల్లీ చెప్పారు.

ఫొటో సోర్స్, MAMBALLY FAMILY
‘‘కేక్ నాణ్యతను కొనసాగించడం కోసం కేక్ తయారీలోని సంప్రదాయ పద్ధతులనే కచ్చితంగా వాడతాం’’ అని బీబీసీతో ప్రకాశ్ మంబల్లీ చెప్పారు. ఇప్పుడు ఆయన అరవై పదుల వయస్సులో ఉన్నారు.
కాల క్రమంలో ఈ కుటుంబీకులు, కేక్‌కు కొత్త రుచులను జోడించారు.
‘‘కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా మేం 2 డజన్లకు పైగా వెరైటీ కేకులకు తయారు చేస్తున్నాం’’ అని ప్రకాశ్ తెలిపారు.
తమకు వచ్చే ఆర్డర్లలో ఎక్కువ భాగం ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా నుంచి వస్తాయని ఆయన భార్య లిజీ ప్రకాశ్ చెప్పారు.
‘‘వారికి కొరియర్ ద్వారా కేక్‌లను పంపిస్తాం’’ అని ఆమె తెలిపారు.
కేరళ, క్రిస్మస్ కేక్‌లకు ఒక ప్రధాన కేంద్రంగా మారిందని చెప్పడంలో ఆశ్చర్యమేమీ లేదు. రాష్ట్రంలోని 33 మిలియన్ల జనాభాలో క్రైస్తవులు 18 శాతం ఉన్నారు. రాష్ట్రం అంతటా బేకరీలు, డెజర్ట్‌లకు ప్రసిద్ధి చెందిన కేఫ్‌లు ఉంటాయి.
2020 జనవరిలో 5.3 కి.మీ పొడవైన కేక్‌ను తయారు చేసి ‘కేరళ బేకర్స్ సంఘం’, గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. అంతకుముందు ఈ రికార్డు చైనా పేరిట ఉండేది. చైనా 3.2 కి.మీ పొడవైన కేకును తయారు చేసి ఈ రికార్డును అందుకుంది.
కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్ల పాటు క్రిస్మస్ వేడుకల్ని ఇంట్లోనే జరుపుకున్న ప్రజలంతా ఈసారి ఘనంగా జరుపుకోవడం కోసం సిద్ధమయ్యారు.
క్రిస్మస్ కోసం నవంబర్‌లోనే మంబల్లీ బేకరీ, కేక్ తయారీ సన్నాహాలను మొదలుపెట్టింది. కేక్‌లో ఉపయోగించే పదార్థాలను బేకరీలు వైన్‌లో నానబెట్టడం అప్పుడే ప్రారంభించాయి.
డిసెంబర్ మూడో వారం నాటికి కేక్‌లు సిద్ధమయ్యాయి.
‘‘యువత ఎక్కువగా తాజా క్రీమ్ కేక్‌లను ఇష్టపడతారు. అవి ఎక్కువ కాలం నిల్వ ఉండవు. కానీ క్రిస్మస్ కేక్‌ను ఈ సీజన్‌లో ఎక్కువగా కొనుగోలు చేస్తారు’’ అని బీబీసీతో మంబల్లీ చెప్పారు.
క్రిస్మస్‌కు ముందు వచ్చే వారాంతం నుంచి విక్రయాలు జోరు అందుకుంటాయని, కొత్త సంవత్సరం వరకు ఈ విక్రయాలు కొనసాగుతాయని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- మావోయిస్టులతో గెరిల్లా పోరాటం చేస్తున్న మహిళా పోలీస్ కమాండోలు...
- ఇండియా వర్సెస్ చైనా: మరో 4 నెలల్లో జనాభాలో చైనాను అధిగమించనున్న భారత్ - అత్యధిక జనాభా వరమా? శాపమా?
- పురుషుల గంభీరమైన స్వరం అంటే మహిళలకు ఎందుకు అంత ఇష్టం
- హంపి ఆలయం: రాతి స్తంభాల్లో సంగీతం ఎలా పలుకుతోంది? 500 ఏళ్ల కిందటి ఆ రహస్యం ఏమిటి?
- డోనల్డ్ ట్రంప్ మీద నేరాభియోగాలు నమోదు చేయాలన్న అమెరికన్ కాంగ్రెస్ కమిటీ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















