తెలంగాణ: ‘కేజీ టు పీజీ’ ఉచిత విద్య అమలు ఎంత వరకు వచ్చింది?

కేజీ టు పీజీ

ఫొటో సోర్స్, BBC/PRAVEEN KUMAR SHUBHAM

    • రచయిత, ప్రవీణ్ శుభం
    • హోదా, బీబీసీ కోసం

తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ (ఇప్పుడు భారత రాష్ట్ర సమితి - బీఆర్ఎస్) ఇచ్చిన ప్రధాన హామీల్లో ‘కేజీ టు పీజీ’ ఉచిత విద్య కూడా ఒకటి.

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావ్ పేటలో ఇటీవల ‘కేజీ టు పీజీ’ సమీకృత భవనాల క్యాంపస్ కూడా ప్రారంభమయ్యింది. ఇది తెలంగాణలో మొదటి ‘కేజీ టు పీజీ క్యాంపస్’ అని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఈ క్యాంపస్‌కు ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టాలని నిర్ణయించారు.

ఇక్కడికి పలకతో వచ్చిన వారు పీజీ డిగ్రీతో బయటకు వెళ్లొచ్చని, విద్యార్థులు, పౌరుల పురోగతి, సాధికారతకు ‘కేజీ టు పీజీ’ పథకం దోహదపడుతుందని ప్రభుత్వం చెబుతోంది.

పలు కార్పొరేట్ సంస్థలు అందించిన కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులతో ఈ క్యాంపస్ నిర్మించారు.

‘కేజీ టు పీజీ’ అమలులో గంభీరావుపేట ఒక ముందడుగు అన్న చర్చ ఒకవైపు, అధికారంలోకి వచ్చిన 9 ఏళ్లలో ‘ఒక్క’ క్యాంపస్ నిర్మాణం మాత్రమే జరగడం పేదల ఉచిత విద్య పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అన్న విమర్శలు మరోవైపు వస్తున్నాయి.

అయితే, ‘కేజీ టు పీజీ’ మాటల్లో అయ్యేది కాదని, ఆవైపు ప్రణాళికబద్ధంగా అడుగులు పడుతున్నాయని తెలంగాణ ప్రభుత్వం అంటోంది.

వీడియో క్యాప్షన్, ‘కేజీ టు పీజీ’ ఉచిత విద్య అమలు ఎంత వరకు వచ్చింది?

క్యాంపస్ ఎలా ఉంది?

మారుమూల ప్రాంతాలకు నాణ్యమైన విద్య మరింత చేరువ చేయడం కేజీ టు పీజీ ఉద్దేశంగా తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వం చెబుతున్నట్టుగానే గాంభీరావ్ పేట ఓ మారుమూల మండల కేంద్రం.

గతంలో ఈ ప్రాంతంలో పర్యటించిన సందర్భంలో కేసీఆర్ మొదటిసారి ‘కేజీ టు పీజీ’ పథకం ప్రస్తావన తెచ్చారు.

‘2004 సెప్టెంబరులో టీఆర్ఎస్ నాయకుడిగా కేసీఆర్ ఈ ప్రాంతంలో (గంభీరావ్ పేటలో) పర్యటించినప్పుడు ప్రత్యేక తెలంగాణలో ఒకే ఆవరణలో కేజీ టు పీజీ విద్యా సంస్థలు నెలకొల్పుతామని హామీ ఇచ్చారు. అది ఈ రోజు నెరవేరడం గర్వకారణంగా ఉంది’ అని ఈ క్యాంపస్ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ అన్నారు.

ఆరు ఎకరాల్లో విస్తరించిన కేజీ-పీజీ క్యాంపస్‌లో సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టారు. కిండర్ గార్డెన్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఉచిత విద్య ఇక్కడ అందుబాటులో ఉంది.

విద్యాశాఖ వివరాల ప్రకారం ఈ క్యాంపస్‌లో మొత్తం 90కి పైగా క్లాస్ రూమ్‌లు, 3500 మంది విద్యార్థులకు సరిపడా సౌకర్యాలు ఉన్నాయి.

అంగన్‌వాడీ, ప్రీప్రైమరీ, ప్రాథమిక పాఠశాల, బాయ్స్, గర్ల్స్ హైస్కూళ్లు, జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, పీజీ సెంటర్‌ల సమాహారం ఈ క్యాంపస్. ఇక్కడి విద్యార్థులతో పాటు గ్రామస్థులు కూడా ఉపయోగించుకునేలా ఒక ప్రజా గ్రంథాలయం కూడా అందుబాటులో తెచ్చారు.

తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ మీడియంలో ఇక్కడ విద్యాబోధన జరుగుతోంది.

కేజీ టు పీజీ

ఫొటో సోర్స్, BBC/PRAVEEN KUMAR SHUBHAM

రెగ్యులర్ చదువులతో పాటూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (దూరవిద్యా) కేంద్రం కూడా ఉంది. ఇక్కడి వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రంలో చుట్టుపక్కల గ్రామాల మహిళలకు స్వయం ఉపాధి పొందేందుకు వివిధ సర్టిఫికేట్ కోర్సుల్లో శిక్షణకు ఏర్పాట్లు ఉన్నాయి.

వెయ్యి మంది విద్యార్థులు ఒకేసారి భోజనం చేసేందుకు వీలైన డైనింగ్ హాల్, కంప్యూటర్, సైన్స్ ల్యాబ్, డిజిటల్ క్లాస్ రూమ్‌లు ఏర్పాటుచేశారు.

44 వేల చదరపు అడుగుల్లో కృత్రిమ గడ్డితో పరిచిన ‘ఆస్ట్రో టర్ఫ్’ క్రీడా మైదానంతో కబడ్డీ, క్రికెట్, ఫుట్‌బాల్, అథ్లెటిక్స్ కోసం ఆధునిక హంగులతో నిర్మించిన ఆటస్థలం ఉంది. ఈ ఆస్ట్రో టర్ఫ్ గ్రౌండ్ ఏర్పాటులో ‘ఫిఫా’ స్థాయి ప్రమాణాలు పాటించినట్టు అధికారులు చెబుతున్నారు. విద్యార్థుల రక్షణ కోసం క్యాంపస్ చుట్టూ ప్రహరి గోడ, దానికి ఫెన్సింగ్ ఏర్పాటు ఉంది.

‘మా పాఠశాలలో సరిపడా అన్ని వసతులు ఉన్నాయి. ఈ వసతి లేదు అనే సమస్య లేదు’ అని బాయ్స్ హైస్కూల్ హెడ్ మాస్టర్ సంటి గంగారాం బీబీసీతో అన్నారు.

కేజీ టు పీజీ

ఫొటో సోర్స్, BBC/PRAVEEN KUMAR SHUBHAM

ఉన్నత విద్య కోసం

పీజీ వరకు కోర్సులు అందుబాటులోకి రావడం ఇక్కడి విద్యార్థులకు కలిసొచ్చే అంశం అని అధికారులు చెబుతున్నారు. ఆర్థిక, సామాజిక కారణాలతో దూర ప్రాంతాలకు వెళ్లలేని మారుమూల ప్రాంతాల విద్యార్థులకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు స్థానికంగానే చదివే అవకాశం కలుగుతుందని వివరించారు.

‘‘విద్యార్థుల అభివృద్దికి తోడ్పడే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వచ్చింది. కంప్యూటర్ నాల్జెడ్జ్, కమ్యునికేషన్ స్కిల్స్ ఇక్కడి పీజీ, డిగ్రీ విద్యార్థులకు బాగా ఉపయోగపడతాయి’’ అని గంబీరావుపేట డిగ్రీ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ బి.శ్రీవల్లి చెప్పారు.

‘‘విమెన్ ఎంపవర్మెంట్ సెల్ కింద మహిళలు స్వయం ఉపాధి పొందేలా కోర్సులు నిర్వహిస్తున్నాం. మండలంలోని గృహిణులు కుట్టు మిషన్, బ్యుటీషియన్ కోర్సులు నేర్చుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఇలాంటి అవకాశం ఉండటం ఇక్కడి విద్యార్థులకు లాభ దాయకం. ఇలాంటి క్యాంపస్‌లు ఇంకా వస్తే అందరికి ఉపయోగపడతాయి’’ అని ఆమె పేర్కొన్నారు.

కేజీ టు పీజీ

ఫొటో సోర్స్, BBC/PRAVEEN KUMAR SHUBHAM

అవకాశాలు మెరుగు పడతాయా?

పీజీ కోర్సులతో తమ ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని గంభీరావ్ పేట ప్రాంత విద్యార్థినులు చెబుతున్నారు. ఈ క్యాంపస్‌లో డిగ్రీ చదువుతున్న విద్యార్థినులు లక్కిరెడ్డి అశ్విని, ఎం.నిఖిత బీబీసీతో మాట్లాడారు.

అశ్విని తండ్రి ఆటో డ్రైవర్. ఆయన రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించారు. కొద్దిపాటి వ్యవసాయ భూమి వీరికి ఉంది. కుటుంబ పోషణకు అశ్విని తల్లి కుట్టుమిషన్‌‌ మీద దుస్తులు కుడుతున్నారు. బీడీలు కూడా చుడుతున్నారు. కాలేజీ అనంతరం బీడీలు చుట్టేపనిలో తల్లికి అశ్విని సహాయంగా ఉంటున్నారు. మంచి జాబ్ సంపాదించి కుటుంబానికి తోడుగా ఉండాలన్నది అశ్విని కోరిక.

‘‘డిగ్రీ తర్వాత చదువు మానేయమన్నారు. ఇప్పుడు పీజీ సెంటర్ వచ్చింది. దీంతో ఎలాంటి ఆటంకం లేకుండా నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదవే అవకాశం కలిగింది. జాబ్ డ్రైవ్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి’’ అని అశ్విని చెప్పారు.

‘‘నేటికీ ఆడపిల్లలను పెద్ద చదువులకు వేరే ప్రాంతాలకు పంపడానికి గ్రామీణ ప్రాంతాల తల్లిదండ్రుల్లో ఎన్నో భయాలు ఉన్నాయి. ఒంటరిగా ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉంటుందని వెనుకా ముందు ఆలోచిస్తారు. అందులో మా తల్లిదండ్రులు కూడా ఉన్నారు. కేజీ-పీజీ క్యాంపస్ ఏర్పాటుతో నా ఉన్నత విద్య కల సాకారం అయ్యింది’’ అని బీఎస్సీ (బీజెడ్సీ) విద్యార్థిని ఎం.నిఖిత బీబీసీతో చెప్పారు.

‘‘కార్పొరేట్ కాలేజీల్లో లేని సౌకర్యాలు కూడ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చదువుతున్నందుకు గర్వంగా ఉంది. మా క్యాంపస్‌ను చూసి ఇతర ప్రాంతాల వారు ఈర్ష్య పడతారు’’ అని నిఖిత అన్నారు.

కేజీ టు పీజీ

ఫొటో సోర్స్, BBC/PRAVEEN KUMAR SHUBHAM

రెగ్యులర్ కోర్సులతోపాటు స్పోకెన్ ఇంగ్లిష్, కంప్యూటర్ సర్టిఫికేట్ కోర్సులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.

‘ఇంటర్ కోసం నిజామాబాద్ వెళ్లాను. కేజీ టు పీజీ క్యాంపస్‌లో అన్ని సదుపాయాలు ఉన్నాయని డిగ్రీ ఇక్కడే చేరాను. ఇక్కడికి పలకా, బలపంతో వస్తే పీజీ చేసి బయటకు వెళ్లొచ్చు. ఇక్కడి వాతావరణం చాలా బావుంది. అందుకే ఉదయం తొందరగా కాలేజ్‌కు వస్తున్నా, ఈవినింగ్ లేట్‌గా ఇంటికి వెళ్తున్నా. బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రోత్సాహంతో అందిస్తున్న ఇంగ్లిష్ కమ్యునికేటివ్ స్కిల్స్ వర్చువల్ క్లాస్‌లో కూడా చేరాను. అమెరికన్ యాక్సెంట్‌లో ఇంగ్లిష్ మాట్లాడాలన్నది నా చిన్ననాటి కల. ఇది త్వరలోనే నెరవేరబోతోంది’’ అని ఇంగ్లిష్ నేర్చుకోవడం పట్ల తనకున్న కుతూహలం వ్యక్తం చేశారు మరో విద్యార్థిని శ్రుతిజ.

‘‘ఇది పట్టణ ప్రాంతంలో పెట్టి ఉంటే అంతగా ఉపయోగం ఉండకపోయేది. ఇప్పుడు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మేలు జరిగింది. దీనికి ప్రభుత్వానికి కృతజ్ఞతలు’’ అని కామారెడ్డిలో ఓ ప్రైవేట్ కాలేజ్ నుండి టీసీ తీసుకుని వచ్చి ఈ క్యాంపస్‌లో బీకామ్ డిగ్రీ కోర్సు జాయిన్ అయిన సి.హెచ్.భాను అనే విద్యార్థి బీబీసీతో అన్నారు.

బయటి ప్రాంతాలకు వెళ్లి చదువుకోలేని పరిస్థితుల్లో ఈ ప్రాంత మహిళలకు గంభీరావుపేట కేజీ-పీజీ క్యాంపస్‌తో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివే అవకాశం కలిగింది అన్నారు డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ పిట్ల దాస్.

కేజీ టు పీజీ

ఫొటో సోర్స్, BBC/PRAVEEN KUMAR SHUBHAM

ఏకైక క్యాంపస్..

గంభీరావ్ పేట్ ప్రస్తుతం తెలంగాణ మొత్తంలో ఉన్న ఏకైక కేజీ టు పీజీ క్యాంపస్.

అయితే, అనుకున్న స్థాయిలో ఈ కార్యక్రమం అమలు కాలేదన్న విమర్శలు వివిధ వర్గాల నుంచి వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి కొరవడిందనే విమర్శలు వస్తున్నాయి.

‘‘అటెండర్, కలెక్టర్, మంత్రుల పిల్లలు ఒకే స్కూల్‌లో చదువుకోవాలని కామన్ స్కూల్ సిస్టంను మానిఫెస్టోలో పెట్టారు. అయితే నాణ్యమైన ప్రభుత్వ విద్యను పేదలకు అందించాలనే ఉద్దేశం వీరికి లేదు. గంభీరావు పేటలో నిర్మించిన కేజీ-పీజీ కాంప్లెక్స్ ప్రభుత్వ నిధులతో కట్టలేదు. దాతల సహకారంతో నిర్మించారు. కేజీ టు పీజీ అంటూ ఒక పాలసీ లేదు, జీవో కానీ బడ్జెట్ కానీ లేవు’’ అని మాజీ ఐఏఎస్ అధికారి, తెలంగాణ డెమోక్రటిక్ ఫోరం కన్వీనర్ ఆకునూరి మురళి బీబీసీతో అన్నారు.

‘‘తెలంగాణ మొత్తం మీద గంభీరావ్ పేట్, గజ్వేల్ స్కూల్ కాంప్లెక్స్‌లు మాత్రమే ఉన్నాయి. మిగతా 30 వేల ప్రభుత్వ స్కూళ్ల సంగతేంటి? ఒకటి మాత్రం స్పష్టం అవుతోంది వారికి కట్టే ఉద్దేశమే లేదు. ప్రభుత్వ విద్య మొత్తం మూసేసి స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు ప్రైవేట్‌కు అప్పజెప్పాలన్నదే వారి ఉద్దేశం’’ అని మురళి వ్యాఖ్యానించారు.

వీడియో క్యాప్షన్, అమిత్ షా చెప్పులు మోశారంటూ ప్రత్యర్ధులు చేస్తున్న విమర్శలకు బండి సంజయ్ జవాబు ఏంటి?

‘‘కేజీ టు పీజీ అనేది తెలంగాణ ప్రాంతంలో పేదవర్గాల పిల్లల విద్యకు గ్యారంటీ లాంటిది. అయితే, ఇక్కడ ప్రభుత్వానికి ఆ ఉద్దేశం ఉందా అన్నది అనుమానాస్పదమే. ఇలాంటి హామీలు మారుమూల ప్రాంతాల బలహీన వర్గాల్లో ఆశలు రేపుతాయి. తమ అస్తిత్వం, గౌరవాలను నిలబెట్టే అవకాశంగా దీన్ని వారు చూస్తారు. వీరి ద్వారా ఎన్నికైన ప్రభుత్వం ఆ ఆశలను, ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవడం ఆ వర్గాల రాజ్యంగ హక్కుల ఉల్లంఘనే అవుతుంది’’ అని రచయిత్రి, ‘హక్కు ఇనీషియేటివ్ ఫర్‌సెప్షన్ స్టడీస్’ డైరెక్టర్ కోట నీలిమ పేర్కొన్నారు.

‘‘ఫీజు రీఇంబర్స్‌మెంట్ ఇస్తాం చదువుకోండి అన్నారు. అది విడుదల కాక తల్లిదండ్రులు అప్పులు చేసి ఫీజులు కట్టాల్సి వచ్చింది. బలహీన వర్గాల పిల్లలుండే సంక్షేమ హాస్టళ్లలో 1500 ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగాయి. మౌలిక సదుపాయాల లేమి ఒక సమస్య అయితే, అసలు వాటిని కల్పించాలనే ఉద్దేశమే లేకపోవడం మరో సమస్య. ఇది పేదవర్గాలను పరిహసించడమే. ఈ పద్ధతి సరైనదికాదు’’ అని ఆమె అన్నారు.

వీడియో క్యాప్షన్, తెలంగాణ: ధనిక రాష్ట్రంలో ప్రజలు ఇలా అట్టపెట్టెల మీద అన్నం ఎందుకు తినాల్సి వచ్చింది?

ఉన్నత విద్యప్రమాణాలకు పెద్దపీవేస్తున్నాం: మంత్రి సబితా ఇంద్రారెడ్డి

దేశంలో ఎక్కడాలేని విద్యా ప్రమాణాలకు తెలంగాణ పెద్దపీట వేసిందని ప్రభుత్వం అంటోంది.

“మన ఊరు-మన బడి కార్యక్రమంలో తెలంగాణలో ఉన్న 26,000 స్కూళ్లలో రూ. 7,000 కోట్ల అంచనా వ్యయంతో మౌలిక వసతులు అభివృద్ది చేస్తున్నాం. మొదటి విడతగా 9,000 స్కూళ్లలో పనులు చేపట్టాం. నూతన తరగతి గదులు, డైనింగ్ హాళ్లు, విద్యుత్ సదుపాయం, ఫర్నిచర్ లాంటి 12 విభాగాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి’’ అని ఈ అంశంపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు.

‘‘కేజీ టు పీజీ అంటే ఒక్క మాటల్లో అయ్యేది కాదు. ప్రణాళికాబద్ధంగా, పక్కాగా దీన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందనేది మా ముఖ్యమంత్రి అభిప్రాయం. రాష్ట్రంలో వెయ్యికి పైగా గురుకులాలను ఇంటర్మీడియట్ స్థాయికి అప్‌గ్రేడ్ చేసుకున్నాం. ఆ తర్వాత డిగ్రీ స్థాయికి పెంచబోతున్నాం. గురుకులాల్లో కేజీ టు పీజీ మొదలుపెట్టాలన్న ఉద్దేశంలో భాగంగానే వాటిలో లా కాలేజీలు, పీజీ కోర్సులు కూడా పెడుతున్నాం. రాష్ట్రంలో జరుగుతున్న విద్యాభివృద్దిని గమనించి అందరూ సహకరించాలని కోరుతున్నాం” అని ఆమె అన్నారు.

బీబీసీ ఐస్వోటీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)