తుర్కియే-సిరియా: 'గత 84 ఏళ్ళల్లో ఇదే అతి పెద్ద భూకంపం' - అధ్యక్షుడు ఎర్దొవాన్, దాదాపు 2,000 మంది మృతి

ఫొటో సోర్స్, Reuters
తుర్కియే దక్షిణ ప్రాంతంలో సిరియా సరిహద్దు వద్ద సంభవించిన తీవ్రమైన భూకంపం వల్ల దాదాపు 2,000 మంది చనిపోయారు.
తుర్కియేలో 1,121 మంది, సిరియాలో 78 మంది భూకంపం వల్ల చనిపోయారని తుర్కియే విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది.
కుప్పకూలిన భారీ భవనాల కింద చిక్కుకున్న మనుషులను కాపాడేందుకు సహాయక బృందాలు నిర్విరామంగా పని చేస్తున్నాయి. మంచు కురుస్తున్న చల్లటి వాతావరణంలో ఈ ఈ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పరిస్థితి చూస్తుంటే మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది.
తుర్కియే దేశాధ్యక్షుడు రీసెప్ తాయిప్ ఎర్దొవాన్, 1939 తరువాత ఇదే అత్యంత తీవ్రమైన భూకంపం అని చెప్పారు. అప్పట్లో తూర్పు టర్కీలోని ఎర్జిన్కన్ భూకంపంలో దాదాపు 33,000 మంది చనిపోయారు.
1999లో వాయవ్య టర్కీలో వచ్చిన మరో భయంకర భూకంపంలో 17,000 మందికి పైగా చనిపోయారు.
సోమవారం తెల్లవారుజామున వచ్చిన మొదటి భూకంపం అత్యంత తీవ్రమైనదని (7.8) సీస్మోలజిస్టులు తెలిపారు. ఈ భూకంపం దాదాపు రెండు నిమిషాలు కొనసాగిందని ప్రాణాలతో బయటపడ్డవారు చెప్పారు. ఆ తరువాత 12 గంటలు గడిచాక టర్నకీలోని ఎల్బిస్తాన్ జిల్లాలో 7.5 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. ఇది ఆఫ్టర్ షాక్ కాదని, ఇది మరో భూకంపమేనని అధికారులు తెలిపారు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో సోర్స్, Getty Images
సిరియా సరిహద్దులోని గాజియంటెప్ సమీపంలో మొదటి భూకంపం సంభవించిందని అమెరికన్ జియోలాజిలక్ సర్వే (యూఎస్‌జీఎస్) ప్రకటించింది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 7.8గా నమోదైందని తెలిపింది.
15 నిమిషాల తర్వాత సెంట్రల్ తుర్కియేలో రెండో భూకంపం సంభవించింది. రాజధాని అంకారాతోపాటు లెబనాన్, సిరియా, సైప్రస్‌లలో కూడా భూమి కంపించింది.
స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 4.17 గంటలకు మొదటి భూకంపం చోటుచేసుకుందని వార్తా సంస్థ ఏఎఫ్‌పీ తెలిపింది.
కాగా, సిరియాలో భూకంప ధాటికి 237 మంది మరణించారని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అలెప్పో, లటాకియా, హమా, టార్టస్ ప్రావిన్స్‌లలో ఈ మరణాలు సంభవించాయని పేర్కొంది. మరో 600 మంది వరకు గాయపడ్డారని వెల్లడించింది.
తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ప్రావిన్సులలో ఎంత మంది బాధితులు ఉన్నారో ఇంకా తెలియదని సిరియా తెలిపింది.

ఫొటో సోర్స్, EPA
భూకంపం నేపథ్యంలో తుర్కియేలో ఎమర్జెన్సీని ప్రకటించారు.
తుర్కియేలో భారీగా భవనాలు కూలిపోవడంతోపాటు ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నట్లు బీబీసీ తుర్కియే ప్రతినిధులు తెలిపారు.
తక్షణమే సహాయక చర్యలు ప్రారంభించినట్లు తుర్కియే అధ్యక్షుడు ఎర్దోవాన్ ప్రకటించారు.
భూకంప ప్రభావిత ప్రాంతాలకు సహాయక చర్యల బృందాలను పంపినట్లు ఆయన తెలిపారు.

తొలుత సిరియా సరిహద్దులో
తుర్కియే తూర్పున 26 కి.మీ దూరంలో ఉన్న నూర్దా నగరంలో గాజియంటెప్‌లో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది.
7.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ జియోసైన్సెస్ (జీఎఫ్‌జెడ్) ప్రకటించిందని వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది.
జీఎఫ్‌జెడ్ ప్రకారం భూకంపం కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల దిగువన ఉంది. అదే సమయంలో భూకంప కేంద్రం భూమికి 11 మైళ్ల దిగువన ఉందని యూఎస్‌జీఎస్ తెలిపింది.
ఇది జరిగిన కొద్దిసేపటికే సెంట్రల్ తుర్కియేలో రెండోసారి భూమి కంపించింది.
దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.7గా నమోదైందని యూఎస్‌జీఎస్ వెల్లడించింది. దీని కేంద్రం భూమికి 9.9 కిలోమీటర్ల దిగువన ఉన్నట్లు తెలిపింది.

ఫొటో సోర్స్, EPA
భూకంపం కారణంగా చాలా భవనాలు కూలిపోయాయని, ప్రజలు వాటి శిథిలాలలో చిక్కుకుపోయి ఉండవచ్చని వార్తలు వస్తున్నాయి.
ప్రకంపనల కారణంగా నగరంలోని ఓ షాపింగ్ మాల్ నేలమట్టమైందని దియార్‌బాకిర్‌లోని బీబీసీ తుర్కియే ప్రతినిధి తెలిపారు.
గాజాలో 45 సెకన్ల పాటు భూమి కంపించిందని అక్కడి బీబీసీ ప్రతినిధి రష్దీ అబులాలుఫ్ అన్నారు.
ప్రపంచంలో ఎక్కువగా భూకంపాలు వచ్చే జోన్‌లో తుర్కియే ఉంది. గతంలోనూ ఇక్కడ అనేక ప్రమాదాలు జరిగాయి. 1999లో 7.4 తీవ్రతతో వచ్చిన భూకంపంలో సుమారు 17వేల మంది చనిపోయారు.
భారత ప్రధాని మోదీ సంతాపం
తుర్కియేలో భూకంప దుర్ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
తుర్కియే పరిస్థితిపై ఆ దేశ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ అర్డోన్ చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ మోదీ ట్వీట్ చేశారు.
"తుర్కియేలో భూకంపం కారణంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగడం బాధాకరం. మృతుల కుటుంబాలకు సంతాపం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.
భారతదేశం తుర్కియే ప్రజలకు అండగా నిలుస్తుంది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి అన్ని విధాలుగా సహాయం అందించడానికి సిద్ధంగా ఉంది" అని ట్విట్టర్ లో తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
మరోవైపు తుర్కియే, సిరియాలకు సాయం చేసేందుకు అమెరికా ముందుకు వచ్చింది.
ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి సాయం అందించాలో అంచనా వేయాలని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ అంతర్జాతీయ అభివృద్ధి సంస్థను కోరారు.
తుర్కియే, సిరియాలో సంభవించిన భూకంపం కారణంగా అమెరికా ఆందోళన చెందుతోందని వైట్‌హౌస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ అన్నారు.
"నేను తుర్కియేలోని అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాను. ఈ పరిస్థితిలో సహాయం చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం. మేం తుర్కియేలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం" అని ట్విట్టర్‌లో తెలిపారు.
భూకంపంతో అతలాకుతలమైన తుర్కియేకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ ప్రకటించింది.
ఆ దేశ విదేశాంగ మంత్రి ఎలి కోహెన్ సత్వర సహాయ కార్యక్రమం సిద్ధమవుతోందని తెలిపారు.
ఇజ్రాయెల్ భద్రతా దళాలు ఎలాంటి సహాయం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నాయని ఆ దేశ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ ప్రకటించారని రాయిటర్స్ తెలిపింది.
ఇజ్రాయెల్, పాలస్తీనా భూభాగాలలో కూడా భూకంపం ప్రకంపనలు కనిపించాయి.
ఇవి కూడా చదవండి
- ‘అతడు నన్ను చంపేసుండేవాడు.. ఇద్దరు పిల్లలు పుట్టాక విడిపోయినా హింస కొనసాగింది’
- గౌతమ్ అదానీ: 25 ఏళ్ల క్రితం గుజరాత్లో అదానీని కిడ్నాప్ చేసింది ఎవరు? అప్పుడు ఏం జరిగింది?
- ఆంధ్రప్రదేశ్: పొలాల్లొకి వచ్చే అడవి ఏనుగులను తరిమికొట్టే కుంకీ ఏనుగులు - వీటిని ఎలా పట్టుకుంటారు? ఎలా శిక్షణ ఇస్తారు?
- దళిత గ్రామాలకు రూ.21 లక్షలు ఇచ్చే ఈ పథకం గురించి తెలుసా?
- సున్తీ తర్వాత సెక్స్ సామర్థ్యం పెరుగుతుందా? నాలుగు ప్రశ్నలు, సమాధానాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








