ఆంధ్రప్రదేశ్: పొలాల్లొకి వచ్చే అడవి ఏనుగులను తరిమికొట్టే కుంకీ ఏనుగులు - వీటిని ఎలా పట్టుకుంటారు? ఎలా శిక్షణ ఇస్తారు?

- రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
- హోదా, బీబీసీ కోసం
“ఏనుగుల దాడిలో పంట ధ్వంసం.. ఏనుగు మందలను తరిమికొట్టడానికి అటవీ శాఖ ప్రయత్నాలు”.. ఆంధ్రప్రదేశ్‌తో పాటు చాలా రాష్ట్రాల్లో ఈ మాట తరచూ వినిపిస్తుంటుంది. కానీ చిత్తూరు జిల్లాలోని ఒక అడవిలో రెండు ఏనుగులు అటవీ శాఖ సిబ్బంది నుంచి కావల్సినంత ప్రేమ, ఆప్యాయతను అందుకుంటున్నాయి.
పంటలు ధ్వంసం చేయడానికి వచ్చే ఏనుగులను తరమికొట్టడమే ఈ ఏనుగుల ప్రత్యేకత. అవసరమైతే ఇవి వాటితో పోరాటం చేస్తాయి. ఆ రెండు ఏనుగులు పేర్లు జయంత్, వినాయక్. వీటిని కుంకీ ఏనుగులని పిలుస్తారు.
అటవీ శాఖ కోసం కుంకీలుగా పనిచేస్తున్న ఈ రెండూ 17 ఏళ్లుగా చుట్టుపక్కల ప్రాంతాల్లోని గ్రామాల్లో పంటలు ధ్వంసం చేసే ఎన్నో అడవి ఏనుగులను అడ్డుకున్నాయి.
ప్రస్తుతం ఈ రెండు కుంకీ ఏనుగులు రామకుప్పం దగ్గరున్న కౌండిన్య అభయారణ్యంలో ననియాల ఫారెస్ట్ క్యాంప్‌లో అటవీ శాఖ సంరక్షణలో ఉంటున్నాయి. జయంత్, వినాయక్ ఎన్నో ఆపరేషన్లలో విజయవంతంగా పాల్గొన్నాయి.
అవి ఇప్పటివరకూ ఒక్కసారి ఏనుగులను తరమకుండా తిరిగి వచ్చింది లేదు. ఒక్కోసారి ఒడిసా అడవుల నుంచి వచ్చి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పంటలు నష్టపరిచే ఏనుగులను తరమడానికి వీటిని అక్కడికి కూడా పంపిస్తుంటారు.
అసలు ఏంటీ కుంకీ ఏనుగులు? ఇవి ఏనుగులను ఎలా తరిమికొడతాయి? ఈ మొత్తం ప్రక్రియ ఎలా ఉంటుంది? తెలుసుకునే ప్రయత్నం చేసింది బీబీసీ.

కుంకీ ఏనుగులను ఎలా పట్టుకుంటారు?
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మూడు రాష్ట్రాలకు మధ్య ఉన్న చిత్తూరు జిల్లా కుప్పం ఒక ట్రై జంక్షన్‌లా ఉంటుంది. ఆ పరిధిలో ఏనుగుల సంచారం ఎక్కువ కావడం పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన ఏనుగులు తరచూ గ్రామలపైకి రావడం, పంటలను ధ్వంసం చేస్తుండటంతో ఇక్కడ 2006లో ననియాల ఏనుగుల క్యాంప్‌కు బీజం పడింది.
కుంకీలుగా మగ ఏనుగులను మాత్రమే ఎంచుకుంటారు. ఎందుకంటే మగ ఏనుగులు మాత్రమే ఒంటరిగా తిరుగుతుంటాయి. ఆడ ఏనుగులు ఎప్పుడూ రక్షణాత్మకంగా తమ పిల్లలతోపాటూ ఒక పెద్ద మందలోనే ఉంటాయి. ఆ ఏనుగులకు ఒక ఆడ ఏనుగు నేతృత్వం వహిస్తుంటుంది.
అందుకే కుంకీగా మగ ఏనుగును ఉపయోగించడం అధికారులకు తేలికగా అవుతుంది. ఆడ ఏనుగుల మంద పంట పొలాలపై దాడి చేసినపుడు, కుంకీని తీసుకెళ్లగానే అవి తమ మందలోని పిల్లలకు మగ ఏనుగు వల్ల నష్టం జరగకుండా వీలైనంత వరకూ అక్కడి నుంచి తప్పుకుంటాయి. దీంతో డ్రైవ్ కూడా సులభం అవుతుంది.
కానీ, ఒక్కోసారి ఒంటరిగా ఉన్న మగ ఏనుగులు పంటలపై దాడి చేసినప్పుడు, వాటిని తరిమికొట్టడం కుంకీలకు, అటవీ అధికారులకు కష్టంగా మారుతుంది. దీంతో ఒక్కోసారి కుంకీ ఏనుగులు ఆ ఏనుగులతో పోరాడాల్సి ఉంటుంది. అలాంటి ఎన్నో ఆపరేషన్లలో జయంత్, వినాయక్ విజయం సాధించాయి.
అడవిలో స్వేచ్ఛగా తిరగడానికి అలవాటు పడిన ఏనుగులకు కుంకీలుగా శిక్షణ ఇవ్వాలంటే అంత సులభం కాదంటారు కుప్పం ఫారెస్ట్ రేంజ్ అధికారి మదన్ మోహన్ రెడ్డి. ముఖ్యంగా పంటలకు, మనుషులకు హాని చేస్తూ కొరకరాని కొయ్యలా మారిన ఏనుగులనే తాము ఎంపిక చేసుకుని కుంకీలుగా శిక్షణ ఇస్తామని చెప్పారు.
‘‘ఎక్కువగా మనుషులను చంపడం, గాయపరచడం లాంటివి చేసిన ఏనుగులను మేం గుర్తిస్తాం. అలాంటి వాటిని కష్టపడి పట్టుకున్న తర్వాత, వాటికి ప్రొసీజర్ ప్రకారం ఆహార నియామాలు పాటిస్తూ డాక్టర్ల పర్యవేక్షణలో మావటిల దగ్గర కుంకీ శిక్షణ జరుగుతుంది.
2006 నుంచి ఇక్కడ క్యాంపు పెట్టిన తర్వాత మా దగ్గర ఇప్పుడు రెండు శిక్షణ పొందిన ఏనుగులు ఉన్నాయి. ఒకటి జయంత్ ఇంకొకటి వినాయక్. అడవి ఏనుగులు పంట పొలాలపైకి వచ్చినపుడు, పంటలు నష్టం చేసేటప్పుడు, ఈ ఏనుగులతోనే డ్రైవ్ చేస్తుంటాం. ఇప్పటివరకు మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో శిక్షణ పొందిన ఏనుగుల క్యాంప్ ఇక్కడ మాత్రమే ఉంది’’అని మదన్ మోహన్ రెడ్డి బీబీసీతో చెప్పారు.
ప్రస్తుతం ఇక్కడ జయంత్, వినాయక్ అనే రెండు కుంకీ ఏనుగులకు ఒక్కోదానికి ఇద్దరు చొప్పున నలుగురు మావటిలు ఉన్నారు. కర్ణాటకకు చెందిన వీరు ఏనుగులకు ప్రతిరోజూ శిక్షణ ఇవ్వడంతోపాటూ వాటిని కంటికి రెప్పలా చూసుకుంటుంటారు.

కుంకీ శిక్షణ ఎలా ఉంటుంది?
ఒక అడవి ఏనుగును కుంకీగా మార్చడానికి వాటికి ఇచ్చే శిక్షణ చాలా ముఖ్యమైనది. కుంకీలు ఏ ఏనుగును ఎలా ఎదుర్కోవాలి అనేది వాటిపైన కూర్చున్న మావటి ఇచ్చే సంకేతాల ఆధారంగానే సాగుతుంది.
ఉదాహరణకు మావటిని ఎక్కించుకోవడం, చైన్ తీసుకోవడం, ఏవైనా అడవి జంతువులు వచ్చినపుడు గట్టిగా అరచి భయపెట్టడం లాంటి శిక్షణ ఇస్తుంటారు.
మావటి కుంకీ చెవిని కాలితో తాకడం, తలపై తట్టడం లాంటి సంకేతాలు ఇస్తుంటాడు. కానీ, వాటికి ఇచ్చే శిక్షణ చాలా సీక్రెట్ అంటారు మావటి సంపత్.
‘‘కుంకీగా ట్రైనింగ్ తీసుకున్న తర్వాత అడవిలో ఎన్ని ఏనుగులు వచ్చినా అది ఎదుర్కుంటుంది. వెనక్కి రాదు, ఎలాగైనా సరే, పోయి కొట్టే రావాలా. ఎంత పెద్ద గుంపు వచ్చినా, కొట్టేస్తుంది. మేం ఇచ్చే శిక్షణ అలా ఉంటుంది. ఏనుగులు మందగా వస్తే వాటిని తరిమేస్తుంది. ఒకటి రెండు ఏనుగులు అయితే, కుంకీల సాయంతో వాటిని పట్టుకుని తిరిగి తీసుకొస్తాం’’ అని వివరించారు.
‘‘ఏనుగుల మంద ఉన్నప్పుడు పెద్దగా సమస్య ఉండదు. ఒక్క ఏనుగు ఉన్నప్పుడే చాలా ప్రమాదం. అలాంటప్పుడు వచ్చిన ఏనుగు మదమెక్కి ఉంటుంది. దాంతో ఈ ఏనుగుకు కూడా మదం వస్తుంది. ఒక్కోసారి పోరాటం తీవ్రంగా జరుగుతుంది. అలాంటప్పుడు వీటిని కంట్రోల్ చేయడం కూడా కష్టమౌతుంది. కానీ మేం కంట్రోల్ తప్పకుండా రోజూ ట్రైనింగ్ ఇస్తూనే ఉంటాం’’ అని ఆయన తెలిపారు.
‘‘వాహనాలు డ్రైవింగ్ ఎలా చేస్తారో దీన్ని కూడా మేం అలాగే ఆపరేట్ చేస్తుంటాం పైన కూర్చుని. ఉదాహరణకు.. చెవిని కాలితో దడితే ముందుకు పోతుంది. చెవికి వెనుక కాలి తొడను తడితే వెనక్కు పోతుంది. రెంటి మధ్యలో అదిమితే అగిపోతుంది. ఇలా మేం పైనుంచి ఆపరేట్ చేస్తుంటాం. అది అలా మూవ్ అవుతుంటుంది’’ అని చెప్పారు.
‘‘జయంత్, వినాయక్ ఏనుగులు రెండూ ప్రతి రోజూ ఉదయం 9 గంటల లోపే సహజంగా లభించే ఆహారం కోసం అడవిలోకి వెళ్తుంటాయి. డ్రైవ్స్ ఏవీ లేని సమయంలో అవి సాయంత్రం వరకూ అడవిలోనే తిరుగుతుంటాయి. తర్వాత సాయంత్రం వచ్చేటపుడు తాము తినడానికి మర్రి, జువ్వు, రాగి చెట్ల ఆకులు లాంటివి కట్ చేసి పెడితే అవి తమ దంతాలపై తెచ్చుకుంటాయి’’ అని సంపత్ తెలిపారు.
సహజంగా తీసుకునే ఆహారంతోపాటూ జయంత్, వినాయక్‌లకు అటవీ సిబ్బంది కూడా ప్రత్యేకంగా ఆహారం అందిస్తారని మదన్ మోహన్ రెడ్డి చెప్పారు.

వంశ పారంపర్యంగా ఏనుగుల శిక్షణ...
ననియాల ఎలిఫెంట్ క్యాంప్‌లో పనిచేస్తున్న నలుగురు మావటిలు కర్ణాటక మైసూర్ ప్రాంతానికి చెందినవారు. ఇక్కడ మూడేళ్ల నుంచీ పనిచేస్తున్న మావటి సంపత్ ఈ పని తమకు వంశపారంపర్యంగా వస్తోందని చెప్పారు. తాము పెద్దగా చదువుకోలేదని, ఇదే తమకు జీవనోపాధి అని తెలిపారు.
‘‘మూడేళ్ల నుంచి ఉన్నాను. ఇది మా కుటుంబంలో పరంపరగా వస్తోంది. మాకు చదువులు ఏం లేవు. మా తాత ముత్తాతల నుంచీ ఇదే చేస్తున్నాం. ఈ పనిలో ఒక్కొక్కసారి ఏనుగులు మమ్మల్ని కొట్టి చంపేయవచ్చు. మా ప్రాణాలకి గ్యారంటీ అనేది ఉండదు. మా ప్రాణం ఎప్పుడు పోతుందో కూడా మాకు తెలీదు. అయినా చేస్తూనే ఉంటాం. మా నాన్న స్కూలుకు పొమ్మని చెప్పినా మమ్మల్ని ఇదే ఆకర్షించేది. చిన్నతనం నుంచి వీటిపైనే తిరగడం వల్ల ఈ పనే చేయాలని అనిపించేది. అలా ఇది మా రక్తంలోనే వచ్చింది’’ అని సంపత్ చెప్పారు.
కుంకీ శిక్షణలో భాగంగా ఏనుగులకు, మావటిలతో ఒక రకమైన బంధం ఏర్పడుతుంది. అది ఎంతగా అంటే ఒక్కోసారి మావటి తన స్వగ్రామానికి వెళ్తే వాటిపై బెంగపెట్టుకునేంత ఉంటుంది అంటారు సంపత్.
‘‘మాకు వీటిమీద చాలా ఫీలింగ్ ఉంటుంది. ఇది మా కుటుంబంలో ఒక మెంబర్ లాగా అయిపోతుంది. ఊరికి పోతే కూడా దిగులుగా ఉంటుంది. మా ఫ్యామిలీని చూసి త్వరగా వచ్చేస్తాం. నాలుగు రోజుల కంటే ఉండము. వినాయక్ దీని పేరు ఇంకో దాని పేరు జయంత్. రెండు ఫారెస్ట్ లోకి వెళ్ళినప్పుడు పైనే ఉండాలి కిందికి దిగితే ఏమి యూస్ లేదు. మేము కొట్టాలంటే పైనుంచి సిగ్నల్ ఇవ్వాల క్యాప్చర్ చేయాలంటే పైనుంచి కాల్ తో సిగ్నల్ ఇస్తుంటాం. మాటలు కూడా ఏమీ ఉండదు. అలా ట్రైనింగ్ చేస్తాం. అలాగే మేం సిగ్నల్స్ ఇస్తూ ఉంటాం అలా వెళ్లి ఏనుగులు కొడతాం’’ అంటారు సంపత్.
దాతల కోసం..

అడవి ఏనుగైన జయంత్ వయసు సుమారు 54 ఏళ్లు దీన్ని 1996లో తిరుమల అడవుల్లోని అవ్వాచేరి కోన దగ్గర పట్టుకున్నారు. దీన్ని తిరుపతి జూలో ఉంచి కుంకీగా ట్రైనింగ్ ఇచ్చారు. దీంతో పాటు పట్టుకున్న విజయను అప్పడు ఉమ్మడి రాష్ట్రం కావడంతో హైదరాబాద్ జూకు తరలించారు.
వినాయక్ వయసు సుమారు 58 ఏళ్లు. దీనిని చిత్తూరు జిల్లా యాదమర్రి మండలం భూమిరెడ్డిపల్లి దగ్గర పట్టుకున్నారు. దీనికి ననియాల ఎలిఫెంట్ క్యాంపులో ట్రైనింగ్ ఇచ్చారు. తర్వాత ఇక్కడున్న గణేష్ అనే మరో కుంకీ ఏనుగును తిరుపతి జూకు పంపించేయడంతో దానికి బదులు ననియాల క్యాంపుకు వినాయక్ వచ్చింది. కుంకీగా ట్రైనింగ్ ఇవ్వడానికి దాని స్థితిని బట్టి మూడు నుంచీ ఆరు నెలలు పడుతుంది.
ఇన్నేళ్లూ సేవలందించిన ఈ ఏనుగులు ఇప్పుడు రిటైర్మెంట్ వయసుకు దగ్గర అవుతున్నాయి. ఈ రెండు ఏనుగులకూ ఏడాదికి దాదాపు నెలకు 2.5 లక్షలు రూపాయల వ్యయం అవుతోంది. వీటికి తగిన ఆహారంతో పాటూ, విటమిన్లు కూడా ఇవ్వాల్సి ఉండడంతో అధికారులు ఇప్పుడు దాతల కోసం చూస్తున్నారు.
‘‘2006 నుంచి ఇప్పటివరకూ ఎలాంటి ఆవాంతరాలూ లేకుండా మా ఎలిఫెంట్ క్యాంపు సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. మరో రెండు మూడు సంవత్సరాలలో ఇవి రిటైర్ అవుతాయి’’ అని చిత్తూరు డి.ఎఫ్.ఒ సి.చైతన్య కుమార్ రెడ్డి బీబీసీతో చెప్పారు.
‘‘వీటికి వయసు మీద పడటంతో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. వాటి స్థానంలో కొత్త కుంకీలు కావాలి. వెంకన్న అనే కుంకీ ట్రైనింగ్ లో ఉంది. మరొక దాన్ని క్యాప్చర్ చేసి ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రపోజల్స్ పంపాం. ఇప్పుడున్న వాటికి దాతలు ముందుకు వస్తే దత్తత ఇస్తాం. ఏనుగుల పేడతో బయోగ్యాస్ తయారు చేయడానికి సిద్దం చేస్తున్నాం. రోజుకు వాటి నుంచీ 300 కిలోల పేడ వస్తుంది’’ అని వివరించారు.
‘‘వచ్చే విజిటర్స్ కోసం సిక్స్ మంత్స్ నుంచి ట్రైల్స్ చేస్తున్నాం. కొత్తగా ఏనుగును క్యాప్చర్ చేయాలంటే ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు కావాలి’’ అని చైతన్య కుమార్ రెడ్డి చెప్పారు.
ఇవి కూడా చదవండి
- ఆంధ్రప్రదేశ్: మంత్రి అంబటి రాంబాబు చుట్టూ వివాదం ఎందుకు? కొడుకుని కోల్పోయిన కుటుంబానికి దక్కాల్సిన పరిహారం చెక్ ఏమయ్యింది?
- జగన్ విశాఖ టూర్ : సీఎం వస్తున్నారని చెట్లు నరికేశారు, నిబంధనలను పట్టించుకోరా?
- రిపబ్లిక్ డే: పరేడ్‌లో కోనసీమ ప్రభల తీర్థం... మోదీ మెచ్చుకున్న దాని చరిత్ర ఏంటి
- మొగల్ గార్డెన్స్: అమృత్ ఉద్యాన్‌గా మారిన ఈ అందమైన తోట విశేషాలు మీకు తెలుసా?
- మంకీ మ్యాన్: బర్త్ డే పార్టీలు, పెళ్లిళ్లలో కోతి వేషంతో అలరిస్తున్న యువకుడు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














