మొగల్ గార్డెన్స్: అమృత్ ఉద్యాన్‌గా మారిన ఈ అందమైన తోట విశేషాలు మీకు తెలుసా?

ఫొటో సోర్స్, IMTIYAZ KHAN/ANADOLU AGENCY VIA GETTY IMAGES
- రచయిత, వివేక్ శుక్లా
- హోదా, బీబీసీ కోసం
న్యూదిల్లీలోని రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ఉన్న మొగల్ గార్డెన్ పేరును మోదీ ప్రభుత్వం అమృత్ ఉద్యాన్‌గా మారుస్తూ ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది.
1928-1929 కాలంలో రాష్ట్రపతి భవన్ పరిసరాల్లో మొగల్ గార్డెన్‌ను ఏర్పాటు చేశారు.
మొగల్ గార్డెన్ పేరును రాజేంద్ర ప్రసాద్ ఉద్యాన్‌గా మార్చాలని 2019లో హిందూ మహా సభ డిమాండ్ చేసింది.
ఈ డిమాండ్‌ను అప్పట్లో అంగీకరించలేదు. కానీ, ఇప్పుడు దీనికి కొత్త పేరును పెట్టారు.
రాష్ట్రపతి భవన్‌లో 15 ఎకరాల్లో విస్తరించిన ఈ ఉద్యానవనాన్ని జమ్మూకశ్మీర్‌లోని మొగల్ గార్డెన్స్, తాజ్‌మహల్ పరిసరాల్లోని ఉద్యానవనాల స్ఫూర్తితో తీర్చిదిద్దారు.

ఫొటో సోర్స్, ANI
మొగల్ గార్డెన్ ఏర్పాటు ఎవరి ఆలోచన?
రాష్ట్రపతి భవన్‌లో మొగల్ గార్డెన్ ఏర్పాటుకు సర్ ఎడ్విన్ లుటియన్స్ కారకుడని అందరూ నమ్ముతారు. కానీ, అసలు విషయం ఏంటంటే అప్పట్లో దిల్లీ ఉద్యానవన శాఖ డైరెక్టర్ అయిన విలియం ముస్టోకి వచ్చిన ఆలోచన వల్ల మొగల్ గార్డెన్స్ రూపుదిద్దుకుంది.
న్యూదిల్లీ చీఫ్ ఆర్కిటెక్ట్ అయిన ఎడ్విన్ లుటియన్స్ పర్యవేక్షణలో విలియం పని చేసేవారు. మొగల్ గార్డెన్స్‌ను తీర్చిదిద్దే చేసే బాధ్యతను విలియం ముస్టోకు అప్పగించారు.
దీని కోసం సర్ ఎడ్విన్ లుటియన్స్, ముస్టో మధ్య సుదీర్ఘ చర్చలు, సంప్రదింపులు జరిగాయి. చివరకు విలియం ముస్టో ఒక సరికొత్త ఆలోచనతో వచ్చారు.
మొగల్ శైలి, ఇంగ్లిష్ ఫ్లవర్ గార్డెన్ శైలి అనే రెండు ఉద్యానవన సంప్రదాయాలను మేళవించి మొగల్ గార్డెన్‌ను రూపొందించాలని ఆయన ప్రతిపాదించారు.
దీనికి ఎడ్విన్ కూడా అంగీకరించారు. ఈ పనిలో విలియంకు ఎడ్విన్ పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. అంచనాలకు తగినట్లే ఎడ్విన్‌ను నిరాశపరచకుండా విలియం, మొగల్ గార్డెన్స్‌ను తయారు చేశారు.

ఫొటో సోర్స్, SUNIL SAXENA/HINDUSTAN TIMES VIA GETTY IMAGES
మొగల్ గార్డెన్స్‌పై లుటియన్స్ భార్య ఏమన్నారు?
క్రిస్టోఫర్ హస్సీ అనే రచయిత ‘ద లైఫ్ ఆఫ్ ఎడ్విన్ లుటియన్స్ (1950)’ పుస్తకాన్ని రాశారు. మొగల్ గార్డెన్ అందాన్ని లుటియన్స్ భార్య లేడీ ఎమిలీ బుల్వర్ లిటన్ గొప్పగా ప్రశంసించినట్లు ఆ పుస్తకంలో పేర్కొన్నారు.
‘‘అన్నిరంగులతో రంగోలీ వేసినట్లుగా భారీ విస్తీర్ణంలో పువ్వులన్నీ పరుచుకున్నాయి. ఫౌంటేన్ నిరంతరం ప్రవహిస్తున్నట్లుగా పూలు కదులుతూనే ఉన్నాయి. ఇక్కడ కఠినత్వానికి చోటే లేదు. గుండ్రాకారంలో ఉన్న ఈ ఉద్యానవనం అందరి మనసులను కొల్లగొడుతుంది. మాటల్లో దీని అందాన్ని వర్ణించలేం’’ అని ఎమిలీ అన్నట్లుగా ఆయన పుస్తకంలో రాశారు.

ఫొటో సోర్స్, ANI
మొగల్ గార్డెన్స్ అందం
మొగల్ గార్డెన్‌లో ప్రపంచంలో ఉన్న అన్ని ప్రసిద్ధ పువ్వులు ఉన్నాయి. నెదర్లాండ్స్‌లోని తులిప్ పుష్పాలు ఈ గార్డెన్‌లో కనిపిస్తాయి.
బ్రెజిల్‌కు చెందిన ఆర్కిడ్ పువ్వులు, చెర్రీ పుష్పాలు, జపాన్‌లో కనిపించే పువ్వులు, చైనా వాటర్ లిల్లీ పుష్పాలు కూడా ఈ మొగల్ గార్డెన్స్‌లో చూడొచ్చు.
యూరప్ దేశాలకు చెందిన పూలగుత్తులు, పచ్చిక బయళ్లు, ఏకాంత ప్రదేశాలతో కూడిన మొగల్ కాలువలు, టెర్రస్‌లు, పూల పొదలు ఆహ్లాదాన్ని పంచుతాయి.

ఫొటో సోర్స్, RAVEENDRAN/AFP VIA GETTY IMAGES
159 రకాల గులాబీలు
మొగల్ గార్డెన్స్‌లోని గులాబీల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
ఇక్కడ 159 రకాల గులాబీలను పెంచుతారు. అడోరా, మృణాళిని, తాజ్ మహల్, ఈఫిల్ టవర్, మోడ్రన్ ఆర్ట్, బ్లాక్ లేడీ, ప్యారడైస్, బ్లూ మూన్, లేడీ ఎక్స్ వంటి గులాబీ రకాలను ఇక్కడ చూడొచ్చు.
మొగల్ గార్డెన్స్‌లో మదర్ థెరిసా, రాజా రామ్మోహన్ రాయ్, జాన్ ఎఫ్. కెన్నెడీ, క్వీన్ ఎలిజబెత్, క్రిస్టియాన్ డియర్ వంటి ప్రముఖ వ్యక్తుల పేర్లతో కూడా గులాబీలు ఉన్నాయి.
మహాభారత పాత్రలైన అర్జునుడు, భీముడు పేర్లతో కూడా గులాబీలు ఇక్కడ కనిపిస్తాయి.

ఫొటో సోర్స్, ANI
గులాబీలే కాకుండా తులిప్, లిల్లీ, డఫోడిల్స్‌తో పాటు కాలానుగుణంగా కనిపించే ఇతర పూలు మొగల్ గార్డెన్స్ అందాన్ని పెంచుతాయి.
అక్కడ 70కి పైగా సీజనల్ పూల రకాలు కనిపిస్తాయి. అంతేకాకుండా కాగితపు పూలుగా మనం పిలిచే బోగెన్‌విల్లాస్‌లోని 101 రకాల్లో 60 రకాలు ఇక్కడ పెంచుతారు.
అలిస్సమ్, డైసీ, పాన్సీ అని పిలిచే పూల పొదలతో పాటు మౌల్సిరి ట్రీ, గోల్డెన్ రైన్ ట్రీ, టార్చ్ ట్రీ వంటి 50 రకాల చెట్లు కూడా అక్కడ కనిపిస్తాయి.

ఫొటో సోర్స్, MONEY SHARMA/AFP VIA GETTY IMAGE
మొగల్ గార్డెన్స్‌ను తీర్చిదిద్దేది ఎవరు?
మొగల్ గార్డెన్స్‌ను ఇంత అందమైన ప్రదేశంగా తీర్చిదిద్దడంలో తోటమాలుల పాత్ర గురించి మనం మాట్లాడుకోవాలి.
మొగల్ గార్డెన్స్‌పై ‘ఫస్ట్ గార్డెన్ ఆఫ్ రిపబ్లిక్’ పేరుతో అమితా బావిస్కర్ ఒక పుస్తకాన్ని రాశారు.
‘‘శీతాకాలంలో మొగల్ గార్డెన్స్ సందర్శనకు వచ్చే లక్షలాది మందికి దీన్ని ఇంత అందంగా తీర్చిదిద్దడం వెనుక ఎంత కృషి దాగి ఉందో తెలియదు. దీన్ని అందంగా మార్చడం కోసం నెలల పాటు చేసిన కృషి, పటిష్టమైన ప్రణాళిక అవసరం.
నిజం చెప్పాలంటే తోటమాలుల కృషి వల్లే ఈ తోట అందంగా వెలిగిపోతుంది’’ అని ఆమె పుస్తకంలో ప్రస్తావించారు.
ఇక్కడ సైనీ కులానికి చెందిన తోటమాలులు పనిచేస్తుంటారు. వారి తండ్రులు, తాతలు కూడా ఇక్కడే పనిచేసేవారు. తరతరాలుగా వారు మొగల్ గార్డెన్స్‌లోనే పని చేస్తున్నారు.
రాష్ట్రపతి భవన్ ఎస్టేట్‌లోనే వారు నివసిస్తుంటారు. వారు సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (సీపీడబ్ల్యూడీ) కోసం పనిచేస్తారు.

ఫొటో సోర్స్, SANJEEV VERMA/HINDUSTAN TIMES VIA GETTY IMAGES
భారత మాజీ రాష్ట్రపతిల సహకారం
మొగల్ గార్డెన్‌ను మరింత మెరుగ్గా, ఆకర్షణీయంగా మార్చడానికి మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం కొన్ని సూచనలు చేశారు. ఆయన సూచనల మేరకు హెర్బల్ గార్డెన్, అంధుల కోసం స్పర్శ గార్డెన్, మ్యూజికల్ గార్డెన్, బయోఫ్యూయల్ పార్క్, న్యూట్రిషనల్ గార్డెన్ వంటి వాటిని అక్కడ ఏర్పాటు చేశారు.
డాక్టర్ కలాం అక్కడ రెండు గుడిసెలను ఏర్పాటు చేశారు. వాటికి ‘థింకింగ్ హట్’, ‘ఇమ్మోర్టల్ హట్’ అని పేరు పెట్టారు.
డాక్టర్ కలాం తన స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ వాటిలోనే కూర్చునేవారు. 'ది ఇండోమిటబుల్ స్పిరిట్' పుస్తకాన్ని ఆయన చాలావరకు ఇక్కడ కూర్చొనే రాశారు.
డాక్టర్ కలాం కంటే ముందు, కలాం తర్వాత వచ్చిన రాష్ట్రపతులు కూడా మొగల్ గార్డెన్స్‌ను మరింత సుందర ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు సహకరించారు.
ఉదాహరణకు కేఆర్ నారాయణన్ 1998లో రాష్ట్రపతి భవన్‌లో భూగర్భ జలాల స్థాయిని మెరుగుపరచడానికి రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్‌ను కోరారు.
2015లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఇక్కడ మురుగునీటి శుద్ధి ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ ప్లాంట్ ద్వారా శుద్ధి చేసిన నీటిని మొక్కలను సాగు చేసేందుకు ఉపయోగించారు.

ఫొటో సోర్స్, RAVEENDRAN/AFP VIA GETTY IMAGES
డాక్టర్ జాకీర్ హుస్సేన్, విదేశాల నుంచి కొత్త జాతుల గులాబీలను తెప్పించడమే కాకుండా, మొక్కల సంరక్షణ కోసం గాజు గృహాన్ని ఏర్పాటు చేశారు.
అదేవిధంగా నీలం సంజీవ రెడ్డి సిట్రస్ బోన్సాయ్ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించారు.
ఆర్. వెంకటరామన్, దక్షిణ భారతదేశానికి చెందిన కొత్త రకాల అరటిపండ్ల మొక్కలను నాటించారు.
కేఆర్ నారాయణన్ భార్య ఉషా నారాయణన్ ఇక్కడ తులిప్, ఇకబనా పువ్వుల పెంపకాన్ని ప్రోత్సహించారు.
ప్రతిభా పాటిల్, దాలిఖానా అనే మామిడి పండ్ల చెట్లను నాటించారు.
ఇవి కూడా చదవండి:
- ముస్లిం ఫండ్ పేరుతో ప్రజల నుంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన అబ్దుల్ రజాక్
- మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలు: 'బంబుల్, టిండర్ వంటి యాప్స్‌తో నేను మగాళ్ళను ఎందుకు ఆకర్షించాలి?'
- ఫిన్లాండ్: పరీక్షలు, ర్యాంకులు లేని అక్కడి చదువుల గురించి ఇండియాలో ఎందుకు చర్చ జరుగుతోంది?
- జహాన్ ఆరా: విలాసవంతమైన మసీదులు, సత్రాలు కట్టించిన అందాల మొఘల్ రాణి
- థైరాయిడ్ సమస్య: మందులు వాడుతున్నా తగ్గకపోతే ఏం చేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














