ముస్లిం ఫండ్ పేరుతో ప్రజల నుంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన అబ్దుల్ రజాక్

ముస్లిం ఫండ్

ఫొటో సోర్స్, HARIDWAR POLICE

ఫొటో క్యాప్షన్, అబ్దుల్ రజాక్
    • రచయిత, రాజేశ్ డోబ్రియాల్
    • హోదా, బీబీసీ కోసం

‘ముస్లిం ఫండ్’ పేరుతో ప్రజల నుంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టి పరారైన అబ్దుల్ రజాక్‌ను ఉత్తరాఖండ్ హరిద్వార్ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు.

రజాక్‌తోపాటు కలిసి మోసాలకు పాల్పడిన వారికి చెందిన 23 బ్యాంకు ఖాతాలను పోలీసులు స్తంభింపజేశారు. వారి దగ్గరున్న స్థిరచరాస్తుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

హరిద్వార్‌ జ్వాలాపుర్‌లో ‘‘ముస్లిం ఫండ్’’ పేరుతో వేల మంది ముస్లింల నుంచి కోట్ల రూపాయలను సేకరించి, మోసం చేసినట్లు అబ్దుల్ రజాక్‌పై ఆరోపణలు ఉన్నాయి.

కబీర్ మ్యూచువల్ బెనిఫిట్ నిధి లిమిటెడ్ (ముస్లిం ఫండ్)కు డైరెక్టర్ రజాక్ ఉండేవారు. ఆయన పరారుకావడంతో పోలీసులు లుక్ అవుట్ నోటీసులు కూడా జారీచేశారు.

ముస్లిం ఫండ్ దగ్గర నిధులు జమచేసిన వారంతా నిరు పేదలు. కొన్ని ఏళ్లపాటు చిన్న మొత్తాల్లో ఈ నిధిలో వారు డబ్బులు దాచుకున్నారు. అవసరమైనప్పుడు తీసుకుందామని భావించిన ఈ నిధులతో రజాక్ పరారు కావడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే, కొంతమంది ఇప్పటికీ అబ్దుల్ రజాక్‌ను నమ్ముతున్నారు. వివాదం సర్దుకున్న తర్వాత, తమకు ఆయన దగ్గర నుంచి డబ్బులు వస్తాయని వారు భావిస్తున్నారు.

ముస్లిం ఫండ్

ఫొటో సోర్స్, HARIDWAR POLICE

రెండున్నర దశాబ్దాల నుంచీ..

జ్వాలాపుర్‌లోని సరాయ్ గ్రామానికి చెందిన అబ్దుల్ రజాక్ 1997లో ముస్లిం ఫండ్ పేరుతో ఒక ‘‘చిట్ ఫండ్’’ మొదలుపెట్టారు. దీనితోపాటు ఆస్తుల కొనుగోళ్లు, అమ్మకాలు లాంటి రియల్ ఎస్టేట్ లావాదేవీలు కూడా చేసేవారు.

రజాక్‌ను హాఫిజ్‌(ఖురాన్‌ను కంఠస్తంచేసిన వ్యక్తి)గా స్థానికులు చెబుతున్నారు. ఆయనకు ఇక్కడ మంచి పేరుండేదని, ఆయన్ను అందరూ గౌరవిస్తారని వివరించారు.

జ్వాలాపుర్‌ ప్రధాన రోడ్డుపై ముస్లిం ఫండ్ కార్యాలయానికి సమీపంలో ఢాబా వెలుపల మేం అర్మాన్, అర్సలాన్‌లను మేం కలిశాం.

 ‘‘ఇటీవల వారంలో రెండు-మూడు రోజులు మాత్రమే ఆ కార్యాలయం తెరచేవారు కాదు. బహుశా రజాక్‌కు ఏదైనా పనుందేమోనని మేం అనుకునేవాళ్లం’’అని అర్మాన్ చెప్పారు.

అయితే, జనవరి 22న ప్రజల డబ్బులతో రజాక్ పరారయ్యాడని ఒక్కసారిగా వార్తలు వినిపించాయి. దీంతో ఈ కార్యాలయం వెలుపల పెద్ద సంఖ్యలో బాధితులు చేరుకున్నారు.

ఇక్కడ చాలా మంది బాధితులు నిరసనలు చేపట్టారు. పోలీసులు కలగజేసుకుని అందరికీ డబ్బులు వస్తాయని చెప్పి శాంతింపచేశారు.

జ్వాలాపుర్‌ స్టేషన్ పరిధిలో 420 (మోసం), 406 (ప్రజల నమ్మకాలను అడ్డుపెట్టుకుని మోసం చేయడం) లాంటి ఆరోపణలపై అబ్దుల్ రజాక్‌పై పోలీసులు కేసు నమోదుచేశారు.

ముస్లిం ఫండ్

ఫొటో సోర్స్, RAJESH DOBRIYAL

ఏమిటీ ముస్లిం ఫండ్?

షరియా ప్రకారం డబ్బులను వడ్డీపై ఇవ్వకూడదని, అందుకే ఇలాంటి సంస్థలు వడ్డీపై కాకుండా ఉచితంగా డబ్బులు ఇస్తామని, తమ దగ్గర డబ్బులు కూడా దాచుకోవచ్చని చెబుతాయని జమియాత్ ఉలేమా-హింద్ ఉత్తరాఖండ్ విభాగం అధికార ప్రతినిధి షా నజర్ చెప్పారు.

‘‘ఇలాంటి ఫండ్‌లలో దాచుకునే డబ్బులకు వడ్డీ ఇవ్వరు. ఇచ్చే రుణాలపైనా వడ్డీ తీసుకోరు’’అని ఆయన వివరించారు.

అబ్దుల్ రజాక్ మొదలుపెట్టిన కబీర్ మ్యూచువల్ బెనిఫిట్ నిధి లిమిటెడ్ (ముస్లిం ఫండ్) కూడా ఇలాంటిదే. అయితే, ఇస్లామిక్ చట్టాలకు అనుగుణంగా సేకరించిన డబ్బులను ఇస్లామికేతర విధానాల్లో రజాక్ ఉపయోగించినట్లు తాజాగా పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది.

‘‘ప్రజల దగ్గర నుంచి వడ్డీ లేకుండా సేకరించిన నిధులను బ్యాంకుల్లో వడ్డీకి ఆయన జమచేసేవారు. ఈ డిపాజిట్లపై ఆయన రుణం కూడా తీసుకున్నారు. దీనిపై బ్యాంకుకు వడ్డీని కూడా ప్రజలు ఇచ్చిన సొమ్ములతో కట్టేవారు’’అని పోలీసు అధికారులు చెప్పారు.

ముస్లిం ఫండ్

ఫొటో సోర్స్, MAAHAVEER NEGI

పేదలే బాధితులు..

అబ్దుల్ రజాక్ దగ్గర డబ్బులు దాచుకున్నవారిలో ఎక్కువ మంది పేదలే ఉన్నారు. చిట్ ఫండ్ తరహాలో ఆయన ప్రజల దగ్గర నుంచి డబ్బులు సేకరించేవారు.

ఆ ప్రజల దగ్గరకు డబ్బులు తీసుకునేందుకు రోజూ ‘‘కలెక్షన్ ఏజెంట్లు’’ వెళ్లేవారు. ప్రతి డిపాజిట్‌ను పాసు పుస్తకాల్లో రాసేవారు.

మరోవైపు ప్రజలు డబ్బులు తీసుకోవడానికి నేరుగా ముస్లిం ఫండ్ కార్యాలయానికి వచ్చేశారు. డబ్బులపై వడ్డీ ఇచ్చేవారు కాదు. కానీ, అవసరమైనప్పుడు వెంటనే డబ్బులు తీసుకునే సదుపాయం ఉండేది.

వడ్డీ లేకుండా రుణాలు కూడా ఈ ఫండ్ నుంచి ఇచ్చేవారు. అయితే, దీనికోసం బంగారు ఆభరణాలు లాంటివి కుదువ పెట్టాల్సి ఉంటుంది.

ఈ ఫండ్ కోసం పనిచేస్తున్న ఉద్యోగులను కూడా పోలీసులు విచారించారు. దీంతో మొత్తంగా వీరు 13,000 ఖాతాలను నడిపిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది.

8,500 ఖాతాల్లో డిపాజిట్లు రూ.500 కంటే తక్కువగా ఉన్నాయి. అయితే, ఇలాంటి ఖాతాల నుంచి ప్రజలు డబ్బులు తీసుకోవడం వీలుకాదు. మరో 1,107 ఖాతాల్లో రూ.10,000 కంటే ఎక్కువ డబ్బులను జమ చేశారు. కొన్ని ఖాతాల్లో ఆరు నుంచి ఏడు లక్షల వరకు డబ్బులు ఉన్నాయి.

అయితే, ఇక్కడ ముస్లింలు మాత్రమే కాదు. 2,500 మంది వరకు హిందువులు కూడా ఈ ఫండ్‌లో డబ్బులు జమచేశారు.

ముస్లిం ఫండ్‌గా ఉన్న సంస్థ పేరును కబీర్ మ్యూచువల్ బెనిఫిట్ ఫండ్ లిమిటెడ్‌గా రజాక్ పేరు మార్చారని స్థానికులు తెలిపారు.

ముస్లిం ఫండ్

ఫొటో సోర్స్, MAAHAVEER NEGI

బ్యాంకు ఖాతాలు స్తంభింపజేశారు..

మొత్తంగా ఈ ఫండ్‌లో రూ.7 కోట్ల నుంచి రూ.7.5 కోట్ల వరకు నగదును ప్రజలు జమచేసినట్లు హరిద్వార్ ఎస్ఎస్‌పీ అజయ్ కుమార్ సింగ్ చెప్పారు. మరోవైపు బంగారంపై రూ.1.5 కోట్ల రుణాలను ప్రజలు తీసుకున్నారు. ఈ బంగారం విలువ రూ.2.5 కోట్ల వరకు ఉంటుంది.

రజాక్‌తోపాటు అతడితో కలిసి పనిచేస్తున్న వారికి చెందిన 23 ఖాతాలను పోలీసులు స్తంభింపజేశారు. ప్రస్తుతం వీరు కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. మరోవైపు రజాక్ కుటుంబ సభ్యుల ఆస్తులపైనా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

మంగళవారం సాయంత్రం నాటికి అబ్దుల్ రజాక్ పేరుపై రిజిస్టర్ అయిన 22 ఆస్తులను పోలీసులు గుర్తించారు. వీటిపై లావాదేవీలన్నీ పూర్తిగా నిలిపివేయాలని రిజిస్ట్రార్ కార్యాలానికి పోలీసులు సూచించారు.

గత రెండు రోజుల్లో ఏజెంట్లు సేకరించిన రూ.6 లక్షల నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ముస్లిం ఫండ్

ఫొటో సోర్స్, HARIDWAR POLICE

25 ఏళ్ల నమ్మకం

అబ్దుల్ రజాక్ పరారీ కావడంతో చాలా మంది ఆందోళన వ్యక్తంచేస్తూ నిరసనలు చేపట్టారు. అయితే, కొంతమంది మాత్రం ఇప్పటికీ ఆయనపై నమ్మకంతో ఉన్నారు.

‘‘ఆ ఫండ్‌లో మా కుటుంబ సభ్యులకు చెందిన రూ.2.5 లక్షలు జమచేశాం. మరోవైపు మా సమీప బంధువులు కూడా మొత్తంగా రూ.10 లక్షలు అక్కడ జమచేశారు’’అని అర్మాన్ బీబీసీతో చెప్పారు.

ఇక్కడకు సమీపంలోనే కోఆపరేటివ్ బ్యాంకు ఉన్నప్పుడు, మీరు ఈ ఫండ్‌లో ఎందుకు డబ్బులను జమచేశారు? అని బీబీసీ ఆయన్ను ప్రశ్నించింది.

‘‘చాలా మంది మమ్మల్ని ఇదే ప్రశ్న అడుగుతున్నారు. కానీ, మేం ఏళ్ల నుంచి రజాక్ దగ్గర డబ్బులను జమచేస్తున్నాం. ఇప్పుడు మాత్రమే ఇలా జరిగింది. దీనిపై మేం మాత్రం ఏం చెప్పగలం?’’అని ఆయన అన్నారు.

ఖురేజాగా పిలిచే ఒక మహిళ కూడా ఈ ఫండ్‌లో డబ్బులు దాచుకున్నారు.

‘‘నేను అక్కడ 76,000 దాచుకున్నాను. ఇప్పుడు రజాక్ ఇలా చేశారు. నా భర్త కూడా చనిపోయారు. పెళ్లి చేయడానికి ఇద్దరు కూతుర్లు సిద్ధంగా ఉన్నారు. వీరిలో ఒకరికి మరో ఆరు నెలల్లో పెళ్లి అనుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు’’అని ఆమె ఆందోళన వ్యక్తంచేశారు.

తనకు సాయం చేయాలని స్థానిక కౌన్సెలర్ ఇస్రార్ అహ్మద్‌ను ఆమె కలిశారు. అయితే, ఇలా చాలా మంది తన దగ్గరకు సాయం కోసం వస్తున్నారని అహ్మద్ తెలిపారు.

ముస్లిం ఫండ్ నుంచి సేకరించిన డబ్బులతో రజాక్ ఆస్తులు కూడా కొనుగోలు చేసేవారని ఇస్రార్ అహ్మద్ చెప్పారు.

‘‘ఉత్తరాఖండ్ కొత్తరాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత ఇక్కడ ఆస్తుల విలువ పెరిగింది. అంతా బానే ఉండేది. కానీ, ఏడాది క్రితం ఆయన ఒకచోట భారీగా భూమి కొన్నారని, కానీ, ఆ పార్ట్‌నర్ ఆయన్ను మోసం చేశారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత పరిస్థితులు తలకిందులయ్యాయి. తన సొంత భూమిని కూడా ఆయన అమ్మకానికి పెట్టినట్లు వార్తలు వచ్చాయి’’అని అహ్మద్ చెప్పారు.

వీడియో క్యాప్షన్, ప్రభుత్వంపై తమకు భరోసా లేదంటున్న స్థానిక ముస్లింలు

ఇది కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)