ఆంధ్రప్రదేశ్, తెలంగాణ: ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు ఎందుకు ఇవ్వడం లేదు?

విద్యార్థులు

ఫొటో సోర్స్, FAMILY ALBUM

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

విద్యా రంగానికి సంబంధించి, దేశంలో చాలా మందికి తెలియని, అమల్లోకి వస్తే మొత్తం విద్యా వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపే నిర్ణయం ఒకటి ఉంది. అన్ని ప్రైవేటు స్కూళ్లు, కార్పొరేట్ స్కూళ్లలోనూ పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు ఇవ్వాలన్నదే ఆ నిర్ణయం.

ఇంతకీ పేదలు ఉచితంగా కార్పొరేట్ స్కూల్లో చదువుకోగలరా? అసలు ఆ అవసరమే లేదా?

భారతదేశంలో ఈ మధ్య కాలంలో వచ్చిన చట్టాల్లో అత్యంత కీలకమైన వాటిలో 2009 నాటి విద్యా హక్కు చట్టం ఒకటి.

విద్యార్థులు

ఫొటో సోర్స్, iStock

కాంగ్రెస్ –యూపీఏ హయాంలో వచ్చిన ఈ చట్టంలో అనేక నిబంధనలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ప్రతీ ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలోనూ 25 శాతం సీట్లు అంటే నాలుగో వంతు సీట్లు పేద కుటుంబాలకు ఇవ్వాలి. ఆ మేరకు చట్టంలోని సెక్షన్ 12 (3) (1) ఏర్పాటు చేశారు. ఆ సీట్లకు అయ్యే ఖర్చు గవర్నమెంటు భరిస్తుంది.

అయితే ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ చట్టం సక్రమంగా అమలు కాలేదు.

ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే 15 వేలకు పైగా ప్రైవేటు పాఠశాలలు ఉన్నట్టు అంచనా. ఒకవేళ నిజంగా ఈ నిబంధన అమలు అయితే 7 నుంచి 10 లక్షల మంది పేద విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో సీటు దక్కుతుంది.

కానీ, ఈ చట్టంలోని ఈ నిబంధన అమలు చేయడానికి రెండు రాష్ట్రాలూ ఆసక్తి చూపడం లేదు.

జగన్మోహన్ రెడ్డి

ఫొటో సోర్స్, FACEBOOK/YS JAGAN MOHAN REDDY

వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామంటున్న ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కోటా అమలుపై ముందు నుంచీ కోర్టు కేసులు నడుస్తున్నాయి. 2017లో తాండవ యోగేశ్ అనే ఒంగోలుకు చెందిన న్యాయవాది దీనిపై ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. 2021 జనవరి 3న దానిపై తీర్పు ఇచ్చింది హైకోర్టు.

రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు స్కూళ్లలో రిజర్వేషన్ అమలు చేయాలి తీర్పు వచ్చింది. అయితే అప్పటికే విద్యా సంవత్సరం మధ్యలో ఉండగా, 2022-23 నుంచి అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయినప్పటికీ హామీ అమలు కాకపోవడంతో 2022 మే 5న మళ్లీ పిటిషన్ వేశారు యోగేశ్.

మరోవైపు 2022 ఫిబ్రవరి 7వ తేదీన పాఠశాల విద్యా శాఖ ఒక రాష్ట్ర స్థాయి కమిటీని నియమించింది. ఒక విద్యార్థికి సగటున ఎంత ఫీజు చెల్లించవలసి వస్తుందన్న నివేదిక కోసం ఈ కమిటీని నియమంచింది. అంతేకాదు 25 శాతంలో ఉప కోటా కూడా నిర్ధారించింది.

విద్యార్థులు

ఫొటో సోర్స్, Getty Images

అనాథలు, వికలాంంగులు, హెచ్ఐవీ బాధిత పిల్లలకు 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, బీసీలకు 5 శాతం, ఆర్థికంగా వెనుకబడ్డ ఓసీ, మైనార్టీలకు 5 శాతంగా కోటాను విభజించింది ఆంధప్రదేశ్ ప్రభుత్వం.

ఈ కోటాలో సీటు సాధించడానికి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 1 లక్షా 20 వేలు, పట్టణ ప్రాంతాల్లో 1 లక్షా 40 వేల కంటే తక్కువ ఉండాలని సూచించింది.

అయితే మార్గదర్శకాలు వచ్చాయి కానీ వాస్తవంగా క్షేత్ర స్థాయిలో అమలు కాలేదు. దీనికి ప్రధాన కారణం ఫీజుల విషయంలో ప్రభుత్వ – ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాల మధ్య పంచాయితీ తేలలేదు.

ప్రభుత్వం ఫీజు రీయంబర్సుమెంటు పథకం తరహాలో ఈ పథకాన్ని అమలు చేయాలని చూస్తోంది. కానీ ఫీజు రీయంబర్సుమెంటులాగా డబ్బులు ఆలస్యం అయితే తట్టుకునే శక్తి తమకు లేదని మీడియాతో అన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు స్కూళ్ల సంఘం ప్రతినిధి చంద్రశేఖర్.

‘‘కార్పొరేట్ స్కూళ్లు కొన్నే ఉంటాయి. కానీ, చాలా వరకూ ప్రైవేటు స్కూళ్లు ఫీజులు సమయానికి అందకపోతే విలవిల్లాడతాయి. కరోనా సమయంలో చూశారు కదా. కాబట్టి మాకు డబ్బుల విషయంలో స్పష్టమైన హామీ ఉండాలి’’అని అన్నారాయన.

కేసీఆర్

ఫొటో సోర్స్, Getty Images

ఈ నిబంధనే వద్దంటున్న తెలంగాణ

తెలంగాణ విద్యా శాఖలోని ఒక ఉన్నత అధికారి బీబీసీతో చెప్పిన వివరాల ప్రకారం, అసలు ఈ నిబంధనే సరికాదని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.

ప్రభుత్వమే మంచి నాణ్యతతో పాఠశాలలు నిర్వహిస్తున్నప్పుడు ఇక ఇలా ప్రభుత్వ డబ్బుతో ప్రైవేటు స్కూళ్లలో పిల్లల్ని చదివించడం సరికాదని తెలంగాణ ప్రభుత్వ భావన.

అందుకే, ఈ చట్టంలోని 25 శాతం సీట్ల నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ కేంద్రాన్ని కోరినట్టు సమాచారం. దాని బదులు ఆ డబ్బును తెలంగాణ గురుకులాల్లో ఖర్చు చేయాలని తెలంగాణ ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.

ఆశ్యర్యకరమైన విషయం ఏంటంటే, కొందరు విద్యావేత్తలు కూడా ఇదే భావనతో ఉన్నారు. ‘‘ఈ పథకం కింద డబ్బు ప్రభుత్వం నుంచి ప్రైవేటు పాఠశాలలకు వెళుతుంది. అదే డబ్బుతో ప్రభుత్వమే అంతకు మించిన నాణ్యతో విద్యను అందించవచ్చు. పైగా ఎంపిక చేసిన కొందరికి మాత్రమే ప్రైవేటు స్కూళ్లలో సీట్లు దొరుకుతాయి. మిగతా వారు మళ్లీ ప్రభుత్వ బడికి రావాలి. దానివలన కూడా విభజన చేసినట్టు అవుతోంది. ఇది ఒక రకంగా ఆరోగ్య శ్రీ లాంటిది’’అని బీబీసీతో చెప్పారు విద్యా రంగ నిపుణులు.

విద్యార్థులు

ఫొటో సోర్స్, Getty Images

ఆంధ్ర, తెలంగాణలతో పాటూ పలు రాష్ట్రాల్లో ఈ 25 శాతం కోటా అమలుపై వివాదం నడుస్తోంది. పలు రాష్ట్రాల్లో హైకోర్టుల్లో దీనిపై కేసులు కూడా వేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా కేసు నడుస్తోంది. దిల్లీ వంటి కొన్ని రాష్ట్రాల్లో అమలైనా అది నామ మాత్రంగానే సాగుతోంది.

అయితే కొందరు విద్యార్థుల తల్లితండ్రులు మాత్రం ఈ పథకం పట్ల ఆసక్తితో ఉన్నారు. ‘‘ఇద్దరు పిల్లల స్కూలు ఖర్చులకు చిన్న కుటుంబాలకు చాలా భారంగా ఉంటుంది. కనీసం ఇద్దరు పిల్లల్లో ఒకరికి ఈ కోటాలో సీటు దక్కినా ఎంతో లాభం ఉంటుంది. కాబట్టి ఈ నిబంధన అమలు చేస్తేనే బావుంటుంది’’ అని బీబీసీతో అన్నారు కూకట్ పల్లికి చెందిన చిరు వ్యాపారి మోహన్.

దీనిపై రెండు రాష్ట్రాల విద్యా శాఖ అధికారులు స్పందించాల్సి ఉంది.

వీడియో క్యాప్షన్, పుట్టుకతోనే ఒక చెయ్యి ఎదగకపోయినా... ఏమాత్రం అధైర్య పడకుండా ఐఏఎస్ కావాలని అనుకుంటోంది.

ఆదిలోనే సుప్రీంలో రగడ

ఈ కోటా విషయంలో ఆ చట్టం వచ్చినప్పటి నుంచీ సుప్రీంలో గొడవ నడిచింది.

ఈ కోటాను వ్యతిరేకిస్తూ కొందరు సుప్రీం కోర్టుకు వెళ్లారు. దీంతో 2010 డిసెంబరులో ఈ 25 శాతం కోటాపై స్టే ఇచ్చి కోర్టు.

 తిరిగి 2012 ఏప్రిల్‌లో కేసు విచారించిన ఫుల్ బెంచ్ ఈ కోటాను సమర్థించింది.

2014లో ఏర్పాటైన రాజ్యాంగ ధర్మాసనం కూడా ఈ కోటాను సమర్థించింది.

వీడియో క్యాప్షన్, ఝార్ఖండ్: పరీక్షల్లో ఫెయిల్ చేశారంటూ.. టీచర్లను చెట్టుకు కట్టేసి కొట్టిన విద్యార్థులు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)