ఖురాన్ దహనం: స్వీడన్, తుర్కియేల మధ్య మరింత ముదిరిన వివాదం

స్వీడన్‌లో నిరసనలు

ఫొటో సోర్స్, Reuters

నాటోలో సభ్యత్వానికి ప్రయత్నిస్తున్న స్వీడన్‌కు ఆ దేశంలో ఖురాన్‌ను తగలబెట్టిన ఘటన ఇబ్బందికరంగా మారింది.

నాటోలో సభ్యత్వం విషయంలో స్వీడన్, తుర్కియేల మధ్య వివాదం కొనసాగుతోంది.

గత ఏడాది రష్యా, యుక్రెయిన్‌ల మధ్య యుద్ధం మొదలైన తరువాత స్వీడన్, ఫిన్లాండ్‌లో నాటోలో సభ్యత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి.

భద్రతాపరంగా తమకు గల ఆందోళనల నుంచి బయటపడేందుకు ఈ రెండు దేశాలు నాటో సభ్యత్వం పొందాలనుకున్నాయి.

కానీ, తుర్కియే వీటి దరఖాస్తులకు అడ్డం పడింది. నాటోలో తనకు గల వీటో అధికారాన్ని ఉపయోగించి అప్లికేషన్లను అడ్డుకుంది.

అనంతరం కొన్ని నెలలకే తుర్కియే తన వీటోను తొలగించి స్వీడన్, ఫిన్లాండ్‌ల దరఖాస్తులకు మార్గమేర్పరిచినప్పటికీ వివాదం మాత్రం చల్లారలేదు.

అందుకు కారణం... కుర్దిష్ వర్కర్స్ పార్టీ(పీకేకే) వంటి సాయుధ కుర్దిష్ గ్రూపులకు స్వీడన్ మద్దతివ్వడం మానుకోవాలని తుర్కియే సూచించడమే.

కుర్దిష్ వర్కర్స్ పార్టీకి చెందిన నేతలు కొందరికి స్వీడన్ ఆశ్రయం ఇచ్చిందని తుర్కియే ఆరోపిస్తుండగా.. స్వీడన్ ఆ ఆరోపణలను ఖండిస్తోంది.

తుర్కియే అధ్యక్షుడు ఎర్దోవాన్

ఫొటో సోర్స్, EPA

తమ అధ్యక్షుడు ఎర్దోవాన్‌ విమర్శకులను(వీరిని తుర్కియే టెర్రరిస్ట్‌లుగా పేర్కొంటోంది) తమకు అప్పగించాలని స్వీడన్‌ను తుర్కియే కోరుతోంది.

కొద్దినెలలుగా రెండు దేశాల మధ్య ఈ అంశంపై వివాదం కొనసాగుతోంది.

ఈ వివాదం నేపథ్యంలోనే తుర్కియేకు వ్యతిరేకంగా స్వీడన్‌లోని స్టాక్‌హోంలో అక్కడి రైట్ వింగ్ నాయకులు నిరసన తెలుపుతున్నారు.

ఈ నిరసనల్లో భాగంగా రైట్‌వింగ్ నేత రాస్‌ముస్ పేలుదాన్ నేతృత్వంలో కొందరు ఖురాన్‌ను తగలబెట్టడంతో వివాదం మరింత ముదిరి అంతర్జాతీయ సమస్యగా మారింది.

ఈ ఘటన స్వీడన్‌కు నాటో సభ్యత్వం ఇచ్చే ప్రక్రియపై ప్రభావం చూపుతుందా అనే అనుమానాలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు తుర్కియేలో స్వీడన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం ఎదుట నిరసనకారులు స్వీడన్ జెండాను తగలబెట్టారు.

స్వీడన్ కాన్సులేట్ జనరల్ ఎదుట నిరసనలు

ఫొటో సోర్స్, ERDEM SAHIN/EPA-EFE/REX/SHUTTERSTOCK

స్వీడన్‌లో ఖురాన్ దహనం చేయడంపై తుర్కియే సహా వివిధ ముస్లిం దేశాలు నిరసన తెలిపాయి.

స్వీడన్ రక్షణ మంత్రి పాల్ జాన్సన్ తుర్కియేలో పర్యటించాల్సి ఉండగా, తాజా పరిస్థితుల నేపథ్యంలో పాల్ జాన్సన్ పర్యటన అర్థరహితమని, ప్రాధాన్యం కోల్పోయిందని చెప్తూ తుర్కియే ఆ పర్యటనను రద్దు చేసింది.

తాజా పరిస్థితులలో నాటోలో చేరేందుకు తాము పెట్టుకున్న దరఖాస్తుకు తుర్కియే నుంచి ఆమోదం దొరకడం అసాధ్యమేనని స్వీడన్ భావిస్తోంది.

మే నెలలో తుర్కియేలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల తరువాత కూడా ఆ దేశం ఈ విషయంలో తన నిర్ణయం మార్చుకోకపోవచ్చని స్టాక్‌హోం యూనివర్సిటీలో టర్కిష్ స్టడీస్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ పాల్ లెవిన్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల తరువాత అక్కడ అధికారం మారినా ఆ దేశం వైఖరి మారుతుందని చెప్పలేమన్నారు.

‘తనను విమర్శించే వేలాది మందిని తుర్కియే అధ్యక్షుడు ఎర్దోవాన్ జైళ్లలో పెడుతున్నారు. దిగజారుతున్న దేశ ఆర్థిక పరిస్థితి నుంచి ఎన్నికలకు ముందు ప్రజల దృష్టి మళ్లించేందుకు ఆయన ఇలా చేస్తున్నారు.. మరోవైపు స్వీడన్‌లోనూ కొందరు ఆ దేశం నాటోలో చేరడాన్ని వ్యతిరేకిస్తున్నవారు ఉన్నారు’ అని పాల్ లెవిన్ చెప్పారు.

స్వీడన్‌కు వ్యతిరేకంగా ఇస్తాంబుల్‌లో నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

స్టాక్ హోంలో ఖురాన్‌ను తగలబెట్టడాన్ని ఆసియా నుంచి మధ్యప్రాచ్య దేశాల వరకు అందరూ వ్యతిరేకిస్తున్నారు.

ఈ ఘటనను తుర్కియేతో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, ఈజిప్ట్ ఖండించాయి. ఈ దేశాలే కాకుండా యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు, లెబనాన్‌లోని హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ కూడా ఖండించాయి.

ఖురాన్ దహనం తరువాత ఏమైనా హింసాత్మక ఘటనలు జరిగితే స్వీడనే దానికి బాధ్యత వహించాలని హౌతీ తిరుగుబాటుదారులు హెచ్చరించారు. మరోవైపు స్వీడన్‌లో జరిగిన ఈ ఘటనను ఖండించాలని ఇరాన్ మద్దతు గల హిజ్బుల్లా సంస్థ ముస్లిం దేశాలను, ముస్లిం సంస్థలను కోరింది.

స్వీడన్ ఏమంటోంది?

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

స్వీడన్ హోం మంత్రి టోబియస్ బిల్‌స్ట్రామ్ దీన్ని భయంకరమైన ఘటనగా అభివర్ణించారు. స్వీడన్‌లో భావప్రకటన స్వేచ్ఛ ఉంది కానీ, ఖురాన్ దహనం ఘటనను తాను కానీ, స్వీడన్ ప్రభుత్వం కానీ సమర్థించడం లేదని టొబియస్ చెప్పారు.

కాగా ఖురాన్ దహనానికి ముందు వారం రోజుల కిందట స్టాక్‌హోంలో నిరసనల సందర్భంగా తుర్కియే అధ్యక్షుడు ఎర్దోవాన్ దిష్టిబొమ్మను వీధి దీపం స్తంభానికి తలకిందులుగా వేలాడదీశారు.

దానిపై స్వీడన్ ప్రధాని కూడా స్పందించారు. అలాంటి చర్యలకు పాల్పడుతున్నవారు స్వీడన్ నాటోలో చేరేందుకు చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుపడుతున్నట్లేనని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)