యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు పుతిన్ సిద్ధంగా ఉన్నారు: టర్కీ అధ్యక్షుడు ఎర్దోవాన్

ఫొటో సోర్స్, Facebook/Recep Tayyip Erdoğan
- రచయిత, పాల్ కిర్బీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
యుక్రెయిన్-రష్యా యుద్ధానికి ముగింపు పలకాలని వ్లాదిమిర్ పుతిన్ కోరుకుంటున్నారా? అవుననే అంటున్నారు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయిప్ ఎర్దోవాన్.
ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిసినప్పుడు ఆయన మాటల ద్వారా తనకు ఆ విషయం అర్థమైందని ఆయన అన్నారు.
'యుక్రెయిన్‌లో తాను ప్రారంభించిన యుద్ధాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆపాలని అనుకుంటూ ఉండటం ఎంతో కీలక పరిణామం. ఇటీవల పుతిన్‌తో మాట్లాడినప్పుడు ఆ విషయం అర్థమైంది' అని అమెరికా మీడియా సంస్థ పీబీఎస్‌తో ఎర్దోవాన్ చెప్పారు.
యుక్రెయిన్‌లో పరిస్థితులు రష్యాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నట్లు ఎర్దోవాన్ మాటలను బట్టి తెలుస్తోంది. రష్యా ఆక్రమించుకున్న భూభాగాల్లో కొన్నింటిని ఇటీవలే యుక్రెయిన్ బలగాలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
పోయిన వారం ఉజ్బెకిస్తాన్‌లో జరిగిన ఎస్‌సీఓ సమిట్‌కు వెళ్లినప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఎర్దోవాన్ సమావేశమయ్యారు.
ఈ సమావేశం గురించి పీబీఎస్‌తో ఎర్దోవాన్ మాట్లాడారు.
'యుక్రెయిన్‌లో యుద్ధానికి సాధ్యమైనంత త్వరగా ముగింపు పలకాలని పుతిన్ భావిస్తున్నట్లుగా నాకు అర్థమైంది.
పుతిన్‌తో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది అదే. ఎందుకంటే ప్రస్తుతం అక్కడ పరిస్థితులు చాలా సమస్యాత్మకంగా ఉన్నాయి' అని ఎర్దోవాన్ వెల్లడించారు.
అలాగే త్వరలోనే రష్యా, యుక్రెయిన్ మధ్య 200 మంది బంధీలను పరస్పర మార్పిడి చేయనున్నారని ఆయన చెప్పారు.
యుక్రెయిన్-రష్యా యుద్ధం మొదలైన నాటి నుంచి రెండు దేశాల మధ్య తాను మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఎర్దోవాన్ చెబుతూనే ఉన్నారు.
నాటో కూటమి సభ్యదేశం అయినప్పటికీ ఆ కూటమికి రష్యాకు మధ్య 'బ్యాలెన్స్' పాటిస్తూ వస్తున్నారు ఎర్దోవాన్. రష్యా మీద పశ్చిమ దేశాల ఆంక్షలను టర్కీ వ్యతిరేకిస్తోంది కూడా.
యుక్రెయిన్ నుంచి ధాన్యం ఎగుమతి తిరిగి ప్రారంభించేలా ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వం వహించడానికి ఎర్దోవాన్ సాయం చేశారు. అలాగే యుక్రెయిన్, రష్యా మధ్య కాల్పుల విరమణ కోసం నేరుగా చర్చలు జరిపేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోయిన వారంలో ఆయన చెప్పారు.
రష్యా బలగాలు తూర్పు యుక్రెయిన్‌లోని లుహాన్‌స్క్ ప్రాంతాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకున్న రెండు నెలల తరువాత, అందులోని కొంత భూభాగాన్ని తిరిగి యుక్రెయిన్ స్వాధీనం చేసుకుంది.
బిలోహోరివ్‌కా గ్రామం నుంచి రష్యా బలగాలు వెనక్కి పోయినట్లు లుహానస్క్ ప్రాంతంలోని యుక్రెయిన్ లీడర్ సెరియ్ హైదాయి చెబుతున్నారు.
'ఆక్రమణదారులు భయపడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది' అని రష్యాను ఉద్దేశించి యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ అన్నారు.
రష్యాను 'రెచ్చగొట్టే' రీతిలో పశ్చిమ దేశాలు వ్యవహరిస్తున్నాయంటూ ఈ నెల ప్రారంభంలో ఎర్దోవాన్ విమర్శించారు. ఇలా అయితే యుక్రెయిన్, రష్యా యుద్ధం ఇప్పట్లో ఆగదని ఆయన హెచ్చరించారు.
యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీని కలిసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పోయిన వారంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. కానీ అందుకు తాను సిద్ధంగా లేనని జెలియెన్‌స్కీ అన్నారు.

ఫొటో సోర్స్, Google
సాధ్యమైనంత త్వరగా యుద్ధానికి ముగింపు పలకాలని తాను అనుకుంటున్నట్లు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కూడా పుతిన్ అన్నారు.
కానీ యుక్రెయిన్ చేస్తున్న డిమాండ్లను అంగీకరిస్తామా? లేదా? అనే విషయాన్ని రష్యా చెప్పడం లేదు. అందుకు సిద్ధమవుతున్న సంకేతాలు కూడా ఇవ్వడం లేదు. యుక్రెయిన్ భూభాగాల నుంచి రష్యా బలగాలను పూర్తిగా వెనక్కి మళ్లించడంతోపాటు 2014లో స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను కూడా ఇవ్వాలని యుక్రెయిన్ డిమాండ్ చేస్తోంది.
యుక్రెయిన్‌లో భాగమైన క్రైమియాను 2014లో రష్యా ఆక్రమించుకుంది.
దోన్బస్ రీజియన్‌లోని లుహాన్‌స్క్, దొనెత్స్‌క్ ప్రాంతాల్లో రష్యా మద్దతుగల వేర్పాటు వాదులు 'రెఫరెండం' చేపట్టాలని రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదెవ్ అంటున్నారు.
యుక్రెయిన్‌లోని దోన్బస్ రీజియన్‌కు విముక్తి కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని పుతిన్ తరచూ చెబుతూ వస్తున్నారు. 'దొన్బస్‌లో రెఫరెండం పెట్టడం ఎంతో అవసరం' అని ప్రస్తుతం రష్యా సెక్యూరిటీ కౌన్సిల్‌కు డెప్యూటీ హెడ్‌గా ఉన్న మెద్వెదెవ్ చెబుతున్నారు. లుహాన్‌స్క్, దొనెత్‌స్క్‌లలో రష్యా మద్దతు గల వేర్పాటు వాద నాయకులు తక్షణమే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని పిలుపునిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రష్యా అధీనంలో ఉన్న ఖార్కియేవ్‌లోని చాలా ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు యుక్రెయిన్ బలగాలు ఎదురు దాడికి దిగుతున్నాయి. ఈ దాడుల వల్ల దక్షిణ ఖార్కియేవ్‌లోని ఖేర్సన్‌లో రెఫరెండం పెట్టాలన్న ప్రయత్నాలు వాయిదా పడుతున్నాయి. మాస్కో నిలబెట్టిన అక్కడి నేత ఖేర్సన్‌ను రష్యాలో కలపాలని చూస్తున్నారు.
'ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు రష్యా స్వాధీనం చేసుకున్న భూభాగాల్లో ఏ ప్రాంతాన్నైనా ఆ దేశం ఉంచుకునేందుకు అనుమతి ఇస్తారా? అది శాంతి ఒప్పందంలో భాగంగా ఉంటుందా?' అని పీబీఎస్ చానెల్ అడగ్గా 'లేదు. అలా ఉండదు. అందులో సందేహమే అవసరం లేదు' అని ఎర్దోవాన్ సమాధానం ఇచ్చారు.
'రష్యా దండెత్తిన భూములను తిరిగి యుక్రెయిన్‌కు ఇవ్వాలి' అని ఎర్దోవాన్ అన్నారు. అయితే ఆయన చెబుతున్న భూభాగాల్లో 2014 నుంచి రష్యా మద్దతు గల గ్రూపులు స్వాధీనం చేసుకున్న ప్రాంతాలు ఉన్నాయో లేదో తెలియదు.
'మరి క్రైమియాను ఉంచుకునేందుకు రష్యాను అనుమతిస్తారా?' అని అడగ్గా 'క్రైమియాను దాని న్యాయమైన యజమానులకు ఇవ్వాలని అధ్యక్షుడు పుతిన్‌ను ఎప్పటి నుంచో టర్కీ కోరుతూ వస్తోంది. కానీ అందులో ఎటువంటి పురోగతి లేదు' అని ఎర్దోవాన్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- క్రికెట్ రూల్స్ మార్చిన ఐసీసీ.. ఈ 8 కొత్త నిబంధనలతో లాభం బౌలర్కా లేక బ్యాటర్‌కా?
- ‘కాందహార్’ విమానం హైజాక్: 21 ఏళ్ల క్రితం అదంతా ఎలా జరిగింది?
- మార్కెటింగ్ సంస్థల చేతికి మీ వివరాలు చిక్కకుండా ఈ సెట్టింగ్స్‌తో తప్పించుకోవచ్చు - డిజిహబ్
- ఆంధ్రప్రదేశ్: 16 ఊళ్ళు ఏకమై ప్రభుత్వం చేయలేనిది చేసి చూపించాయి
- మ్యూచువల్ ఫండ్స్: ఎలాంటి ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












