కాంపిటిటివ్ ఎగ్జామ్స్: నెలకు రూ. 4వేలు, ఉచితంగా కోచింగ్...ఏమిటీ పథకం?

- రచయిత, ఎ.కిశోర్ బాబు
- హోదా, బీబీసీ కోసం
యూపీఎస్సీ, ఆర్ఆర్‌బీ, ఎస్ఎస్‌సీ, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, నీట్, క్యాట్, టోఫెల్, సీఏ, బ్యాంకింగ్.. ఇలా ఇంటర్మీడియెట్, డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థుల ముందున్న లక్ష్యాలు ఎన్నో.
ఇవన్నీ పోటీతో కూడుకున్న పరీక్షలే. వీటికి శిక్షణ ఇవ్వడానికి దేశమంతటా ఎన్నో కోచింగ్ సెంటర్లున్నాయి. అయితే అక్కడ కోచింగ్ తీసుకోవడం అంటే ఎంతో వ్యయం, భారంతో కూడుకున్న పని.
చాలా మంది విద్యార్థులు అంత స్తోమత లేక ఈ పరీక్షలకు దూరమవుతున్నారు కూడా.
అయితే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి విద్యార్థులకు ప్రతి నెలా రూ.4000ల ఉపకార వేతనం కూడా ఇచ్చి ఈ పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇప్పిస్తుంది.
ఈ పథకాన్ని కేవలం షెడ్యూల్డు క్యాస్ట్ (SC), ఇతర వెనుకబడిన కులాలు (OBC) సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకు మాత్రమే అమలు చేస్తోంది.
ఏటా వేల మందికి లబ్ధి చేకూర్చుతున్న ఈ పథకం పేరు ఎస్సీ, ఓబీసీ విద్యార్థులకు ఉచిత శిక్షణ (‘Free Coaching Scheme for SC and OBC Students’) పథకం.
2016-17 to 2020-21 మధ్యకాలంలో మొత్తం 7250 లబ్ధిదారులు కోచింగ్ తీసుకోగా అందులో 1592 మంది పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఉద్యోగాలు పొందారని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో లిఖితపూర్వకంగా వెల్లడించింది.
ఈ పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఉండాల్సిన అర్హతలేమిటి? నోటిఫికేషన్ ఎప్పుడిస్తారు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? విధి విధానాలు ఏమిటి? స్టైఫండ్ ఎలా చెల్లిస్తారు? ఎలాంటి పరీక్షలకు కోచింగ్ తీసుకోవచ్చు? తదితర వివరాలన్నీ పూర్తిగా తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, Getty Images
ఏమిటీ పథకం?
బలహీన వర్గాల సాధికారత కోసం ఆయా వర్గాలకు చెందిన విద్యార్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి కావాల్సిన కోచింగ్‌ను ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది.
ఆ విద్యార్థులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో, ప్రైవేటు రంగాల్లో మంచి ఉద్యోగాలు పొందేలా చేయాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష.
దీని కోసం ఆరవ పంచవర్ష ప్రణాళికలో భాగంగా తొలుత 'Coaching and Allied Assistance for Weaker Sections పేరిట 2001 సెప్టెంబరులో ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది.
ఈ తరవాత మైనార్టీలకు చెందిన వ్యవహారాలన్నీ చూడటం కోసం కేంద్ర ప్రభుత్వం మైనార్టీల మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేసింది. అప్పుడే ఈ పథకంలో మార్పులు చేశారు.
కేవలం ఎస్సీలు, ఓబీసీ కేటగిరీలను మాత్రమే చేర్చుతూ 2016 ఏప్రిల్‌లో దీనికి ‘Free Coaching Scheme for SC and OBC Students’గా పేరు మార్చారు.
ఎలాంటి పోటీ పరీక్షలకు కోచింగ్ ఇస్తారంటే?
- యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ ఏ, బీ పరీక్షలు
- స్టాఫ్ సెలక్షన్ కమీషన్ పరీక్షలు
- రైల్వే రిక్రూట్‌మెంట్ పరీక్షలు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్లు నిర్వహించే గ్రూప్ ఏ, బీ పరీక్షలు
- బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, పబ్లిక్ సెక్టార్ కంపెనీ అండర్ టేకింగ్స్ నిర్వహించే ఆఫీసర్స్ గ్రేడ్ ఎగ్జామ్స్
- ప్రీమియం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అంటే ఇంజినీరింగ్ (ఐఐటీ, జేఈఈ), మెడికల్ (నీట్ ), ప్రొఫెషనల్ కోర్సులు ( క్యాట్ ), లా (క్లాట్), మరికొన్ని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ నిర్ణయించే మరికొన్ని పరీక్షలు
- ఎస్ఏటీ, జీఆర్ఈ, ఐఈఎల్‌టీఎస్, టోఫెల్
- సీపీఎల్ కోర్సుల కోసం ఎంట్రన్సులు, నేషనల్ డిఫెన్స్ ఎకాడెమీ, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసులు మొ.వి.

ఏయే పరీక్షలకు ఎంత శాతం స్లాట్స్ కేటాయిస్తారు.
మొత్తం పథకంలో 60శాతం స్లాట్స్ డిగ్రీ అర్హతతో రాయబోయే పోటీ పరీక్షలకు కేటాయిస్తారు.
మిగిలిన 40 శాతం ఇంటర్మీడియెట్ లేదా +2 లేదా 12వ తరగతి అర్హతతో రాయబోయే పోటీ పరీక్షలకు కేటాయిస్తారు.
ఈ పథకానికి ఎవరు అర్హులు?
షెడ్యూల్డు కులాలు, ఇతర వెనుకబడిన తరగతుల వర్గాలకు చెందిన విద్యార్థులు మాత్రమే అర్హులు.
ఈ వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉండాల్సిన అర్హతలేమిటి?
- విద్యార్థి కుటుంబ వార్షికాదాయం రూ.8లక్షలకు మించి ఉండకూడదు.
- మండల రెవెన్యూ అధికారి (MRO) జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని పొందుపరచాలి.
- ఇంటర్మీడియెట్ అర్హతతో రాసే పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకోవాలనుకునే విద్యార్థులు ఈ పథకానికి ఎంపికయ్యే నాటికి వాటికి సంబంధించిన విద్యార్హత ధ్రువ పత్రాలు పొందుపరచాలి.
- ఇంటర్మీడియెట్ పూర్తయిన వారు లేదా చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా ఈ పథకానికి అర్హులే.
- డిగ్రీ అర్హతతో రాసే పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకోదలచిన విద్యార్థులు ఈ పథకానికి ఎంపికయ్యే నాటికి వాటికి సంబంధించిన విద్యార్హత ధ్రువ పత్రాలు పొందుపరచాలి.
- డిగ్రీ పూర్తయిన వారు లేదా చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా అర్హులే.
- విద్యార్థులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచీ ఇదేవిధంగా ఇతరత్రా ఏవైనా పోటీ పరీక్షల కోచింగ్ తీసుకోవడానికి లబ్ధి పొందుతున్నారా అనే అంశాలను కూడా పొందుపరచాల్సి ఉంటుంది.
ముస్లిం కేటగిరీకి చెందిన విద్యార్థులకు పథకం వర్తించదా?
ముస్లిం కేటగిరీకి చెందిన విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇదే తరహా పథకాన్ని అమలు చేస్తోంది. వారు అక్కడ దరఖాస్తు చేసుకుని లబ్ధి పొందవచ్చు.
వారు కూడా కుల ధ్రువీకరణ పత్రం పొందుపరచాలి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రాలను విద్యార్థులు తమ దరఖాస్తుతో పాటు పొందుపరచాల్సి ఉంటుంది.

ఇంటర్, డిగ్రీలో ఎన్ని మార్కులు వచ్చి ఉండాలి?
ఈ పథకం పొందడానికి ఇంటర్మీడియెట్ పరీక్షల్లో విద్యార్థి 50 శాతానికి తగ్గకుండా మార్కులు సాధించి ఉండాలి.
డిగ్రీ విద్యార్థులు కూడా పరీక్షల్లో 50 శాతానికి తగ్గకుండా మార్కులు సాధించి ఉండాలి.
50శాతం కంటే తక్కువ మార్కులు ఉంటే?
అలాంటి విద్యార్థులు ఈ పథకం కింద లబ్ధి పొందడానికి అర్హులు కారు.
ఎన్ని పర్యాయాలు కోచింగ్ తీసుకోవచ్చు?
కేవలం రెండు పర్యాయాలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇలా పోటీ పరీక్షలకు శిక్షణ పొందడానికి ఉపకార వేతనాలు ఇస్తుంది. అంతకు మించి ఈ పథకం పొందడానికి వీలుండదు.
ఎంతమంది విద్యార్థులను ఎంపిక చేస్తారు?
ఏటా 3500 మంది విద్యార్థులను ఈ పథకం కింద ఎంపిక చేస్తారు.
ఇందులో ఎస్సీలు 70శాతం, ఓబీసీ విద్యార్థులకు 30 శాతం కేటాయిస్తారు.
ఒక వేళ ఇంతకంటే తక్కువ శాతంలో ఆయా కేటగిరీల నుంచీ విద్యార్థులు ఉంటే అప్పుడు నిబంధనలను కొంత సడలిస్తారు
పోటీ పరీక్షలకు విద్యార్థులు ఏ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాలి?
విద్యార్థులు తమకు ఇష్టమొచ్చిన ఇన్‌స్టిట్యూట్‌లో చేరొచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం తొలగించిన కొన్ని సంస్థలున్నాయి. వాటిలో మాత్రం చేరకూడదు.

ఫీజు ఎలా చెల్లిస్తారు?
నేరుగా లబ్ధిదారుడి ఖాతాకే చెల్లిస్తారు.
ఎంత చెల్లిస్తారు?
ఆయా కోర్సుకు కోచింగ్ సెంటర్ ఎంత ఫీజు నిర్ణయించిందో అంత ఫీజూ పూర్తీగా చెల్లిస్తారు.
అయితే గరిష్ఠంగా మాత్రం ఒక్కో కోర్సుకు ఇంత ఫీజు అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి ఉంటుంది. ఆ ఫీజు పరిమితికి మించి చెల్లించరు.
ఒకవేళ అంతకు మించి చెల్లించాల్సి వచ్చినా ఆ మిగిలిన అదనపు ఫీజును విద్యార్థి సొంతంగా భరించాల్సి ఉంటుంది.
ఫీజు ఎప్పుడు చెల్లిస్తారు?
విద్యార్థి ఆ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌కు ఫీజు చెల్లించిన రసీదును ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన రెండు వారాల్లోపు ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది.
ప్రతి నెలా ఉపకార వేతనం చెల్లిస్తారా?
పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకునే విద్యార్థికి కేవలం ఫీజు చెల్లించడమే కాకుండా ఆ విద్యార్థికి ఆ పోటీ పరీక్ష రాసే వరకు ప్రతి నెలా రూ.4000లు ఉపకార వేతనం(స్కాలర్‌షిప్ ) కూడా చెల్లిస్తారు.
ఉపకార వేతనం ఎందుకు ఇస్తారు?
కోచింగ్ సెంటర్ ఫీజు చెల్లించడంతో పాటు విద్యార్థికి అదనంగా ఉపకారవేతనం ఎందుకు చెల్లిస్తారంటే విద్యార్థులకు ఆ పోటీ పరీక్షకు సన్నద్ధం కావడానికి అవసరమైన పుస్తకాలు తదితర సామగ్రి కొనుగోలు చేసుకోవాలనే ఉద్దేశంతో ఇస్తారు.
హాల్ టికెట్ పొందుపరచాలా?
కోచింగ్ పూర్తయిన తరువాత ఈ ఉపకారవేతనాన్ని ఒకేసారి విద్యార్థి ఖాతాలో జమ చేస్తారు.
కోచింగ్ పూర్తయినట్లు, తాను రాయబోయే పోటీ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్‌ను విద్యార్థి ఆన్‌లైన్‌లో అప్‌లోడు చేయాలి.

ఫొటో సోర్స్, Getty Images
పోటీ పరీక్ష పూర్తయ్యాక ఉపకార వేతనం ఇస్తారా?
ఇవ్వరు. పోటీ పరీక్ష నిర్వహణ ఏదైనా కారణాల వల్ల ఏడాదికి మించి సమయం తీసుకుంటే ఆ విషయాన్ని ముందుగానే విద్యార్థి తెలియజేయాలి. లేకపోతే కేంద్ర ప్రభుత్వం విధించిన నిర్ణీత గడువు తరువాత ఉపకార వేతనం ఆపేస్తారు.
నోటిఫికేషన్ ఎప్పుడు జారీ చేస్తారు?
ఈ పథకం కింద విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి నోటిఫికేషన్ మే నెలలో జారీ చేస్తారు
ప్రతి సంవత్సరం మే 1వ తేదీ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియకు అనుమతిస్తారు
మే నెల 31వ తేదీ లోపు విద్యార్థులు దరఖాస్తు పక్రియను పుర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
మే 31వ తేదీ తరువాత ఈ వెబ్‌సైటు దానంతట అదే ఆగిపోతుంది. తరువాత దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నించినా వీలు కాదు.
దరఖాస్తు ఎలా చేసుకోవాలి?
దరఖాస్తు, ఎంపిక ప్రక్రియ పూర్తీగా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. ఎంపిక కూడా పూర్తీగా మెరిట్ ఆధారంగానే నిర్వహిస్తారు. అభ్యర్థుల జాబితా కూడా ఆన్‌లైన్‌లో ప్రదర్శిస్తారు.
మొదటగా విద్యార్థులు https://coaching.dosje.gov.in/(S(4ejcxslbhjkareuhewjy3h0k))/Home.aspx లింక్‌ను ఓపెన్ చేసి, రిజిస్టర్ చేసుకుని లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవాలి.
అందులో విధి విధానాలను జాగ్రత్తగా ఒకసారి చదువుకోవాలి.
అందులో అడిగిన పూర్తి వివరాలను పొందుపరచాలి.
మీ పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడీ తదితరాలతో ఆన్‌లైన్ దరఖాస్తును పూర్తీగా నింపాలి.
ప్రభుత్వం అడిగిన ధ్రువీకరణ పత్రాలన్నీ ఆన్‌లైన్‌లోనే అప్‌లోడ్ చేయాలి.

ఫొటో సోర్స్, Getty Images
ఓబీసీ కులాలంటే ఎవరు?
ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఓబీసీ కులాల కింద కేంద్ర ప్రభుత్వం అనుమతితో కొన్ని కులాలను గుర్తించి ఉంటుంది. అలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన గెజెట్‌లో పేర్కొన్న కులాలు, సామాజిక వర్గాలు మాత్రమే ఇతర వెనుకబడిన కులాల కిందకు వస్తాయి.
వీటిని కూడా ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఓబీసీ కేటగిరి కింది వరకు సామాజిక వర్గాలు ఏవో తెలుసుకోవాలంటే ఈ కింది వెబ్‌సైటు లింక్‌ను ఓపెన్ చేయండి.
http://www.ncbc.nic.in/user_panel/GazetteResolution.aspx?Value=mPICjsL1aLvYBtdZSrP4uO%2bploAhiJHMALWmHIwbzS8Il37YLL3Fb0FHfWDHzP7c
తెలంగాణకు సంబంధించి ఓబీసీ కేటగిరి సామాజిక వర్గాలు ఏవో తెలుసుకోవాలంటే ఈ కింది వెబ్‌సైటు లింక్‌ను ఓపెన్ చేయండి.
http://www.ncbc.nic.in/user_panel/GazetteResolution.aspx?Value=mPICjsL1aLvYBtdZSrP4uO%2bploAhiJHMALWmHIwbzS8Il37YLL3Fb0FHfWDHzP7c
తప్పుడు వివరాలు పొందుపరిస్తే?
తీవ్రమైన నేరమవుతుంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. ఎలాంటి తప్పుడు సమాచారం లేదా తప్పుడు ధ్రువీకరణ పత్రాలను పొందుపరిచినా, అలా చేసినట్లు గుర్తించినా అలాంటి విద్యార్థిపైన తీవ్రమైన చర్యలు తీసుకుంటారు.
విద్యార్థికి చెల్లించిన సొమ్మును 15శాతం వడ్డీతో కలిపి వసూలు చేస్తారు.
అలాగే సదరు విద్యార్థిపై క్రిమినల్ కేసు పెట్టి చర్యలు తీసుకుంటారు.
భవిష్యత్తులో ఆ విద్యార్థి కేంద్ర ప్రభుత్వ పథకాల్లో దేని నుంచీ కూడా లబ్ధి పొందకుండా బ్లాక్ లిస్టులో ఆ విద్యార్థి పేరు చేర్చుతుంది.
ఈ పథకం గురించి ఏవైనా అభ్యంతరాలున్నా వివరాలు కావాలన్నా సంప్రదించాల్సిన చిరునామా
Free Coaching Scheme for SC and OBC Students
Department of Social Justice and Empowerment
Shastri Bhavan
Dr. Rajendraprasad Road
New Delhi – 110001
Phone: 011-23382391
Email: [email protected]
సాంకేతికపరమైన సందేహాలు తీర్చుకోవడానికి సంప్రదించాల్సిన చిరునామా
Free Coaching Scheme for SC and OBC Students
Department of Social Justice and Empowerment
Shastri Bhavan
Dr. Rajendraprasad Road
New Delhi – 110001
Phone: 011-23073443
ఇవి కూడా చదవండి:
- వీరసింహారెడ్డి: అమెరికా థియేటర్లను హడలగొడుతున్న తెలుగు సినిమా ‘సంస్కృతి’
- ఆస్కార్-ఆర్ఆర్ఆర్: ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల ‘నాటు నాటు’ పాట ఎలా పుట్టింది?
- గంగా విలాస్ క్రూయిజ్: డిజైన్ చేసింది తెలుగు మహిళ.. మోదీ ప్రారంభించిన ఈ షిప్ ప్రత్యేకతలేమిటి? విమర్శలు ఎందుకు?
- దేవికా రాణి: బాలీవుడ్లో చరిత్ర సృష్టించిన ఈ ‘ముద్దు సీన్’ చుట్టూ అల్లుకున్న కథలేంటి?
- క్రైస్తవ మిషనరీలు మత మార్పిడుల కోసం బుద్ధుడి జన్మస్థలాన్ని టార్గెట్ చేశాయా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















