తెలంగాణ: ఇంటర్ విద్యార్థులకు హెచ్‌సీఎల్‌లో సాఫ్ట్‌వేర్ జాబ్... ఎంపిక ఎలా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణలో గవర్నమెంటు కాలేజీల్లో చదివే వారికి ఇంటర్‌తోనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం రాబోతోంది. అవును. ఆ మేరకు తెలంగాణ ప్రభుత్వం ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ హెచ్‌సీఎల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
అయితే, నెలకు పాతిక వేలకు మించని జీతంతో వచ్చే సాఫ్ట్‌వేర్ ఉద్యోగంతో లాభం ఎంత? భవిష్యత్తు ఏం ఉంటుంది?
డిసెంబరు చివర్లో తెలంగాణ ప్రభుత్వ విద్యా శాఖ, ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ హెచ్‌సీఎల్‌తో ఒక ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం ప్రకారం ఇంటర్‌లో లెక్కలు చదివే విద్యార్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
ఐదూ పదీ కాదు. ఏకంగా ఏడాదికి 20 వేల మందిని అలా ఎంపిక చేయడానికి హెచ్‌సీఎల్ ముందుకు వచ్చింది.
దీని అమలు కోసం మంత్రి సబిత, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్మీడియట్ బోర్డు ఇంచార్జి కార్యదర్శి నవీన్ మిట్టల్‌తో సమీక్ష నిర్వహించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎంపిక ఇలా
గవర్నమెంటు ఇంటర్ కాలేజీల్లో మాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివే వారు దీనికి అర్హులు. ఇంటర్ రెండో ఏడాది చదువుతున్న విద్యార్థులకు వాళ్ల సెకండియర్‌లో ఉండగా, ఏటా ఫిబ్రవరిలో ఒక ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు.
ఆ పరీక్షలో కనీసం కనీసం 60 శాతం మార్కులు వచ్చిన వాళ్లను ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూ కూడా ఆన్‌లైన్లోనే పూర్తి చేసి, వారిలో మంచి ప్రతిభ కనపరిచిన వారిని ఎంపిక చేస్తారు. హెచ్‌సీఎల్ కెరీర్ యాప్టిట్యూడ్ టెస్ట్ పేరుతో పిలిచే ఈ పరీక్షలో లెక్కలతో పాటూ, లాజికల్ రీజనింగ్, ఇంగ్లీషు కూడా ఉంటాయి.
ఇలా ఎంపికైన విద్యార్థులకు ఆన్‌లైన్‌లోనే ఆరు నెలల పాటు శిక్షణ ఇస్తారు. ఆ శిక్షణ పూర్తి అయితే, అప్పుడు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కార్యాలయంలో ఆరు నెలల పాటూ ఇంటర్న్‌షిప్ చేయిస్తారు. ఈ ఇంటర్న్‌షిప్ సమయంలో ప్రతీ నెలా 10 వేల రూపాయలు స్టైఫండ్ ఉంటుంది.
ఇంటర్న్‌షిప్ తరువాత ఉద్యోగం ఇస్తారు. ఏడాదికి 2 లక్షల 50 వేలు జీతం. అంటే నెలకు సుమారు 20 వేల రూపాయలు. అక్కడ ఉద్యోగం చేస్తూనే, ఎంపిక చేసిన యూనివర్సిటీలు, అంటే బిట్స్, శాస్త్ర, అమిటి వంటి యూనివర్సిటీల్లో ఇంటిగ్రేటెడ్ డిగ్రీ పూర్తి చేసేందుకు అవకాశం ఇస్తుంది కంపెనీ.

ఫొటో సోర్స్, Getty Images
వేతనం పెరుగుతుందా?
అనుభవం పెరుగుతున్న కొద్దీ వేతనాన్ని పెంచుతారని తెలంగాణ విద్యా మంత్రిత్వ శాఖ కార్యాలయం ప్రకటించింది.
గతంలో హెచ్‌సీఎల్ ఆంధ్రలో కూడా ఈ తరహా కార్యక్రమం ప్రతిపాదించింది. టెక్‌బీ పేరుతో ఉంటే ఈ పథకం కూడా ఇలాంటిదే.
జూన్‌లో ప్రారంభం అయిన ఈ పథకం నుంచి ఆంధ్రలో 1500 మంది వరకూ ఎంపిక చేస్తామని హెచ్‌సీఎల్ వైస్ ప్రెసిడెంట్ సుబ్బరామన్ బాలసుమ్రమణ్యన్ అప్పట్లో మీడియాకు చెప్పారు. దాదాపు ప్రస్తుతం తెలంగాణలో హెచ్‌సీఎల్ చెప్పే తరహాలోనే ఆంధ్రలో ప్రకటించిన పథకం కూడా ఉంది.
ప్రస్తుతం ఆంధ్ర, తెలంగాణలతో పాటూ దక్షిణ భారతదేశంలో ఇంజినీరింగ్ కాలేజీలు బాగా పెరిగి, పీక్ దశకు చేరుకున్నాయి. వాటిలో ఏ బ్రాంచిలో ఇంజినీరింగ్ చదివిన వారికి అయినా, కేవలం ఐటీ పరిశ్రమ మాత్రమే భారీ ఎత్తున ఉద్యోగాలు ఇవ్వగలుగుతోంది. దీంతో మెజార్టీ విద్యార్థులు ఏదో ఒక బ్రాంచి మమ అంటూ చదివేసి, చివర్లో కంప్యూటర్ కోర్సులు నేర్చుకుని సాఫ్ట్‌వేరు వైపే చూస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో తాజా పథకం అసలు ఇంజినీరింగ్ చదవాలనుకునే విద్యార్థులనే మరోసారి ఆలోచింపచేసేలా ఉంది. అయితే ఇలాంటి పథకాల వల్ల దీర్ఘకాలంలో విద్యార్థులకు ఎంత వరకూ లాభం అనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
‘‘ఇది ఒక రకంగా ఛీప్ లేబర్ అవుతుంది. వారికి కొద్దిమొత్తం జీతాలు ఇస్తారు. మామూలుగా ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారు సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో 20 వేల జీతానికి దొరకరు. వాళ్లకు 30-35 కనీసం ప్రారంభంలో ఇవ్వాలి. అదే సమయంలో విద్యార్థులకు ముఖ్యంగా పేద కుటుంబాల నుంచి వచ్చిన వారికి, ఇంజినీరింగ్ నాలుగేళ్లూ ఉద్యోగం కోసం ఆగలేని వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. దీంతో చూడ్డానికి మనకు ఇది విన్ విన్ సిచ్యుయేషన్ లాగా కనిపిస్తుంది. అంటే కంపెనీకి, విద్యార్థికీ ఇద్దరికీ లాభంలా కనిపిస్తుంది. అయితే ఇదంతా చెప్పినంత సులువుగా జరగదు’’ అని బీబీసీతో అన్నారు విద్యారంగ నిపుణులు, ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్ రమేశ్ పట్నాయక్.
ఇంటర్ తరువాత చదువు కొనసాగించలేక మానేసి ఏదో వృత్తి చూసుకోవాలి అనుకునే వారికి ఇది లాభంగానే కనిపిస్తుంది కానీ, ఉద్యోగంతో పాటూ చదువు ఎంత వరకూ సాధ్యం అనేది ప్రశ్నార్థకం అంటున్నారు నిపుణులు.
చదివే పరిస్థితి ఉంటుందా?
‘‘ఉద్యోగం ఓకే. కానీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ, పగలంతా ఉద్యోగం కష్టపడి చేసి, సాయంత్రానికి పుస్తకం తీసి చదివే పరిస్థితి వారికి ఉంటుందా? అనేది పెద్ద ప్రశ్న. వారికి ఉండే పని ఒత్తిడిని తట్టుకుంటూ మళ్లీ కోర్సులు చదువుకోవడం అనేది అందరికీ సాధ్యమయ్యే పనికాదు. కొద్ది శాతం పిల్లలు అలాంటి అవకాశాలు కూడా అందిపుచ్చుకోవచ్చు కానీ, అది ఆచరణలో చాలా కష్టమైంది. వాళ్లు చదువుకుంటున్నారు కదా అని, వర్క్ లోడ్ తక్కువ ఉండదు కదా. చివరగా దీనివల్ల జరిగేది ఒకటే. 17-18 ఏళ్ల వయసులో ఉద్యోగంలో చేరి కష్టించి పని చేసి, ఎదురు ప్రశ్నించకుండా చెప్పిన పనిచేసే విధేయులైన ఉద్యోగులు కంపెనీలకు దొరకుతారు. ఇంజినీరింగ్ వంటివి చేసి, ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారి అవకాశాలు ఆ మేరకు తగ్గుతాయి. ఆ రకంగా చూస్తే ఆ కంపెనీ ఎవరికీ ఫేవర్ చేయడం లేదు’’అని అన్నారు రమేశ్.
నిజానికి గతంలో చాలా బ్యాంకింగ్ కంపెనీలు ఇలాంటి ఆఫర్‌లు ఇచ్చాయి. కొన్ని ప్రైవేటు యూనివర్సిటీలతో కలసి ఆరు నెలలు, ఏడాది కోర్సులు నిర్వహించి, ఆ తరువాత వివిధ ప్రైవేటు బ్యాంకుల్లో ఉద్యోగాలు ఇచ్చి, వారి వేతనంలో నుంచి లోన్ మొత్తాన్ని వసూలు చేసేవారు. కానీ వారంతా డిగ్రీ తరువాత ఆయా కోర్సులకు వెళ్లారు కాబట్టి సమస్య రాలేదు.
కానీ, ఇంటర్ తరువాత నేడు ఉన్నత విద్య లేకుండా ఉద్యోగానికి వెళ్లిన వారు, తిరిగి డిగ్రీ పూర్తి చేయాల్సిన అవసరం ఎంత? చేయాలనుకుంటే వెసులుబాటు ఎంత అనేది ఆ యువ ఉద్యోగుల భవిష్యత్తును నిర్ణయిస్తుంది.
ఇవి కూడా చదవండి:
- దిల్లీ: కారుతో 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్ళి చంపేసింది ఈ అమ్మాయినే
- గుండెపోటు: 40వేల అడుగుల ఎత్తులో విమానప్రయాణికునికి హార్ట్స్ట్రోక్... 5 గంటల పాటు వైద్యం చేసి బతికించిన డాక్టర్
- స్కూలుకు పంపించడానికి ఒక బిడ్డనే ఎంచుకోవాలి... ఓ అయిదుగురు పిల్లల తల్లి కథ
- ఆంధ్రప్రదేశ్: ఫ్యామిలీ డాక్టర్ విధానం ఎలా అమలవుతోంది, పూర్తిస్థాయిలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?
- మోదీ బీజేపీ మీద పోరాటంలో హిందువులు, ముస్లింల మధ్య నలిగిపోతున్న కాంగ్రెస్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















