మోదీ బీజేపీ మీద పోరాటంలో హిందువులు, ముస్లింల మధ్య నలిగిపోతున్న కాంగ్రెస్

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, ANI

    • రచయిత, ఫైసల్ మహమ్మద్ అలీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

నరేంద్రమోదీ ప్రభుత్వం మీద, అధికార బీజేపీ మీద పోరాటానికి రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర' చేస్తున్నారు. అయితే ఈ పోరాటంలో హిందువులను కూడా జోడించాలని కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా గట్టి స్వరాలు వినిపిస్తున్నాయి.

కేవలం మైనారిటీల బలంతోనే ఈ యుద్ధం గెలవలేమని, హిందువులను కూడా ఈ పోరాటంలో కలుపుకుని పోవాల్సిన అవసరముందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోనీ గతంలో అన్నారు.

ఆంటోనీ కేరళ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు.

ఆయన గత బుధవారం తిరువనంతపురంలో మాట్లాడుతూ, ‘‘ఆలయాలకు వెళ్లేవారిని.. నుదుటి మీద బొట్టు, చందనం పెట్టుకునే వారిని మృదు హిందుత్వవాదులు అని అంటే, అది నరేంద్ర మోదీ మళ్లీ గెలవటానికే దోహదపడుతుంది. మోదీపై పోరాటంలో హిందువులను మనతో పాటు కలుపుకుపోవాల్సిన అవసరముంది’’ అని వ్యాఖ్యానించారు.

అంతకుముందు డిసెంబర్ 28న, కాంగ్రెస్ 138వ ఆవిర్భావ దినోత్సవం రోజున, పార్టీ కార్యకర్తలు ఇలాంటి 'అనుబంధం' ఏర్పరచుకోవటానికి ఎలాంటి కిటుకులు చెప్పారనేది తెలియదు.

కాంగ్రెస్ పార్టీ

ఫొటో సోర్స్, ANI

రాజకీయాల్లో మతంపై కాంగ్రెస్ విధానం

ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని దేశంలోని అన్ని మతాలు, కులాలు, తరగతులకు వేదికగా నిలిచిన రాజకీయ పార్టీగా పరిగణించేవారు. అలాంటి పార్టీకి అత్యధికులు దూరం కావడం ఆ పార్టీకి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన ఆలోచనను కానీ వ్యూహాన్ని కానీ రూపొందించ లేకపోయిందని నిపుణులు భావిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీని 1885 డిసెంబరు 28న అప్పటి బొంబాయి (ప్రస్తుతం ముంబై)లో స్థాపించారు. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను నిర్వహించారు.

రాజకీయాలలో మతం విషయంలోఇటీవలి సంవత్సరాలలో కాంగ్రెస్ అనిశ్చిత విధానాల ఫలితంగా పార్టీ లోపలి నుంచి ఇలాంటి ప్రకటనలు వస్తున్నాయని రచయిత, రాజకీయ విశ్లేషకుడు రషీద్ కిద్వాయ్ అభిప్రాయపడ్డారు.

మరోవైపు, మైనారిటీలను సంతృప్తపరచటానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని చాలా బలమైన విమర్శ ఉందని, ఆ దృక్కోణాన్ని తొలగించే ప్రయత్నంలో భాగంగా ఇటువంటి ప్రకటనలు చేస్తుండవచ్చునని లోక్‌మత్ వార్తాపత్రిక మాజీ ఎడిటర్ శరద్ గుప్తా వ్యాఖ్యానించారు.

భారత్ జోడో యాత్ర

ఫొటో సోర్స్, ANI

ముస్లింలను సంత్తృప్తి పరుస్తుందనే ముద్ర

కాంగ్రెస్ పార్టీ ముస్లింలను సంతృప్తిపరుస్తోందని భారతీయ జనతా పార్టీ, ఇతర హిందూత్వ సంస్థలు నిరంతరం ఆరోపిస్తూనే ఉన్నాయి.

ఎ.కె.ఆంటోని తాజా వ్యాఖ్యల ద్వారా.. ‘హిందువులను కేవలం ఓటు బ్యాంకుగా పరిగణిస్తామని కాంగ్రెస్‌ చెప్పింది’అని బీజేపీ ఒక ప్రకటనలో విమర్శించినట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

అయితే, ఎ.కె.ఆంటోనీ ఆలోచన కొత్తదేమీ కాదని, ఆయన చాలా కాలంగా ఆ వైఖరితోనే ఉన్నారని.. కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన పృథ్వీరాజ్ చౌహాన్ బీబీసీతో మాట్లాడుతూ పేర్కొన్నారు. ఆంటోనీ ప్రకటనను బీజేపీ వక్రీకరించిందని కూడా చౌహాన్ తప్పుపట్టారు.

ఈ విషయమై ఎ.కె.ఆంటోనీ వాదనను తెలుసుకోవటానికి బీబీసీ సంప్రదించింది. ఆయన దీనిపై మాట్లాడటానికి నిరాకరించారు.

ఏకే ఆ:టోని

ఫొటో సోర్స్, ANI

ఎ.కె.ఆంటోనీ ప్రకటన

ఆంటోనీ మాటల ఉద్దేశాన్ని వక్రీకరిస్తున్నారని ఆయనతో సన్నిహిత పరిచయం ఉన్న వి.కె.చెరియన్ అనే కేరళ జర్నలిస్టు కూడా అంటున్నారు.

ఎ.కె.ఆంటోని చేసిన అసలు ప్రకటన ఇలా ఉందని చెరియన్ పేర్కొన్నారు: ‘‘మోదీకి వ్యతిరేకంగా పోరాటంలో మనకు మైనారిటీ, మెజారిటీ మతస్తులు ఇరువురి మద్దతూ అవసరం.

మైనారిటీల లాగానే మెజారిటీ వారికి కూడా ఆలయాన్ని సందర్శించి, బొట్టు పెట్టుకునే హక్కు ఉంది. అటువంటి వారి మీద మృదు హిందుత్వవాదులని ముద్ర వేయటం.. మోదీ మళ్లీ అధికారంలోకి తిరిగి రావటానికి తోడ్పడుతుంది.

మోదీకి వ్యతిరేకంగా (రాజకీయ) పోరాటంలో హిందువులను మనతో పాటు కలుపుకుపోవాలి. కాంగ్రెస్ ప్రతి ఒక్కరినీ కలుపుకు పోవటానికి ప్రయత్నిస్తోంది.’’

ఎ.కె.ఆంటోని 1996, 1999, 2004 సంవత్సరాల్లో కూడా ఇలాంటి ప్రకటనలు చేశారు. పార్టీ పరాజయాలకు ఆర్థిక సరళీకరణ వంటి అంశాలతో పాటు ‘కాషాయ ఉగ్రవాదం’, ‘విద్య కాషాయీకరణ’ వంటి పదజాలం కూడా తోడ్పడ్డాయని చెప్పారు.

చింతన్ శిబిర్

ఫొటో సోర్స్, ANI

ఉదయపూర్ చింతన్ శిబిర్

అయితే, గత కొన్ని రోజులుగా ఎ.కె.ఆంటోనీ ప్రకటన మీద చర్చ కొనసాగుతోంది.

‘ముస్లింవాద’ ముద్రను తొలగించుకోవాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీలో ఎంత లోతుగా ఉందనేది.. పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ 2018లో కార్యకర్తలనుద్దేశించి చేసిన ప్రసంగాన్ని చూస్తే అర్థమవుతుంది. ‘‘మనది ముస్లింల పార్టీ అని ప్రజలను నమ్మించటంలో బీజేపీ సఫలమయింది’’ అని ఆమె పేర్కొన్నారు.

మేలో ఉదయ్‌పూర్‌లో జరిగిన కాంగ్రెస్ చింతన్ శిబిర్‌లో కూడా హిందుత్వ అంశంపై పార్టీలో వాడివేడిగా చర్చ జరిగింది.

ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ బఘేల్‌, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్‌ నేత కమల్‌నాథ్‌లు మాట్లాడుతూ.. హిందూ పండుగలు, కార్యక్రమాల నుంచి కాంగ్రెస్ బలవంతంగా దూరంగా ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు.

దక్షిణాదికి చెందిన కొందరు నేతలు, పృథ్వీరాజ్ చౌహాన్ వంటి వారు.. సైద్ధాంతిక విషయాలపై కాంగ్రెస్ వైఖరి స్పష్టంగా ఉండాలని అన్నారు.

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, ANI

కాంగ్రెస్ 'అవుట్‌రీచ్ ప్రోగ్రామ్'

ఉదయ్‌పూర్ చింతన్ శిబిర్‌లో మరొక అంశం కూడా ప్రధానంగా ముందుకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రజా సంబంధాల ప్రచారం. 'అవుట్‌రీచ్ ప్రోగ్రామ్' అని పిలుస్తున్న ఈ కార్యక్రమం రూపురేఖల గురించి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల సమక్షంలో చర్చించినట్లు మీడియా కథనాలు చెప్తున్నాయి.

ఇందులో భాగంగా పలు రాష్ట్రాల్లో స్థానిక నేతలు పెరుగు కుండ పోటీలు, గణేష్ పూజ వంటి కార్యక్రమాలను ప్రారంభించారు.

అయితే, ఈ కార్యక్రమం వేరే పరిణామాలకు కూడా దారితీసింది. ఉదాహరణకు, మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో బక్రీద్ సందర్భంగా కొంతమంది ముస్లిం కార్యకర్తలు పార్టీ ప్రధాన కార్యాలయానికి బలిచ్చే మేకలను తీసుకువచ్చారు. పార్టీలో హిందూ పండుగలు జరుపుకోగలిగితే, ముస్లిం పండుగలు ఎందుకు చేయకూడదని వారు ప్రశ్నించారు.

పార్టీ నాయకులు పోలీసులను పిలిపించి వారిని అక్కడి నుండి బలవంతంగా పంపించాల్సి వచ్చింది.

ఛత్తీస్‌గఢ్‌లోని భూపేష్ బఘేల్ ప్రభుత్వం నుండి మధ్యప్రదేశ్‌లో గత కమల్‌నాథ్ ప్రభుత్వం వరకూ.. రామ్ గమన్ పథం నిర్మాణం, గోమూత్రం, పేడ కొనుగోలు, గోశాలలు, ఆధ్యాత్మిక విభాగం ఏర్పాటు, సంస్కృత అధ్యయనానికి ప్రాధాన్యత ఇవ్వటం వంటి చర్యలు.. హిందువులను పార్టీ వైపు సమీకరించటానికి చేసిన ప్రయత్నాలుగా భావిస్తున్నారు.

ముస్లింలకు, గోవధకు, శబరిమలకు దూరం

‘‘బీజేపీ మమ్మల్ని ముస్లిం పార్టీ అని పిలిచేది. మా ప్రత్యర్థులు వేసిన ముద్రను తొలగించేందుకు ఉద్దేశపూర్వకంగానే మేం ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని కూడా కాంగ్రెస్ మధ్యప్రదేశ్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడు చెప్పారు.

భూపేష్ బఘేల్ బహిరంగంగా హిందూ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. హిందూ కార్యక్రమాలకు కాంగ్రెస్ బలవంతంగా దూరంగా ఉండకూడదని, ఆ ఖాళీని పూరించడానికి బీజేపీకి అవకాశం ఇవ్వకూడదని ఆయన గతంలో బీబీసీతో మాట్లాడుతూ పేర్కొన్నారు.

బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌లు రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని ఉపయోగించుకుంటున్నాయని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. అయితే ఆయన స్వయంగా ఎప్పటికప్పుడు ఆలయాలు, మఠాలను సందర్శిస్తున్నారు. తనను తాను ‘జంధ్యం ధరించిన వ్యక్తి’ (బ్రాహ్మణుడి)గా చెప్పుకోవటానికి ఆయన ఏ అవకాశాన్నీ వదులుకోవటం లేదు.

‘‘రాజకీయాల్లో మతం అనే అంశం కాంగ్రెస్‌ శరీరంలో ఒక ముల్లు వంటిది. పార్టీలో అంతర్గతంగా భావజాలంపై ఎలాంటి స్పష్టత లేదు. ఈ విషయాన్ని ముందుకు తేవాలని ఆంటోనీ భావిస్తున్నారు. పిల్లి మెడలో గంట ఎలా కట్టాలనేది కాంగ్రెస్‌కు తెలియటం లేదు’’ అని రషీద్ కిద్వాయ్ పేర్కొన్నారు.

‘‘వామపక్ష రాజకీయ పార్టీలు, బీజేపీ వంటి మితవాద పార్టీలు, సోషలిస్టు భావజాల పార్టీలు, డీఎంకే వంటి పార్టీలకు కూడా ఆర్థికవ్యస్థ, మతం, కులతత్వం వంటి అంశాలపై స్పష్టమైన వైఖరి ఉంది.

కానీ ఈ విషయాలపై కాంగ్రెస్‌లో నేడు సందిగ్ధత నెలకొని ఉంది. ఈ అంశాలపై పార్టీలో రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. వీటిపై ఒక వైఖరి తీసుకోవాలనే విషయాన్ని తరచుగా ఎవరో ఒకరు లేవనెత్తుతూనే ఉంటారు’’ అని ఆయన చెప్పారు.

పార్టీ ద్వంద్వ వైఖరి

ఉత్తరప్రదేశ్‌లోని దాద్రీలో గోమాంసం పేరుతో ఒకరిని కొట్టిచంపినపుడు.. గోవధ నిషేధం గురించి బీజేపీ మాట్లాడింది. అదే సమయంలో.. కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల కిందటే 1955లో ఈ విషయంలో ఒక వైఖరి తీసుకుందని బీజేపీ గుర్తు పెట్టుకోవాలంటూ పలువురు కాంగ్రెస్ నేతలు ప్రకటనలు చేశారు. 1955లో కొన్ని రాష్ట్రాల్లో గోవధను నిషేధించారు.

గోవధపై జాతీయ చట్టాన్ని తీసుకువచ్చే అంశంపై చర్చకు తమ పార్టీ సిద్ధంగా ఉందని, ఈ అంశంపై నాటి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతోను, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతోను చర్చిస్తామని కూడా కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అప్పుడు చెప్పారు.

శబరిమలలో మహిళల ప్రవేశం విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని అవలంబించింది. అన్ని వయసుల హిందూ మహిళలకు ఆలయంలోకి ప్రవేశం కల్పించిన కోర్టు నిర్ణయాన్ని మొదట ఆ పార్టీ కొనియాడింది. కానీ, ఆ తర్వాత దానికి భిన్నమైన వైఖరిని తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం అభిప్రాయం.. కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ అభిప్రాయానికి భిన్నంగా ఉంది.

అయితే కాంగ్రెస్ అగ్ర నేతల సూచనలు మేరకే ఆ పార్టీ నేతలు హిందూ పండుగలు జరుపుకుంటున్నారని అంటే తాను అంగీకరించబోనని శరద్ గుప్తా చెప్పారు.

హిందూ ఓట్లు అవసరం

అన్ని మతాలను గౌరవించాలని కాంగ్రెస్ విశ్వసిస్తుందని, నేటి పరిస్థితుల్లో లౌకికవాదం వంటి విషయాలను స్పష్టంగా విశదీకరించడం కష్టతరంగా మారిందని మాజీ కేంద్ర మంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ పేర్కొన్నారు.

‘‘మతపరమైన విషయాలలో అన్ని మతాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ సమాన దూరం పాటించాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం గురించి గరిష్ట సమాచారాన్ని పార్టీ కార్యకర్తలకు అందించాలి. తద్వారా వారు ఈ విషయాలను ప్రజలకు తెలియజేయగలరు’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ గత కొద్ది రోజులుగా పార్టీ కార్యకర్తల కోసం రాజ్యాంగ శిబిరాన్ని నిర్వహిస్తోంది. డిసెంబరు 8న నవీ ముంబయిలో కూడా ఇదే తరహా శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

హిందువులందరూ తన వెంటే ఉన్నారని బీజేపీ నిరంతరం ప్రచారం చేస్తుందని.. కానీ ఆ పార్టీకి 2014లో 31 శాతం ఓట్లు రాగా, గత సార్వత్రిక ఎన్నికల్లో (2019 ఎన్నికల్లో) అవి 37 శాతానికి పెరిగాయని.. అంటే ఇంకా హిందు ఓట్లలో చాలా పెద్ద బీజేపీ వైపు వెళ్లలేదని.. కాంగ్రెస్‌లో అంతర్గతంగా ఒక ఆలోచన ఉంది.

లౌకికవాదంపై సంక్షోభం

అయితే, ‘‘బచ్చా-బచ్చా రామ్ కా, మందిర్ కే కామ్ కా’ వంటి నినాదాలు సర్వత్రా వినిపించిన తొంభైల దశాబ్దంలో కూడా.. సాధారణ ప్రజా మనోస్థితిలో గత ఎనిమిది సంవత్సరాల్లో ఉన్నంత తీవ్ర ముస్లిం వ్యతిరేకత లేదు’’ అని శరద్ గుప్తా పేర్కొన్నారు.

ఆయన బీజేపీలోని ఒక ముస్లిం నాయుకుడితో తన సంభాషణను ఉటంకించారు. పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఏం చేస్తారని తాను ఆ నేతను అడిగినపుడు.. ఇతర పార్టీలు కూడా ముస్లింలకు టికెట్ ఇచ్చే అంశంపై ఇలాగే ఆలోచిస్తాయని చెప్పారని గుప్తా తెలిపారు.

అధికార బీజేపీ ఎన్నికల్లో ముస్లింలకు టికెట్లు ఇవ్వదనే అభిప్రాయం సర్వత్రా ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో ముస్లింలకు టికెట్లు ఇచ్చే అంశం ఇంతకుముందు లాగా లేదు.

2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మొత్తం అభ్యర్థుల్లో ముస్లిం అభ్యర్థులకు ఆరు శాతం కంటే తక్కువ టిక్కెట్లే ఇచ్చింది.

హిందూ జాతీయవాదం

లౌకికవాదంపై ఇప్పుడు తలెత్తిన సంక్షోభం అకస్మాత్తుగా పుట్టుకురాలేదని, 1980ల నుంచి కాంగ్రెస్ పార్టీలోనే దీనికి నేపథ్యం తయారైనట్లు కనిపిస్తోందని ఫ్రెంచ్ పరిశోధకుడు క్రిస్టోఫ్ జాఫ్రోల్ ఇటీవల తన కథనంలో రాశారు.

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ అలీఘడ్ ముస్లిం విశ్వవిద్యాలయాన్ని మైనారిటీ సంస్థగా ప్రకటించడం, భింద్రన్‌వాలేను ప్రోత్సహించడం, విశ్వహిందూ పరిషత్ సహాయంతో నిర్మించిన భారత మాత మందిర్ కార్యక్రమంలో పాల్గొనడం గురించి క్రిస్టోఫ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

ఇందిరాగాంధీ హత్య తర్వాత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ.. బాబ్రీ మసీదు తాళాలు తెరవడం, రామమందిరానికి శంకుస్థాపన చేయడం, షాబానో కేసులో వైఖరి మార్చడం, ఆపైన కేంద్రంలో పీవీ నరసింహారావు ప్రభుత్వం ఉండగా బాబ్రీ మసీదు కూల్చివేత జరగడం వంటి అంశాలను కూడా ఉటంకించారు.

ఈ సంఘటనలు, కాంగ్రెస్‌ను ‘నకిలీ లౌకికవాదులు’ అని పిలవడానికి హిందూవాదులకు అవకాశం ఇచ్చాయని జాఫ్రోల్ చెప్పారు. ‘‘ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు ఈ నిర్ణయాలతో భారతదేశ లౌకిక సంప్రదాయాన్ని మసకబార్చడం ద్వారా, హిందూ జాతీయవాదానికి తలుపులు తెరిచారు’’ అని ఆయన రాశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)