న్యూయార్క్ మహా నగరం ‘ఖాళీ’ అయిపోతోంది... ఎందుకు?

న్యూయార్క్ నగరం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2020లో మహమ్మారి సమయంలో ఖాళీగా ఉన్న న్యూయార్క్‌లోని ఒక వీధి
    • రచయిత, హెలోయిసా విలేలా
    • హోదా, న్యూయార్క్ నుంచి బీబీసీ న్యూస్

ఒక ఇల్లు, అందులో ఆఫీస్ పెట్టుకోవటానికి వెనుక ఖాళీ జాగా.. ఇది జియోవన్నా అల్మేడా కల. ప్రపంచాన్ని కరోనావైరస్ మహమ్మారి కబళించటానికి ముందు నాటి కల అది.

బ్రెజిల్ లోని బెలో హొరిజోన్టే నుంచి ఆమె 2015లో అమెరికాలోని న్యూయార్క్ నగరానికి వచ్చారు. బ్రూక్లిన్ ప్రాంతంలో నివసించేవారు. కోవిడ్ మహమ్మారి తీవ్రంగా ఉన్న సమయంలో ఆమె ఐసొలేషన్‌లో ఉండాల్సి వచ్చింది.

అంతకుముందు ఆమె ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్లటానికి గంట సేపు పట్టేది. అయితే మహమ్మారి కారణంగా ఇంట్లో ఉండే ఆఫీస్ మీటింగ్‌లలో పాల్గొనటం, ఇంటి నుంచే పని చేయటం వీలవటంతో.. అమెరికాలోని బ్రెజిల్ మహిళల జీవితాలు పూర్తిగా మారిపోయాయి. వాళ్లు ఆఫీస్ పని మీద వెచ్చించే సమయం తగ్గిపోయింది. తమ జీవితం కోసం మరింత ఎక్కువ సమయం లభించింది. కనీసం రెండేళ్ల పాటు వారు ఇలాగే జీవించారు.

ఇప్పుడు ఆమె, ఆమె భర్త న్యూయార్క్ పొరుగు రాష్ట్రమైన న్యూ జెర్సీలో నివసిస్తున్నారు. ఇటీవలే ఒక ఇల్లు కూడా కొనుక్కున్నారు. ఆ ఇంట్లో లాన్ కూడా ఉంది. వారి 11 నెలల కొడుకు త్వరలో ఆ లాన్‌లో పరుగులు తీస్తూ ఆడుకోవచ్చు.

న్యూయార్క్ రాష్ట్రం నుంచి గత రెండేళ్లలో చాలా మంది ఖాళీ చేసి వెళ్లిపోతున్నారనటానికి జియోవన్నా ఒక ఉదాహరణ.

జియోవన్నా అల్మేడా

ఫొటో సోర్స్, HELOISA VILLELA

ఫొటో క్యాప్షన్, జియోవన్నా అల్మేడా బ్రూక్లిన్‌లోని తన అపార్ట్‌మెంట్ అమ్మేసి న్యూ జెర్సీలో ఇల్లు కొనుక్కున్నారు

మహమ్మారి కారణంగా వలసలు...

న్యూయార్క్‌లోని మన్‌హాటన్ దీవిలో నివసించే జనంలో అత్యధికులు ఇతర నగరాలు, రాష్ట్రాల్లో ఇళ్లు, అపార్ట్‌మెంట్ల కోసం వెదుకుతున్నారు. 2020 మార్చి నాటికి అలాంటి వారి సంఖ్య 2,00,000 గా ఉంది.

న్యూయార్క్ రాష్ట్రంలోని క్వీన్స్, బ్రూక్లిన్ కౌంటీల నుంచి కూడా చాలా మంది బయటకు వెళ్లిపోయారు. క్వీన్స్ కౌంటీ నుంచి 51,000 మంది, బ్రూక్లిన్ కౌంటీ నుంచి 88,000 మంది వేరే చోటుకు తరలిపోయారు. బ్రూక్లిన్ నుంచి వెళ్లిన వారిలో జియోవనా కూడా ఉన్నారు.

కొలంబియా యూనివర్సిటీ బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్ స్టిన్ వాన్ నూవెర్‌బర్.. రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ రంగాల్లో పరిశోధనలు చేస్తుంటారు. ఆయన 2003 నుంచి న్యూయార్క్ నగరంలో నివసిస్తున్నారు. ఇప్పుడు ఈ నగరం భవిష్యత్తు గురించి ఆయన ఆందోళన చెందుతున్నారు.

న్యూయార్క్ నగర జనాభా తగ్గిపోవటం, పన్ను ఆదాయం పడిపోవటం, వ్యాపారాలు తరలిపోవటం అనే విషవలయంలో చిక్కుకుంటుందని హెచ్చరిస్తున్నారు. దానిని నివారించటానికి అధికార యంత్రాంగాలు అత్యవసర చర్యలు చేపట్టాలని అంటున్నారు.

‘‘70వ దశకంలో ఇలాగే జరిగింది’’ అని కూడా ఆయన గుర్తుచేస్తున్నారు.

జియోవన్నా అల్మేడా

ఫొటో సోర్స్, HELOISA VILLELA

ఫొటో క్యాప్షన్, జియోవన్నా అల్మేడాకు 11 నెలల కొడుకు ఉన్నాడు

రిమోట్ వర్క్ కొనసాగుతుంది...

పార్టనర్‌షిప్ ఫర్ న్యూయార్క్ సిటీ అనే సంస్థ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం.. వారంలో కొన్ని రోజుల పాటైనా రిమోట్ వర్క్ విధానం – అంటే ఆఫీసుకు వెళ్లకుండా పనిచేసే విధానం ఇక ముందు కూడా కొనసాగుతుంది.

2021 అక్టోబర్ నాటికి నగరంలోని ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగుల్లో 54 శాతం మంది ఇళ్ల నుంచే పని చేస్తున్నారు. ఆఫీసులు, ఇతర పని ప్రదేశాల్లో పనిచేయటం కోసం ప్రతి రోజూ ప్రయాణిస్తున్న వారి సంఖ్య కేవలం 8 శాతంగానే ఉంది.

2022 ఏప్రిల్ నాటికి రిమోట్‌గా పనిచేస్తున్న వారి సంఖ్య 28 శాతానికి తగ్గింది. కానీ హైబ్రీడ్ విధానం – అంటే రిమోట్‌గా పనిచేయటం, ఆఫీస్ నుంచి పనిచేయటం రెండూ కలిసి ఉండే విధానం ఊపందుకుంది. దీనివల్ల ప్రతి రోజూ ఆఫీసుకు వెళుతున్న వారి సంఖ్య 8 శాతం గానే ఉండిపోయింది.

గత సెప్టెంబర్‌లో నిర్వహించిన సర్వే ప్రకారం.. 16 శాతం మంది వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగిస్తుండగా, కేవలం 9 శాతం మంది మాత్రమే ప్రతి రోజూ ఆఫీసుకు ప్రయాణిస్తున్నారు.

ఫలితంగా చాలా ఆఫీసులు ఖాళీగా ఉంటున్నాయి.

ఈ పరిస్థితుల్లో వ్యాపార సంస్థలు, నగర నివాసుల నుంచి పన్ను ఎగవేత సమస్య మీద అధ్యయనానికి నగర పాలక మండలి, రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిషన్‌ను నియమించాయి. ఆ కమిషన్ ఆరు నెలల పాటు అధ్యయనం చేసి తాజాగా నివేదిక ఇచ్చింది.

న్యూయార్క్ నగరం

ఫొటో సోర్స్, HELOISA VILLELA

ఫొటో క్యాప్షన్, న్యూయార్క్ నగరంలోని వాణిజ్య ప్రాంగణాలను నివాస ప్రాంతాలుగా మార్చాలని నగర పాలక మండలి భావిస్తోంది

పరిస్థితిని మార్చటం ఎలా?

న్యూయార్క్ నగరంలోని ఫిఫ్త్ అవెన్యూ, సిక్స్త్ అవెన్యూల మధ్య ఉన్న 57 స్ట్రీట్‌లో అలా నడిచి చూస్తే.. ఏం జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు.

నగరంలో అత్యంత ఖరీదైన వ్యాపార సంస్థలు కొన్ని ఈ వీధిలో ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ అనేక షాపులు మూతపడి ఉంటాయి. చాలా ఆఫీసు భవనాలు ఖాళీగా కనిపిస్తాయి. వాటి దగ్గర ‘అద్దెకు ఇవ్వబడును’ అని బోర్డులు దర్శనమిస్తాయి.

ఈ ఆఫీసులను నివాసభవనాలుగా మార్చాలని కమిషన్ తన నివేదికలో సిఫారసు చేసింది. ఈ ఆలోచన బాగుందని ప్రొఫెసర్ స్టిన్ వాన్ నూవెర్‌బర్ అభిప్రాయపడ్డారు. కేవలం జోన్ల విధానం చట్టాన్ని మారిస్తే సరిపోతుందని పేర్కొన్నారు.

‘‘మొదటి అంతస్తులో షాపులను అలాగే ఉంచి, మిగతా అంతస్తుల్లో ఆఫీసులను నివాసాలుగా మార్చవచ్చు. దానివల్ల వ్యాపారానికి డిమాండ్ పుడుతుంది’’ అని ఆయన చెప్పారు.

జనం వస్తూ వెళ్తూ ఉండటం వల్ల కెఫేల దగ్గర ఆగటం, ఏమైనా తినటానికి కూర్చోవటం, ఇళ్లకు వెళ్లే దారిలో షాపులో ఏదైనా కొనుక్కోవటం వంటివి జరుగుతాయి. తద్వారా చిన్న, మధ్య స్థాయి వ్యాపారాలు మనుగడ సాగించగలవు.

జుయారెజ్ బోచి

ఫొటో సోర్స్, HELOISA VILLELA

ఫొటో క్యాప్షన్, జుయారెజ్ బోచి ఇంటి నుంచి పని చేస్తున్నారు.. ఆఫీసుకు తిరిగి వెళ్లాలనే కోరిక ఆయనకు లేదు

టైమ్ మేనేజ్‌మెంట్

జుయారెజ్ బోచి ఇంకా న్యూయార్క్‌లోనే ఉన్నారు. కానీ తన భార్యతో సహా మరో నగరానికి తరలి వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు.

మహమ్మారి ఆరంభంలో ఆయన ఇంటి నుంచి పనిచేయాల్సి వచ్చింది. అప్పటి నుంచీ మళ్లీ ఆఫీసుకు వెళ్లలేదు. నిజానికి ఇలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగించటానికి అవకాశం ఉంటే.. దానికే ఆయన మొగ్గుచూపుతారు.

ఆయనకు తన సొంత టైమ్‌ ఎక్కువగా లభించటంతో ఉదయం జాగింగ్‌కు వెళుతున్నాడు. ఆ పనులన్నీ చూసుకుని పొద్దున 8 గంటలకల్లా ఆఫీస్ పని మొదలుపెడుతున్నారు కూడా.

ఇంతకుముందు తాను ఆఫీసుకు వెళ్లే దారిలో తరచుగా వెళ్లిన ప్రాంతాలకు ఇప్పుడు పెద్దగా వెళ్లటం లేదు. ఇప్పుడు ఆయన తను నివసించే బ్రూక్లిన్ ప్రాంతంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు.

న్యూయార్క్ నగరం

ఫొటో సోర్స్, Reuters

జనం తిరిగి వచ్చేలా ఆకర్షించాలి...

చాలా మంది జనం ఇలాగే జీవిస్తున్నారు. మెట్రో రైల్ ఆదాయం పడిపోయింది. షాపులు, బార్లు, రెస్టారెంట్ల మీద కూడా ప్రభావం చూపుతోంది.

అయితే న్యూయార్క్ భవిష్యత్తు.. నగరం విడిచి వెళ్లిపోయిన జనాన్ని తిరిగి రప్పించటం మీద ఆధారపడి ఉందని ప్రొఫెసర్ స్టిన్ వాన్ నూవెర్‌బర్ అంటున్నారు. నగర జనాభాలో ఆదాయాలు, ఆసక్తుల్లో వైవిధ్యం ఉండేలా చూడాలని కూడా అని ఆయన అభిప్రాయపడ్డారు.

‘‘కేవలం ఫైనాన్స్, టెక్నాలజీ ప్రొఫెషనల్స్ మీద, న్యాయవాదుల మీద ఆధారపడి ఏ నగరమూ మనుగడ సాగించలేదు’’ అని పేర్కొన్నారు.

నగర వైభవం తిరిగి రావాలంటే.. కళాకారులను, హోటల్, రెస్టారెంట్ ఉద్యోగులను, ఇక్కడి వినోద పరిశ్రమలో పనిచేసే వారిని కూడా నిలుపుకోవాల్సిన అవసరముంది.

‘‘మహమ్మారికి ముందు న్యూయార్క్ నగరాన్ని ప్రతి ఏటా 6 కోట్ల మంది సందర్శించేవారు. బ్రాడ్‌వే లేకపోతే.. థియేటర్లు, రెస్టారెంట్లు లేకపోతే ఆ పర్యాటకులు రారు’’ అని ప్రొఫెసర్ స్టిన్ వాన్ నూవెర్‌బర్ హెచ్చరించారు.

న్యూయార్క్

ఫొటో సోర్స్, Getty Images

నగర ఖజానాకు సమస్యలు...

నగర పాలక మండలి ఖజానాకు కూడా సాయం అవసరమవుతుంది.

2024 నుంచి న్యూయార్క్ నగరానికి 10,000 కోట్ల డాలర్ల బడ్జెట్‌లో ప్రతి ఏటా 10 శాతం - అంటే 1,000 కోట్ల డాలర్ల లోటు ఉంటుందని ప్రొఫెసర్ స్టిన్ వాన్ పేర్కొన్నారు.

ఇంత పెద్ద లోటును భర్తీ చేయాలంటే ఆదాయం పెంచుకోవటం కానీ, ఖర్చులు తగ్గించుకోవటం కానీ చేయాల్సి ఉంటుంది. అంటే.. పన్నులు పెంచటం, సేవలు తగ్గించటం చేయాల్సి వస్తుంది.

1970లలో న్యూయార్క్ ఇలాంటి విషమ పరిస్థితిని ఎదుర్కొంది. ప్రస్తుతం డెట్రాయిట్ కూడా ఇదే పరిస్థితుల్లో ఉంది.

ఇవి కూడా చదవండి: