ఎలాన్ మస్క్: మార్స్ మిషన్ మీద కన్నా ట్విటర్‌లోనే ఎక్కువ కాలం గడుపుతున్నారు.. ఎందుకు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జో క్లీన్‌మన్
- హోదా, టెక్నాలజీ ఎడిటర్
ఎలాన్ మస్క్‌ని నేను చాలా ఏళ్లుగా గమనిస్తున్నాను. ఇటీవల ట్విటర్‌ను కొనుగోలు చేయాలని ఆయన నిర్ణయించుకున్నప్పటి నుంచి మరింత నిశితంగా చూస్తున్నాను.
ప్రపంచంలో అత్యంత సంపన్నుల్లో ఆయన ఒకరు. ఆయన ప్రధాన ఆర్థిక ఆస్తి అయిన టెస్లా షేర్ల ధరలను బట్టి కొన్నిసార్లు అందరికన్నా సంపన్నుడిగా కూడా నిలుస్తుంటారు. టెస్లా, స్పేస్ ఎక్స్, స్టార్‌లింక్, న్యూరాలింక్ సహా పలు భారీ కంపెనీలు ఆయన సొంతం. కాబట్టి ప్రపంచమంతటా ఆయన మీద తీవ్ర ఆసక్తి ఉంటుంది.
ఇక ఆయన వ్యక్తిగత కథ కూడా ఉంది. ప్రస్తుతం 51 ఏళ్లున్న మస్క్‌కు 10 మంది పిల్లలున్నారు. వారి వయసు ఏడాది నుంచి 18 ఏళ్ల వరకూ ఉంటుంది. ఆయన మొదటి కొడుకు 10 వారాల వయసులోనే చనిపోయాడు.
ఎలాన్ మస్క్ దక్షిణాఫ్రికాలో పుట్టారు. ఆస్పర్జర్ అనే ఆటిజం సమస్య తనకు ఉండేదని చెప్పారు. అంగారక గ్రహాన్ని ఆక్రమించటం తన జీవిత లక్ష్యమని ప్రకటించారు.
అయితే ఎలాన్ మస్క్‌కు బహు ముఖాలు ఉన్నాయని నేను తెలుసుకున్నాను. బహుశా మనలో చాలా మందికి కూడా తెలిసే ఉంటుంది.
ఆయన తన ట్వీట్ల ద్వారా ప్రదర్శించే వ్యక్తిత్వం రెచ్చగొట్టేలా ఉంటుంది. వివాదాస్పదంగా ఉంటుంది. దూకుడుగా ఉంటుంది. మొరటు మీమ్‌లంటే అతడికి ఇష్టం. తను ఏం మాట్లాడినా ప్రపంచమంతా పతాక శీర్షికలకు ఎక్కుతుందని అతడికి తెలుసు. వింత ప్రకటనలు, జోక్‌లు వేస్తూ మీడియాను ట్రోల్ చేయటాన్ని ఎంజాయ్ చేస్తాడు. ఇంకా ఇంకా విపరీతమైన శీర్షికలు రాసేలా మా పాత్రికేయులను రెచ్చగొట్టటమన్నా అతడికి చాలా ఇష్టం.
జనంలో షోమాన్‌లాగా ఉండటం నేర్చుకున్నాడు. ఎలక్ట్రిక్ కార్ రోబోల పక్కన డ్యాన్స్ చేయటమైనా, సరికొత్త టెస్లా ప్రొటోటైప్‌కార్ నుంచి బయటకు రావటమైనా, ట్విటర్ హెడ్‌క్వార్టర్స్‌లోకి సింక్ పట్టుకుని నడుస్తూ వీడియో తీయడం ఇలా అన్నీ పాపులర్ అయ్యాయి. హాలోవీన్ పార్టీకి ఆయన వేసుకున్న లెదర్ కాస్ట్యూమ్ విలువ 7,500 డాలర్లు.
ఆయన మాజీ భార్య టౌలా రీలే కూడా బీబీసీ డాక్యుమెంటరీ సిరీస్ ‘‘ద ఎలాన్ మస్క్ షో’’లో మస్క్‌ను ‘‘స్వీట్ అండ్ షై’’ పర్సనాలిటీగా చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, ఎలాన్ మస్క్ చాలా తక్కువగా మాట్లాడతారని, తెలివైనవారని, ఆత్మపరిశీలన ఎక్కువగా చేసుకుంటారని ఆయనతో 20 ఏళ్ల పరిచయమున్న సిలికాన్ వ్యాలీ జర్నలిస్టు మైక్ మాలోన్ చెప్పారు. అంగారకుడిపై వ్యోమనౌకను ఎలా దించాలనే అంశంపై వీరిద్దరూ అట్లాంటిక్ మీదుగా విమానాల్లో వెళ్తూ చాలాసార్లు మాట్లాడుకున్నారు.
2030నాటికి అంగారకుడిపైకి మనుషులను పంపిస్తానని మాలోన్‌తో ఎలాన్ మస్క్ 5 డాలర్ల పందెం కాశారు. ‘‘మీరు ఆ పనిచేయలేకపోవచ్చని నేను అన్నాను. కానీ, మీరు మీ లక్ష్యం చేరుకోవాలి, అప్పుడు నేను ఆ ఐదు డాలర్లు తెచ్చి ఇస్తాను’’అని ఆయనతో నేను చెప్పారు. ఇప్పటికీ ఆ పందెం అలానే ఉందని ఆయన వివరించారు.
అంగారకుడిపైకి మనుషులను పంపించడం అనేది మస్క్ జీవిత లక్ష్యం. ప్రస్తుతం ప్రజల అవసరాల కంటే దీర్ఘకాలంలో మానవాళి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చర్యలు తీసుకోవడాన్ని లాంగ్‌టెర్మిజంగా కొందరు తత్వవేత్తలు అంటారు. మస్క్ ఆలోచనలు కూడా ఈ ఫిలాసఫీ కిందే చూడాలని కొందరు చెబుతుంటారు.
ఏదో ఒక రోజు మనుషులు ఈ భూమిని వదిలేసే పరిస్థితి వస్తుందని మస్క్ చెబుతుంటారు. అందుకే అంతరిక్షంలో వాణిజ్యంపై తను అంత దృష్టి సారిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మరి ఆ ఆలోచనల్లోకి ట్విటర్ ఎలా సరితూగుతుంది?
ఈ ప్రశ్నకు ఒక ట్వీట్ సాయంతో మస్క్ సమాధానం చెప్పేందుకు ప్రయత్నించారు.
‘‘సోషల్ మీడియా ముఖ్యంగా ట్విటర్ వల్ల మన సమాజంలో విలువలు పడిపోతున్నాయి’’అని ఆయన రాసుకొచ్చారు. ‘‘అంగారకుడిపై జీవనానికి అనువైన పరిస్థితులు సృష్టించకముందే, ఇలా నాగరికత పతనం అయితే, ఇంకేమీ మిగలదు. అంతా నాశనం అవుతుంది’’అని ఆయన రాసుకొచ్చారు.

ఫొటో సోర్స్, NASA
ట్విటర్ వల్ల ఎలా సమాజంలో విలువలు పడితున్నాయి?
‘‘మొదట్లో నేను 21వ శతాబ్దపు డిజిటల్, గ్లోబల్ టౌన్ స్క్వేర్ గురించి చర్చించేందుకు ఈ వేదికను కొనాలని నిర్ణయించుకున్నాను’’అని ఆయన చెప్పారు.
ట్విటర్‌లో సమానత్వం లోపించిందని ఇదివరకు ఆయన చాలాసార్లు చెప్పారు. తమతో విభేదించే భావజాలమున్న వారిని ఇదివరకటి సిబ్బంది ట్విటర్ వేదికపై అడ్డుకుంటున్నారని, తమ అభిప్రాయాలతో విభేదించే వారికి అసలు స్వరమే లేకుండా చేస్తున్నారని ఆయన అన్నారు. ఆ తర్వాత కొందరు జర్నలిస్టుల సాయంతో ‘‘ట్విటర్ ఫైల్స్’’ పేరుతో కొన్ని పత్రాలను ఆయన విడుదల చేశారు. ఆయన చెబుతున్న వాదనకు ఈ పత్రాలు బలం చేకూర్చాయి.
అధికార దుర్వినియోగం, మిస్‌ఇన్ఫర్మేషన్ లాంటివి ట్విటర్‌పై జరుగుతున్నాయని చెబుతూ.. ప్రజలు తెలుసుకోవాలనే కొన్ని అంశాల నుంచి దృష్టి మరల్చే ప్రయత్నాన్ని ఎలాన్ మస్క్ చేశారు.
అయితే, ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛకు అనుమతించడం, విద్వేష వ్యాఖ్యలకు కళ్లెం వేయడం మధ్య గీత చాలా సన్నగా ఉంటుంది. దీన్ని గుర్తించడం చాలా చాలా కష్టం.
మనుషుల మెదడును, కంప్యూటర్‌తో అనుసంధానించే న్యూరాలింక్‌కు ట్విటర్‌తో ముడిపెట్టే లంకె మస్క్ మెదడులో తట్టే ఉండొచ్చు.
బహుశా న్యూరాలింక్ కోసం జరుగుతున్న పరిశోధనలకు దాదాపు 30 కోట్ల మంది తమ మెదడులోని భావాలను పంచుకునే ట్విటర్ ఉపయోగపడుతుందని ఆయన భావించి ఉండొచ్చు.
ఓకే.. మనం ఒక సైన్స్ ఫిక్షన్‌లోకి వెళ్లిపోతున్నాం.
మనుషులను వేరే గ్రహం మీదకు తీసుకెళ్లడం అనేది కూడా భూమి నుంచి మానవ మేధస్సును వేరేచోటుకు తరలించడంగానే చూడాలి. నిజానికి ఇది సవాళ్లతో కూడుకున్న వ్యవహారం. మస్క్‌కు సవాళ్లను స్వీకరించడం ఇష్టమనే అనుకుంటున్నాను.

ఫొటో సోర్స్, Getty Images
భిన్నమైన సవాల్..
మస్క్‌తో పందెం కాయడం అనేది మాలోన్‌కు ఒక చెత్త ఆలోచన లాంటిదని స్పేస్ ఎక్స్ కంపెనీలో దాదాపు ఆరేళ్లు పనిచేసిన డాలీ సింగ్ అంటున్నారు.
‘‘అసలు ఆయనతో పందెం ఎప్పుడూ కాయకూడదు’’అని డాలీ వ్యాఖ్యానించారు.
‘‘ఆయన ఒక మెషీన్ లాంటివారు. ఆయనే గెలుస్తారు’’అని డాలీ చెప్పారు.
అయితే, ట్విటర్ వల్ల ఆయనకు భిన్నమైన సవాళ్లు ఎదురుకావొచ్చని డాలీ అంటున్నారు.
‘‘మనం ఊహించినదానికంటే ఇది చాలా కష్టంగానే ఉండొచ్చు. దీని వల్ల ఆయన మరింత ఎక్కువ పనిచేయాల్సి రావచ్చు’’అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
తలనొప్పి వ్యవహారమేనా?
ప్రజలతో మాట్లాడేకంటే ఇంజినీరింగ్, కోడ్‌లే మేలని మస్క్ బహిరంగంగానే చెప్పారు. చిన్నప్పటి నుంచి అసలు ప్రజలు సరిగ్గా ఏం చెప్పాలని అనుకుంటున్నారో తను గ్రహించలేకపోయేవాణ్నని గత ఏడాది వాంకోవర్‌లో ఒక టెక్నాలజీ, ఎంటర్‌టైన్‌మెంట్, డిజైన్ (టెడ్) కాన్ఫెరెన్స్‌లో ఆయన చెప్పారు.
ట్విటర్‌పై కోర్టు కేసుకు సంబంధించిన పత్రాలతోపాటు ఇటీవల ఒక టెక్ట్స్ మెసేజ్‌ను ఆయన పోస్ట్ చేశారు.
‘‘ప్రోగ్రామ్ మేనేజర్లు, ఎంబీఏ గ్రాడ్యుయెట్ల కంటే హార్డ్‌కోర్ ప్రోగ్రామర్లతో నేను మెరుగ్గా మాట్లాడగలను. మేనేజ్‌మెంట్ ప్రతినిధులతో మాట్లాడటం నిజంగా నాకు చాలా చిరాగ్గా అనిపిస్తుంది. నిజానికి ఇక్కడ ఎవరూ ఎవరికీ బాస్ కాదు. కానీ, టెక్నికల్, ప్రాడక్ట్ డిజైన్ సమస్యలను పరిష్కరించడంలో సాయం చేయడం నాకు ఇష్టం’’అని ఆయన ఆ మెసేజ్‌లో రాసుకొచ్చారు.
ఇప్పుడు ఆయనకు సమస్య ఏమిటంటే.. ట్విటర్ అనేది కోట్ల మంది వాదించుకునే, నవ్వుకునే, ట్రోల్ చేసే భారీ, సంక్లిష్టమైన నెట్‌వర్క్.
దీన్ని గాడిలో పెట్టేందుకు ఇప్పటికే మస్క్ చాలా శ్రమిస్తున్నారు. అయితే, ఇదివరకటి హయాం కంటే పరిస్థితులు మెరుగ్గా చేస్తానని ఆయన అంటున్నారు.
అయితే, దీన్ని నడిపించడం ఆయన ఊహించుకునే దానికంటే చాలా కష్టంగానే ఉండొచ్చని డాలీతోపాటు మరికొందరు కూడా భావిస్తున్నారు.

కష్టపడతారు...
ఒక వ్యాపారవేత్తగా, నాయకుడిగా ఆయన కూడా నిరంకుశంగా ఉండొచ్చు. అయితే, ఈ విషయంలో ఆయన మిగతా చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ల ఎక్కువే ఉన్నారా?
ట్విటర్‌ను కొనుగోలు చేసిన వారం రోజుల్లోనే దాదాపు సగం మందిని ఆయన ఉద్యోగాల్లో నుంచి తొలగించారు. అక్కడ మిగిలిన వారితోనూ సుదీర్ఘ పని గంటలు, తీవ్రంగా పనిచేసేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
కోవిడ్ లాక్‌డౌన్ తర్వాత ఉద్యోగులు మళ్లీ కార్యాలయాలకు రావాలని పిలుపు నిచ్చిన సంస్థల్లో ఆయన కంపెనీలు ముందున్నాయి.
తమ ఉద్యోగులు వంద శాతం నిబద్ధతతో పనిచేయకపోతే ఆయన అసలు సహించలేరు.
మస్క్‌ను ఒక అద్భుతమైన నాయకుడిగా డాలీ అభివర్ణించారు. ‘‘మీరు ఏదైనా సాధించలేరని చెప్పినప్పుడు.. అది తప్పని రుజువు చేసేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తారు. ఆయన చాలా కఠోరంగా శ్రమిస్తారు’’అని ఆమె చెప్పారు.
‘‘వారానికి 80 గంటలు పనిచేసే ప్రపంచంలో మస్క్ జీవించాలని భావిస్తారు’’అని ఆమె అన్నారు.
‘‘మీరు నాలానే కష్టపడి పనిచేయాలని ఆయన చెప్పడానికి వెనుకాడరు. ఎందుకంటే ఆయన ఎక్కువగా ఫోన్‌లో మాట్లాడరు. ఫాక్టరీలోని ఒక స్లీప్ బ్యాగ్‌లోనే ఆయన నిద్రపోతారు’’అని ఆమె చెప్పారు.
కొంతమందికి విసుగువచ్చేస్తుందని, ఆయన మాత్రం అలానే పనిచేస్తారని ఆమె తెలిపారు.
ట్విటర్ శాన్‌ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయంలో ఆయన బెడ్స్ కూడా ఏర్పాటుచేశారు. ఆయన రెండేళ్ల కుమారుడు ఎక్స్ కంపెనీ పాస్ వేసుకుని కనిపిస్తున్న ఓ ఫోటో కూడా ఆయన షేర్ చేశారు.
1990ల్లో ఆయనతోపాటు కలిసి పనిచేసిన కొందరు ఆయన పని విషయంలో నిబద్ధతతో ఉంటారని చెబుతారు. ఒక శుక్రవారం రాత్రి 9 గంటలకు ఆఫీసులో ఎవరూ కనిపించకపోవడంతో ఆయనకు కోపం కూడా వచ్చిందని ఒకరు చెప్పారు.
మస్క్ సమయానికి చాలా ప్రాధాన్యం ఇస్తారని, అదే ఆయనకు అన్నింటికంటే విలువైనదని డాలీ వివరించారు.
‘‘ఏదైనా పనిచేసేటప్పుడు, ఇది ఇప్పుడు ఎంత అవసరం? అని ఒక నిమిషం పాటు ఆయన ఆలోచిస్తారు’’అని ఆమె చెప్పారు.
ప్రస్తుతం ఆయన శక్తినంతా ట్విటర్ కోసం ధారపోస్తున్నారు.
అయితే, మాలోన్ అప్పుడే తన ఐదు డాలర్లను ఖర్చుపెట్టేయకూడదేమో.
ఇవి కూడా చదవండి:
- పఠాన్: బికినీ రంగు, ‘లవ్ జిహాద్’ వివాదంలో షారుఖ్, దిపికల సినిమా
- చైనాతో ‘సరిహద్దు ఘర్షణలు’ జరుగుతున్నా.. చైనా నుంచి భారత్ దిగుమతులు ఏటేటా పెరుగుతూనే ఉన్నాయి.. ఎందుకు?
- Argentina vs France: అర్జెంటీనాకు యువ ఆటగాడు జులియన్ అల్వారెజ్ ఎలా కీలకం అయ్యాడు
- పవన్ కల్యాణ్: ‘వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటును చీలనిచ్చేది లేదు’ - సత్తెనపల్లి సభలో జనసేన నేత
- ఆంధ్రప్రదేశ్: 20 రూపాయలకే ‘మన భోజనం’ - ఎక్కడంటే...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















