పవన్ కల్యాణ్: ‘వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటును చీలనిచ్చేది లేదు’ - సత్తెనపల్లి సభలో జనసేన నేత

జనసేన, తెలుగుదేశం పార్టీలు 2014 ఎన్నికల్లో లాగా 2018 ఎన్నికల్లోనూ కూటమిగా ఉన్నట్లయితే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉండేది కాదని జనసేన నేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనిచ్చేది లేదని చెప్పారు. జనసేన పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే వ్యూహం తనకు ఉందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో జనసేన పార్టీ కౌలు రైతుల భరోసా యాత్ర సభలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పలువురు కౌలురైతు కుటుంబాలకు నగదు సాయం అందించారు. కౌలు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
‘‘నేను కదిలితేనే వైసీపీ వాళ్లకి బాధ. వారాంతపు పొలిటీషియన్ అంటారు. వారానికి ఒక రోజు వస్తేనే ఇంత గోల చేస్తున్నారు.. నేను రోజూ ఉండే ఇంకెంత గోల చేస్తారు. ఆ రోజులు ఉన్నాయి’’ అని పవన్ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, JanaSena Party/fb
‘అవినీతి రహిత పాలన తీసుకొస్తాం’
దశాబ్ధకాలంగా పార్టీని కష్టపడి నడిపిస్తున్నానని పవన్ అన్నారు.
‘‘మీలాగ మాకు మా తాతలు సంపాదించిన డబ్బులు లేవు. లేదంటే అక్రమాలు, దోపిడీలు చేసి సంపాదించిన డబ్బుల లేదు. లేదా వేలకోట్ల విరాళాలు రావు. సొంత సంపాదనతో పార్టీని నడుపుతున్నాను. మీలాంటి వాళ్లు తృణమో పణమో ఇస్తే పార్టీని నడుపుతూ ఉన్నా. తొమ్మిద సంవత్సరాల నుంచి’’ అని చెప్పారు.
‘‘నేను ఎక్కువ మాట్లాడను.. నేనేంటో చేసి చూపిస్తాను’’ అన్నారు.
‘‘నా మీద లాఠీ పడితే రక్తం చిందించడానికి కూడా సిద్ధం. జైల్లో కూర్చోడానికి కూడా సిద్ధం నా సినిమాలు ఆపినా ఆపుకోండి. నన్ను కొట్టే కొద్ది పైకిలేస్తాను తప్ప తగ్గను’’ అన్నారాయన.

ఫొటో సోర్స్, JanaSena Party/fb
వచ్చే ఎన్నికలు చాలా బలంగా ఉండబోతున్నాయంటూ మాచర్లలో ఇటీవల జరిగిన ఘర్షణలను పవన్ కల్యాణ్ ప్రస్తావించారు.
‘‘అధికారం పోతుందన్న భయంతో వారు(వైసీపీ నాయకులు) ఎలా దాడులు చేస్తున్నారో మీరంతా చూశారు. నేను నా వారాహిలో ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద తిరుగుతా. నన్ను ఎవరు ఆపుతారో చూస్తా’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.
జనసేనకు అధికారం వస్తే అవినీతి రహిత పాలన తీసుకొస్తామని ఆయన అన్నారు.
‘‘వ్యక్తిగతంగా నా దగ్గర ఉన్న 30 కోట్ల డబ్బంతా మీకు ఇవ్వగలను. కానీ, జనసేనకు అధికారం వస్తే లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు చేరేలా చూస్తాను’’ అని ఆయన అన్నారు.
వైసీపీ నేతలంతా జనసేన నేతలను అడ్డుకుంటున్నారని, ఎవరికో కొమ్ముకాస్తున్నారని విమర్శిస్తున్నారని, కానీ, తాను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కొమ్ము కాస్తున్నానని ఆయన అన్నారు. ‘బెదిరించే నాయకులు వస్తే, ఎదిరించే యువతరం రావలి’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఫిఫా ప్రపంచకప్‌లో '33వ జట్టు' పాలస్తీనా.. ఆడకుండానే అభిమానుల మనసు గెలుచుకుంది
- డేటింగ్: బహుళ వ్యక్తులతో సంబంధాలు నడిపే ‘సోలో పాలియమరి’లో మంచి, చెడులేమిటి?
- రైలు ప్రయాణం: ప్రయాణికులకు తగినన్ని రైళ్లు నడపటం లేదా? రిజర్వేషన్ బోగీలలో తరచూ తగాదాలెందుకు?
- మంచిర్యాల: ఆరుగురు సజీవ దహనం.. హత్యలా? ప్రమాదమా?
- ఖతార్: కనీసం ఒక్క నది, తాగడానికి నీటి చుక్కలేని ఈ దేశం.. ఫుట్‌బాల్ పిచ్‌ల కోసం నీటిని ఎలా సృష్టిస్తోంది
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















