క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు, అధిక వడ్డీల ఆశచూపి రూ. 4,690 కోట్లు కొట్టేశారు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, లారెన్స్ పీటర్, జేమ్స్ ఫిట్జ్‌గెరాల్డ్
- హోదా, బీబీసీ న్యూస్
57.5 కోట్ల డాలర్ల(భారతీయ కరెన్సీలో సుమారు రూ. 4,690 కోట్లు) విలువైన క్రిప్టోకరెన్సీ కుంభకోణానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో ఎస్టోనియా పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు చేతిలో వందలాది మంది మోసపోయారని పోలీసులు చెబుతున్నారు.
ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌తో కలిసి ఎస్టోనియా పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేశారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న సెర్గీ పోటాపెంకో, ఇవాన్ ట్యూరోజిన్‌లను తమకు అప్పగించాలని అమెరికా అధికారులు ఎస్టోనియా పోలీసులను కోరారు.
హ్యాష్ ఫ్లేర్ అనే క్రిప్టోకరెన్సీ మైనింగ్ సర్వీస్, పొలీబియస్ అనే మరో ఫేక్ వర్చువల్ బ్యాంక్‌లో వీరు ప్రజలతో పెట్టుబడులు పెట్టించి మోసగించారన్నది ఆరోపణ.
ఈ మేరకు అమెరికా వీరిపై అభియోగం నమోదు చేసింది. 37 ఏళ్ల వయసున్న వీరిద్దరిపై ఎస్టోనియా పోలీసులు ఎఫ్బీఐతో కలిసి దర్యాప్తు చేశారు.
సెర్గీ, ఇవాన్‌ల జంట మనీలాండరింగ్ కుట్రకు పాల్పడ్డారని, వీరు చేసిన నేరాలకు గరిష్ఠంగా 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడొచ్చని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ ఒక ప్రకటనలో పేర్కొంది.
నిందితులిద్దరినీ ఎస్టోనియా రాజధాని టాలిన్‌లోని కోర్టులో హాజరుపరిచారని, వారిని అమెరికాకు అప్పగించాల్సి ఉందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
అయితే, నిందితుల వైపు నుంచి ఎలాంటి వివరాలు ఇవ్వడానికి వారి ప్రతినిధులెవరూ అందుబాటులో లేరు.
2015 నుంచి 2019 మధ్య సెర్గీ, ఇవాన్‌ల నుంచి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది 50 కోట్ల డాలర్ల (సుమారు రూ. 4 వేల కోట్లు) విలువైన హ్యాష్‌ఫ్లేర్ క్రిప్టో కాంట్రాక్టులు కొనుగోలు చేసి మోసపోయారని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ ఆరోపించింది.
వర్చువల్ బ్యాంకు పొలీబియస్‌లో పెట్టుబడులు పెడితే ఆకర్షణీయమైన డివిడెండ్స్ వస్తాయంటూ మోసపూరితంగా 2.5 కోట్ల డాలర్ల మేర వసూళ్లు చేశారని డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ ఆరోపించింది.
ఈ డబ్బును షెల్ కంపెనీలకు మళ్లించారని, 75 భవనాలు, కొన్ని విలాసవంతమైన కార్లు కొనుగోలు చేశారని ఆరోపించింది.
అమెరికాకు చెందిన 15 మంది సహా మొత్తం 100 మంది ఈ దర్యాప్తులో పాలుపంచుకున్నట్లు ఎస్టోనియా పోలీస్ విభాగంలోని సైబర్ క్రైమ్ బ్యూరోకు చెందిన ఆస్కార్ గ్రాస్ చెప్పారు.
ఎస్టోనియాలో ఇంతవరకు ఇంత పెద్ద కుంభకోణం జరగలేదని గ్రాస్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















