మలేసియా ఎన్నికలు: ఈ దేశంలో ఇంకా ప్రభుత్వం ఎందుకు ఏర్పడలేదు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జొనాథన్ హెడ్
- హోదా, బీబీసీ న్యూస్
మలేసియా ఎన్నికల్లో చాలామంది ఊహించినట్లే జరుగుతోంది.
ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యత రాకుండా హంగ్ పార్లమెంట్ ఏర్పడుతుందని అంచనా వేశారు చాలామంది.
ప్రస్తుత ఎన్నికలలో మూడు ప్రధాన కూటములు బరిలో నిలిచాయి.
దీంతో 222 సీట్లున్న పార్లమెంటులో ఏ ఒక్క కూటమీ పూర్తి మెజారిటీ సాధించడం సాధ్యం కాలేదు.
ఏ కూటమి ఎన్ని సీట్లు సాధించిందంటే..
పకాటన్ హరపన్ కూటమి(పీహెచ్): ఇందులో ప్రధాన పక్షం పీపుల్స్ జస్టిస్ పార్టీ(పార్టీ కీడిలన్ రక్యాత్ - పీకేఆర్). దీని నేత అన్వర్ ఇబ్రహీం. ప్రస్తుత ఎన్నికల్లో ఈ కూటమి 82 సీట్లు గెలిచింది.
పెరికతాన్ నేషనల్(పీఎన్): ఈ కూటమిలో ప్రధాన పార్టీ బీఈఆర్ఎస్ఏటీయూ లేదా పీపీబీఎం. దీన్నేమలేసియన్ యునైటెడ్ ఇండిజీనస్ పార్టీగా పిలుస్తారు. దీని నేత ముహియుద్దీన్ యాసీన్. ఈ కూటమి ప్రస్తుత ఎన్నికలలో 73 సీట్లు గెలిచింది. ఈ కూటమిలోని మరో ప్రధాన పక్షం పాన్ మలేసియన్ ఇస్లామిక్ పార్టీ. దీన్నే పీఏఎస్ అంటారు.
బారిసాన్ నేషనల్ కూటమి(బీఎన్): ఇందులో ప్రధాన పార్టీ యునైటెడ్ మలేసియా నేషనల్ ఆర్గనైజేషన్(యూఎంఎన్ఓ). దీని నాయకుడు ఇస్మాయిల్ సబ్రీ యాకూబ్. ప్రస్తుత ఎన్నికలలో ఈ కూటమి 30 స్థానాలు గెలుచుకుంది.
గబుంగాన్ పార్టీ సరావక్(జీపీఎస్): ఇందులో ప్రధాన పక్షం ‘పార్టీ పెసాకా భూమిపుత్ర బెర్సాతు(పీబీబీ). ప్రధాన నాయకుడు అబాంగ్ జొహారీ ఒపాంగ్. ఈ కూటమి గెలిచిన సీట్లు 23.
గబుంగాన్ రక్యాత్ సబా(జీఆర్ఎస్): ఈ కూటమిలో ప్రధాన పక్షం బెర్సాతు సబా వర్గం. ప్రధాన నేత హజీజీ నూర్. ఈ కూటమి గెలిచిన సీట్లు 6.
ఈ కూటములు కాకుండా షఫీ అప్దాల్ నేతృత్వంలోని వారిసాన్ పార్టీ 3 సీట్లు గెలిచింది.
లారీ షీన్ జురైదా కమారుద్దీన్ నేతృత్వంలోని పీబీఎం పార్టీ 1 సీటు గెలిచింది. మహతీర్ మహ్మద్ నేతృత్వంలోని పెజుయాంగ్ పార్టీ, ఆ పార్టీ ప్రధానపక్షంగా ఉణ్న జీటీఏ కూటమి ఒక్క సీటు కూడా గెలవలేదు.

ఫొటో సోర్స్, Reuters
బారిసన్ నేషనల్ కూటమి 30 సీట్లకు మించి గెలవలేదని చాలామంది అంచనా వేశారు.
ఈ సంఖ్య 2018లో ఆ పార్టీ గెలిచిన సీట్లలో సగం.
మరో ప్రధాన కూటమి యూఎంఎన్‌ఓ అంచనాలూ తప్పాయి.
ఇటీవల కొంతకాలంగా మలేసియాలో జరిగిన ఉప ఎన్నికల్లో యూఎంఎన్‌ఓ విజయాలు సాధించడంతో ఆ పార్టీ ముందస్తు ఎన్నికల కోసం గట్టి ప్రయత్నాలు చేసి ఎట్టకేలకు ఈ ఏడాదే ఎన్నికలు జరిగేలా చేయగలిగింది.
కానీ, ఈ ఎన్నికలలో మాత్రం ఆ పార్టీ దారుణంగా దెబ్బతింది.
మలేసియాను ఆరు దశాబ్దాలకు పైగా పాలించిన యూఎంఎన్ఓ లెక్కలు తప్పడంతో ఇప్పుడు కొత్తగా ఏర్పడబోయే సంకీర్ణ ప్రభుత్వంలో అది చిన్న పార్టీగా కొనసాగనుంది.
బారిసన్ నేషనల్ కూటమి, యూఎంఎన్ఓల ఎన్నికల వైఫల్యం మరోకొత్త కూటమికి కలిసొచ్చింది.
యూఎంఎన్ఓ నుంచి ఫిరాయించిన నేతలు, ఇస్లామిక్ పార్టీ పీఏఎస్ కలిసి ఏర్పడిన కొత్త కూటమి పెరికతాన్ నేషనల్(పీఎన్) ఇప్పుడు లాభపడింది.
ఎన్నికల ప్రచారంలో ఈ కూటమి జోరు చూపడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని స్థానిక మలయ్ తెగల మద్దతునూ చూరగొని ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకుంది.
పీఎన్ నేత ముహ్యిద్దీన్ యాసిన్ ఒకప్పుడు యూఎంఎన్ఓలోనే ఉండేవారు. కానీ, 2015లో అధికారంలో ఉన్న పార్టీ యూఎంఎన్ఓ నేత, అప్పటి ప్రధానమంత్రి నజీబ్ రజాక్ అవినీతి కుంభకోణాలను యాసిన్ ప్రశ్నించడంతో ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించారు.
ప్రస్తుతం నజీబ్ రజాక్ 12 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు.
అవినీతి ఆరోపణలతో చెడ్డపేరు తెచ్చుకున్న యూఎంఎన్ఓపై 2018 ఎన్నికలలో మరో సంకీర్ణం విజయం సాధించి అధికారంలోకి వచ్చింది.
కానీ, ఆ ప్రభుత్వం రెండేళ్లకే పతనమవడంతో 2020లో ముహ్యిద్దీన్ యాసిన్ మలేసియాకు ప్రధానమంత్రయ్యారు.
అయితే, 2021లో యాసిన్ కూడా పదవీచ్యుతుడై యూఎంఎన్ఓకు చెందిన ఇస్మాయిల్ యాకూబ్ సబ్రీ ప్రధాని పీఠమెక్కారు. యాకూబ్ సబ్రీ ప్రధాని పదవి చేపట్టినప్పటి నుంచి దేశం ఎదుర్కొంటున్న తీవ్ర ద్రవ్యోల్బణంతో పోరాడాల్సి వచ్చింది.
‘ద్రవ్యోల్బణం అనేక కుటుంబాలపై ప్రభావం చూపింది. ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగా మారాయి.
కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ కాలంనాటి నష్టాల నుంచి బయటపడడానికీ ఇంకా కష్టాలు పడుతున్నారు ప్రజలు.
ఇవన్నీ పార్టీల గెలుపుఓటములను నిర్దేశించాయి’ అని మెర్దెకా సెంటర్ ఫర్ ఒపీనియన్ రీసెర్చ్‌కు చెందిన ఇబ్రహీం సూఫియా చెప్పారు.
‘దీంతో పాటు బారిసన్ నేషనల్ పార్టీకి చెందిన నేత జహీద్ హమీదీ ఈ ఎన్నికలతో అధికారంలోకి రావాలని ప్రయత్నించడాన్నీ ప్రజలు ఇష్టపడలేదు. తనపై ఉన్న అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు న్యాయవ్యవస్థనూ వాడుకునే లక్ష్యంతో ఆయన అధికారంలోకి రావాలనుకుంటున్నారని ముస్లిం ఓటర్లు గట్టిగా నమ్మడంతో బారిసన్ నేషనల్ పార్టీకి ప్రత్యామ్నాయంగా పీఎన్, పీఏఎస్‌లకు ఓటు వేశారు’ అని ఇబ్రహీం సూఫియా చెప్పారు.
ఇవన్నీ ఇస్లామిక్ పార్టీ పీఏఎస్‌కు బాగా లాభించింది. 44 సీట్లు గెలుచుకుని పీఏఎస్ అతి పెద్ద పార్టీగా అవతరించింది.
కూటమిగా ‘పకాతన్ హరపన్’ 83 సీట్లతో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ పార్టీలు సాధించిన సీట్ల పరంగా చూస్తే ‘పెరికతాన్ నేషనల్’ కూటమిలోని పీఏఎస్ 44 సీట్లతో అందరి కంటే ముందుంది.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీ పీఏఎస్ నాయకుడు హాదీ అవాంగ్ నోటి దురుసుతనం, ఆయన చేసే వివాదాస్పద వ్యాఖ్యల గురించి తెలిసిన ప్రజలు ఆ పార్టీ అధికారం చేపడితే ఆయన తన అతి సంప్రదాయ అజెండాను ప్రభుత్వం ద్వారా అమలు చేసే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.
మలేసియాలో అవినీతి మూలాలు ముస్లిమేతరులలోనే ఉన్నాయని అవాంగ్ ఇటీవల వ్యాఖ్యానించారు.
‘పబ్లిక్ పాలసీలో మరిన్ని ఇస్లామిక్ అంశాలను చేర్చే ప్రయత్నం జరగొచ్చని ప్రజలు ఆందోళన చెందుతున్నారు’ అని టాస్మేనియాలో యూనివర్సిటీలో ఏసియన్ స్టడీస్ ప్రొఫెసర్ జేమ్స్ చిన్ అన్నారు.
‘ముఖ్యంగా మలయేతరులలో భయం నెలకొంది. మలయేతరులకు రాజకీయ హక్కులు ఉండరాదని పీఏఎస్ అంటుండడంతో వారిలో ఆందోళన ఉంది. కొత్తగా ఏర్పడబోయే సంకీర్ణ ప్రభుత్వంలో పీఏఎస్ కనుక ఉంటే అనేక అంశాలలో వారి అజెండా అమలు చేసే ప్రమాదం ఉందని... విద్యాశాఖలో వేలు పెట్టి కరికులమ్‌ను ఇస్లామీకరించే ప్రమాదం ఉంది’ అని ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు జేమ్స్ చిన్.
అయితే పీఏఎస్ 44 సీట్లు గెలుచుకున్నప్పటికీ పెరికతాన్ నేషనల్(పీఎన్) కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అంత సులభం కాదు. యూఎంఎన్ఓ, అందులోని బీఎన్ భాగస్వామ్య పార్టీలను లోబరుచుకుని తమతో చేర్చుకుంటే తప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పీఎన్‌కు సాధ్యం కాదు.
పీఎన్ కంటే 9 సీట్లు అధికంగా గెలుచుకున్న పీహెచ్ కూటమికి ప్రభుత్వ ఏర్పాటు అవకాశాలున్నప్పటికీ చివరి వరకు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి.
పీహెచ్ కూటమిలో ఎక్కువ సీట్లు సాధించింది డెమొక్రాటిక్ యాక్షన్ పార్టీ. ఈ పార్టీకి 40 సీట్లు వచ్చాయి. మలేసియాలోని చైనీస్ మైనారిటీల మద్దతుతో ఈ పార్టీ చాలా చోట్ల విజయం సాధించింది.

ఫొటో సోర్స్, Reuters
ఏ ఒక్క పార్టీకి, ఏ ఒక్క కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిననన్ని సీట్లు రాకపోవడంతో మద్దతులు, పొత్తుల కోసం పార్టీల మధ్య ప్రయత్నాలు సాగుతున్నాయి.
ఆదివారమే ఫలితాలు వెల్లడైనప్పటికీ ఇప్పటికీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు ముందుకుపడలేదు.
పీహెచ్ కూటమి నేత అన్వర్ ఇబ్రహీం పేరున్న మలయ్ నేత అయినప్పటికీ కొందరు యూఎంఎన్ఓ కూటమి భాగస్వామ్య పక్షాల నేతలు ఆయనతో కలిసి పనిచేయడానికి ఇష్టపడడం లేదు. అది పెద్ద కూటమి అయిన పీహెచ్ మిగతావారిని కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని ప్రయత్నిస్తున్నా ఇంకా ఒక కొలిక్కి రాలేదు.
ఈ ప్రయత్నాలు కొలిక్కి రాకుంటే ప్రధానమంత్రి కావాలని 25 ఏళ్లుగా ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఈసారీ ఫలించనట్లే. అంతకుముందు 1997లో అప్పటి ప్రధాని మహతీర్ మహ్మద్ సెలవులో వెళ్లినప్పుడు ఓ సందర్భంలో ఆయన రెండు నెలల పాటు యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్‌గా వ్యవహరించారు కానీ ఎన్నడూ ప్రధాని కాలేకపోయారు.
మలేసియా రాజకీయాల్లో మరో పెద్ద నాయకుడు, 97 ఏళ్ల మహతీర్ మహ్మద్ పార్టీ ఈసారి ఒక్కసీటూ గెలవలేదు. మలేసియాకు అత్యదిక కాలం ప్రధానిగా ఉన్నది మహతీర్ మహ్మదే. పెజువాంగ్ పేరుతో ఆయన పెట్టిన కొత్త పార్టీ నుంచి పోటీ చేసిన ఆయన, మిగతా అభ్యర్థులలో ఎవరూ ఈ ఎన్నికల్లో విజయం సాధించలేదు. అంతేకాదు, వారిలో ఒక్కరికి కూడా డిపాజిట్లు రాలేదు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








