ఆర్టెమిస్: చంద్రున్ని చుట్టేసి సురక్షితంగా భూమికి చేరిన నాసా ఒరైన్ స్పేస్ షిప్

ఫొటో సోర్స్, EPA
- రచయిత, జొనాథన్ ఆమోస్
- హోదా, బీబీసీ సైన్స్ కరస్పాండెంట్
చంద్రున్ని చుట్టేసిన నాసా ఒరైన్ స్పేస్ షిప్ విజయవంతంగా భూమి మీద దిగింది.
26 రోజుల ప్రయాణం తర్వాత సురక్షితంగా భూమికి చేరింది ఒరైన్ క్యాప్సుల్. భూమి వాతావరణంలోకి అత్యంత వేగంగా ప్రవేశించిన ఒరైన్, పారాచూట్ సాయంతో పసిఫిక్ మహా సముద్రంలో క్షేమంగా దిగింది.
పనితీరును పరీక్షించడంలో భాగంగా చంద్రుని వద్దకు ఒరైన్‌ను పంపారు కాబట్టి ఇందులో మనుషులు ఎవరూ ప్రయాణించలేదు. రాబోయే రోజుల్లో ఇది ఆస్ట్రోనాట్స్‌ను చంద్రుని మీదకు తీసుకెళ్తుంది.
2024 చివర్లో లేదా 2025, 2026లలో మరొకసారి మనుషులను చంద్రుని మీదకు పంపాలని నాసా భావిస్తోంది. సరిగ్గా 50ఏళ్ల కిందట ఇదే రోజు అపోలో-17 ద్వారా ఆస్ట్రోనాట్స్ చంద్రుని మీద దిగారు.
నాసా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ పేరు ఆర్టెమిస్. గ్రీకు పురణాల ప్రకారం ఆర్టెమిస్ అనేది అపోలో సోదరి.
‘(అపోలో అప్పుడు) మేం అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించాం. ఇపుడు మరొకసారి చంద్రుని మీదకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నాం. కానీ, ఈసారి అవసరం వేరు.
జీవించడం నేర్చుకోవడానికి, పని చేయడానికి, ఆవిష్కరణలు చేయడానికి, కొత్తవాటిని సృష్టించడానికి వెళ్తున్నాం. చంద్రున్ని ఆధారంగా చేసుకుని విశ్వాన్ని మరింత అన్వేషించడానికి పోతున్నాం.
2030 చివరి నాటికి అంగారకుని మీదకు మానవులను తీసుకెళ్లడానికి సిద్ధం కావాలన్నది మా ఆలోచన. అంగారకున్ని దాటి కూడా మేం వెళ్లాలని భావిస్తున్నాం’ అని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ మీడియాతో అన్నారు.

ఫొటో సోర్స్, NASA
గత మూడు వారాలుగా మీడియా సమావేశాలలో తరచూ కనిపించిన ఆర్టెమిస్ ప్రాజెక్ట్ మేనేజర్ మైక్ సరాఫిన్... ఒరైన్ క్షేమంగా కిందకు రావడంతో తన ఆనందాన్ని దాచుకోలేకపోయారు.
చంద్రుని నుంచి తిరిగి వచ్చే స్పేస్ షిప్స్, అత్యంత వేగంతో భూమి వాతావరణంలోకి ప్రవేశిస్తాయి. దాదాపు గంటకు 40 వేల కిలోమీటర్ల వేగంతో భూమి దిశగా అవి ప్రయాణిస్తాయి.
ఇంత వేగంతో ప్రయాణించే స్పేస్ షిప్, భూమి వాతావరణంలోకి ప్రవేశించాక వాయువులతో జరిగే ఘర్షణ వల్ల ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయి. షిప్ బయటి ఉష్ణోగ్రత 3,000 సెల్సియస్ డిగ్రీల వరకు చేరుతుంది. కాబట్టి ఇంతటి వేడిని తట్టుకుని నిలబడేలా షిప్‌ను నిర్మించాల్సి ఉంటుంది.
పాత స్పేస్ షిప్స్‌తో పోలిస్తే ఒరైన్‌లో భిన్నమైన హీట్ షీల్డ్స్ వాడారు. వాటి డిజైన్‌ను మార్చారు. ఆస్ట్రోనాట్స్ ప్రాణాలకు ఏమాత్రం ముప్పు కలగకుండా ఉండాలన్నది నాసా లక్ష్యం.
క్యాప్సూల్‌లోని 11 పారాచూట్‌లు వరుసగా విచ్చుకొని, ఒరైన్ క్షేమంగా దిగడం చూస్తే దాని హీట్‌షీల్డ్ బాగానే పని చేసిందని అర్థమవుతోంది. కానీ ఇంజినీర్లు దానిని పరిశీలించే వరకు ఒక నిర్ణయానికి రాలేం.
‘ఈ మిషన్ చాలా గొప్ప విజయం సాధించింది. స్పేస్‌క్రాఫ్ట్ బాగానే ఉన్నట్లు ఈ మిషన్ ద్వారా తెలుస్తోంది. ఆర్టెమిస్-2లో మనుషులను పంపడానికి వీలుగా మేం చేయాల్సిన మార్పులను చేస్తాం’ నాసా జాన్సన్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ వెనెస్సా వైచె అన్నారు.

ఫొటో సోర్స్, NASA
చంద్రునిపై చివరిసారిగా 1972 డిసెంబర్ 11న మానవులు దిగారు. అపోలో-17లో వెళ్లిన జీన్ సెర్నాన్, హారీసన్ స్మిత్ బృందం మూడు రోజుల పాటు చంద్రుని మీద గడిపింది.
ఆర్టెమిస్ కోసం నాసాకు సర్వీస్- ప్రొపల్షన్ మాడ్యూల్‌ను యురోపియన్ స్పేస్ ఏజెన్సీ(ఈఎస్ఏ) అందించింది. ఒరైన్ చంద్రుని దిశగా కదిలేందుకు, దాని చుట్టూ తిరిగేందుకు, భూమి దిశగా ప్రయాణించేందుక ఈ మాడ్యుల్ సహకరిస్తుంది.
ఒరైన్ సముద్రంలో పడటానికి 20 నిమిషాల ముందు ఇది విడిపోయి, ధ్వంసమై దక్షిణ పసిఫిక్ సముద్రంలో పడిపోయింది.
ఆర్టెమిస్-2కు అవసరమైన మాడ్యుల్‌ను ఇప్పటికే నాసాకు ఈఎస్‌ఏ అందించింది. ఆర్టెమిస్-3కు అవసరమైన మాడ్యుల్‌ను జర్మనీలో నిర్మిస్తున్నారు.
నాసా చంద్రుని మీదకు మనుషులను తీసుకెళ్లి తిరిగి వారిని భూమి మీదకు తీసుకురావాలంటే చేయాల్సింది ఇంకా ఉంది. ఇంకా నాసాకు చంద్రుని మీద ల్యాండింగ్ సిస్టమ్ లేదు. స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ నాసా కోసం ల్యాండింగ్ సిస్టమ్‌ను రూపొందిస్తున్నారు.
స్టార్‌షిప్ అనే అది పెద్ద రాకెట్, స్పేస్‌షిప్‌ను మస్క్ నిర్మిస్తున్నారు. ఆర్టెమిస్-3 మిషన్‌లో చంద్రుని వద్ద స్టార్‌షిప్‌ను ఒరైన్ స్పేస్‌క్రాఫ్ట్ కలుస్తుంది. అక్కడి నుంచి ఆస్ట్రోనాట్స్‌ను స్టార్‌షిప్‌లోని వాహనం చంద్రుని మీదకు తీసుకెళ్తుంది.
ఇవి కూడా చదవండి:
- అఫ్గాన్ మహిళల రహస్య కథలు: ‘కొన్ని కలలు కనడానికి కూడా మాకు అనుమతి ఉండదు’
- మసాయి ఒలింపిక్స్: సింహాలను వేటాడే వీరులు ఆడే ఆటలు
- పని కోసం ఖతార్ వెళ్తే తిరిగి రావడం కష్టమా, పని మనుషుల జీవితాలు ఎలా ఉంటాయి
- గుజరాత్ ఎన్నికల్లో ముస్లింలు బీజేపీకే ఓటు వేశారా, ఈ వాదనల్లో నిజమెంత?
- ఇషాన్ కిషన్: ‘అతనొక భయం తెలియని ఆటగాడు’... విరాట్ కోహ్లీ ఈ మాట ఎందుకన్నాడు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













