ఆంధ్రప్రదేశ్: ఫ్యామిలీ డాక్టర్ విధానం ఎలా అమలవుతోంది, పూర్తిస్థాయిలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?

ఫ్యామిలీ డాక్టర్
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలోని కొన్ని గ్రామాలు నదీ లంకల్లో ఉంటాయి. సుమారు 2వేల మంది అక్కడ జీవిస్తున్నారు. వారందరికీ ఎటువంటి అవసరమున్నా నదిని దాటాల్సిందే.

ఆరోగ్య అవసరాల కోసం, అత్యవసర వేళ వారి అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఈ గ్రామాల్లో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారి ఇబ్బందులు, ముఖ్యంగా గర్భిణులకు ఎదురవుతున్న సమస్యలపై 2018లో బీబీసీ కథనం ప్రచురించింది.

ఆ తర్వాత పరిస్థితులు కొంత మారుతున్నట్టు కనిపిస్తోంది. ఎదురుమొండి గ్రామంలో పీహెచ్‌సీని ఆధునికీకరించారు. ఇద్దరు వైద్యులను కూడా నియమించారు.

సిబ్బందితో పాటు మందులు కూడా అందుబాటులో కనిపించాయి. దాంతో అక్కడికి వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ (ఎఫ్ పీ సీ) పేరుతో ప్రభుత్వ వైద్యులను అవసరమైన రోగుల ఇంటికి పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కృష్ణా నది మధ్యలో ఉన్న లంకల్లో ఇది ఎలా అమలవుతోందనే అంశాన్ని బీబీసీ పరిశీలించింది.

ఫ్యామిలీ డాక్టర్

104 మొబైల్ మెడికల్ యూనిట్స్ ద్వారా...

ఆంధ్రప్రదేశ్‌లో 104 వాహనాల ద్వారా మొబైల్ మెడికల్ యూనిట్లను గడిచిన దశాబ్ద కాలానికి పైగా నడుపుతున్నారు. ఇటీవల డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్కులను ప్రభుత్వం అన్ని గ్రామ సచివాలయాల పరిధిలో ఏర్పాటు చేసింది. ప్రతీ గ్రామంలోనూ అందుబాటులో ఉన్న ఆశా వర్కర్లకు తోడుగా ఏఎన్ఎంలతో పాటుగా ఎంఎల్ హెచ్ పీ( మిడ్ లెవెల్ హెల్త్ ప్రోవైడర్) పేరుతో సిబ్బందిని నియమించారు.

రాష్ట్రంలో 6,313 మెడికల్ సబ్ సెంటర్స్ ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అనుబంధంగా అవి పనిచేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ 2వేల మంది జనాభాకు ఒక్కో సచివాలయం ఉంది. దానికి అనుబంధంగా మొత్తం 10,032 వైఎస్సార్‌ విలేజ్ హెల్త్ క్లినిక్‌లను ఏర్పాటు చేశారు.

కొన్నేళ్లుగా నడుస్తున్న 104 వ్యవస్థను వీటికి అనుబంధం చేశారు. ప్రతీ నెలకు రెండు సార్లు చొప్పున ఆయా విలేజ్ క్లినిక్‌ల పరిధిలో మెబైల్ మెడికల్ యూనిట్ పర్యటిస్తుంది. ఆ సమయంలో ఎంఎంయూలో వైద్యులు అందుబాటులో ఉండేలా నియామకాలు చేశారు.

సమీపంలోని పీహెచ్‌సీలో నియమించిన ఇద్దరు డాక్టర్లలో ఒకరు ఈ ఎంఎంయూతో పాటుగా ఆయా విలేజ్ క్లినిక్కులలో వైద్య సేవలు అందిస్తారు.

తద్వారా ప్రతీ 15రోజులకు ఒకసారి ప్రతి గ్రామానికి కనీసంగా ఇద్దరు వైద్యులు వెళ్లేలా ఏర్పాటు చేసినట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ చెబుతోంది.

ఫ్యామిలీ డాక్టర్

ఫ్యామిలీ డాక్టర్ అంటే ఏమిటి?

ఆయా గ్రామాలకు వెళ్లే వైద్యులు క్రమం తప్పకుండా అక్కడి రోగులను పరీక్షించి అవసరమైన మందులు అందిస్తారు. రోగులు మంచం నుంచి కదలలేని స్థితిలో ఉంటే ఇంటికి కూడా వెళ్లి వైద్యం అందిస్తారు. దానికే ఫ్యామిటీ ఫిజీషియన్ కాన్సెప్ట్ (ఎఫ్ పీ సీ) అని పేరు పెట్టారు.

కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌లో ఇప్పటికే ఏపీలోని దాదాపు 3.5కోట్ల మందికి స్క్రీనింగ్ నిర్వహించారు. అందులో ఏపీ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచినట్టు కేంద్రం ప్రకటించింది.

ఈ డేటా ఆధారంగా విలేజ్ క్లినిక్ పరిధిలో ఎవరెవరు దీర్ఘకాల వ్యాధిగ్రస్థులున్నారన్నది ముందుగానే సమాచారం ఉంటుంది.

కాబట్టి వారిని 104 మొబైల్ మెడికల్ యూనిట్ వచ్చే సమయానికి ఆశా వర్కర్లు, ఇతర సిబ్బంది సన్నద్ధం చేస్తారు. ఇంటికి వెళ్లి వైద్యం అందించాల్సిన అవసరం ఎవరికి ఉన్నదనేది కూడా నిర్ణయిస్తారు.

ఆయా విలేజ్ క్లినిక్‌లకు వచ్చే వారికి పరీక్షలు చేయడం, మందులు ఇవ్వడంతో పాటుగా అవసరమైన వారికి ఇంటికి వెళ్లి వైద్యం చేసే విధానం ప్రారంభమయ్యింది.

ఫ్యామిలీ డాక్టర్

ఆస్పత్రికి వెళితే డాక్టర్ ఉండేవారు కాదు

2022 అక్టోబర్ నుంచి ఈ విధానం అమలులోకి వచ్చింది. ప్రయోగాత్మకంగా దానిని నిర్వహిస్తున్నట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ చెబుతోంది.

ఈ ప్రయోగ దశలో ఎదురయిన అనుభవాల ఆధారంగా మెరుగుపరిచి గణతంత్ర దినోత్సవం లేదా ఉగాది నాటికి ఈ స్కీమ్ పూర్తిగా ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎంటీ కృష్ణబాబు బీబీసీకి తెలిపారు.

మండల కేంద్రంలో ఉన్న పీహెచ్‌సీకి ఎప్పుడు వెళ్లినా డాక్టర్ ఉండేవారు కాదని, అలాంటిది ఇంటింటికీ డాక్టర్ రావడం ఆశ్చర్యంగా ఉందని ఎదురుమొండి గ్రామానికి చెందిన వి సాయినాథ్ బీబీసీతో అన్నారు.

"ఏ ఆపద వచ్చినా మేము నది దాటాల్సిందే. పంటు ఉంటే పంటు మీద లేదంటే చిన్న పడవలు వేసుకుని దాటుతుంటాం. కానీ, వరదల సమయంలో ఇబ్బందులు తప్పవు. మేం చాలా సార్లు నాగాయలంక పీహెచ్‌సీకి వెళితే ఒక్క డాక్టర్ కూడా ఉండేవారు కాదు. కాంపౌండర్లు మందులు ఇచ్చి పంపించేవారు. అందుకే వాళ్ల మీద నమ్మకం లేక ఆర్ఎంపీలను నమ్ముకునేవాళ్లం. ఇప్పుడు నెల రోజుల నుంచి రెండు సార్లు మా ఊరికి గవర్నమెంట్ డాక్టర్ వచ్చారు. అందరూ చూపించుకుంటున్నారు" అని ఆయన తెలిపారు.

డాక్టర్లు వచ్చి ఇలా పరీక్షలు చేసి , మందులు ఇవ్వడం తమ ఊరి వాళ్లకు చాలా ఉపయోగం ఉంటుందంటూ సాయినాథ్ అభిప్రాయపడ్డారు.

ఫ్యామిలీ డాక్టర్

బీపీ , షుగర్ బిళ్లలు ఇస్తున్నారు..

బీబీసీ పరిశీలించిన గ్రామాల్లో 104 వాహనాల ద్వారా నెలకు 2 సార్లు ప్రభుత్వ వైద్యులు పర్యటిస్తున్నారు. రోగులకు బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

నాన్ కమ్యూనికబుల్ డీసీజెస్‌గా పిలిచే అలాంటి సమస్యలే ఎక్కువ మందికి ఉన్నట్టు గుర్తించి, వారి ఆరోగ్య పరిస్థితిని క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నారు. పరీక్షలు చేసి, అవసరమైన మోతాదులో మందులు ఇస్తున్నారని వైద్య సహాయం పొందుతున్న వారు చెబుతున్నారు.

"మేము ఇంతకుముందు అప్పుడప్పుడూ బీపీ, షుగర్ చూపించుకునే వాళ్లం. మందులు తెచ్చుకుని వాడుతూ ఉండేవాళ్లం. కానీ ఇప్పుడు 15 రోజులకు ఓసారి పరీక్ష చేస్తున్నారు. మందులు ఇస్తున్నారు. మాకు రానుపోను దారి ఖర్చులు, మందులకు కలిపి నెలకు వెయ్యి రూపాయల వరకూ అయ్యేది. పైగా ఓ రోజు పనిపోయేది. ఇప్పుడు మా ఊరికే వచ్చి పరీక్షలు చేస్తుండడం వల్ల అవి మిగిలాయి. ఇప్పుడు ఈ డాక్టర్లు ఇచ్చిన మందు బిళ్లలే వాడుతున్నాను" అంటూ పి మంగాదేవి అనే వృద్ధురాలు అన్నారు.

ఈ హెల్త్ క్లినిక్‌ల ద్వారా 14 రకాల డయాగ్నోస్టిక్ ర్యాపిడ్ టెస్టులు చేసేందుకు కిట్‌లు అందుబాటులో ఉంచామని స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు బీబీసీకి తెలిపారు. బీపీ, షుగర్ వంటి పరీక్షలతో పాటుగా ఈసీజీ వంటివి కూడా చేసేందుకు అనువుగా ఏర్పాట్లు చేసినట్టు కనిపించింది.

అంతేగాకుండా 67 రకాల మందులు అందుబాటులో ఉన్నాయని అధికారులు అంటున్నారు. అవసరమైన వారికి నెలకు సరిపడా ఒకేసారి మందులు ఇస్తున్నట్టు బీబీసీ పరిశీలించింది.

వీడియో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్: బందరు పోర్టు.. నిర్మాణం ఎప్పుడు?

యూరప్ తరహాలో ...

యూరప్ తరహాలో వైద్యం అందించే ఆలోచనతో ఈ ఫ్యామిలీ డాక్టర్ విధానం ప్రారంభించినట్టు కృష్ణబాబు అన్నారు.

"సాధారణ రోగులకు అందుబాటులో వైద్యం ఉంటుంది. మందులు ఉంటాయి. అవసరమైన పరీక్షలు చేస్తారు. విలేజ్ క్లినిక్‌ల నుంచి నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. తద్వారా వారికి అవసరమైనప్పుడు ఏఎన్ఎంతో పాటుగా ఎంఎల్ హెచ్‌పీ సహాయంతో వారిని పీహెచ్‌సీకి రిఫర్ చేస్తారు. అక్కడి నుంచి ఇంకా మెరుగైన వైద్యం అందాలంటే ఏరియా ఆస్పత్రికి, జిల్లా ఆస్పత్రికి పంపిస్తారు. ఇలా రిఫరల్ వ్యవస్థ ద్వారా వైద్యం పర్యవేక్షణలో అందుతుంది. గర్బిణులు, చిన్న పిల్లలకు ఇది చాలా ఉపయోగపడుతుంది. డిజిటల్ హెల్త్ ఐడీ అందుబాటులో ఉంది కాబట్టి, ఎన్‌సీడీ డేటా ఆధారంగా మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాటు జరుగుతుంది"అని ఆయన వివరించారు.

ఈ విధానం అమలులోకి తీసుకొచ్చిన తర్వాత వైద్య సేవలు పొందుతున్న వారంతా సంతృప్తిగా ఉన్నారని ఆయన తెలిపారు. అత్యవసర వేళలో టెలిమెడిసిన్ కూడా అందుబాటులో ఉంచామన్నారు. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ స్కీమ్‌ను త్వరలోనే పూర్తిస్థాయిలో ప్రారంభించి, వైద్య సేవలు విస్తృతం చేయబోతున్నట్టు కృష్ణబాబు వివరించారు.

వీడియో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్: ఒకే వీధి.. రెండు జిల్లాలు

పర్యవేక్షణ ఉండాలి..

ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ప్రయోజనకరమేనని, కానీ దానిని నిరంతర పర్యవేక్షణలో మాత్రమే ఫలితాలు సాధించగలమని ఐఎంఏ ప్రతినిధి డాక్టర్ ఎం వీ రమేశ్ అన్నారు.

"గ్రామాల్లో వైద్య సేవలు అరకొరగానే ఉన్నాయి. చాలా మంది ఎలాంటి శిక్షణ లేని ఆర్ఎంపీలు, పీఎంపీలను ఆశ్రయిస్తుంటారు. వారికి అవగాహన లేకపోవడం వల్ల ఎక్కువ అనర్థాలు జరుగుతున్నాయి. ఈ విధానం సామాన్యులకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపయోగపడుతుంది. ప్రభుత్వ వైద్య శాలల్లో వైద్యుల, సిబ్బంది నియామకం ఆహ్వానించదగినది. కానీ పర్యవేక్షణ చాలా అవసరం. అర్బన్ హెల్త్ సెంటర్లలో వైద్యం అరొకరగా మారిందనే అభిప్రాయం ఉంది. విలేజ్ క్లినిక్‌లు కూడా అలా కాకూడదు. అవసరమైన టెస్టింగ్ కిట్లు, మందులు అందుబాటులో ఉంచేందుకు నిధులు కేటాయించాలి. లేదంటే ఇవన్నీ ప్రచారార్భాటంగా మిగిలిపోతాయి"అని ఆయన అభిప్రాయపడ్డారు.

వైద్య రంగంలో చాలా ప్రయోగాలు ఘనంగా ప్రారంభమయినప్పటికీ ఆచరణలో నీరుగారిపోతున్న పరిస్థితుల్లో ఈ ఫ్యామిలీ డాక్టర్ స్కీమ్ పగడ్బందీగా సాగేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని ఆశిస్తున్నట్టు డాక్టర్ రమేశ్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)