స్కూలుకు పంపించడానికి ఒక బిడ్డనే ఎంచుకోవాలి... ఓ అయిదుగురు పిల్లల తల్లి కథ

శ్రీలంక

ఫొటో సోర్స్, Manendra

    • రచయిత, ఇషారా దనశేకర, టామ్ డంకిన్
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్

పదేళ్ల మల్కి చాలా ఉత్సాహంగా కనిపిస్తోంది.

తన ఇద్దరు చెల్లెళ్లు, ఇద్దరు తమ్ముళ్ల కంటే గంట ముందే ఆమె నిద్రలేచింది. చాలా కాలం తర్వాత మళ్లీ ఆమెకు స్కూలుకు వెళ్తోంది. అందుకే తను చాలా ఉత్సాహంగా ఉంది.

కానీ, ఆమె తోబుట్టువులు మాత్రం ఇంటిలోనే ఉన్నారు. ఎందుకంటే ఇంటిలో ఒకరిని మాత్రమే ఈ కుటుంబం స్కూలుకు పంపగలదు.

శ్రీలంకలో ఆరు నెలల క్రితం స్వాతంత్ర్యం తర్వాత ముందెన్నడూ చూడని ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టింది. దీనిపై పెద్దయెత్తున నిరసనలు, అల్లర్లు చెలరేగాయి.

ప్రస్తుతం ఇక్కడ శాంతి నెలకొన్నట్లుగా కనిపిస్తోంది. కానీ, నిరుద్యోగం, ధర పెరుగుల లాంటి సమస్యలు ఇక్కడ కుటుంబాలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నాయి.

శ్రీలంక

ఫొటో సోర్స్, Manendra

తల్లిదండ్రులకు చాలా కష్టం..

బాణాసంచా విక్రయించడం ద్వారా మరికొంత ఆదాయాన్ని సమకూర్చుకోవడం కోసం తన పిల్లల్లో కొంతమందిని మల్కి తల్లి ప్రియాంతిక స్కూలుకు పంపడం లేదు.

శ్రీలంకలో ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇక్కడ ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 95 శాతానికి పెరిగింది. మల్కి కుటుంబం కొన్నిసార్లు ఆకలితోనే పడుకుంటోంది.

పిల్లల స్కూలు బట్టలు, పుస్తకాలు, స్కూలుకు వెళ్లేందుకు ఆటో ఖర్చులు.. ఇవన్నింటినీ చూసి అందరు పిల్లలను ప్రియాంతిక స్కులుకు పంపలేకపోతున్నారు.

రోజుకు ఒక్కో పిల్లాడిని స్కూలుకు పంపడానికి 400 శ్రీలంక రూపాయలు (1.09 డాలర్లు) ఖర్చు అవుతాయని ఆమె చెబుతున్నారు. వారి ఒకే గది ఇంటిలో అందరూ ఒకే మంచంపై నిద్రపోతారు.

‘‘పిల్లలందరూ రోజూ స్కూలుకు వెళ్లేవారు. ఇప్పుడు వారిని బడికి పండానికి నా దగ్గర డబ్బులు లేవు’’అని వారిని చూపిస్తూ ఆమె కన్నీరు పెట్టుకున్నారు.

పాత స్కూలు బట్టలు, షూలు మల్కికి ఇప్పటికీ సరిపోతున్నాయి. అందుకే ఆమెను స్కూలుకు పంపుతున్నారు.

అయితే, ఆమె చెల్లి దులంజలీ మాత్రం తనకు స్కూలుకు పంపడంలేదని ఏడుస్తోంది.

‘‘ఏడవద్దమ్మా. నేను రేపు నిన్ను పంపిస్తాను’’అని ప్రియాంతిక తనను ఓదారుస్తూ కనిపించారు.

శ్రీలంక

ఫొటో సోర్స్, Manendra

చదువు కష్టం...

ఉదయం కాగానే మురికిగా కనిపిస్తున్న రోడ్లపై పిల్లలు నడుచుకుంటూ, కొందరు ఆటోల్లో, మరికొందరు మోటార్‌ సైకిళ్లపై తల్లిదండ్రుల వెనుక కూర్చొని స్కూలుకు వస్తూ కనిపించారు.

కొందరు పిల్లల పరిస్థితి చూసి కొలంబోలోని కొటెహీనా సెంట్రల్ సెకండరీ స్కూలు ప్రిన్సిపల్ ప్రక్రమ వీరసింఘే ఆవేదన వ్యక్తంచేశారు.

‘‘రోజూ ఉదయం ప్రార్థనతో స్కూలు మొదలవుతుంది. కానీ, ప్రార్థనలోనే చాలా మంది పిల్లలలు ఆకలితో కళ్లు తిరిగి పడిపోతున్నారు’’అని ఆయన చెప్పారు.

స్కూలు పిల్లల కోసం బియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ, తమకు ఎలాంటి సాయమూ అందండం లేదని మేం మాట్లాడిన స్కూలు ప్రతినిధులు వివరించారు.

తమ స్కూలులో పిల్లల శాతం 40 వరకు పడిపోయిందని వీరసింఘే చెప్పారు. పిల్లల కోసం కాస్త భోజనం ఏమైనా పట్టుకురావాలని టీచర్లను అభ్యర్థిస్తున్నట్లు ఆయన తెలిపారు.

సిలోన్ టీచర్స్ యూనియన్‌కు జోసెఫ్ స్టాలిన్ జనరల్ సెక్రటరీ.

చదువుపై వెచ్చించే ఖర్చు పెరిగిపోవడంతో చాలా మంది పిల్లలు స్కూలుకు దూరం అవుతున్నారని తెలిసి కూడా ప్రభుత్వం ఏ చర్యలూ తీసుకోవడంలేదని ఆయన అన్నారు.

శ్రీలంక

ఫొటో సోర్స్, Manendra

ఖాళీ డబ్బాలు

‘‘పిల్లలు ఖాళీ భోజనం డబ్బాలు తీసుకురావడాన్ని టీచర్లు చూస్తున్నారు. ఈ ఆర్థిక సంక్షోభానికి పిల్లలే అసలైన బాధితులు’’అని స్టాలిన్ వివరించారు.

‘‘ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం అసలు ప్రయత్నించడం లేదు. యూనిసెఫ్, ఇతర అంతర్జాతీయ సంస్థలు సమస్యను గుర్తించాయి. ప్రభుత్వం మాత్రం చూసీచూడనట్లు ఊరుకుంటోంది’’అని ఆయన చెప్పారు.

రానున్న రోజుల్లో ప్రజలకు భోజనం దొరకడం మరింత కష్టం అవుతుందని యూనిసెఫ్ చెబుతోంది. బియ్యం లాంటి నిత్యావసరాలు కూడా మరింత ధరలు పెరుగుతాయని వివరిస్తోంది.

దీంతో మరింత మంది పిల్లలు బడికి దూరమయ్యే ముప్పుంది.

శ్రీలంక

ఫొటో సోర్స్, Manendra

సాయం ఎలా?

పరిస్థితిని చక్కబెట్టడంలో ప్రభుత్వం విఫలం అవుతుంటే, కొన్ని స్వచ్ఛంద సంస్థలు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి.

కొలంబోలోని పేదలకు మూడు దశాబ్దాలుగా స్వచ్ఛంద సంస్థ ‘‘సమత శరణ’’ సేవలు అందిస్తోంది.

రాజధానిలోని భిన్న ప్రాంతాల్లోని విద్యార్థులకు ప్రస్తుతం సంస్థ ప్రతినిధులు ఆహారం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు.

రోజుకు దాదాపు 200 మంది పిల్లలకు సంస్థ సాయం అందించగలదు. కానీ, ఆకలితో ఉండేవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటోంది.

‘‘వారు మాకు భోజనం పెడతారు. ఇంటికి వెళ్లేందుకు బస్సులు కూడా పెడుతున్నారు. మేం వారి వల్లే స్కూలుకు వెళ్తున్నాం’’అని ఐదేళ్ల మనోజ్ చెప్పాడు. స్నేహితులతో కలిసి అతడు భోజనం కోసం వరుసలో నిలబడ్డాడు.

స్కూలుకు నుంచి ఇంటికి వచ్చిన తర్వాత, తన స్నేహితులతో కలిసి విశేషాల గురించి తల్లికి మల్కి వివరించింది.

అయితే, తనకు కొత్త వర్క్‌బుక్ కావాలని, ప్రాజెక్టు కోసం టీచరు డబ్బులు కట్టమంటున్నారని తల్లికి ఆమె చెప్పింది.

కానీ, ఈ కుటుంబం దగ్గర ఆహారం కొనుక్కోవడానికి కూడా డబ్బులు సరిపోవడం లేదు.

‘‘ఈ రోజుకు భోజనం దొరికితే, రేపటికి ఎలా అని ఆందోళన పడుతున్నాం. మా జీవితాలు ఇలా మారిపోయాయి’’అని ప్రియాంతిక ఆవేదన వ్యక్తంచేశారు.

వీడియో క్యాప్షన్, శ్రీలంకకు విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టే తేయాకు ఇండస్ట్రీ నష్టాల్లో ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)