నాటునాటు: ఆస్కార్‌ గెలుచుకున్న ఆర్ఆర్ఆర్ సాంగ్.. ఆ పాట ఎలా పుట్టింది?

నాటు నాటు పాట

ఫొటో సోర్స్, RRR Movie/fb

    • రచయిత, సాహితి
    • హోదా, బీబీసీ కోసం

పిల్లాపాపల నుంచి వృద్ధుల వరకు అందరినీ ఉర్రూతలూగిస్తున్న సినీ గీతాల్లో ‘నాటు నాటు’ పాట ఒకటి.

ఇప్పుడు ఈ పాట ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌ అవార్డ్ గెలుచుకుంది.

ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలోని ఈ పాట విడుద‌లైన‌ప్పటి నుంచే ప్రేక్ష‌కుల మ‌దిలో నాటుకుపోయింది.

వెండి తెర‌పై ఎన్టీఆర్ - రామ్ చ‌ర‌ణ్‌ల డాన్స్ తోడ‌య్యాక‌... ఆ పాట‌ను దర్శకుడు ఎస్‌ఎస్ రాజ‌మౌళి త‌న‌దైన శైలిలో ఆవిష్క‌రించాక‌ ఇది మ‌రింత ఆద‌ర‌ణ చూరగొంది.

ఈ నేపథ్యంలో, నాటు నాటు పాట ఎలా పురుడు పోసుకుందో తెలుసుకుందాం.

నాడు దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ మదిలో మెదిలిన ఆలోచనలు ఏమిటో చూద్దాం.

రాజమౌళి

ఫొటో సోర్స్, FACEBOOK/RRRMOVIE

పాట పుట్టిందిలా

`నాటు .. నాటు` పాట‌... పేరుకి త‌గ్గ‌ట్టే నాటు గీతం.

ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌... ఇద్ద‌రూ మేటి డాన్స‌ర్లే. విడివిడిగా వాళ్ల ప్ర‌తిభ‌ని ఇది వ‌ర‌కే లెక్క‌లేన‌న్ని సార్లు ఆవిష్క‌రించుకొన్నారు.

ఇద్ద‌రూ క‌లిసి డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? ప్రేక్ష‌కుల‌కు ఎలాంటి అనుభూతి కలుగుతుంది? దర్శకుడు రాజ‌మౌళి ఆలోచించింది ఇంత వ‌ర‌కే.

సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణికి చెప్పిన వివరాలు కూడా ఇంత వరకే.

“పెద్ద‌న్నా... ద బెస్ట్ డాన్స‌ర్స్ పోటా పోటీగా డాన్స్ ప్ర‌తిభ‌ను చూపించ‌డానికి ఓ పాట కావాలి.. అంతే” అని రాజమౌళి తనతో చెప్పారని కీరవాణి బీబీసీకి తెలిపారు.

త‌న‌కు చెప్పిన బ్రీఫ్‌.. చిన్న‌దే అయినా, దాన్ని రాజ‌మౌళి ఆకాశ‌మంత ఎత్తులో తీసుకెళ్లి చూపించ‌డానికి సిద్ధ‌మ‌య్యారని గ్ర‌హించారు కీర‌వాణి.

ఈ పాట కోసం నేటి తరం గేయ రచయితల్లో తనకు అత్యంత ఇష్టమైన చంద్ర‌బోస్‌ను కీరవాణి పిలిపించారు.

“ఇద్ద‌రు హీరోలు డాన్సుల‌తో అద‌ర‌గొట్టాలి. మీకు ఏం న‌చ్చితే అది రాయండి. కానీ ఈ క‌థ 1920 ప్రాంతంలో జ‌రుగుతుంది కాబ‌ట్టి ఆ కాలానికి త‌గిన మాట‌లు వాడాలి” అంటూ చంద్ర‌బోస్‌ను స‌మాయాత్తం చేశారు కీర‌వాణి.

అప్ప‌టికి ట్యూను లేదు. సంద‌ర్భం కూడా చంద్రబోస్‌కు మరీ వివరంగా తెలియదు.

rrr

ఫొటో సోర్స్, RRR MOVIE/FACEBOOK

రెండు రోజులు.. మూడు ప‌ల్ల‌వులు

2020 జ‌న‌వ‌రి 17న హైద‌రాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో ఉన్న ఆర్‌.ఆర్‌.ఆర్ కార్యాలయంలో రాజ‌మౌళి, కీర‌వాణి, చంద్రబోస్ కూర్చుని పాట కోసం క‌స‌రత్తు చేశారు.

రాజ‌మౌళి, కీర‌వాణి చెప్పిన మాట‌ల్ని గుర్తు చేసుకొంటూ కారెక్కారు చంద్ర‌బోస్‌.

అల్యూమినియం ఫ్యాక్టరీ నుంచి... జూబ్లీ హిల్స్‌కి కారు ప‌రుగులు తీస్తోంది.

చేతులు స్టీరింగ్ పైనే ఉన్నా.. ఆలోచ‌న‌ల‌న్నీ పాట‌పైనే.

స‌రిగ్గా... `నాటు... నాటు.. ` అనే హుక్ లైన్ త‌గిలింది చంద్ర‌బోస్‌కు.

అప్ప‌టికి ట్యూన్ అంటూ ఏమీ లేదు కాబ‌ట్టి... 6-8 త‌కిట త‌కిట తిశ్ర గ‌తిలో... ఈ పాట‌ను అల్లుకొన్నారు చంద్ర‌బోస్‌.

తిశ్ర గ‌తిలోనే ఎందుకు అంటే... కీర‌వాణికి అత్యంత ఇష్ట‌మైన బీట్ ఇది.

“జ‌నాల‌కు ఉత్సాహం ఇచ్చే ఏ పాటైనా ఈ బీట్ లో రాసుకో” అని కీర‌వాణి తనకు ఎప్పుడో పాతికేళ్ల క్రితం `పెళ్లి సంద‌డి` సినిమా స‌మ‌యంలో స‌ల‌హా ఇచ్చారని చంద్రబోస్ బీబీసీతో చెప్పారు.

పైగా, ఇది నాట్య ప్ర‌తిభ‌ని ప్ర‌దర్శించే సంద‌ర్భం. అందుకే తిశ్ర గ‌తిలో పాట అందుకొన్నారు. రెండే రోజుల్లో మూడు ప‌ల్ల‌వులు రాసుకొని కీర‌వాణి ముందు కూర్చున్నారు చంద్రబోస్.

త‌న‌కు బాగా న‌చ్చిన చ‌ర‌ణాన్ని చివ‌ర్లో చెప్పి.. ముందు మిగిలిన రెండూ వినిపించారు.

చంద్ర‌బోస్‌కి ఇష్ట‌మైన ప‌ల్ల‌వే కీరవాణికీ నచ్చింది. అదే ఖరారైంది.

“పొలం గ‌ట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకిన‌ట్టు

పోలేర‌మ్మ జాత‌ర‌లో పోతురాజు ఊగిన‌ట్టు

కిర్రు సెప్పులేసుకొని క‌ర్ర‌సాము చేసిన‌ట్టు

మ‌ర్రిసెట్టు నీడ‌లోన కుర్ర గుంపు కూడిన‌ట్టు

ఎర్ర జొన్న రొట్టెలోన మిర‌ప తొక్కు క‌లిపిన‌ట్టు...”అంటూ చంద్ర‌బోస్ కలం ప‌రుగులు పెట్టింది.

నా పాట చూడు... నా ఆట చూడు... అనేదానికి బ‌దులుగా `నా పాట పాడు..` అని రాశారు చంద్ర‌బోస్‌.

కానీ దాన్ని `నా పాట చూడు..` అంటూ కీర‌వాణి మార్చారు.

90 శాతం పాట రెండు రోజుల్లో పూర్త‌యిపోయింది.

కానీ... మార్పులూ, చేర్పులూ చేస్తూ చేస్తూ... పాట పూర్తి స్థాయిలో సిద్ధమవ్వ‌డానికి 19 నెల‌లు ప‌ట్టింది.

ఈ 19 నెలల్లో కీర‌వాణి, చంద్ర‌బోస్ మ‌ధ్య పాట గురించి చ‌ర్చ సాగేది.

rrr

ఫొటో సోర్స్, FACEBOOK/RRR

ఆర్థిక, సామాజిక స్థితిగతులకు అద్దం

భీమ్ (ఎన్టీఆర్‌)ది తెలంగాణ అయితే.. రామ్ (చ‌ర‌ణ్‌)ది ఆంధ్రా. అందుకే ఈ పాట‌లో రెండు ప్రాంతాల‌ మాటలూ ఉన్నాయి.

నిశితంగా చూస్తే అప్ప‌టి ఆర్థిక, సామాజిక స్థితిగ‌తులు... ఇవ‌న్నీ ఈ పాట‌లో ద‌ర్శ‌న‌మిస్తాయి.

మిర‌ప‌ తొక్కు, దుముకులాడ‌టం, కీసు పిట్ట తెలంగాణలో బాగా వినిపించే మాటలే. `విజిల్`ని తెలంగాణలో కీసు పిట్ట అంటారు.

అప్ప‌టి తెలంగాణ ప్ర‌ధాన ఆధారం జొన్న‌లే. దానికి జోడీ.. అప్ప‌ట్లో మిర‌ప తొక్కు.

పాటంటే... ప‌దాలు మాయ‌మై దృశ్యాన్ని ఆవిష్క‌రించాలి అంటుంటారు చంద్ర‌బోస్‌. అది ఈ పాట‌లో క‌నిపిస్తుంది.

తెలుగు గ్రామాల్లో జ‌రిగే జాత‌ర‌లు, కనిపించే పోట్ల‌గిత్త‌లు, పోతురాజులు, ర‌చ్చ‌బండ‌లు.. ఇవ‌న్నీ ఈ పాట‌తో క‌ళ్ల ముందు క‌ద‌లాడ‌తాయి.

ఈ పాట‌ను కాల‌భైర‌వ‌, రాహుల్ సిప్లిగంజ్ ఆల‌పించారు.

rrr

ఫొటో సోర్స్, FACEBOOK/RRR

యుక్రెయిన్‌లో పాట చిత్రీకరణ

‘నాటు నాటు` పాట‌ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ డాన్సింగ్ టాలెంట్ కి ప‌రీక్ష‌లా నిలిచింది. ప్రేమ్ ర‌క్షిత్ మాస్ట‌ర్ ఈ పాట కోసం దాదాపు 95 స్టెప్పులు కంపోజ్ చేశారు.

చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌ చేతులు క‌లుపుతూ వేసే సిగ్నేచ‌ర్ స్టెప్పు కోసం ఆయన 30 వెర్ష‌న్లు త‌యారు చేశారు.

ఆ స్టెప్పు కోస‌మైతే ఏకంగా 18 టేకులు చేయాల్సి వచ్చిందని చిత్రబృందం ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది.

అయితే వీటిలో రెండో టేక్‌నే సినిమా ఎడిటింగ్ దశలో ఫైనల్ చేసినట్టు తెలిపింది.

ప్ర‌తీసారీ తను `ఓకే` చేసినా.. రాజ‌మౌళి `వ‌న్ మోర్` అని అడిగేవారని ప్రేమ్ ర‌క్షిత్‌ వివిధ ఇంటర్వ్యూల్లో చెప్పారు. తనకు కూడా క‌నిపించ‌ని చిన్నిచిన్న టైమింగ్ లోపాలు మానిట‌ర్ ముందున్న రాజ‌మౌళికి క‌నిపించేవని ఆయన తెలిపారు.

నాడు ఈ పాట‌ను ఇప్పుడు యుద్ధంతో అట్టుడుకుతున్న యుక్రెయిన్‌లో చిత్రీకరించారు.

చిత్రీకరణ ప్రెసిడెంట్ ప్యాలెస్ ముందు జరిగింది.

యుక్రెయిన్‌లో షూటింగ్ చేస్తున్నప్పుడు చివ‌రి చర‌ణం మార్చాల‌ని నిర్ణ‌యించుకొన్నారు రాజ‌మౌళి, కీర‌వాణి.

చంద్ర‌బోస్ అప్పుడు సుకుమార్-అల్లు అర్జున్-దేవిశ్రీ ప్రసాద్ సినిమా `పుష్ప` సిట్టింగ్స్‌లో బిజీగా ఉన్నారు.

కాన్ఫరెన్స్ కాల్ లో చంద్ర‌బోస్ తో మాట్లాడి నాటు నాటు పాట చివ‌రి చ‌ర‌ణంలో మార్పులు చేయాలని రాజమౌళి, కీరవాణి కోరారు.

ఇంతకుముందు ఖరారైన పాట పూర్తి వర్షన్‌కు 19 నెల‌లు పడితే, ఇప్పుడు చివ‌రి చ‌ర‌ణంలో మార్పులకు కేవలం 15 నిమిషాలు పట్టింది.

“భూమి ద‌ద్ద‌రిల్లేలా వొంటిలోని ర‌గ‌త‌మంతా రంకెలేసి ఎగ‌రేలా ఏసేయ‌రో.. య‌కాయ‌కి నాటు నాటు నాటో దుమ్ము దుమ్ము దులిపేలా లోప‌లున్న పాన‌మంతా దుముకు దుముకులాడేలా దూకేయ‌రో స‌రాస‌రి నాటు నాటు నాటో...”

ఇదీ ఈ పాట‌లోని చిట్ట చివ‌రి మార్పు. ఇది రాశాక‌.. మ‌ళ్లీ అప్ప‌టిక‌ప్పుడు రికార్డ్ చేసి.. చిత్రీక‌రించారు.

నాటు నాటు పాట‌లో ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌ల నాట్య ప్ర‌తిభే కాదు.... భీమ్, రామ్‌ల స్నేహం ఎలాంటిది, భీమ్ కోసం రామ్ చేసిన త్యాగం ఏమిటి, బ్రిటిష్ పాలకుల ముందు తెలుగువాడి స‌త్తా ఎలా చాటారు, భీమ్ తాను ప్రేమించిన బ్రిటిష్ యువతి మ‌న‌సు ఎలా గెలుచుకొన్నాడు లాంటి విషయాలనూ రాజమౌళి చూపించారు.

వీడియో క్యాప్షన్, ఆస్కార్‌కు నామినేట్ అయిన నాటు... నాటు పాట ఎలా పుట్టింది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)