ప్రవాస భారతీయ సమ్మేళనం: ఇందోర్‌లో జరిగే ఈ కార్యక్రమానికి గల్ఫ్ దేశాల నుంచే ఎక్కువ మంది వస్తున్నారు.. ఎందుకు?

ఫొటో సోర్స్, GOVT OF INDIA
- రచయిత, సల్మాన్ రావి
- హోదా, బీబీసీ ప్రతినిధి
మధ్యప్రదేశ్‌లోని ఇందోర్‌లో ఆదివారం నుంచి జరుగనున్న 17వ ప్రవాస భారతీయ సమ్మేళనంలో గల్ఫ్ దేశాల నుంచి ఎక్కువ మంది హాజరుకానున్నారు.
ఒక్క యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచే గరిష్టంగా 715 మంది ప్రవాస భారతీయులు ఈ సదస్సుకు హాజరయ్యేందుకు విదేశీ వ్యవహారాల శాఖలో పేర్లు నమోదు చేసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి ఒకరు బీబీసీతో చెప్పారు.
ఖతార్ నుంచి 275 మంది ప్రవాసీయులు వస్తుండగా, ఒమన్ నుంచి 233, కువైట్ నుంచి 95, బహ్రెయిన్ నుంచి 72 మంది ప్రతినిధులు సదస్సులో పాల్గొనేందుకు అనుమతి పొందారు.
అమెరికా నుంచి కూడా 167 మంది ప్రతినిధులు వస్తున్నారు. మారిషస్ నుంచి ఏకంగా 447 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు.
మొత్తం 66 దేశాల నుంచి 2705 మంది ప్రతినిధులు పాల్గొంటున్నట్లు ప్రభుత్వ సీనియర్ అధికారి ఏపీ సింగ్ తెలిపారు.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమంలో భాగస్వామిగా ఉంది. అయితే, పెట్టుబడిదారుల సమావేశాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తోంది.
జనవరి 8వ తేదీ ఆదివారం నుంచి ఈ సదస్సు ప్రారంభం కానుంది. జనవరి 9న ప్రవాస భారతీయ సమ్మేళనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. మరుసటి రోజు అంటే జనవరి 10న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దీనిని ముగించనున్నారు.
ఆ తరువాత మరో రెండు రోజుల పాటు అంటే జనవరి 11, 12 తేదీల్లో ఇండోర్‌లోనే పెట్టుబడిదారుల సదస్సును నిర్వహిస్తున్నారు. అందులో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించనున్నారు.
1915లో మహాత్మా గాంధీ జనవరి 9న దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చారు. ప్రవాస భారతీయులు భారత అభివృద్ధికి అందిస్తున్న సహకారానికి గుర్తుగా ఆ రోజున ప్రవాసుల దినోత్సవం జరుపుకుంటారు.
2002లో అటల్ బిహారీ వాజ్‌పేయ్ ప్రభుత్వం ప్రవాసుల దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించింది. 2003 నుంచి ప్రతి ఏడాది జనవరి 9న ఈ వేడుకలు జరుగుతాయి.
ప్రతి ఏటా ప్రవాసుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసే సదస్సుకు వివిధ దేశాల ప్రతినిధులు హాజరవుతారు.
ఈసారి ప్రవాస భారతీయ సమ్మేళనానికి దక్షిణ అమెరికా దేశమైన సురినామ్ అధ్యక్షురాలు చంద్రికా ప్రసాద్ సంతోఖి ముఖ్య అతిథిగా హాజరుకానుండగా, గయానా అధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ అలీ ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేస్తున్నారు. ఆస్ట్రేలియా పార్లమెంటరీ సభ్యురాలు జానెటా మస్కరెన్హాస్ కూడా ఈ సదస్సులో పాల్గొననున్నారు.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ సదస్సు పట్ల ఉత్సాహంగా ఉంది. విదేశాల్లో నివసిస్తున్న మధ్యప్రదేశ్ ప్రజలతో సన్నిహితంగా ఉండేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వ విదేశాంగ శాఖ 'ఫ్రెండ్స్ ఆఫ్ మధ్యప్రదేశ్ చాప్టర్స్'ను ఏర్పాటు చేసింది. ప్రవాస భారతీయ సమ్మేళనంలో ఎక్కువమంది మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రవాసులే పాల్గొననున్నారని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

ఫొటో సోర్స్, SALMAN RAAVI/BBC
యూఏఈ నుంచి గరిష్టంగా ప్రతినిధులు
మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రవాసులలో ఎక్కువమంది యూఏఈ నుంచి వస్తున్నారు. సదస్సుకు హాజరు కానున్న ప్రతినిధులలో మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రవాసుల సంఖ్య సుమారు 300 కాగా, అమెరికా నుంచి 75, బ్రిటన్ నుంచి 55, దక్షిణాఫ్రికా నుంచి 10, సింగపూర్ నుంచి 12, జపాన్ నుంచి 11 మంది, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ నుంచి నలుగురు చొప్పున హాజరవుతున్నారు.
ఎల్‌టీ ఫుడ్స్ లిమిటెడ్‌కు చెందిన విజయ్ కుమార్ అరోరా, లండన్ డిప్యూటీ మేయర్, బ్రిటన్‌లోని 'ఫ్రెండ్స్ ఆఫ్ మధ్యప్రదేశ్' కోఆర్డినేటర్ రాజేష్ అగర్వాల్, న్యూయార్క్‌లోని 'ఫ్రెండ్స్ ఆఫ్ మధ్యప్రదేశ్' అధ్యక్షుడు జితేంద్ర ముచ్చల్ సహా మధ్యప్రదేశ్‌కు చెందిన ఆరుగురు ప్రవాసులను జనవరి 9న ప్రధానమంత్రితో పాటు విందుకు ఆహ్వానించారు.
పెట్టుబడి రంగాల గుర్తింపు
మధ్యప్రదేశ్ భారతదేశానికి హృదయస్థానంలో ఉందని, అక్కడి నుంచి ఏ ప్రాంతానికైనా సరకులను పంపిణీ చేయడం సులభమని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. దేశ జనాభాలో 50 శాతం ప్రజలకు అక్కడి నుంచి సరకులు రవాణా చేయవచ్చని అంటోంది.
దిల్లీ-ముంబై కారిడార్ లేదా దిల్లీ-నాగ్‌పూర్ ఇండస్ట్రియల్ కారిడార్, ఈస్ట్-వెస్ట్ కారిడార్, దిల్లీ-ముంబై 'గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే' వంటి ఆధునిక రహదారి మార్గాల ద్వారా మధ్యప్రదేశ్ నుంచి సరుకులను సౌకర్యవంతంగా రవాణా చేయవచ్చు.
మధ్యప్రదేశ్ సుగంధ ద్రవ్యాలతో పాటు పత్తి, వెల్లుల్లి, పప్పులు, శనగలు, సోయాబీన్, గోధుమలు, మొక్కజొన్న, పువ్వుల ఉత్పత్తి ద్వారా దేశంలోని అగ్రగామి రాష్ట్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ కారణంగానే ఈరాష్ట్రంలో 'ఫుడ్ ప్రాసెసింగ్' రంగానికి ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తున్నారు.
అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఇంతకన్నా పెద్ద పెట్టుబడులు పెట్టగల రంగాలను గుర్తించింది. ఫార్మా, ఆటోమొబైల్, టెక్స్‌టైల్ పరిశ్రమలు వంటి రంగాల్లో భారీ పెట్టుబడుల కోసం చూస్తోంది.

ఫొటో సోర్స్, SALMAN RAAVI/BBC
'ఆర్గానిక్ కాటన్'లో మధ్యప్రదేశ్ పైచేయి
భారతదేశంలో ఉత్పత్తి అయ్యే 'సేంద్రీయ పత్తి'లో 43 శాతం ఈ రాష్ట్రం నుంచే జరుగుతోందని మధ్యప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది. ఇది మొత్తం ప్రపంచంలోని 'సేంద్రీయ పత్తి' ఉత్పత్తిలో 21 శాతం.
ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 60కి పైగా వస్త్రాల తయారీ యూనిట్లు ఉండగా, 4000కు పైగా 'మగ్గాలు' ఉన్నాయి. అందుకే ఈ రంగంలో పెట్టుబడులపై ప్రభుత్వం 200 శాతం 'ప్రోత్సాహకం' ప్రకటించింది.
భారత ప్రభుత్వం ఈ రంగంలో ఇప్పటికే రూ. 3,513 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఇది ఇతర రాష్ట్రాలలో పెట్టిన పెట్టుబడుల కంటే ఎక్కువ.
మధ్యప్రదేశ్‌లోని పారిశ్రామిక రంగం కూడా ప్రవాస భారతీయ సమ్మేళనం పట్ల ఉత్సాహంగా ఉంది. రాష్ట్ర సామర్థ్యానికి అనుగుణంగా అక్కడ పలు ప్రాజెక్టులు చేపట్టవచ్చని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు.
మధ్యప్రదేశ్ భౌగోళికంగా భారతదేశానికి మధ్యలో ఉందని, ఇక్కడి నుంచి అన్ని దిక్కులా సరుకులను సులభంగా రవాణా చేయవచ్చని, అయితే, కేంద్ర ప్రభుత్వ విధానాలు రాష్ట్రానికి అనుకూలంగా లేవని ఆ రాష్ట్రానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త జీడీ లాధా అన్నారు.
"ఉదాహరణకు, గ్వాలియర్ డివిజన్‌లో ఉక్కు కర్మాగారాలు ప్రారంభించారు. వీటిని నెలకొల్పిన వారికి ప్రభుత్వం నుంచి అనేక ప్రోత్సహకాలు అందాయి. అన్నీ తీసుకున్నాక ఫ్యాక్టరీలు మూసేసి వెళ్లిపోయారు. వీటికి ఏ రకమైనా పర్యవేక్షణ లేదు. అలాగే, బుర్హాన్‌పూర్, ఖాండ్వాలలో 'స్పిన్నింగ్ మిల్లులు' అంటే పత్తి నుంచి నూలు తయారు చేసే యూనిట్లు తెరిచారు. అవీ మూతపడ్డాయి. బట్టల ఫ్యాక్టరీలు కూడా తెరిచారు. వాటి పరికరాలను ఆధునీకరించలేదు. ఆ ఫ్యాక్టరీలూ మూతబడ్డాయి" అని ఆయన బీబీసీతో అన్నారు.
పారిశ్రామిక విధానాలను రూపొందిస్తున్న అధికారులకు క్షేత్ర స్థాయిలో వాస్తవాలు ఏమాత్రం తెలియదని మధ్యప్రదేశ్ పారిశ్రామికవేత్తలు అంటున్నారు. వ్యవసాయం, పరిశ్రమల కోసం ప్రభుత్వం ఉమ్మడి విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు.
ఇందోర్ పారిశ్రామికవేత్త గౌతమ్ కొఠారి మాట్లాడుతూ, ఇతర రాష్ట్రాల కంటే మధ్యప్రదేశ్ ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమ, ఖనిజ పరిశ్రమ, సమాచార సాంకేతిక ఆధారిత పరిశ్రమ రంగాల్లో మెరుగ్గా రాణించగలదని అన్నారు.
వివిధ పంటలకు మధ్యప్రదేశ్‌లో వాతావరణం అనుకూలిస్తుందని, వ్యవసాయం, పరిశ్రమలను ముడిపెడుతూ ప్రభుత్వం ఉమ్మడి విధానాలను రూపొందించాలని, అప్పుడే భారీ పెట్టుబడులు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, SALMAN RAAVI/BBC
స్పష్టమైన పారిశ్రామిక విధానం అవసరం
మధ్యప్రదేశ్‌లో భూమి, కూలీలు చౌకగా లభిస్తాయి కాబట్టి పెట్టుబడులకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. అయితే, ఇందుకోసం ప్రభుత్వం స్పష్తమైన విధానాన్ని రూపొందించాల్సి ఉంటుందని పారిశ్రామికవేత్తలు భావిస్తున్నారు.
"ప్రభుత్వం కఠినమైన విధానాలను అమలుచేయాలి. ప్రజలకు ఉచిత ఆహార ధాన్యాలు అందించే పథకం వల్ల లాభం లేదు. అది ప్రజలను సోమరులను చేస్తోంది. అందుకే పరిశ్రమలు పెట్టినా బయటి నుంచి కార్మికులను తీసుకురావాల్సి వస్తోంది" అని భోపాల్‌లోని 'హెచ్‌ఈజీ లిమిటెడ్' మాజీ వైస్ ప్రెసిడెంట్ రాజేంద్ర కొఠారి బీబీసీతో అన్నారు.
పెట్టుబడిదారులను ఆకర్షించడానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా దేశంలోని ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలలో పర్యటించారు.
ఈ సదస్సు తరువాత రాష్ట్రంలో పెట్టుబడులు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- అస్సాం: ‘మా ఇళ్లు కూల్చడానికి బదులు మమ్మల్ని చంపేయండి’
- రాహుల్ గాంధీ: ‘మోదీ చేయనిది.. రాహుల్ చేశారు’ – భారత్ జోడో యాత్ర గురించి విదేశీ మీడియా ఎలా విశ్లేషిస్తోంది?
- జోషిమఠ్ ‘కుంగిపోతోంది’ - కుప్పకూలిన ఆలయం.. ఇళ్లు వదిలి పోతున్న జనం.. ఈ హిమాలయ నగరంలో ఏం జరుగుతోంది?
- మైనర్ హిందూ బాలిక ‘కిడ్నాప్, మతమార్పిడి, వివాహం’.. పాకిస్తాన్లో ఆందోళనలు
- హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ప్రజల కష్టాలేమిటి? మునిసిపాలిటీ పరిధిలోకి వస్తే ఏం జరుగుతుంది?












