హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో ప్రజల కష్టాలేమిటి? మునిసిపాలిటీలో విలీనమైతే ఏం జరుగుతుంది?

సికింద్రాబాద్ కంటోన్మెంట్
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

హైదరాబాద్ నగరంలో ఒక సుదీర్ఘ సమస్యకు ముగింపు దొరకబోతోంది.

తిరుమలగిరి, మారేడుపల్లి, అమ్ముగూడ, హకీంపేట, జవహర్ నగర్, కార్ఖాన, బోయినపల్లి, కౌకూరు, బొల్లారం ప్రాంత వాసుల జీవిత కాల కోరిక నెరవేరబోతోంది.

త్వరలోనే సికింద్రాబాద్ కంటోన్మెంటు బోర్డును గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ లో విలీనం చేయడానికి రంగం సిద్ధమైంది.

అసలేంటీ కంటోన్మెంటు బోర్డు?

మిలటరీ వారి సంస్థలు, నిర్మాణాలు ప్రధానంగా ఉండి, సైన్యం కోసం ఏర్పడ్డ ప్రాంతం కంటోన్మెంట్. దేశంలో ఇలాంటివి చాలా ఉన్నాయి.

అక్కడ సైనిక స్థావరాలతో పాటూ, సాధారణ పౌరులు కూడా ఉంటారు కానీ, ఆ ప్రాంతం స్థానిక పరిపాలన అంతా సైన్యమే చూసుకుంటుంది.

అంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎమ్మెల్యే, ఎంపీలు ఉంటారు కానీ, స్థానికంగా మునిసిపాలిటీ లేదా పంచాయితీ ఉండదు. దాని స్థానంలో కంటోన్మెంటు బోర్డు ఉంటుంది.

సికింద్రాబాద్ కంటోన్మెంట్

ఫొటో సోర్స్, UGC

18వ శతాబ్దంలో 3వ నిజాం రాజు హయాంలో బ్రిటిష్ వారి హైదారాబాద్ స్థావరంగా ఈ కంటోన్మెంట్ ఏర్పడింది. ఈ ప్రాంతం బ్రిటిష్ వారికి కీలక స్థావరంగా ఉండేది. స్వాతంత్ర్యం తరువాత బ్రిటిష్ వారి నుంచి నేరుగా భారత రక్షణ శాఖకు వెళ్లింది.

ప్రస్తుతం సికింద్రాబాద్ కంటోన్మెంట్ భారతదేశంలోనే రెండో అతి పెద్ద కంటోన్మెంట్. ఇది 40.14 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. ఇందులో 8 వార్డులు, 4 లక్షల మంది జనాభా ఉన్నారు.

కంటోన్మెంట్ బోర్డు ప్రెసిడెంట్‌గా సైన్యం నుంచి బ్రిగేడియర్ స్థాయి వ్యక్తి ఉంటారు.

బోర్డులో స్థానికుల ఓట్ల ద్వారా వచ్చిన 8 మంది వార్డు మెంబర్లు ఉంటే, రక్షణ శాఖ నియమించిన వారు 9 మంది ఉంటారు. కాబట్టి నిర్ణయాల్లో రక్షణ శాఖదే పైచేయి. ఈ బోర్డు 2006 కంటోన్మెంట్ చట్టం ప్రకారం నడుస్తుంది. 

సికింద్రాబాద్ కంటోన్మెంటు బోర్డు పరిధిలో 279 హౌసింగ్ కాలనీలు, 13 గ్రామాలు, 16 నోటిఫైడ్ సివిల్ బజార్ ప్రాంతాలు, రక్షణ శాఖ, రాష్ట్ర ప్రభుత్వ భూములు ఉన్నాయి. తిరుమలగిరి, మారేడుపల్లి, అమ్ముగూడ, హకీంపేట, జవహర్‌నగర్, కార్ఖాన, బోయినపల్లి, కౌకూరు, బొల్లారం ప్రాంతాలు ప్రస్తుతం సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఉన్నాయి.

సికింద్రాబాద్ కంటోన్మెంట్

ఫొటో సోర్స్, UGC

కంటోన్మెంటులో ఉంటే సమస్య ఏంటి?

కంటోన్మెంటులు ప్రధానంగా మిలటరీ వారి కోసం ఏర్పడ్డాయి. దీంతో అక్కడ అన్నీ మిలటరీ కేంద్రంగానే నడుస్తాయి. మారుతున్న కాలంతో అక్కడ పరిస్థితులు మారినా, చట్టాలూ, పద్ధతులూ మారలేదు. దీంతో ప్రజల జీవితాలతో రోజూవారీగా ముడిపడిన అంశాలు కూడా దిల్లీ నుంచి వచ్చే మిలటరీ అధికారులే నిర్ణయించాల్సిన పరిస్థితి. కంటోన్మెంట్‌లో నివసిస్తోన్న వారికి చాలా సమస్యలున్నా, ప్రధానంగా పాపులర్ అయింది రోడ్ల మూసివేత. అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు కంటోన్మెంట్ రోడ్లను మిలటరీ మూసివేస్తుండేది. కానీ ఒక దశలో చాలా రోడ్లను పర్మినెంటుగా మూసేసింది సైన్యం. దాంతో పాటూ చాలా రోడ్లపై అనేక ఆంక్షలు ఉండేవి.

  • సొంతింటికి వెళ్లాలన్నా ఐడీ కార్డు చూపించాలి
  • సొంతింటికి చుట్టాలు వచ్చినా మిలటరీ సెక్యూరిటీకి ముందుగా సమాచారం ఇవ్వాలి
  • మెప్మా వంటి రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఆలస్యంగా అందుతాయి
  • రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్ని సంక్షేమ పథకాలూ అందవు
  • ఇల్లు తిరిగి కట్టాలన్నా, పెద్ద మరమ్మత్తు చేయాలన్నా అనుమతుల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాలి
  • దగ్గరి దారులు మూసేస్తే దూరం దారుల నుంచి చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది
  • రాత్రి పూట రోడ్ల మూసివేస్తే చాలా ఇబ్బందులు పడాలి
  • రోడ్లు తగినంత వెడల్పుగా ఉండవు
  • గర్భిణులను ఆసుపత్రికి తీసుకెళ్లాలన్నా చుట్టూ తిప్పాలి
  • మంచి నీరు మూడు లేదా నాలుగు రోజులకు ఒకసారి మాత్రమే సరఫరా అవుతుంది
  • రెండు అంతస్తుల కంటే పెద్ద భవనం కట్టటానికి వీలు లేదు, భవనం 11 మీటర్ల ఎత్తు దాటకూడదు
  • వాణిజ్య కార్యకలాపాలకు అనేక ఇబ్బందులు
  • 133 చదరపు గజాల కంటే తక్కువ స్థలం ఉంటే ఇల్లు కట్టడానికి అనుమతి ఇవ్వరు. ఇంటి పర్మిషన్లు రెండేళ్ల వరకూ పడుతుంది.

సమస్యలపై స్థానికుల సంతకాల పోరాటం

వీటిలో రోడ్ల మూసివేత సమస్య తీవ్రంగా మారింది. స్థానికులు ఎన్నో ఆందోళనలు చేశారు. సంతకాల సేకరణ వంటివి చేశారు. అవతలవైపు ఉన్నది భారత సైన్యం కావడంతో ఆ గౌరవంతో ఆచితూచి వ్యవహరించేవారు.

ఒక దశలో కంటోన్మెంట్ బోర్డు పద్ధతి మార్చుకోకపోతే, కరెంటు, నీరు కట్ చేస్తామంటూ మంత్రి కేటీఆర్ గత మార్చిలో బహిరంగ హెచ్చరిక చేశారు.

కేటీఆర్ హెచ్చరిక ఆర్మీని అవమానించడం అంటూ బీజేపీ వ్యాఖ్యానించింది. ఇలా ఈ వ్యవహారం రాజకీయం కూడా అయింది.

ఈ సమస్యలపై పోరాటానికి కంటోన్మెంట్ ప్రజలు అనేక సంఘాలుగా ఏర్పడ్డారు. దిల్లీలో కూడా ఆందోళనలు చేశారు. అన్ని పార్టీలూ వీరి గురించి మాట్లాడాయి. ఎట్టకేలకు వారి ఆందోళనలు ఫలించాయి.

సికింద్రాబాద్ కంటోన్మెంట్

విలీన ప్రక్రియ ఇలా

దేశవ్యాప్తంగా కంటోన్మెంట్ల పరిధిలోని సివిల్ ఏరియాలు, అంటే సాధారణ పౌరులు ఉండే ప్రాంతాలను ఆయా స్థానిక ప్రభుత్వాలకే అప్పగించేయాలని కేంద్రం భావిస్తోంది.

దానిపై దేశంలో ఆర్మీ ఉన్నతాధికారుల, కంటోన్మెంటు బోర్డు సీఈవోల అభిప్రాయాలు తీసుకుంది రక్షణ శాఖ. వారు కూడా సానుకూలంగా స్పందించారు.

ఆ క్రమంలోనే గత ఏడాది ఆగస్టులో తెలంగాణ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది కేంద్ర రక్షణ శాఖ.

దీనికి తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పదించింది. మునిసిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఆధ్వర్యంలో ఆరుగురితో కమిటీ వేసి అధ్యయనం చేసింది.

చివరగా కేంద్ర రక్షణ శాఖకు విలీనానికి అనుకూలంగా లేఖ పంపింది. ఆ మేరకు డిసెంబరు 14న తెలంగాణ నుంచి కేంద్రానికి లేఖ వెళ్లింది.

వీడియో క్యాప్షన్, సింగరేణి గనుల నుంచి నల్ల బంగారం ఎలా తీస్తారో చూడండి

నెల రోజుల్లో నివేదిక

తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోవడంతో విలీనంపై ఒక ఉన్నత స్థాయి కమిటీ వేసింది కేంద్ర రక్షణ శాఖ. విలీనం ఎలా చేయాలి అనేదానిపై ఈ కమిటి ఒక నెల రోజుల్లో నివేదిక ఇస్తుంది.

రక్షణ శాఖ సంయుక్త కార్యదర్శి స్థాయి అధికారులు ఇద్దరు, తెలంగాణ మునిసిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి, కంటోన్మెంట్ బోర్డుల అదనపు డీజీ, సైన్యం ప్రధాన కేంద్రం నుంచి ఎల్ అండ్ డబ్ల్యు విభాగం అదనపు డీజీ, రక్షణ భూముల దక్షిణ భారత డైరెక్టర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ప్రెసిడెంట్, సీఈవోలు ఇందులో సభ్యులు.

ఈ ఎనిమిది మందిలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క అధికారే ఉన్నారు. రాజకీయ పదవుల వారు ఎవరూ లేరు. సైన్యం భవనాలు, ఇతర సైనిక సంబంధింత స్థలాలను వదిలేసి మిగిలిన వాటిని జీహెచ్ఎంసీలో ఎలా విలీనం చేయాలి అనే దానిపై ఈ సంఘం చర్చించి నివేదిక ఇస్తుంది.

ఉద్యోగులను ఏం చేయాలి, ఆస్తులు, అప్పుల పంపకం, భూమి, స్థిర, చర ఆస్తుల పంపకం వాటిని ఎలా అప్పగించాలి, ఎవరు ఎలా నిర్వహించాలి అనేవి చర్చిస్తారు. దీన్ని మరీ రాష్ట్రాల విలీనంతో పోల్చలేం కానీ, రెండు మునిసిపాలిటీలు లేదా కార్పొరేషన్లో దగ్గర్లోని మునిసిపాలిటీ విలీనంతో పోల్చవచ్చు.

అన్నీ సక్రమంగా జరిగితే బహుశా ఈ ఫిబ్రవరిలోనే కంటోన్మెంటు బోర్డు జీహెచ్ఎంసీలో విలీనం కావచ్చునని కొందరు అధికారులు బీబీసీకి చెప్పారు.

వీడియో క్యాప్షన్, తెలంగాణ: ‘చూపు పోయింది.. అడుక్కోమన్నారు, 50 ఏళ్లుగా ఈ రిపేర్లు చేసుకుని జీవిస్తున్నా’

ఎన్నాళ్లో వేచిన ఉదయం

‘‘ఈ నిర్ణయాన్ని మేం స్వాగితిస్తున్నాం. దీని కోసం మేం ఎంతో పోరాడాం. ఇది అన్ని విధాలా మాకు మేలు చేస్తుందని’’ అని బీబీసీతో చెప్పారు సంకి రవీందర్. ఆయన కంటోన్మెంట్ వికాస్ మంచ్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

  • జీహెచ్ఎంసీలో కలిస్తే మాకు మంచి రోడ్లు వస్తాయి. కంటోన్మెంట్ నుంచి వెళ్లే రాజీవ్ రహదారి కూడా 40 అడుగులకు పరిమితం అయింది. ఇకపై ఆ పరిస్థితి ఉండదు.
  • రోజు విడచి రోజూ మంచినీళ్లు వస్తాయి. ఇప్పుడు నాలుగు రోజులకు ఒకసారి వచ్చే నీళ్లతో బోరింగులపై ఆధారపడ్డాం. ఆ దుస్థితి తప్పుతుంది.
  • అన్ని రకాల పౌర సౌకర్యాలూ మెరుగుపడతాయి. ఇక్కడ ఏం చేయాలన్నా ఆర్మీ అనుమతి కావాల్సి రావడం పెద్ద సమస్య అయింది. ఆ పరిస్థితి ఉండదు.
  • చిన్న స్థలాలు ఉన్న వారికి తెలంగాణ ప్రభుత్వం భూమి రెగ్యులరైజ్ చేస్తున్నట్టుగా పథకాలు ఉండవు.
  • 20 వేల లోపు లీటర్లు నీరు వాడే వారికి ఉచిత మంచినీటి పథకం వస్తుంది.
  • స్ట్రాటజిక్ నాలా డవలెప్మెంట్ ప్రోగ్రామ్ కింద నాలాలు బాగు పడతాయి. ఇక్కడ చిన్న డిస్పెన్సరీలానే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అయితే పెద్ద ఆసుపత్రి కట్టవచ్చు.

కంటోన్మెంట్లో కలిస్తే ఇలాంటివి ఎన్నో రకాలుగా తమకు మేలు జరుగుతుంది అంటూ విలీనం గురించి చెప్పుకొచ్చారు రవీందర్.

వీడియో క్యాప్షన్, హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు ఆపారంటూ తన బైక్‌పై పెట్రోల్ పోసి తగలబెట్టిన యజమాని

‘విలీనం తరువాత లెక్కలు మారుతాయి’

సాధారణంగా జీహెచ్ఎంసీలో భూమి అమ్మితే 7.6 శాతం పన్ను ఉంటుంది. కంటోన్మెంట్లో 5 శాతం అధికంగా ఉంటుంది అంటూ అక్కడకీ, బయటి ప్రాంతాలకూ తేడా వివరించారు రవీందర్.

అన్నిటికీ మించి ప్రజాస్వామ్యం పెరుగుతుంది. ప్రస్తుతం కంటోన్మెంటు బోర్డులో వార్డు మెంబర్లు ఉన్నప్పటికీ, మిలటరీ అధికారుల పెత్తనం ఎక్కువగా ఉంటుంది. విలీనం తర్వాత కంటోన్మెంట్ బోర్డులోని వార్డు మెంబర్ల స్థానంలో జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు వస్తారు. అయితే వార్డులను యధాతథంగా డివిజన్లుగా ఉంచుతారా లేక ఆ సంఖ్యను పెంచడం కానీ తగ్గించడం కానీ చేస్తారా అనేది వేచి చూడాలి.

‘‘కంటోన్మెంటులో 2010 ప్రకారం 2.25 లక్షల జనాభా ఉంది. కానీ 2.5 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అదెలా సాధ్యం? చిత్రం ఏంటంటే, ఇక్కడ కనీసం జనాభా లెక్కలు కూడా సక్రమంగా జరగలేదు. కంటోన్మెంటు ఓటరు జాబితాలో ఫోటో ఉండదు. కేవలం పేరు వయసు ఉంటుంది. డోర్ నెంబర్ ఉన్న వారికే ఓటు ఉన్నప్పటికీ ఎన్నో అవకతవకలు ఉంటాయి. అందుకే, విలీనం తరువాత ఇక్కడ ఎన్నో లెక్కలు మారతాయి’’ అన్నారు రవీందర్.

కంటోన్మెంటు బోర్డుకు ప్రత్యక్షంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నిధులు రావు. స్వతంత్ర సంస్థ కావడంతో వారు కట్టే పన్నులతోనే నడవాలి. కానీ తాజా విలీనంతో తమకు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మరింత అభివృద్ధి జరుగుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

అంతే కాదు, కంటోన్మెంట్‌లో సుమారు 10 వేల ఎకరాల భూములు ఉంటే, అందులో సుమారు 6 వేల ఎకరాలు భూములు ఆర్మీ కిందకు పోయినా, మిగిలిన 4 వేల ఎకరాల సివిల్ భూమి అందుబాటులోకి వస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)