సిగరెట్ల రిటైల్ అమ్మకాలపై నిషేధం విధించడం సాధ్యమేనా.. అలా చేస్తే ఏం జరుగుతుంది?

వీడియో క్యాప్షన్, దేశంలో సిగరెట్లను విడిగా అమ్మడంపై నిషేధాన్ని పరిశీలిస్తున్న కేంద్రం

పొగతాగడం ఆరోగ్యానికి హానికరం .. సిగరెట్ ప్యాకెట్లు, గోడలు, బిల్ బోర్డులు, హోర్డింగులు, సినిమా థియేటర్లలో, ఇంకా అనేక మార్గాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తోంది ప్రభుత్వం.

అధికారంలో ఏ పార్టీ ఉన్నా, ఆర్థిక మంత్రి ఎవరైనా సరే.. బడ్జెట్‌లో రెవిన్యూ పెంచుకునేందుకు సిగరెట్లు ఒక అవకాశం.

ప్రజారోగ్యంతో ముడిపడిన పొగాకు వినియోగాన్ని నియంత్రించడం ద్వారా తగ్గించాలనే విధానాన్ని అమలు చేస్తున్నారు పాలకులు.

ఎంతగా ప్రచారం చేసినా... సిగరెట్లు, బీడీలు, గుట్కా, ఖైనీల రూపంలో పొగాకు వాడకం ఏటేటా పెరుగుతోందని చెబుతున్నాయి అధికారిక గణాంకాలు.

అందుకే పొగ తాగడాన్ని తగ్గించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంటోంది కేంద్ర ప్రభుత్వం.

సిగరెట్లను లూజుగా అమ్మడాన్ని నిషేధించే ఆలోచనలో ఉంది.

బోర్ కొట్టినప్పుడల్లా ఓ సిగరెట్ తాగేవాళ్ళు ఇకపై సింగిల్ సిగరెట్ కొనలేకపోవచ్చు.

ఎందుకంటే ఇక నుంచి విడివిడిగా అంటే సింగిల్‌గా సిగరెట్‌ అమ్మకపోవచ్చు.

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ మేరకు కేంద్రానికి సిఫార్సు చేసింది.

జీఎస్టీ అమలయ్యాక కూడా పొగాకు ఉత్పత్తులపై పన్నుపెద్దగా పెరగలేదని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ గుర్తించింది.

పొగాకు ఉత్పత్తులైన బీడీలపై 22 శాతం, సిగరెట్లపై 53 శాతం, నమిలే పొగాకుపై 64 శాతం జీఎస్టీ విధిస్తోంది.

అయితే సిగరెట్లపై 75 శాతం జీఎస్టీ విధించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత ప్రభుత్వాన్ని కోరింది.

సిగరెట్ వాడకం మన దేశంలో ఎలా ఉంది

ఫౌండేషన్ ఫర్ స్మోక్ ఫ్రీ వరల్డ్ నివేదిక ప్రకారం పొగాకు వినియోగంలో భారత్‌ది ప్రపంచంలోనే రెండో స్థానం.

దేశంలో 26.7 కోట్ల మంది పొగ తాగుతున్నారు.

సిగరెట్లు, బీడీలు తాగే వారి సంఖ్య 10 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

పొగాకు ఉత్పత్తుల్ని నమిలి తినేవారిలో పదిహేనేళ్లు పైబడిన వారు దాదాపు 20కోట్ల మంది ఉన్నారు.

స్మోకింగ్ వల్ల ఏటా 12లక్షల మంది చనిపోతున్నారు.

పొగాకు నమలడం వల్ల 3.5 లక్షల మంది మరణిసున్నారు.

2018లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనమిక్స్ రిసెర్చ్ చేసిన సర్వేలో సిగరెట్లు తాగే వారిలో 46 శాతం మంది నిరక్షరాస్యులని, 16 శాతం మంది కాలేజ్ విద్యార్థులని తేలింది.

అత్యధికంగా పొగాకు వినియోగిస్తున్న దేశాలు..

ప్రపంచంలో ఎక్కువగా పొగాకును ఉత్పత్తి చేస్తోంది, తాగుతోంది చైనా.

అక్కడ దాదాపు 30 కోట్ల మంది ప్రజలు పొగ తాగుతున్నారు.

బహిరంగ ప్రదేశాలలో స్మోకింగ్ బ్యాన్ చేసిన దేశాలలో మొట్టమొదటి దేశం భుటాన్.

ఐర్లాండ్ , గ్రీస్, బల్గేరియా, మాల్టా, స్పెయిన్, హంగేరీ, భారత్‌లో కూడా బహిరంగ ప్రదేశాలలో స్మోకింగ్ బాన్ అమలులో ఉంది.

న్యూజిలాండ్ కూడా పిల్లలకు సిగరెట్లు అమ్మతే కఠిన చర్యలు తీసుకోనుంది.

2027 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలు సిగరెట్లు కొనుగోలు చేయకుండా కఠిన నిబంధనలు తీసుకువచ్చింది.

మున్ముందు స్మోకింగ్ ను కూడా బ్యాన్ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.

సిగరెట్లు

ఫొటో సోర్స్, Getty Images

రైతులు ఏమంటున్నారు

దేశంలో పొగాకు ప్రత్యక్షంగా పరోక్షంగా మూడున్నర కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోంది.

లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నా.. పొగాకు రైతులు నష్టపోతూనే ఉన్నారు.

పొగాకుతో వ్యాపారం చేస్తున్న సంస్థలు కోట్ల రూపాయల లాభాలు ఆర్జిస్తుంటే.. రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి.

పొగాకు ఉత్పత్తిలో ఖర్చులు పెరిగినంతగా.. పొగాకు ధరలు పెరగడం లేదనేది చేదు నిజం.

ఆరోగ్యం పై ప్రభావం

పొగ తాగడం వల్ల క్యాన్సర్‌తో పాటు ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యాధులు, దంతపరమైన సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.

పొగ తాగడం, పొగాకు నమలడం వల్ల చాలా రకాల క్యాన్సర్లు వస్తున్నాయి.

సిగరెట్ వల్ల ప్రతి ఏటా 21 శాతం మంది కాన్సర్ బారిన పడుతున్నారు.

ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా 80 లక్షల మంది పొగాకు వినియోగం కారణంగా చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తోంది డబ్యూహెచ్ ఓ.

పొగాకుని పండించడం నిలిపివేస్తే దాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉండదు కదా అని గుంటూరులో వైద్యుడిగా పని చేస్తున్న హనుమంతరావు అడిగిన ప్రశ్న అర్థవంతమైనదే కావచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)