ముద్దుపెట్టుకున్నందుకు మహిళకు రాళ్లతో కొట్టి చంపేలా మరణ శిక్ష.. చివరికి 6 నెలల జైలు శిక్ష

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జీనబ్ మొహమ్మద్ సలీహ్
- హోదా, ఖార్టుమ్
సూడాన్‌కు చెందిన ఒక మహిళ, ఒక వ్యక్తిని ముద్దు పెట్టుకున్నట్లుగా అంగీకరించడంతో ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష విధించారు. వ్యభిచారం అభియోగాలతో అరెస్ట్ అయిన ఆమెకు మరణశిక్ష తప్పింది.
20 ఏళ్ల ఆ మహిళకు తొలుత చనిపోయేవరకు రాళ్లతో కొట్టడం అనే శిక్ష విధించారు. దీనిపై అంతర్జాతీయంగా విమర్శలు వచ్చాయి.
ఈ శిక్షను ‘‘అంతర్జాతీయ చట్టం తీవ్ర ఉల్లంఘన’’గా ఆఫ్రికన్ సెంటర్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ స్టడీస్ (ఏసీజేపీఎస్) వర్ణించింది.
ఆమె ప్రియుడిని, ఆమె బంధువు ఒకరు హత్య చేసిన తర్వాత పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. వ్యభిచారం కింద కేసు నమోదు చేశారు. భర్త నుంచి ఆమె విడిపోయారు.
వ్యభిచార ఆరోపణలు రుజువు కావడంతో సుడాన్ వైట్ నైల్ రాష్ట్రంలోని కోస్తీ నగర కోర్టు ఆమెకు మరణశిక్షను విధించింది.

ఫొటో సోర్స్, SIHA
ఈ తీర్పుపై అంతర్జాతీయంగా ఖండనలు రావడంతో వైట్ నైల్ రాష్ట్ర కోర్టు ఈ కేసును మరోసారి విచారించింది. చివరకు జడ్జి ఆమెపై నమోదైన అభియోగాన్ని ‘‘వ్యభిచారం’’ నుంచి ‘‘అశ్లీల చర్య’గా మార్చారు. ఈ మేరకు ఆమె జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది.
ఒక వ్యక్తితో కలిసి ఉంటున్నట్లు, తామిద్దరం ముద్దు పెట్టుకున్నట్లు ఆమె కోర్టు ముందు అంగీకరించారు.
ఆమెను దోషిగా నిర్దారించడం తప్ప జడ్జి ముందు వేరే అవకాశాలు లేవని ఆమె తరఫు న్యాయవాది అంతిసర్ అబ్దుల్లా అన్నారు.
‘‘విషయం ఏంటంటే, ఒక వ్యక్తితో కలిసి ఉంటున్నట్లు ఆమె కోర్టు ముందు ఒప్పుకున్నారు. ఆమె చాలా చిన్నపిల్ల. ఈ కేసులోని చిక్కుల గురించి ఆమెకు ఏమీ తెలియదు’’ అని బీబీసీకి ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇన్నాళ్లు బెయిల్‌పై బయట ఉన్న ఆమె ఇప్పుడు శిక్ష అనుభవించడం కోసం జైలుకు వెళ్లారు.
తొలుత ఆమెకు న్యాయవాదిని అనుమతించలేదని, విధానపరమైన లోపాలతో రాళ్లతో కొట్టి చంపే శిక్ష విధించారని, ఇప్పుడు ఈ తీర్పును వెనక్కి తీసుకున్నారని ఏసీజేపీఎస్ చెప్పింది.
కొన్ని రకాల ‘హుదుద్’ నేరాలకు సూడాన్ ఇంకా రాళ్లతో కొట్టి చంపే శిక్షలు విధిస్తుంది. ‘హుదుద్’ నేరాలు అంటే ఖురాన్‌లో అల్లా పేర్కొన్న నేరాలు. దొంగతనం, వ్యభిచారం వంటి నేరాలు అక్కడ ఈ కోవలోకే వస్తాయి.
సూడాన్ చట్టంలో కొరడాతో కొట్టడం, కాళ్లుచేతుల్ని నరికేయడం, ఉరిశిక్ష, రాళ్లతో కొట్టడం వంటి శిక్షలు ఉన్నాయి.
సూడాన్‌లో ప్రధానంగా మహిళలకు విధించిన రాళ్లతో కొట్టే శిక్షల్లో ఎక్కువ వాటిని హైకోర్టు రద్దు చేసింది.
ఆమెపై జరిగిన విచారణ "ఒక జోక్" అని ఓ ప్రభుత్వ అధికారి కూడా అంగీకరించారు. "ఈ విషయంలో జోక్యం చేసుకుని ఆమెను విడిపించగలిగే మంత్రులెవరూ మాకు లేరు" అని ఆయన అన్నారు.
2021 తిరుగుబాటు తర్వాత సూడాన్‌ను మిలిటరీ జుంటా ప్రభుత్వం పాలిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- ప్రపంచ కుబేరుని కథ: ఎలాన్ మస్క్‌ను వెనక్కి నెట్టిన బెర్నార్ ఆర్నో ఎవరు
- ‘‘జీతాలు పెరగలేదు.. రెండు ఉద్యోగాలు చేసినా పూట గడవటం కష్టమవుతోంది’’
- రిషి రాజ్పోపట్: 2500 ఏళ్ల నాటి సంస్కృత సమస్యకు.. భారతీయ విద్యార్థి పరిష్కారం
- భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో 7 కిలోమీటర్ల పొడవైన లఖ్‌పత్ కోట గురించి మీకు తెలుసా?
- అక్కడ చికెన్ కంటే ఎలుక మాంసం ధర ఎక్కువ... దీని రుచి ఎలా ఉంటుంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














