అస్సాం: ‘మా ఇళ్లు కూల్చడానికి బదులు మమ్మల్ని చంపేయండి’

- రచయిత, దిలీప్ కుమార్ శర్మ
- హోదా, బీబీసీ హిందీ కోసం
‘ప్రభుత్వం మా ఇళ్లు కూల్చేసింది. పిల్లలతో మేమంతా ఎక్కడికి వెళ్లాలి. అన్నీ ధ్వంసమయ్యాయి. ప్రభుత్వం ఇచ్చిన ఇల్లూ ధ్వంసమైంది’
‘చూడండి.. ఎముకలు కొరికే చలిలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. మాపై ఎందుకీ అణచివేత. ఇళ్ల వద్ద బయట ప్లాస్టిక్ గుడారాల్లో మొదట ఉండనిచ్చారు.. ఇప్పుడు అక్కడి నుంచీ వెళ్లిపోమంటున్నారు. ఎక్కడికి వెళ్లాలి. ప్రశాంతంగా జీవించడానికి మాకు కొంత భూమి ఇవ్వండి. లేదంటే చంపేయండి’
అస్సాంలోని బాటాద్రవా హాయీదూబీ గ్రామానికి చెందిన 73 ఏళ్ల అమీనా ఖాతూన్ గద్గద స్వరంతో చెప్పిన మాటలివి.
డిసెంబర్ 19న అస్సాం ప్రభుత్వం నగావ్ జిల్లా బాటాద్రవా పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ భూమిని ఖాళీ చేయించడానికి శాంతిజన్ బజార్ ప్రాంతం చుట్టూ ఉన్న నాలుగు గ్రామాలలో ఆక్రమణల తొలగింపు పనులు చేపట్టింది.
900 బిఘాల (సుమారు 1.2 చదరపు కిలోమీటర్లు) విస్తీర్ణంలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని 302 కుటుంబాలు నివసిసిస్తున్నాయని అక్కడి అధికారులు చెప్తున్నారు.

అమీనా ఖాతూన్ నివసించే హాయీడూబీ గ్రామంలో కొద్దిరోజుల కిందట వరకు ఆమె ఇల్లు ఉండేది. ఇప్పుడు ఆ ప్రాంతమంతా శిథిలాలతో నిండిపోయింది.
హాయీడూబీతో పాటు జమాయీ బస్తీ, భొమ్రగురి, లాలుంగ్ గ్రామాలలోనూ ప్రభుత్వం భూములను జిల్లా అధికారులు ఖాళీ చేయించారు. ఈ గ్రామాలన్నీ బాటాద్రవా మఠం(అస్సామీ సమాజానికి పవిత్ర స్థలం) సమీపంలో ఉన్నాయి.
15-16 శతాబ్దాల ప్రాంతానికి చెందిన సంస్కర్త, పండితుడు శ్రీమంత శంకరదేవ జన్మస్థలం ఈ బాటాద్రావా. అస్సాంలోని సత్రాలకు సంబంధించిన భూసమస్యలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం మగ్గురు ఎమ్మెల్యేలతో ఒక కమిటీ వేసింది. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆక్రమణల తొలగింపు కార్యక్రమం చేపట్టింది.

ఈ ఆక్రమణల తొలగింపు డ్రైవ్ తరువాత ఇల్లు కోల్పోయిన అనేకమంది తమ బంధువుల ఇళ్లలో తలదాచుకున్నారు.
మరికొందరు అద్దె ఇళ్లకు మారిపోయారు.
అయితే, అమీనా ఖాతూన్, మరో 30 కుటుంబాలు తమకు తెలిసినవారికి చెందిన స్థలాలలో ప్లాస్టిక్ షీట్లతో గుడారాలు వేసుకుని అందులో నివసిస్తున్నాయి.
చలి నుంచి తమను తాము కాపాడుకోవడానికి వారు ఈ గుడారాల్లో నేలపై ఎండుగడ్డి పరుచుకున్నారు.
ఇళ్లు కూల్చేయడంతో నిరాశ్రయులైన వీరంతా ఆ గుడారాల్లోనే రాత్రంతా గడుపుతున్నారు.

‘రాత్రి పూట చలికి నిద్రపట్టడం లేదు. గుడారాల్లోకి కుక్కలు, పిల్లులు వచ్చేస్తున్నాయి. నా భర్త, కొడుకు చనిపోయారు. ఈ కష్టాలు తట్టుకోలేకపోతున్నాను. నా మనవడు, కోడలితో కలిసి సిగ్గుపడుతూ ఇక్కడ బతుకుతున్నాను’ అన్నారు అమీనా ఖాతూన్.
డిసెంబర్ 15న వందలాది మంది పోలీసులు ఒక్కసారిగా వచ్చి ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించారని స్థానికులు చెప్పారు.
శాంతిజన్ బజార్ ప్రాంతంలో 600 మంది భద్రతాసిబ్బందిని మోహరించి ఆక్రమణల తొలగింపు కార్యక్రమం చేపట్టినట్లు నగావ్ జిల్లా ఎస్పీ లీనా డోల్ విలేకరులకు చెప్పారు.
ఈ ఆక్రమణల తొలగింపుల తరువాత ప్లాస్టిక్ టెంట్‌లో నివసిస్తున్న మొహమ్మద్ సోహ్రబుద్దీన్ మాట్లాడుతూ.. ‘‘ఇళ్లు కూల్చడానికి నాలుగైదు రోజుల ముందునుంచే పోలీసులు వచ్చారు. ఏమీ లేకుండా ఇంతమంది పోలీసులు ఎందుకొచ్చారో అనుకున్నాను. ఏదో ప్రమాదం జరగనుంది అనుకున్నాను. కొద్దిమంది మాత్రం ఇళ్లు కూల్చడానికే బలగాలు వస్తున్నాయని తెలుసుకుని ఇంట్లోని సామగ్రి తీసుకుని వెళ్లిపోయారు. ఎవరం ఏమీ ఎదిరించలేదు. దరంగ్ జిల్లాలో తూటాలు ఎలా పేల్చారో చూశాం కదా’ అన్నారు.

తాపీ మేస్త్రీగా పనిచేసే 50 ఏళ్ల సోహ్రబుద్దీన్ తనకు 1988లో అప్పటి అస్సాం గణపరిషత్ ప్రభుత్వం హయాంలో ఈ భూమి ఇచ్చారంటూ ఆధారాలు చూపిస్తున్నారు. అప్పటి మంత్రి డిజేన్ బోరా తనలాంటి 14 మంది భూమి లేని పేదలకు హాయీడూబీలో 14 బిఘాల భూమి ఇచ్చారని చెప్తున్నారు. అయితే, ఆ భూమిహక్కు పత్రాలను ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం లేదు.
అంతేకాదు... ఈ భూముల్లో ఉండేవారి పౌరసత్వాన్నీ ప్రస్తుత ప్రభుత్వం ప్రశ్నిస్తోంది.
దీనికి సమాధానంగా వారంతా.... తాము భారతీయులమేనని చెప్తున్నారు. 71 ఏళ్ల హొయిబుర్ రెహ్మాన్ మాట్లాడుతూ.. ‘‘మేం ఈ దేశ పౌరులం. మాకు ఎన్ఆర్‌సీ ధ్రువపత్రం, ఓటర్ కార్డ్ ఉన్నాయి. ప్రభుత్వం మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతోందో తెలియదు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా మా ఇల్లు కూల్చేశారు. ఇంతకుముందు ప్రభుత్వం ఇళ్లు కట్టించింది. రోడ్లు వేయించింది, కరెంటు వేయించింది. అవన్నీ ఇప్పుడు మట్టిలో కలిసిపోయాయి. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మా పిల్లలను డాక్టర్లు, ఇంజినీర్లను చేస్తామన్నారు. కానీ, ఇప్పుడు ఇలా చేస్తున్నారు. మమ్మల్ని ఇలా నాశనం చేయడానికి బదులు అందరినీ వరుసలో నిల్చోబెట్టి తుపాకీతో కాల్చేసినా బాగుండేది’ అన్నారు.

ఈ గ్రామాల్లో అధికారులు ఖాళీ చేయించిన కుటుంబాలలో 99 శాతం మంది బెంగాలీ ముస్లింలు. అయితే, ఇదే సమయంలో కొందరు హిందువులకు చెందిన ఇళ్లు, దుకాణాలు కూడా కూల్చివేశారు అధికారులు.
ఇల్లు కోల్పోయిన ధరమ్ బోరా మాట్లాడుతూ.. ‘‘పైసాపైసా కూడబెట్టి పిల్లల కోసం ఇల్లు కట్టించాను. మళ్లీ నేను ఈ జన్మలో ఇల్లు కట్టించలేను. గవర్నమెంట్ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మా ఇళ్లను కూల్చేసింది. నా కూతురు ఈ సంవత్సరం మెట్రిక్యులేషన్ చదువుతోంది. ఇల్లు కూల్చివేయడంతో ఆమె మానసికంగా చాలా ఆందోళనకు గురైంది’ అన్నారు.
‘1966 నుంచి ఈ భూమిని అనుభవిస్తున్నాను.. ఇల్లు కూల్చివేయడానికి ఒక్క రోజు ముందు మాకు సమాచారం ఇచ్చారు. ఇంట్లో వస్తువులు బయటకు తీయడానికి కూడా సమయం ఇవ్వలేదు. మా పొరుగింటి గోపాల్ కలిత్‌ది పక్కా ఇల్లు. అది కూడా కూల్చేశారు. 58 ఏళ్లుగా ఇవే ఇళ్లలో ఉండేవాళ్లం. ఇప్పుడు మేమంతా ఒక కచ్చా ఇంట్లో అద్దెకు ఉంటున్నాం’ అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు ధరమ్ బోరా.

ఆక్రమణలు తొలగింపు కార్యక్రమం గురించి చెప్పిన తరువాత 80 శాతం మంది తమంతట తామే తమ ఇళ్లు, దుకాణాలను కూల్చివేసి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారని అధికారులు చెప్తున్నారు.
మొత్తం వ్యవహారంపై నగావ్ జిల్లా డిప్యూటీ కమిషనర్ నరేంద్ర షా ‘బీబీసీ’తో మాట్లాడుతూ.. తొలుత ప్రభుత్వ భూమిలో ఆక్రమణలను గుర్తించాం. నాలుగు గ్రామాలలో 900 బిఘాల స్థలం ఆక్రమణకు గురైనట్లు గుర్తించి చట్టప్రకారం ఖాళీ చేయించాం అని చెప్పారు. ఇదంతా శాంతియుత వాతావరణంలో సాగింది. వీలైనంత ఎక్కువ మందికి పట్టాలివ్వాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన చెప్పారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నవారిని మాత్రమే ఖాళీ చేయించినట్లు ఆయన చెప్పారు.
కాగా ఇళ్లు తొలగించిన 302 కుటుంబాలలో 90 శాతం మందికి సొంత భూమి ఉన్నట్లు ఆయన తెలిపారు. మరోవైపు నగావ్ జిల్లా అదనపు డిప్యూటీ కమిషనర్ శంతన్ బోరా మాట్లాడుతూ.. ఇల్లు కూల్చివేత తరువాత వారిలో 25 కుటుంబాలు మాత్రమే పునరావాసం కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు.
నిరాశ్రయులైనవారు చలిలో ఇబ్బందిపడుతున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా అర్హులైన, అసలైన పౌరులందరికీ సహాయం చేస్తామని చెప్పారు.

గత అసెంబ్లీ ఎన్నికలలో మఠం భూములలో ఆక్రమణల తొలగింపును బీజేపీ తమ ప్రధాన ప్రచారాస్త్రంగా వాడుకుంది. 2021 మే నెలలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారనే కారణంతో 4,449 కుటంబాలను ఖాళీ చేయించారు.
అస్సాం అసెంబ్లీలో ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం.. దరంగ్ జిల్లాలో 2,153 కుటుంబాలు, హోజాయ్ జిల్లాలోని లుమ్డింగ్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో 805 కుటుంబాలు, ధుబ్రి జిల్లాలో 404 కుటుంబాలను ఖాళీ చేయించారు.
భూమిలేని స్థానిక పౌరులకు ప్రభుత్వం భూమి పట్టాలిస్తుండగా బెంగాలీ మూలాలున్న భూమిలేని ముస్లింలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వ కొత్త భూవిధానంతో ఆందోళన చెందుతున్నారు.

ఫొటో సోర్స్, DILIP KUMAR SHARMA
కాగా బాటాద్రావా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ పౌరుడి ఇంటిని కూల్చివేసిన ఘటనపై కేసును గౌహతిలోని హైకోర్ట్ విచారించింది. బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ కూల్చివేతలపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన న్యాయవాది అన్వర్ హుసేన్ లష్కర్ ‘బీబీసీ’తో మాట్లాడారు. ‘గత ఏడాది మే నెలలో ఓ ముస్లిం యువకుడు పోలీస్ కస్టడీలో మరణించిన ఘటన తరువాత స్థానికులు కొందరు బాటాద్రవా పోలీస్ స్టేషన్‌ను తగలబెట్టారు. ఆ ఘటన పోలీసులకు కోపం తెప్పించింది. మరణించిన యువకుడి బంధువుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేశారు. ఇది చట్టవిరుద్ధం. అందుకే నేను గౌహతి హైకోర్టులో నేను ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాను’ అన్నారు.
ఈ కేసు విచారణ సమయంలో కోర్టు... ఎవరి అనుమతితో ఇళ్లను బుల్డోజర్లతో కూల్చారని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ప్రశ్నించింది. దానికి ఆయన చెప్పిన సమాధానంతో సంతృప్తి చెందని కోర్టు బాధితులకు పరిహారం ఇవ్వాలని ఆదేశించింది.
ఇవి కూడా చూడండి:
- 2023లో మానవ జీవితాల్ని మార్చబోయే 5 శాస్త్రీయ పరిశోధనలు
- ప్రేమ-సెక్స్: 2022లో వచ్చిన కొత్త మార్పులు ఏంటి?
- ఆనాటి కారు యాక్సిడెంట్లో ఓ క్రికెటర్ చనిపోయాడు, ప్రాణాలతో బయటపడ్డవారు ప్రపంచ ప్రఖ్యాత ఆల్‌రౌండర్స్ అయ్యారు
- న్యూయార్క్ మహా నగరం ‘ఖాళీ’ అయిపోతోంది... ఎందుకు?
- క్యాథలిక్: చర్చిలో మతాధికారి హోదా కోసం మహిళల పోరాటం... ససేమిరా అంటున్న వాటికన్ వర్గాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














