అస్సాం వరదలు: చితికి పోయిన బతుకు చిత్రాలు

మందులు తీసుకుంటున్న వరద బాధితుడు
ఫొటో క్యాప్షన్, వరదలతో అస్సాం వాసులకు తిండి, మంచి నీళ్లు, మందులు దొరకడం కష్టంగా మారింది

వరద ముంచెత్తిన అస్సాంలో ఇప్పుడు పరిస్థితి కాస్త మెరుగుపడింది. గత కొద్ది రోజులుగా భారీ వానలతో పోటెత్తిన వరదలు అస్సాంను అతలాకుతలం చేశాయి.

ఇప్పటి వరకు సుమారు 186 మంది చనిపోయారు. దాదాపు 9 లక్షల మంది వరదలతో తీవ్రంగా నష్టపోయారు. వేల మంది పునరావాస శిబిరాల్లో తలదాచుకున్నారు.

వరదలతో భారీగా నష్టపోయిన సిల్చార్ ప్రాంతానికి బీబీసీ ప్రతినిధి అన్షుల్ వర్మ వెళ్లారు. అక్కడ ఇళ్ల చుట్టూ ఎటు చూసినా నీరే కనిపిస్తోంది. తిండి, మందులు, మంచినీళ్లు దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీధుల నిండా నీరు ఉండటంతో వారికి నిత్యావసర సామాగ్రి చేరవేయడం అత్యంత కష్టంగా ఉంటోంది.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాలను చేరుకునేందుకు బోట్లు, తెప్పలు వంటి వాటి కోసం ప్రజలు వెతుకుతున్నారు. ముసలి వాళ్లు, అనారోగ్యంతో ఉన్న వాళ్లను నీళ్లు నిండిన ఇళ్ల నుంచి తరలించడం చాలా కష్టంగా మారుతోంది.

సిల్చార్ పునరావాస శిబిరంలో నిలబడి ఉన్న మహిళ
ఫొటో క్యాప్షన్, ఎంతో మంది కట్టుబట్టలతోనే పునరావాస శిబిరాలకు చేరుకున్నారు

భారత సైన్యం, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ముమ్మరంగా పునరావాస చర్యలు చేపడుతున్నాయి. నీటిలో చిక్కుకున్న వాళ్లను శిబిరాలకు తరలించడంతోపాటు బాధితులకు తిండి, మంచి నీళ్లు అందిస్తోంది. అస్సా వ్యాప్తంగా 299 శిబిరాల్లో 1,48,000 మందికిపైగా ప్రజలు తలదాచుకుంటున్నారని ఆ రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులు తెలిపారు.

పునరావాస శిబిరాల్లో పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉంది. పరిమితికి మించి ప్రజలను ఉంచుతున్నారు. కొన్ని సార్లు ఒక్కో గదిలో 30 మంది వరకు ఉండాల్సి వస్తోంది. చాలా వరకు ఇళ్లు, స్కూళ్లను తాత్కాలికంగా పునరావాస శిబిరాలుగా మార్చారు.

శిబిరాల్లోనూ పరిశుభ్రమైన నీళ్లు దొరకడం కష్టంగా ఉంటోంది. పరిసరాలు కూడా అంత స్వచ్ఛంగా లేవు. తమకు ఇంకా వైద్య సాయం అందలేదని వరదల్లో చిక్కుకుని ఇళ్ల నుంచి బయట పడే క్రమంలో గాయపడ్డ వారు చెబుతున్నారు. వరదల వల్ల కట్టుబట్టలతో బయటకు రావాల్సి వచ్చిందని, తమ గుర్తింపు పత్రాలన్నీ పోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అస్సాంలోని ఒక శిబిరం ముందు నీళ్లలో నిలబడి ఉన్న వ్యక్తి
ఫొటో క్యాప్షన్, తమ జీవితంలో ఇంత భయానక వరదలను చూడలేదని అస్సాం వాసులు చెబుతున్నారు
అస్సాంలోని సిల్చార్ ప్రాంతంలో శిబిరంలో తలదాచుకున్న తల్లి బిడ్డ
ఫొటో క్యాప్షన్, పునరావాస శిబిరాల్లో ఆహారం, మంచి నీళ్లు అయిపోతున్నాయని వరద బాధితులు చెబుతున్నారు
నీటిలో మునిగిపోయిన సిల్చార్ పట్టణం
ఫొటో క్యాప్షన్, పోటెత్తిన వరదలతో సిల్చార్ పట్టణమంతా నీటిలో ముగినిపోయింది. ప్రజలు పునరావాస శిబిరాలకు వెళ్లడం కూడా కష్టంగా మారింది
నీరు చుట్టుముట్టిన ఇళ్ల నుంచి చిన్నారులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు
ఫొటో క్యాప్షన్, వరద నీరు చుట్టుముట్టిన ప్రాంతాల నుంచి చిన్న పిల్లలను జాగ్రత్తగా పునరావాసా శిబిరాలకు తరలిస్తున్నారు
పునరావాస శిబిరాలకు చేరుకునేందుకు నీళ్లలోనే ప్రజలు నడుచుకుంటూ వెళ్తున్నారు
ఫొటో క్యాప్షన్, సిల్చార్‌లోని పునరావాస శిబిరాలకు ప్రజలకు భారీ సంఖ్యలో వెళ్తున్నారు
పునరావాస శిబిరం బయట ఉన్న వ్యక్తి
ఫొటో క్యాప్షన్, ‘పోయిన సారి వరదలు వచ్చినప్పుడు నా పౌరసత్వం, ఇతర గుర్తింపు కార్డులు పోయాయి. కానీ ఈ సారి వాటిని ప్లాస్టిక్ కవర్లో పెట్టి జాగ్రత్తగా ఉంచాను.’ అని ఈ వ్యక్తి చెబుతున్నారు.
బిస్కెట్ ప్యాకెట్లు పట్టుకుంటున్న వ్యక్తి
ఫొటో క్యాప్షన్, భారత సైన్యం, ఎన్‌డీఆర్ఎఫ్ వరద బాధితులకు తిండి, మంచి నీళ్లు చేరవేస్తున్నాయి
ఎన్‌డీఆర్ఎఫ్ అందించే సాయం తీసుకుంటున్న మహిళ
ఫొటో క్యాప్షన్, వరదలతో తీవ్రంగా నష్టపోయిన ప్రజలు, సాయం కోసం ఎదురు చూస్తున్నారు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)