మైనర్ హిందూ బాలిక ‘కిడ్నాప్, మతమార్పిడి, వివాహం’.. పాకిస్తాన్‌లో ఆందోళనలు

పాకిస్తాన్

ఫొటో సోర్స్, TWITTER

    • రచయిత, షుమాయిలా ఖాన్
    • హోదా, బీబీసీ ఉర్దూ, కరాచీ

పాకిస్తాన్‌లో ఒక హిందూ అమ్మాయిని కిడ్నాప్ చేసి బలవంతంగా మతమార్పిడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

కరాచీలో ఈ ఘటన జరిగింది. మైనర్ అయిన రొమిలా తేజా మహేశ్వరీ అలియాస్ సోనూను కిడ్నాప్ చేసినట్లు ఆమె తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో పెళ్లి కోసం ఇస్లాంలోకి మారినట్లు కోర్టులో రొమిలా చెప్పారు.

కోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం రొమిలా, షెల్టర్ హోమ్‌లో ఉన్నారు.

రొమిలా అన్నయ్య రాజేశ్ తేజా మహేశ్వరీ, బీబీసీతో మాట్లాడుతూ, ‘‘నేను ఒక ర్యాగ్ పికర్ (చెత్త ఏరుకునే వ్యక్తి)ని. డిసెంబర్ 19న మధ్యాహ్నం 12 గంటలకు రొమిలా ఇంటి నుంచి అపహరణకు గురైనప్పుడు నేను పనికి వెళ్లాను. అప్పుడు నా చెల్లితో పాటు నా భార్య ఇంట్లో ఉంది’’ అని చెప్పారు.

కుటుంబ సభ్యులు చెప్పినదాని ప్రకారం, రొమిలా వయస్సు 13 సంవత్సరాలు.

ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి వచ్చి సోనును తీసుకెళ్లినట్లు తాను ఇంటికి రాగానే తన భార్య చెప్పిందని ఆయన తెలిపారు.

‘‘వచ్చిన ముగ్గురిలో ఒకరు మా పొరుగు వ్యక్తి. అతన్ని నా భార్య గుర్తు పట్టింది’’ అని ఆయన చెప్పారు.

రొమిలా

ఫొటో సోర్స్, WERAGMAL MAHESHWARI

‘‘పెళ్లి కోసం ఇస్లాం మతం స్వీకరించా’’

‘‘మా ప్రాంతంలోని పెద్ద మనుషులను కలిసి సహాయం చేయాలని నేను అభ్యర్థించా. నా చెల్లెలిని తిరిగి తీసుకురావాలని వారిని కోరాను.

అప్పుడు వారు కిడ్నాపర్లలో ఒకరి తండ్రికి ఫోన్ చేశారు. ‘రొమిలాను తిరిగి పంపించాలని మీ కుమారుడికి చెప్పండి’ అని వారు అతనితో అన్నారు. కిడ్నాపర్ల బంధువులు అందరూ కలిసి నాలుగు రోజుల్లో ఈ మొత్తం వ్యవహారాన్ని గందరగోళంగా మార్చారు’’ అని రాజేశ్ చెప్పారు.

ఆ తర్వాత తమ సంఘం (మహేశ్వరీ యాక్షన్ కమిటీ) పెద్దలు ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేసి, కేసు నమోదు చేయాలని తనకు సలహా ఇచ్చారని తెలిపారు.

కరాచీ శివార్లలోని షేర్ షా సింధీ ప్రాంతంలో రొమిలా నివసిస్తారు.

తనకు ఇతర సహాయం అందకపోవడంతో రొమిలా అన్నయ్య రాజేశ్ తేజా, డిసెంబర్ 24న అర్షద్ ముహమ్మద్ సాలెహ్‌తో పాటు ఇద్దరు ఇతర వ్యక్తులపై కేసు దాఖలు చేశారు.

రొమిలా, రాజేశ్‌ల తల్లి 8 నెలల క్రితమే మరణించారు. వృద్ధుడైన వారి తండ్రి తన కూతురు రాక కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎఫ్ఐఆర్ తర్వాత, పోలీసులు ఆమెను (రొమిలా)ను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరిచారు. కోర్టులో ఇచ్చిన వాంగ్మూలంలో రోమిలా, తాను పెళ్లి కోసం ఇస్లాం మతంలోకి మారినట్లు చెప్పారు.

మత మార్పిడికి సంబంధించిన సర్టిఫికెట్‌తో పాటు వివాహ ద్రువీకరణ పత్రాన్ని నిందితులు కోర్టుకు సమర్పించారు.

పాకిస్తాన్

ఫొటో సోర్స్, WERAGMAL MAHESHWARI

షెల్టర్ హోమ్‌కు తరలింపు

రొమిలా ఇంకా మైనర్ అని, ఆమె వయస్సు కేవలం 13 సంవత్సరాలే అని ఆమె తండ్రి, అన్నయ్య చెబుతున్నారు.

రాజేశ్ తరఫు న్యాయవాది కిషన్ లాల్, కోర్టులో రోమిలా జనన ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించారు. ఈ కేసులో బాల్య వివాహ చట్టం ప్రకారం, నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆయన అప్పీల్ చేశారు.

రోమిలాను షెల్టర్ హోమ్‌కు తరలించాలని, అక్కడ ఆమె వయస్సును నిర్ధారించాలని కోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారాన్ని పూర్తిగా విచారించాలని నిర్దేశించింది.

వయస్సు నిర్ధారణకు సంబంధించిన పరీక్ష ఫలితాలు బుధవారం నాటికి వచ్చే అవకాశం ఉంది.

రోమిలాను అపహరించి, మతమార్పిడి చేయడాన్ని నిరసిస్తూ కరాచీలోని మహేశ్వరీ సంఘం రెండుసార్లు నిరసన ప్రదర్శనలు చేసింది. మౌలా మదాద్ రోడ్‌తో పాటు కరాచీ ప్రెస్ క్లబ్‌లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

పాకిస్తాన్

ఫొటో సోర్స్, WERAGMAL MAHESHWARI

ఫొటో క్యాప్షన్, సామాజిక కార్యకర్త నజ్మా మహేశ్వరీ

మహేశ్వరీ యాక్షన్ కమిటీకి చెందిన సామాజిక కార్యకర్త నజ్మా మహేశ్వరీ మాట్లాడుతూ, ‘‘వీరంతా రౌడీలు. రౌడీలకు, మతానికి ఎలాంటి సంబంధం ఉండదు. వారు కేవలం ప్రజలను బెదిరించి భయపెడతారు’’ అని అన్నారు.

‘‘ఒక 13 ఏళ్ల బాలిక మతాన్ని మార్చుకోలేదు. ఇంకా చెప్పాలంటే 18 ఏళ్ల అమ్మాయిని కూడా బలవంతంగా మతం మార్పించకూడదు. కాబట్టి 13 ఏళ్ల అమ్మాయిని బలవంతంగా ఇస్లాంలోకి మార్చకూడదు. దీన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. మాకు న్యాయం కావాలి’’ అని ఆమె వ్యాఖ్యానించారు.

రాజేశ్ తేజా మాట్లాడుతూ, ‘‘షెల్టర్ హెమ్‌కు వెళ్లి నేను రోమిలాను కలిశాను. అసలేం జరిగిందో ఆమె చెప్పలేదు. కానీ, తనను ఇంటికి తీసుకెళ్లాలని ఏడుస్తోంది’’ అని చెప్పారు.

వీడియో క్యాప్షన్, ఆరు దశాబ్దాలుగా ప్రజలు ఇక్కడ బౌద్ధమతంలోకి మారుతున్నారు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)