ప్రేమ-సెక్స్: 2022లో వచ్చిన కొత్త మార్పులు ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జెస్సికా క్లీన్
- హోదా, ...
మనుషుల్లో ఆడ, మగ మాత్రమే ఉంటారనే ‘బైనరీ’ భావనలను వదులుకోవటం, విధి నిషేధాలను వదిలించుకోవటం.. ఇంకా మరెన్నో పరిణామాలతో భారీ మార్పులు కనిపించిన 2022 సంవత్సరంలో.. ప్రేమ, శృంగారం కూడా భిన్నంగా కనిపించాయి.
ప్రేమ గురించి, సెక్స్ గురించి మనం ఆలోచించే తీరు నిరంతరం అభివృద్ధి చెందుతూ ఉంది. సాంస్కృతిక, రాజకీయ, ప్రపంచ పరిణామాలు మన ఆలోచనలపై ఎల్లప్పుడూ ప్రభావం చూపుతున్నాయి.
ఈ ఏడాది కూడా అంతే. ఆ ప్రభావం ఎక్కువగా ఆన్‌లైన్ ద్వారా వ్యాపించింది. ముఖ్యంగా LGBTQIA+ వర్ణపటానికి చెందిన వారిమని తమను తాము గుర్తించుకున్న వారు చూపిన ప్రభావమిది.
మరోవైపు, కోవిడ్ మహమ్మారి కారణంగా మొదలైన ‘ఆత్మపరిశీలన’.. డేటింగ్ ప్రపంచం మీద కూడా ప్రభావం చూపింది. ఫలితంగా ఆచరణలు మారాయి. ఎవరితో డేటింగ్ చేయాలి, ఎలా డేటింగ్ చేయాలి అనే అంశాల గురించి జనం మరింత ఎక్కువగా ఆలోచించారు.

ఫొటో సోర్స్, Getty Images
స్త్రీ, పురుషులనే బైనరీ భావనలకు దూరం
పాశ్చాత్య సంస్కృతిలో.. సంబంధాలు, లింగం, లైంగితలను అనాది కాలంగా బైనరీలు మాత్రమే నిర్వచించాయి. అంటే ఒక వ్యక్తి అయితే స్త్రీ అవ్వాలి, లేదంటే పురుషుడు కావాలి. ఒక వ్యక్తి స్త్రీకి కానీ, పురుషుడికి కానీ ఎవరికో ఒకరికే ఆకర్షితులు కావాలి. ఒక జంట అయితేనే వారు డేటింగ్ చేస్తున్నట్లు. అలా కాదంటే అది డేటింగ్ కాదు.
గత కొన్నేళ్లుగా ఈ బైనరీ భావనలు స్థిరంగా వదులవుతూ వచ్చాయి. లైంగిక ఆకర్షణలను, లింగి గుర్తింపులను మరింత మంది విభిన్నంగా చూడటం పెరిగింది. ఇది 2022లో మరింత స్పష్టంగా కనిపించింది.
లైంగిక ధోరణికి సంబంధించి.. భాగస్వామి కోసం అన్వేషిస్తున్న చాలా మందికి, ఎదుటి వ్యక్తి లింగం ఏమిటనే అంశం ప్రాధాన్యం తగ్గిపోయింది. ముఖ్యంగా మిలీనియల్స్, జనరేషన్ జడ్ తరం వారి సన్నిహిత సంబంధాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. కొంతమంది అయితే.. భాగస్వామిలో తాము కోరుకుంటున్న అంశాల్లో వారి లింగం ఏమిటనేది కనిష్ట ప్రాధాన్యానికి పడిపోయింది. ఇలాంటి వారిలో.. క్వీర్ లేదా పాన్‌సెక్సువల్ అని తమని తాము గుర్తించుకునే వారు ఎక్కువగా ఉన్నారు. అంటే.. వారి శృంగార, లైంగిక ఆకర్షణలకు లింగ ప్రాధాన్యత ఉండదు.
లండన్‌కు చెందిన 23 ఏళ్ల ఎల్లా డెరెగోవ్‌స్కా చెప్పినట్లు.. పాన్‌సెక్సువల్‌గా తనను తాను గుర్తించటం వల్ల.. ‘‘నాకు కలిగే ప్రతి ఆకర్షణనూ అంగీకరించగలిగే సరళత్వం నాకు లభించింది. ఆ ఆకర్షణలను వివరించటానికి నా గుర్తింపును లేదా ముద్రను నేను పునఃపరిశీలించుకోవాల్సిన అవసరం లేకుండాపోయింది’’.
ఈ విధమైన నాన్-బైనరీ ఆకర్షణలను (అంటే స్త్రీ యా, పురుషుడా అనే తేడా లేకుండా కలిగే ఆకర్షణలను) విషయంలో) అంగీకరించటం పెరిగింది. దీనికి.. పాపులర్ మీడియాలో, టెలివిజన్ షోలు, కార్యక్రమాల్లో అటువంటి పాత్రల ప్రాతినిధ్యం పెరగటం, పలువురు ప్రముఖులు తాము పాన్‌సెక్సువల్ వ్యక్తులమని బహిరంగంగా గుర్తించుకోవటం ఒక కారణమని నిపుణులు చెప్తున్నారు.
ఈ ఏడాది నుంచి బైనరీల నుంచి మారింది కేవలం లైంగిక ధోరణి ఒక్కటే కాదు. చాలా మంది యువత (సెలబ్రిటీలు కూడా) తమ లింగం ఏమిటనేది వర్ణించే విషయంలో కూడా బైనరీ భావనలను పక్కన పెడుతున్నారు.
‘నాన్-బైనరీ’ లేదా ‘జెండర్ ఫ్లూయిడ్’గా గుర్తించుకోవటం వల్ల చాలా మంది తమను తాము మరింత నిజాయితీగా వ్యక్తీకరించుకునేందుకు వీలు కల్పిస్తోంది.
‘‘ఒక్కోసారి పొద్దునే నేను నిద్ర లేచాక నాలో స్త్రీతత్వం ఎక్కువగా కనిపిస్తుంది. చెవులకు రింగులు పెట్టుకోవాలని, సగం టాప్ ధరించాలని అనిపిస్తుంది. ఒక్కోసారి నా వక్షోజాలు ఎక్కువగా కనిపించకుండా బైండర్ ధరించాలని అనిపిస్తుంది’’ అని బార్సెలోనాకు చెందిన 26 ఏళ్ల కార్లా హెర్నాండో చెప్పారు.
అయితే.. లైంగికత్వంలో, లింగం విషయంలో బైనరీలను బద్దలుకొడుతున్న జనం పెరుగుతున్నా కూడా.. అలాంటి వారికి డేటింగ్ విషయంలో సమస్యలు తప్పటం లేదు.
లింగం విషయంలో బైనరీలను అమలు చేస్తున్న డేటింగ్ యాప్‌లు మొదలుకుని.. నాన్-బైనరీ వ్యక్తులను లింగ ఆధారిత పాత్రల్లోకి నెట్టే భాగస్వాముల వరకూ.. ఇలాంటి సమస్యలు ఇంకా తగ్గలేదు. ఎందుకంటే బైనరీ జండర్ విధానాల నుంచి దూరం జరుగుతున్న ఈ ఉద్యమం ఇంకా సమాజంలో లోతుగా పాతుకోలేదు.

ఫొటో సోర్స్, Getty Images
సంబంధాల్లో విధినిషేధాలు, సంప్రదాయాల పట్ల ధిక్కారం
సమాజంలో సంస్కృతుల్లో లోతుగా పాతుకుపోయి ఉన్న విధివిధానాలను యువతరం ధిక్కరించటం ఈ ఏడాది పెరిగింది.
జనరేషన్ జడ్ తరంవారు.. డేటంగ్‌లో ఉద్దేశపూర్వకంగా ‘సిట్యుయేషన్‌షిప్’లు నెలకొల్పుకుంటున్నారు. ఈ సంబంధాలు.. సాహచర్యం, సాన్నిహిత్యం, సెక్స్ అవసరాలను తీరుస్తాయి. కానీ దీర్ఘకాలిక సహజీవనం, వివాహం వంటి లక్ష్యాలు ఈ సంబంధాలకు ప్రాతిపదికగా ఉండవు. సన్నిహిత సంబంధానికి, సెక్స్ కోసం కలవటానికి (కాజువల్ హుకప్‌కు) మధ్యస్థంగా ఉండే ‘సిట్యుయేషన్‌షిప్’లు ఇవి.
అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్‌లో సోషియాలజీ ప్రొఫెసర్ ఎలిజబెత్ ఆర్మ్‌స్ట్రాంగ్.. ఇటువంటి సంబంధాలపై అధ్యయనం చేస్తున్నారు. ‘‘కారణమేదైనా కానీ, ఈ ‘సిట్యుయేషన్‌షిప్’ అనేది ప్రస్తుతానికి పని చేస్తుందని, ఆ సంబంధం ప్రస్తుతానికి మాత్రమేనని జనరేషన్ జడ్ తరంవారు భావిస్తున్నారు. ‘ఇది ఇంకెక్కడికో వెళతుందనే ఆందోళన అవసరం లేదు’ అనే భావన వారిలో ఉంది’’ అని ఆమె చెప్పారు.
మొత్తంమీద చూస్తే.. అన్ని విధాలైన సంప్రదాయేతర సంబంధాలు మరింత ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఏకభర్తృత్వం లేదా ఏకపత్నిత్వం అనే దానికి విరుద్ధంగా, నైతిక బహుళ సంబంధాలు (ఎథికల్ నాన్-మోనోగమీ) టిక్‌టాక్ అంతటా కనిపిస్తున్నాయి. వీటినే పాలియామోరస్ సంబంధాలుగా చెప్తున్నారు. ఈ సంబంధాల్లో.. ఇద్దరి కన్నా ఎక్కువ మంది రొమాంటిక్ లేదా సెక్సువల్ భాగస్వాములు కలిసి జీవిస్తారు.
ఇక ‘ఓపెన్ రిలేషన్‌షిప్స్’ కూడా పెరిగాయి. భాగస్వాములుగా ఉన్న ఇద్దరూ.. వేరే జంటతో తాత్కాలిక సెక్స్‌లో పాల్గొనటం, తమ ప్రధాన భాగస్వాములతోనే కాకుండా బయట వేరే సంబంధాలు కలిగి ఉండటం.. ఇలాంటి సంబంధాల కిందికి వస్తాయి.
అలాగే ఒంటరిగా నివసిస్తూ.. బహుళ సంబంధాలు నెలకొల్పుకుని కొనసాగించే ‘సోలో పాలియామోరస్’ జీవనశైలి కూడా పెరుగుతోంది.
ఇంకొందరు.. లైంగిక వాంఛలేకుండా ‘మానసిక భాగస్వాముల’తో సహజీవనం చేయటానికి మొగ్గుచూపుతున్నారు. ప్రేమికులతో కాకుండా, సన్నిహిత మిత్రులతో శాశ్వత సంబంధాలు ఏర్పరచుకుంటూ వారితో కలిసి నివసించటానికి ఇళ్లు కొనుక్కోవటం, భవిష్యత్ ప్రణాళికలను రచించుకోవటం చేస్తున్నారు.
ఇలాంటి ధోరణులు పెరుగుతున్నా కూడా.. సంబంధాలపై అనేక విధినిషేధాలు, కాల్పనిక భావనలు కొనసాగుతూనే ఉన్నాయి. బహుశా ఇకముందూ కొనసాగుతాయి కూడా.
జంటగా లేని ఒంటరి వారిని గేలి చేయటం.. మహమ్మారి ఆరంభం నుంచి బలంగా సాగుతోంది. బ్రిటన్‌లోని ఒంటరి వయోజనుల్లో 52 శాతం మంది.. తాము సంబంధంలో కాకుండా ఒంటరిగా ఉండటం వల్ల హేళనకు గురయ్యామని.. ఒక సర్వేలో చెప్పారు.
లియొనార్డో డికాప్రియోను, ఆయన స్నేహితులను.. వారి మధ్య సంబంధాల్లో ఎక్కువగా వయసు తేడా ఉండటాన్ని జనం ఇంకా తప్పుపడుతున్నారు.
అలాగే ‘ఆపోజిట్స్ అట్రాక్ట్’ – అంటే ‘భిన్నధృవాలు ఆకర్షించుకుంటాయి’ అనే తరహా కాల్పనిక భావనలు ఇంకా బలంగానే ఉన్నాయి.
విడిపోవటం, విడాకుల కష్టాలకు ‘కోచింగ్’ పరిష్కారాలు
డేటింగ్‌లో విభిన్న వైఖరులు పెరుగుతున్నా కానీ.. విడిపోవటం ఏమంత సులభం కాలేదు.
లాక్‌డౌన్లలో డేటింగ్‌తో జంటకట్టిన వాళ్లలో చాలా మంది.. 2022 సంవత్సరంలో సాధారణ పరిస్థితుల్లో ఆ సంబంధాలను కొనసాగించటానికి కష్టాలుపడుతున్నారు. ఒంటరితనంలో బాగా కలిసివున్న జంటలు.. బయటి ప్రపంచంలో ఇమడలేకపోతున్నట్లు కనిపిస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో బ్రేకప్ కావటానికి సిద్ధపడిన జంటలకు 2022 పరిష్కారాలు కూడా చూపింది.
వివాహిత జంట విడిపోవటం వల్ల.. వారికి ఎదురయ్యే మానసిక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడటానికి.. ‘డైవోర్స్ కోచ్’లను ఆశ్రయించటం పెరిగింది. బ్రిటన్ నుంచి కెనడా వరకూ ఈ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తోంది.
తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొనే సమయంలోనూ, విడాకుల సమయంలోనూ మానసిక చికిత్సను ఆశ్రయించటం సాధారణంగా మారింది. ‘‘విడిపోవటాన్ని.. ఇప్పుడిక వ్యక్తిత్వంలో లోపంగా కానీ, జీవితంలో వైఫల్యంగా కానీ చూడటం లేదు’’ అని క్లినికల్ సైకాలజిస్ట్ యాస్మిన్ సాద్ చెప్పారు. ఆమె, న్యూయార్క్ నగరంలోని మాడిసన్ పార్క్ సైకలాజికల్ సర్వీసెస్ వ్యవస్థాపకురాలు.
‘‘మీ డబ్బును పెట్టుబడిగా పెట్టేముందు ఆర్థిక సాయం కోరటం ఎంత సహజమో.. డైవోర్స్ కోచ్‌ను నియమించుకోవటం అంతే సహజం’’ అంటారామె.
లేదంటే.. విడిపోవాలని భావిస్తున్న జంట.. ఒక ‘గ్యాప్ ఇయర్’ను – అంటే ఒక సంవత్సరం వేరుగా ఉండటానికి - ప్రయత్నించవచ్చు. దీనివల్ల వారి సంబంధం ముగిసిపోయినట్లు కాదు.
మహమ్మారి నేపథ్యంలో ఇలాంటి ‘దీర్ఘకాలిక వేర్పాట్లు’ ఎక్కువయ్యాయని రిలేషన్‌షిప్ థెరపిస్టులు చెప్తున్నారు. లాక్‌డౌన్లలో గత రెండేళ్ల పాటు ఒకే బోనులో బందీలయ్యామని భావిస్తున్న జంటలు.. విడిపోకుండానే కొంత కాలం పాటు ఒంటరిగా జీవితాన్వేషణ సాగించాలని నిర్ణయించుకుంటున్నారు.
అయితే.. విడిపోవాలని కోరుకుంటున్న జంటలు కూడా విడిపోలేకపోతుండటం 2022లో ఎక్కువగా కనిపించింది. ఆర్థిక మాంద్యం పరిస్థితుల వల్ల.. వారు కలిసి నివసించే తప్పనిసరి పరిస్థితుల్లో చిక్కుకుపోయారు.
ఎందుకంటే ఈ రోజుల్లో ఒంటరిగా నివసించటం చౌక కాదు. జంటలో ఏ ఒక్కరూ తమ మాజీ భాగస్వామి కోసం.. తమ ఉమ్మడి ఇంట్లో తమ వాటాను వెచ్చించి ఇల్లు కొనివ్వరు.
చాంతాల్ టక్కర్ అనే 37 ఏళ్ల మహిళ లండన్‌లో ఒక ఇంటికి.. తన మాజీ భాగస్వామితో పాటు సహ యజమానిగా ఉన్నారు. ‘‘మళ్లీ ఒక ఇంటిని కొనుక్కోగల స్తోమత నాకు ఇక ఉండదని నాకు తెలుసు. అలాగని లండన్‌లో అద్దెకు ఉండటం అంతకంతకూ కష్టమైపోతోంది’’ అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
డేటింగ్ ప్రపంచాన్ని మెరుగుపరచటానికి ప్రయత్నం
ఇదిలావుంటే.. ఒంటరి వ్యక్తులకు డేటింగ్ యాప్‌లలో అన్వేషణ ఇంకా కష్టంగానే ఉంది.
మిలీనియల్స్ యువత, జనరేషన్ జడ్ తరం వారు.. భాగస్వామిని కలవటానికి ప్రధాన మార్గం డేటింగ్ యాప్‌లే అనేది నిర్వివాదాంశం. వేలాది ఆన్‌లైన్ డేటింగ్ వెబ్‌సైట్లు ఉన్నాయి. అమెరికాలో 18 ఏళ్ల నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న వారిలో 48 శాతం మంది వాటిని ఉపయోగిస్తున్నారు.
దురదృష్టవశాత్తూ.. ఈ యాప్‌లలో దుష్ప్రవర్తన చాలా అధికంగా ఉంది. వ్యభిచారానికి, వేధింపులకు, మోసాలకు ఈ యాప్‌లను వాడే వారు చాలా ఎక్కువగానే ఉన్నారు. దీని దుష్ప్రభావం మహిళల మీదే ఎక్కువగా ఉంటోంది.
దీంతో చాలా మంది ఆన్‌లైన్ డేటింగ్‌తో తీవ్రంగా విసిగిపోతున్నారు. డేటింగ్ యాప్‌లో అందుబాటులో ఉన్న చాయిస్‌లు తమను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని అన్ని రకాల వ్యక్తులూ చెప్తున్నారు. భాగస్వాములయ్యే అవకాశం ఉన్న నిజమైన వ్యక్తులతో మాట్లాడటం కాకుండా.. ఏదో నంబర్ గేమ్ ఆడుతున్నట్లుగా అనిపిస్తోందని వారు అంటున్నారు.
‘‘నాకు ఓ మాదిరిగా ఆసక్తిగా అనిపించే ఒక వ్యక్తి ప్రొఫైల్‌ను చూడటానికి.. 100 మంది ప్రొఫైళ్లను స్వైప్ చేయాల్సి వస్తోంది. దీంతో ఒక్కోసారి చాలా విసుగెత్తిపోతోంది’’ అని అమెరికాకు చెందిన 32 ఏళ్ల రోజ్‌మేరీ గేజర్ చెప్పారు. కానీ ఎవరినైనా కలవటానికి డేటింగ్ యాప్‌ను ఉపయోగించకుండా ఉండటం దాదాపు అసాధ్యం.
కానీ మహమ్మారి కారణంగా.. జనం కొత్తవారిని తొలుత ఆన్‌లైన్‌లో కలవటానికి అలవాటుపడ్డారు.
నిజంగా ముఖాముఖి కలవాలా వద్దా అనేది నిర్ణయించుకోవటానికి.. అలా ముందస్తుగా ఆన్‌లైన్‌లో కలిసి పరిశీలించటం.. సురక్షితమైన, తెలివైన పద్ధతని భావిస్తున్నారు. ఇప్పటికీ చాలా మంది ఒంటరి వ్యక్తులు ఈ విధానాన్ని పాటిస్తున్నారు.
ఇప్పుడు పెరుగుతున్న మరో విధానం ‘సోబర్ డేటింగ్’. అంటే మద్యం లేకుండా కలవటం. బంబుల్ అనే డేటింగ్ సర్వీస్ నిర్వహించిన 2022 ట్రెండ్స్ సర్వేలో.. మహమ్మారి అనంతరం 34 శాతం మంది బ్రిటన్ యూజర్లు సోబర్ డేటింగ్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అలా చేయటం వల్ల ఇద్దరి మధ్య నిజమైన కనెక్షన్ ఏర్పడటానికి దోహదపడుతుందని 62 శాతం మంది అభిప్రాయపడ్డారు.
ఇటు సెక్స్ రాహిత్యం... అటు ఉత్తమ సెక్స్ జీవితం...
మహమ్మారి మనుషుల సెక్స్ జీవితాల మీద కూడా తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా మిలీనియల్ జంటల మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంది.
అమెరికాలోని వివాహిత మిలీనియల్స్ 2021లో తమ లైంగిక వాంఛల విషయంలో అత్యధిక సమస్యలు ఎదుర్కొన్నట్లు ఆ ఏడాది గణాంకాలు చెప్తున్నాయి. అధిక పనిభారాలు, మానసిక ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా బాగా నీరశించిపోవటం దీనికి కారణం.
మిలీనియల్ జంటల సంబంధాలు.. తమ ముందు తరం వారికన్నా వేగంగా సెక్స్ రహతంగా మారుతున్నట్లు ఈ ఏడాది కనిపించింది.
గతంలో తన దగ్గరకు థెరపీ కోసం వచ్చే జంటలు.. ఒకరితో ఒకరు సెక్స్‌లో పాల్గొనటం ఆగిపోవటానికి 10 నుంచి 15 ఏళ్ల సమయం పట్టేదని.. ఇప్పటి జంటలు మూడు నుంచి ఐదేళ్లలోనే ఆ పరిస్థితుల్లోకి వెళుతున్నారని.. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన సెక్స్ థెరపిస్ట్ సెలెస్టి హిర్ష్‌మన్ చెప్పారు.
అయితే.. వివాహితులైన మిలీనియల్స్ చాలా మంది సెక్స్ రహిత వివాహ బంధాలతో ఇబ్బందులు పడుతోంటే.. వారికన్నా ముందటి తరాల వారైన బేబీ బూమర్స్ మాత్రం తమ ఉత్తమ సెక్స్ జీవితాలను గడుపుతున్నారు. వారి అనుభవం, సహనం వల్ల వారికి మరిన్ని బెడ్‌రూమ్ స్కిల్స్, సంభాషణా చాతుర్యాలు అలవడ్డాయి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



















