అస్సాం-మిజోరాం పోలీసులు ఎందుకు ఘర్షణ పడ్డారు? రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు గొడవేంటి ?

ఫొటో సోర్స్, DEBALIN ROY
- రచయిత, ప్రదీప్ కుమార్
- హోదా, బీబీసీ కరస్పాండెంట్
సోమవారం నాడు అస్సాం, మిజోరాం రాష్ట్రాల ముఖ్యమంత్రులు సోషల్ మీడియాలో గొడవపడ్డారు. మిజోరాం ముఖ్యమంత్రి జొరామ్‌తంగా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. దేశ చరిత్రలో ఇద్దరు ముఖ్యమంత్రులు ఇలా గొడవ పడిన సందర్భాలు లేవు.
అయితే, సోషల్ మీడియాలో కనిపించని వార్తలు కొన్ని గంటల తర్వాత బయటకు వచ్చాయి. ఇరు రాష్ట్రాల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణలో అయిదుగురు అస్సాం పోలీసులు మరణించారు. రెండు రాష్ట్రాల పోలీసులు ఒకరికొకరు ఎదురుపడి ఘర్షణకు దిగారు. భారతదేశ చరిత్రలో ఇంతకు ముందు ఎప్పుడూ రెండు రాష్ట్రాల మధ్య ఇలాంటి పరిస్థితి రాలేదు.
ఇద్దరు ముఖ్యమంత్రులు కేంద్ర హోంమంత్రికి సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదులు చేశారు. అయితే ఈ సంఘటనకు ఒక రోజు ముందు అమిత్ షా షిల్లాంగ్‌లో ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. ఈశాన్య భారత్ రాజకీయాలను దగ్గరగా పరిశీలిస్తున్న వారు చెప్పిన దానిని బట్టి, ఈ రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం కూడా ఈ సమావేశంలో ప్రధాన చర్చనీయాశం.

ఫొటో సోర్స్, TWITTER/ZORAMTHANGA
అసలేం జరిగింది - రాష్ట్ర ప్రభుత్వాల వాదనేంటి?
ఆదివారం నాడు జరిగిన సంఘటన చాలా విచారకరమని మిజోరాం ముఖ్యమంత్రి జొరాంతాంగ అన్నారు. ఆదివారం ఉదయం 11.30 గంటలకు కాచర్ జిల్లాలోని వైరంగేట్ ఆటో రిక్షా స్టాండ్ సమీపంలో ఉన్న సీఆర్‌పీఎఫ్ పోస్టుపై అస్సాం నుంచి వచ్చిన 200 మంది పోలీసులు దాడి చేయడంతో ఈ గొడవ మొదలైందని ఆయన వెల్లడించారు. అస్సాం నుంచి వచ్చిన పోలీసులు మిజోరాం రాష్ట్రానికి చెందిన పోలీసులు, స్థానికులపై దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆయన అన్నారు.
ఈ ప్రాంతంలో వివాదం చెలరేగడంతో పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి చేరుకున్నారు. అయితే వారిని అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో పలువురు గాయపడ్డారు.
కొలాసిబ్ జిల్లా ప్రాంత పోలీసు సూపరింటెండెంట్ వారితో మాట్లాడి పంపించేందుకు ప్రయత్నించారు. కానీ, అస్సాం పోలీసులు గ్రెనేడ్లు విసిరి కాల్పులు జరిపడంతో మిజోరాం పోలీసులు సాయంత్రం 4.50 గంటలకు కాల్పులు జరిపారు.
అస్సాం పోలీసుల కాల్పులకు ప్రతిస్పందనగానే తమ పోలీసులు కాల్పులు జరిపారని మిజోరాం ముఖ్యమంత్రి జొరామ్‌తంగా తన ప్రకటనలో తెలిపారు. అస్సాం ముఖ్యమంత్రి కూడా ఇదే తరహాలో ప్రకటన చేశారు.
లైలాపూర్ జిల్లాలో అంటే అస్సాం ప్రాంతంలో యథాతథ స్థితిని ఉల్లంఘిస్తూ మిజోరాం ప్రభుత్వం రోడ్డు పనులు ప్రారంభించడంతోనే ఈ సమస్య మొదలైందని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తన ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి, జూలై 26న, ఐజీ, డీఐజీ, అస్సాం పోలీసు పోలీసు సూపరింటెండెంట్ స్థాయి అధికారులు అక్కడకు వెళ్లి యథాతథ స్థితిని కొనసాగించాలని వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు.
అస్సాం ముఖ్యమంత్రి ప్రకటన ప్రకారం, మిజోరాంకు చెందిన కొందరు వ్యక్తులు అస్సాం పోలీసు బలగాలపై రాళ్లతో దాడి చేశారు. మిజోరాం పోలీసులు వారికి మద్దతుగా నిలిచారు.
''రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం ఉంది, కానీ, ఇలా ఎదురు కాల్పులు జరుపుకోవడం ఇంతకు ముందెప్పుడూ జరగలేదు'' అని మిజోరాంకు చెందిన ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మాజీ జర్నలిస్ట్ ఆడమ్ హాలిడే బీబీసీతో అన్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో, పోలీసులు కాల్పులు జరిపే వరకు ఎందుకు వెళ్లారో దర్యాప్తు జరపాల్సిన విషయమని ఆయన అన్నారు.
''రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం ఉన్నమాట నిజమే. గతంలో కూడా ఘర్షణలు కూడా జరిగాయి. కానీ, ఇంత పెద్ద వివాదంగా మారుతుందని, కాల్పుల్లో పోలీసులు చనిపోయే పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించలేదు'' అన్నారు పీటీఐ గువాహటి బ్యూరో చీఫ్ దుర్వా ఘోష్ అన్నారు.
''హోం మంత్రి పర్యటన జరిగిన వెంటనే ఈ ఘటన జరగడం దురదృష్టం. ఇది చాలా కాలంగా కొనసాగుతున్న వివాదం. కానీ, దీని కోసం ఎవరూ ప్రయత్నించలేదు. దీన్ని పరిష్కరించాల్సి ఉంది'' అని సిల్చార్ విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ జయ్‌దీప్ బిస్వాస్ అన్నారు.

అసలు గొడవేంటి ?
''అస్సాం, మిజోరాం మధ్య సరిహద్దు వివాదం వలస పాలన కాలం నుంచి ఉంది. మిజోరాం 1972 వరకు అస్సాంలో ఒక భాగం. ఇది లుషాయ్ హిల్స్ అనే పేరుతో అస్సాంలోని ఓ జిల్లాగాఉంది. దీని ప్రధాన కార్యాలయం ఐజాల్. అస్సాం-మిజోరాం వివాదానికి మూలం లుచాయ్ కొండలను కాచర్ మైదానాల నుండి వేరుచేసే 1875 నాటి నోటిఫికేషన్ లో ఉందని చెబుతారు'' అని అస్సాంలోని బీబీసీ హిందీ అసోసియేట్ జర్నలిస్ట్ దిలీప్ కుమార్ శర్మ వెల్లడించారు.
''మిజోరాం అస్సాంలో ఒకప్పుడు భాగమే. కానీ మిజో జనాభా, లుషాయ్ హిల్స్ విస్తీర్ణం స్థిరంగా ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని 1875లో గుర్తించారు. మిజోరాం రాష్ట్ర ప్రభుత్వం దాని సరిహద్దును తదనుగుణంగా పేర్కొంది. కాని అస్సాం ప్రభుత్వం దాన్ని ఒప్పుకోలేదు. 1933లో గుర్తించిన సరిహద్దు ప్రకారం అస్సాం ప్రభుత్వం తన వాదన వినిపించింది. ఈ రెండు కొలతలకు మధ్య చాలా తేడా ఉంది. దీంతో రెండు రాష్ట్రాలు కొంత భూభాగాన్ని మాది అంటే మాది అని క్లెయిమ్ చేసుకుంటున్నాయి. ఎవరూ వెనక్కి తగ్గడం లేదు'' అని జర్నలిస్ట్ ఆడమ్ హాలీడే అన్నారు.
1875 నోటిఫికేషన్ ప్రకారం బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్ (బీఎఫ్ఆర్) చట్టం, 1873 కింద వచ్చింది. అయితే 1933 లో వచ్చిన నోటిఫికేషన్ సమయంలో మిజో కమ్యూనిటీని సంప్రదించలేదు. కాబట్టి నోటిఫికేషన్‌ను మిజో కమ్యూనిటీ వ్యతిరేకించింది.
మిజోరాం అస్సాంతో 165 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటుంది, ఇందులో మిజోరం, ఐజాల్, కొలాసిబ్, మామిట్ అనే మూడు జిల్లాలు ఉన్నాయి. అదే సమయంలో, అస్సాంలోని కాచార్, కరీమ్‌గంజ్, హైలాకాండి జిల్లాలు ఈ సరిహద్దులో వస్తాయి.

ఫొటో సోర్స్, ANI
''గత ఏడాది అక్టోబర్‌లో, అస్సాంలోని కాచర్ జిల్లాలోని లైలాపూర్ గ్రామ ప్రజలు, మిజోరాంలోని కొలాసిబ్ జిల్లాలోని వైరంగేట్ సమీపంలో స్థానిక ప్రజల మధ్య సరిహద్దు విషయంలో హింసాత్మక ఘర్షణ జరిగింది. ఇందులో 8 మంది గాయపడ్డారు'' అని జర్నిలిస్ట్ దిలీప్ శర్మ అన్నారు.
''ప్రాథమికంగా ఈ పోరాటం భూమి కోసం. ప్రజలకు ఇళ్లు, స్కూళ్లు, ఆసుపత్రులు కావాలి. దీని కోసం భూమి అవసరం. రెండు రాష్ట్రాలు ఒకదానికొకటి భూమిని ఆక్రమించుకుంటున్నారని ఆరోపించుకుంటున్నాయి. రెండు రాష్ట్రాలలో ఎవరు నిజం చెబుతున్నారో, ఎవరు అబద్ధాలు చెబుతున్నారో తెలుసుకోవడం చాలా కష్టం'' అన్నారు దుర్వా ఘోష్
''జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలో ఈ ఘర్షణలు ఎక్కువగా జరుగుతున్నాయి'' అన్నారు ప్రొఫెసర్ జయ్‌దీప్ బిస్వాస్
''మొదట్లో ఈ ప్రాంతమంతా చెట్లు పుట్టలతో నిండి ఉంది. నోమ్యాన్స్ ల్యాండ్ అనేవారు. కానీ, ఇప్పుడు జనాభా పెరగడంతో ఘర్షణ పెరిగింది'' అని ఆడమ్ హాలీడే అభిప్రాయపడ్డారు.
''అస్సాంకు ఒక్క మిజోరాంతోనే కాదు, మేఘాలయా, అరుణాచల్ ప్రదేశ్, నాగాలండ్‌లతో కూడా ఇలాంటి గొడవలున్నాయి. మిగతా రాష్ట్రాలతో సమస్య పరిష్కారమవుతుందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు. కానీ, మిజోరాం తో గొడవ అంత త్వరగా పరిష్కారమయ్యేది కాదు'' అని దుర్వ ఘోష్ అన్నారు.

ఫొటో సోర్స్, ANI
సరిహద్దు సమస్యలపై ఉమ్మడి సర్వే లేదు
అస్సాం, మిజోరాం సరిహద్దు వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నాలు 1955 నుండి కొనసాగుతున్నాయి. కానీ, ఆ ప్రయత్నాలు సవ్యంగా సాగడం లేదన్న విమర్శ ఉంది.
''ఏదైనా భూవివాదం వచ్చినప్పుడు పరిష్కారం కోసం ఇరు వర్గాల పర్యవేక్షలో ఉమ్మడి సర్వే జరగాలి. ఇంత కాలమైనా ఆ సమస్య పరిష్కారం కాకపోవడానికి కారణంగా ఉమ్మడి సర్వే జరపక పోవడమే'' అని ఆడమ్ హాలిడే తేల్చి చెప్పారు.
సరిహద్దు వివాదం ఏళ్ల తరబడి కొనసాగుతున్నప్పడికీ, ఏడాది కాలంగా ఇక్కడి ఘర్షణ వివాదం పెరిగిందని, కొత్త వారు వచ్చి ఇక్కడ స్థిరపడుతుండటమే దీనిక కారణమని దుర్వా ఘోష్ అన్నారు.
"ఇంతకు ముందు వివాదాల స్థాయి ఇంత దాకా రాలేదు. ఇప్పుడు ఈ వివాదానికి రాజకీయాలు తోడవుతున్నందున సత్వర పరిష్కారం కనుగొనాల్సి ఉంది'' అని ప్రొఫెసర్ జయదీప్ బిస్వాస్ అన్నారు.

ఫొటో సోర్స్, ANUWAR HAZARIKA/NURPHOTO VIA GETTY IMAGES
మేఘాలయ సరిహద్దుల్లోనూ ఉద్రిక్తతలు
ఆదివారం రాత్రి నుండి అస్సాం, మేఘాలయ సరిహద్దులో కూడా ఈ ఉద్రిక్తత ప్రభావం కనిపించింది. '' ఇటీవల మేఘాలయ రాష్ట్ర విద్యుత్ విభాగం సరిహద్దు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసింది. మరుసటి రోజు, అస్సాం పోలీసులు వచ్చి వాటిని తొలగించాలని కోరారు. మేఘాలయ ప్రభుత్వం ఇది తమ భూమి అంటుండగా, అస్సాం కూడా ఇది తమదేనని వాదిస్తోంది'' అని షిల్లాంగ్‌కు చెందిన స్థానిక జర్నలిస్ట్ జో థింగ్ కియు అన్నారు. అస్సాం, మేఘాలయ మధ్య ప్రస్తుతం ఉద్రిక్తత ఉందని ఆయన వెల్లడించారు.
''అస్సాం, మేఘాలయ సరిహద్దులోని నాలుగు జిల్లాల పరిధిలో సరిహద్దు వివాదం గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతోంది. సరిహద్దును గుర్తించే దిశగా ఎవరూ కృషి చేయనందున వివాదం సమసిపోవడం లేదు'' అని జో థింగ్ కియు అన్నారు.
అయితే, అస్సాం, మిజోరాం మధ్య ప్రస్తుత వివాదాన్ని రాబోయే రోజులలో రాజకీయ అంశంగా మారుతుందని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు.
''అస్సాంలో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. జొరామ్‌తంగా మిజో నేషనల్ ఫ్రంట్ కూడా ఎన్డీయేలో భాగస్వామి. రెండేళ్ల తరువాత మిజోరంలో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ, అప్పటి వరకు జో రామ్‌తంగా ఎన్‌డీఏలో ఉంటారా అన్న సందేహం ఉంది. ఆయన అటు కేంద్రంతోనూ, ఇటు అస్సాంతో తెగదెంపులు చేసుకునే అవకాశం ఉంది'' ఓ జర్నలిస్టు వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్-19 ఎప్పటికీ అంతం కాకపోవచ్చు, దానితో కలిసి జీవించడం ఎలా?
- అందం కోసం సెక్స్ ఒప్పందాలు: ‘నాకు కాస్మోటిక్ సర్జరీ చేయిస్తే నా శరీరం ఆరు నెలలు నీదే’
- కోవిడ్-19ను మనం నోరోవైరస్లా ఎందుకు చూడాలి? అసలు నోరోవైరస్ అంటే ఏమిటి
- పెగాసస్ స్పైవేర్: ఇప్పటికీ సమాధానాలు దొరకని కీలక ప్రశ్నలు
- ఒకప్పటి భారతదేశానికి ఇప్పటి ఇండియాకు తేడా ఇదే
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- టోక్యో ఒలింపిక్స్: ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఉత్సవం ప్రత్యేకతలేంటి? భారత్ నుంచి ఎవరెవరు వెళ్తున్నారు?
- ప్రమాదం అని తెలిసినా చైనాలో ప్లాస్టిక్ సర్జరీల సంఖ్య ఎందుకు పెరుగుతోంది
- దానిష్ సిద్దిఖీ: పులిట్జర్ ప్రైజ్ అందుకున్న భారత ఫొటో జర్నలిస్ట్ తీసిన మరపురాని ఛాయా చిత్రాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








