మాఫియా డాన్ 'ది మౌస్'ను ఎలా అరెస్ట్ చేశారు... ఆ ప్రయత్నంలో 29 మంది ఎందుకు బలయ్యారు?

ఒవిడియో గుజ్మన్ లోపెజ్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఒవిడియో గుజ్మన్ లోపెజ్ అరెస్ట్ అయిన తర్వాత ఆయన ముఠా సభ్యులు కార్లను తగులబెట్టారు

మెక్సికోలో పేరు మోసిన డ్రగ్స్ మాఫియా సూత్రధారి ఎల్ చాపో కుమారుడు ఒవిడియో గుజ్మన్ లోపెజ్ అరెస్ట్‌ ఆపరేషన్‌లో భారీ ప్రాణనష్టం జరిగింది.

‘ది మౌస్’ అని పేరుపడ్డ 32 ఏళ్ల ఒవిడియో గుజ్మన్ లోపెజ్‌ను ఒక భారీ పోలీస్ ఆపరేషన్ నిర్వహించి గురువారం క్యులియకాన్‌లో అరెస్ట్ చేశారు. అతడిని హెలికాప్టర్ ద్వారా మెక్సికో సిటీకి తరలించారు.

అతన్ని అరెస్ట్ చేసే క్రమంలో, అరెస్ట్ చేసిన తర్వాత 10 మంది సైనికులతో పాటు 19 మంది అనుమానితులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.

ఎల్ చాపో డ్రగ్స్ సామ్రాజ్యాన్ని ప్రస్తుతం లోపెజ్ నడిపిస్తున్నారనేది ఆరోపణ.

లోపెజ్ అరెస్ట్‌ కావడంతో ఆయన ముఠా సభ్యులు పెను విధ్వంసం సృష్టించారు.

పోలీసులను అడ్డుకోవటానికి రహదారులను దిగ్బంధించారు. డజన్ల కొద్దీ వాహనాలకు నిప్పు పెట్టి దగ్ధం చేశారు. స్థానిక విమానాశ్రయంలోని విమానాలపై కాల్పులు జరిపారు.

మెక్సికోలో తగలబడిన బస్సు

ఈ ఆపరేషన్‌లో 35 మంది మిలిటరీ సిబ్బంది గాయపడినట్లు, 21 మంది ముష్కరులను అరెస్ట్ చేసినట్లు శుక్రవారం రక్షణ మంత్రి లూయిస్ క్రెసెన్సియో సాండోవాల్ చెప్పారు.

విమానాశ్రయంలో రెండు విమానాలపై వారు కాల్పులు జరిపారు. అందులో ఒకటి టేకాఫ్‌కు సిద్ధమవుతుండగా దాని మీద తుపాకులతో కాల్పులు జరిపారు.

ఒవిడియో ముఠా సభ్యుల దాడుల కారణంగా సినలోవా ఎయిర్‌పోర్ట్ నుంచి రాకపోకలు సాగించాల్సిన 100కి పైగా విమానాలు రద్దయ్యాయి.

ఎల్‌చాపో ముఠాలో సినలోవా వర్గానికి ప్రస్తుతం ఒవిడియో నాయకత్వం వహిస్తున్నాడని.. ఆయన్ను అంతా ‘ది మౌస్’ అంటారని మెక్సికో డిఫెన్స్ మినిస్టర్ లూయిస్ క్రెసెన్సియో సాండోవాల్ తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్ద డ్రగ్స్ ముఠాల్లో ఇదొకటి.

ఒవిడియో తండ్రి ‘జొయాక్విన్ ఎల్ చాపో గుజ్మన్’ అమెరికాలో ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. మనీలాండరింగ్, డ్రగ్ స్మగ్లింగ్ కేసుల్లో అరెస్ట్ అయిన ఎల్ చాపోకు 2019లో జీవిత ఖైదు విధించారు.

Ovidio Guzmán-López

ఫొటో సోర్స్, US STATE DEPARTMENT

ఒవిడియో గుజ్మన్ లోపెజ్‌ను పట్టుకోవడానికి ఆర్నెళ్లుగా అమెరికాతో కలిసి నిఘా పెట్టి.. చివరికి అరెస్ట్ చేశామని రక్షణ మంత్రి సాండోవాల్ చెప్పారు.

క్యులియకాన్‌లో బస్సులు తగలబెట్టిన దృశ్యాలు, రోడ్లు మూసేసి రాకపోకలను అడ్డుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో పెద్దసంఖ్యలో కనిపిస్తున్నాయి.

గురువారం ఉదయం క్యులియకాన్ నుంచి మెక్సికో సిటీకి వెళ్లాల్సిన ఒక విమానంపై ఒవిడియో ముఠా కాల్పులు జరిపిందని, విమానానికి బుల్లెట్లు తగిలాయని మెక్సికో విమానయాన సంస్థ ఏరోమెక్సికో ప్రకటించింది.

అయితే, ఈ దాడిలో విమాన సిబ్బంది కానీ ప్రయాణికులు కానీ ఎవరూ గాయపడలేదని ఏరోమెక్సికో వెల్లడించింది.

విమానంపై కాల్పులు జరడపంతో అందులోని ప్రయాణికులు సీట్ల కింద దాక్కున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాల్పుల కారణంగా భయంతో సీట్ల కింద కూర్చున్న ప్రయాణికులు

ఫొటో సోర్స్, Reuters

‘మేం టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో విమానానికి అత్యంత సమీపంలో కాల్పుల శబ్దం వినిపించింది. దాంతో అందరం విమానంలో కింద కూర్చున్నాం’ అని డేవిడ్ టెల్లెజ్ అనే ప్రయాణికుడు రాయిటర్స్ వార్తాసంస్థకు చెప్పారు.

ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఓ విమానంపైనా కాల్పులు జరిగాయని మెక్సికో ఏవియేషన్ ఏజెన్సీ తెలిపింది.

కాగా ఉత్తర అమెరికా దేశాల నాయకుల సమావేశంలో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వచ్చేవారం మెక్సికోకు రావాల్సి ఉంది. అయితే, సోమవారం రావాల్సిన ఆయన ఒక రోజు ముందుగా ఆదివారమే చేరుకుంటున్నట్లు మెక్సికో విదేశీ వ్యవహారాల మంత్రి మార్సిలో ఎబ్రాడ్ తెలిపారు. ఆయన ఒక రోజు ముందే ఎందుకు వస్తున్నారో మాత్రం మార్సిలో వెల్లడించడలేదు.

మరోవైపు గురువారం ఉదయం నుంచి మెక్సికో భద్రతా దళాలు క్యులియకాన్‌లో ఆపరేషన్ చేడుతున్నాయని ఆ నగరం మేయర్ రూబెన్ రోచా మోయా తెలిపారు.

ఇప్పటికే నగరంలోని అనేక రోడ్లు మూసేసి ఉన్నాయని.. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని మేయర్ ట్విటర్ వేదికగా కోరారు. అనేక దుకాణాలను గ్యాంగ్స్ లూటీ చేశాయని చెప్పారు.

గురువారం మధ్యాహ్నం కూడా ఒవిడియో గ్యాంగ్ సభ్యులకు, భద్రతాదళాలకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.

ఒవిడియో గుజ్మన్ లోపెజ్‌ను 2019లో కూడా ఒకసారి అరెస్ట్ చేసినప్పటికీ అల్లర్లను నివారించడానికి ఆయన్ను విడుదల చేశారు.

ఒవిడియో గుజ్మన్ లోపెజ్, ఆయన సోదరుడు జాక్విన్‌లు కలిసి సినలోవాలని 11 మెథ్‌ఎంఫటమైన్ ల్యాబ్‌లను నడిపిస్తున్నారని అమెరికా హోం శాఖ చెప్తోంది. ఈ ల్యాబ్‌ల నుంచి నెలకు 1300 కేజీల నుంచి 2,200 కేజీల మత్తు పదార్థాలు తయారవుతున్నాయి.

ఒవిడియో గుజ్మన్‌ లోపెజ్ ఆదేశాల మేరకు ఆయన ముఠా సభ్యులు ఒకరిని ఇన్‌ఫార్మర్ నెపంతో చంపారని.. అలాగే లోపెజ్ పెళ్లి వేడుకలో పాటలు పాడలేదన్న కారణంతో ఓ పాపులర్ సింగర్‌ను కూడా చంపేశారని అమెరికా హోం శాఖ తెలిపింది.

ఒవిడియో, ఆయన ముగ్గురు సోదరులను పట్టిచ్చే సమాచారం అందిస్తే 50 లక్షల డాలర్ల (సుమారు రూ. 41 కోట్లు) బహుమానం ఇస్తామని అమెరికా 2022 డిసెంబరులో ప్రకటించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)