‘‘తప్పుడు కేసులో జైలుకు పంపి సెక్స్‌కు దూరం చేశారు.. రూ. 10 వేల కోట్లు పరిహారం ఇవ్వాలి’’ - ప్రభుత్వంపై కేసు

కాంతిలాల్ కేసు

ఫొటో సోర్స్, SHURAIH NIYAZI/BBC

    • రచయిత, షురయా నియాజ్
    • హోదా, బీబీసీ కోసం

మధ్య ప్రదేశ్‌లోని రతలామ్ జిల్లా కోర్టు జనవరి 10న ఒక కేసును విచారణ చేపట్టబోతోంది. దీనిలో పిటిషన్‌దారుడు కోరిన పరిహారంపై మీడియాలో చర్చ జరుగుతోంది.

మొత్తంగా ఆ కేసు వేసిన వ్యక్తి ప్రభుత్వం నుంచి పది వేల ఆరు కోట్ల రెండు లక్షల రూపాయల పరిహారాన్ని కోరారు.

అవును. మీరు విన్నది నిజమే. ఆయన తనకు రూ. 10,006 కోట్లు పరిహారం చెల్లించాలని అడుగుతున్నారు.

సామూహిక అత్యాచారం కేసులో కాంతిలాల్ రెండేళ్లపాటు జైలులో గడపాల్సి వచ్చింది. అయితే, ఈ కేసులో ఆయన నిర్దోషి అని కోర్టు ప్రకటించింది.

అయితే, జైలులో ఇన్ని రోజులు తనను ఖైదు చేసినందుకు ప్రభుత్వం తనకు పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

కాంతిలాల్ కేసు

ఫొటో సోర్స్, SHURAIH NIYAZI/BBC

రూ. 10,000 కోట్లు ఎందుకు?

తనకు జరిగిన నష్టానికి రూ. ఆరు కోట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. మిగతా రూ.10,000 కోట్లను 666 రోజుల పాటు సెక్స్‌కు దూరం చేసినందుకు ఇవ్వాలని ఆయన అడుగుతున్నారు.

గిరిజన వర్గానికి చెందిన కాంతిలాల్.. న్యాయవాది విజయ్ సింగ్ సాయంతో కోర్టులో ఈ కేసు వేశారు.

పరిహారానికి సంబంధించిన పిటిషిన్లలో కోర్టు ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ‘‘ప్రత్యేక నిబంధనల’’ కింద ఫీజును మినహాయించాలని పిటిషన్‌లో ఆయన కోరారు.

కాంతిలాల్ కేసు

ఫొటో సోర్స్, SHURAIH NIYAZI/BBC

కాంతిలాల్ ఏం అంటున్నారు?

కాంతిలాల్‌ను అందరూ కాంతు అని పిలుస్తుంటారు. ఆయన సొంత ఊరు రతలామ్‌కు 55 కిలో మీటర్ల దూరంలోనే ఘోడాఖేడా.

‘‘నేను అమాయకుడిని. అనవసరంగా ఈ కేసులో ఇరికించారు. రెండేళ్లపాటు నేను జైలులో గడపాల్సి వచ్చింది. నా జీవితం మొత్తం తలకిందులైంది. నేను చాలా అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. అందుకే నాకు పరిహారం ఇవ్వాలి’’ అని కాంతు అంటున్నారు.

ఆ కేసు వల్ల తనతోపాటు తన కుటుంబం మొత్తం చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆయన చెప్పారు.

‘‘నా కుటుంబానికి తిండి కూడా సరిగా దొరకడం లేదు. నేను లేకపోవడం వల్ల వారు నిరాశ్రయులయ్యారు. పిల్లలు చదువుకు కూడా దూరమయ్యారు’’ అని ఆయన వివరించారు.

అరెస్టుకు ముందుగా రోజు కూలీగా పనిచేస్తూ కాంతిలాల్ కుటుంబాన్ని పోషించేవారు. నేడు జైలు నుంచి విడుదల అయినప్పటికీ తనను ఎవరూ కూలికి తీసుకోవడం లేదని ఆయన చెబుతున్నారు. ఎందుకంటే వారు మోపినవి తీవ్రమైన ఆరోపణలని ఆయన చెప్పారు.

కాంతిలాల్ ఇంట్లో ఆయన భార్య, తల్లి, ముగ్గురు పిల్లలు జీవిస్తున్నారు. మరోవైపు పిల్లలతోపాటు ఆయన సోదరి కూడా ఆ ఇంట్లోనే ఉంటారు.

వీడియో క్యాప్షన్, పోలీసులే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎలా: ప్రొఫెసర్ హరగోపాల్

న్యాయవాది ఏం చెబుతున్నారు?

రూ.10,000 కోట్లు పరిహారం కోరడంపై కాంతిలాల్ న్యాయవాది విజయ్ సింగ్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘ఒక వ్యక్తి జీవితానికి ఎవరూ వెల కట్టలేరు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

‘‘తప్పుడు కేసు వల్ల ఒక వ్యక్తి జీవితం నాశనమైంది. అతడి కుటుంబం చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. వారికి దిక్కు లేకుండా అయింది. అందుకే వారికి పరిహారం ఇవ్వడం చాలా ముఖ్యం’’ అని యాదవ్ చెప్పారు.

‘‘పేదలకు కూడా హక్కులు ఉంటాయి. ఊరికనే ఎవరిపైనా కేసులు వేసి జైలుకు తరలించకూడదు..’’ అనే సందేశాన్ని కూడా ఈ కేసు ద్వారా తాము ఇవ్వాలని భావిస్తున్నట్లు ఆయన వివరించారు.

‘‘రెండేళ్లు జైలులో గడిపిన తర్వాత ఆయన్ను నిర్దోషిగా ప్రకటించారు. ఆయన అనుభవించిన వేదన ప్రజలకు తెలియాలి. ఒక పేద వ్యక్తి జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత ఎలాంటి అవమానాలు ఎదుర్కొంటాడో అందరికీ తెలియాలి’’ అని ఆయన చెప్పారు.

కాంతిలాల్ కేసు

ఫొటో సోర్స్, Getty Images

అసలేమైంది?

2018 జనవరిలో కాంతిలాల్‌పై సామూహిక అత్యాచారం ఆరోపణలు మోపారు. అయితే, ఈ ఆరోపణల్లో ఎలాంటి నిజమూ లేదని కోర్టు నిర్ధారించింది.

‘‘ఆ మహిళ భర్త కక్ష సాధించాలనే ఉద్దేశంతో ఆ ఆరోపణలు చేసినట్లు కోర్టులో రుజువైంది. ఆమె ఆరు నెలలపాటు ఇంటికి రాలేదని, ఆమె కనీసం కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేయలేదని కోర్టులో ఆ కేసు పెట్టిన వ్యక్తి ఒప్పుకున్నారు’’ అని యాదవ్ చెప్పారు.

వీడియో క్యాప్షన్, ‘‘ఆయన చనిపోయినా వేరే వారిలో బతికున్నారు’’

పరిహారం దేని కోసం?

ఆ ఆరోపణల నుంచి 2022 అక్టోబరు 20న కాంతిలాల్‌కు కోర్టు విముక్తి కల్పించింది. అయితే, అప్పటికే ఆయన 666 రోజులు జైలులో గడపాల్సి వచ్చింది.

తను ఈ కేసు వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని, అందుకే తనకు పరిహారం ఇవ్వాలని న్యాయవాది సాయంతో కాంతిలాల్ కోర్టులో పిటిషన్ వేశారు.

  • తన జీవితంలో రెండేళ్లు ఉపాధి కోల్పోయినందుకు ఆయన రూ. కోటి పరిహారం కోరారు.
  • తన పరువు, ప్రతిష్ఠలు దెబ్బతిన్నందుకు రూ. కోటి అడిగారు.
  • రెండేళ్లపాటు శారీరక, మానసిక ఇబ్బందులను ఎదుర్కొన్నందుకు రూ. కోటి కోరారు.
  • కుటుంబం ఎదుర్కొన్న అవమానాలకు రూ. కోటి, పిల్లలు చదువుకు దూరం అయినందుకు, వారి భవిష్యత్ ప్రశ్నార్ధకం అయినందుకు రూ. రెండు కోట్లు ఇవ్వాలని అన్నారు.
  • కోర్టులో పోరాటం చేస్తున్నందుకు రూ. 2 లక్షలు కోరారు.
  • మరోవైపు రెండేళ్ల పాటు లైంగిక సుఖానికి దూరం చేసినందుకు రూ. 10,000 కోట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
వీడియో క్యాప్షన్, శ్రీకాకుళం-కాశీబుగ్గ: అనాథ శవాన్ని మోసుకెళ్లిన మహిళా ఎస్‌ఐ

కాంతిలాల్ చాలా పేదవారని, ‘‘జై కుల్‌దేవీ ఫౌండేషన్’’ సాయంతో ఆయన ఈ కేసు వేశారని ఆయన న్యాయవాది విజయ సింగ్ యాదవ్ చెప్పారు.

‘‘పేదవారిని ఇలా తప్పుడు కేసుల్లో ఇరికించడం ఎక్కువైంది. పోలీసులు ఇలాంటివి మానుకోవాలి’’ అని ఆయన అన్నారు.

పోలీసుల్లో శాంతి, భద్రతల పరిరక్షణ; దర్యాప్తుకు రెండు ప్రత్యేక విభాగాలుంటే, ఇలాంటి కేసులను మొదట్లోనే గుర్తించి, అమాయకులను ఇరికించడాన్ని అడ్డుకోవచ్చని భోపాల్‌కు చెందిన సీనియర్ అడ్వొకేట్ సిద్ధార్థ్ గుప్తా చెప్పారు.

2007 జనవరి 11న ప్రకాశ్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీం కోర్టు కూడా ‘‘తప్పుడు కేసుల్లో అమాయకులు జైళ్లలో గడపకుండా ఉండాలంటే పోలీసుల్లో రెండు విభాగాలను ఏర్పాటుచేయాల’’ని చెప్పిందని ఆయన వివరించారు.

‘‘అయితే, ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. అందుకే ఇలాంటి కేసులు వెలుగుచూస్తున్నారు. అమాయకులు కూడా ఏళ్ల పాటు జైలులో గడపాల్సి వస్తోంది’’ అని ఆయన అన్నారు.

పోలీసుల్లో శాంతి, భద్రతల పరిరక్షణ; దర్యాప్తుకు రెండు ప్రత్యేక విభాగాలు ఏర్పాటుచేసేందుకు గ్వాలియర్, భోపాల్‌లలో 2012లో ఒక పైలట్ ప్రాజెక్టు చేపట్టారని, ఆ తర్వాత ఆ విషయాన్ని ఎవరూ పట్టించుకోవడం మానేశారని గుప్తా వివరించారు.

తాజా కేసులో పోలీసులు స్పందించడానికి నిరాకరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)