హల్ద్వానీ: ‘రాత్రికి రాత్రే వేలాది మందిని నిరాశ్రయులను చేయడం తగదు’- సుప్రీం కోర్టు

హల్ద్వానీ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో వందలాదిమంది నిరసనలు చేపట్టారు

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని వేలాది మంది ప్రజలకు సుప్రీం కోర్టు తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించింది.

గతంలో ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పు మేరకు, వేలాది మందిని ఇళ్ల నుంచి ఖాళీ చేయమంటూ ప్రభుత్వ అధికారులు బలవంతం చేస్తున్నారు. వీరంతా భారత రైల్వే భూములను ఆక్రమించారని ఆరోపిస్తున్నారు.

దీనికి సంబంధించిన కేసును గురువారం విచారించిన సుప్రీం కోర్టు, గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించడంతో పాటు ఈ సమస్యకు సరైన పరిష్కారాలను కనుగొనాలని ఆదేశించింది.

డిసెంబర్‌లో హైకోర్టు తీర్పు వెలువరిస్తూ ఆక్రమణదారులకు వారం రోజుల గడువు ఇచ్చి, ఆ తర్వాత స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని రైల్వే అధికారులను కోరింది.

అప్పటి నుంచి అక్కడి నివాసితులు నిరసనలు చేస్తున్నారు. తాము ఎక్కడికీ వెళ్లబోమని చెబుతున్నారు.

హైకోర్టు తీర్పు ప్రకారం చర్యలు తీసుకుంటే, దాదాపు 50 వేల మంది ప్రజలు నిరాశ్రయులు అవుతారని నివేదికలు చెబుతున్నాయి. ఉత్తరాఖండ్‌లోని హల్దానీ రైల్వే స్టేషన్‌కు సమీప పరిసర ప్రాంతాల్లో వీరంతా నివసిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, ప్రభుత్వ వైఖరి పట్ల నిరాశను వెలిబుచ్చిన బాధిత కుటుంబాలు

డిసెంబర్ 20న ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన హైకోర్టు బెంచ్ తీర్పు వెలువరిస్తూ, వారం రోజులు గడువు ఇచ్చిన తర్వాత అనధికారిక ఆక్రమణలను తొలిగించడానికి అవసరాన్ని బట్టి ఏ మేరకు అయినా బలగాలను ఉపయోగించమని రైల్వే ఆధికారులకు సూచించింది.

కానీ, రాత్రికి రాత్రే వేలాదిమందిని నిరాశ్రయులు చేయలేమని తాజాగా సుప్రీం కోర్టు చెప్పింది. ప్రజలను తొలిగించడానికి ముందుగా పునరావాస పథకాలను అమలు చేయాలని వ్యాఖ్యానించింది.

ఈ ప్రాంతంలో అక్రమ మైనింగ్‌పై 2013లో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఆ తర్వాత ఈ కేసులోకి ఆక్రమణదారులను కూడా చేర్చారు.

జనవరి 1నుంచి ఇక్కడి నివాసితులకు ఇళ్లను ఖాళీ చేయాలనే నోటీసులు రావడం ప్రారంభమైందని ‘ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ వార్తా పత్రిక పేర్కొంది.

హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా మహిళలు, పిల్లలతో సహా వేలాది మంది ప్రజలు నిరసనలు చేస్తున్నారు.

కొందరు నివాసితులు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పత్రికతో మాట్లాడుతూ, ఎలాంటి కారణం లేకుండా తమను వేధిస్తున్నారని చెప్పారు. అనుమతులు లేకుండా పాఠశాలలు, ఆసుపత్రులను ఎలా నిర్వహించగలమని ప్రశ్నించారు.

‘‘బ్రిటిష్ కాలం నాటి నిర్మాణాలను ఎలా పడగొడతారు? రైల్వే చేస్తోన్న వాదనలకు మద్దతు ఇచ్చే ఆధారాలేవీ లేవు’’ అని ఒక వ్యక్తి అన్నారు.

తమ వాదనను నిరూపించడానికి భారత రైల్వే వద్ద పురాతన పటాలతో పాటు, 1959 నోటిఫికేషన్, 1971 నుంచి రెవిన్యూ రికార్డులు, 2017 నాటి సర్వే ఫలితాలు ఉన్నాయని ఒక సీనియర్ అధికారి చెప్పారు.

సుప్రీం కోర్టు ఇచ్చే ఎలాంటి తీర్పునైనా పాటిస్తామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి గతంలో అన్నారు.

కొండ ప్రాంతమైన ఉత్తరాఖండ్‌లో చలి విపరీతంగా ఉంది. అక్కడ కనిష్ట ఉష్ణోగ్రత ఒక డిగ్రీగా ఉంది.

వీడియో క్యాప్షన్, బండ్లపల్లి: జాతీయ ఉపాధి హామీ పథకం తొలిసారిగా అమలైన ఊరు ఇప్పుడెలా ఉంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)