గంగా విలాస్ క్రూయిజ్: డిజైన్ చేసింది తెలుగు మహిళ.. మోదీ ప్రారంభించిన ఈ షిప్ ప్రత్యేకతలేమిటి? విమర్శలు ఎందుకు?

ఫొటో సోర్స్, Antara Luxury River Cruises/Facebook
- రచయిత, ఆర్కే
- హోదా, బీబీసీ ప్రతినిధి
గంగా విలాస్... ప్రపంచంలోని ‘అతిపెద్ద’ రివర్ క్రూయిజ్.
గంగా నదిలో సాగే ఈ విహార యాత్రను నేడు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
రోడ్లు, రైల్వేలు, విమానయానాలు సర్వసాధారణమైన నేటి కాలంలో నదిలో ప్రయాణం అనేది విహారంగా వినోదంగా మారిపోయింది. కానీ ఒకప్పుడు ప్రయాణానికి, రవాణాకు కీలకంగా ఉండేవి నదులు.
ప్రపంచంలోని అతి పెద్ద నదుల్లో గంగా ఒకటి. సుమారు 2,500 కిలోమీటర్ల పొడవు ఉండే గంగా నది తీరాన అనేక పట్టణాలతోపాటు చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాంతాలు ఉన్నాయి. వీటన్నింటిని కలుపుతూ ఈ యాత్రను డిజైన్ చేశారు.

ఫొటో సోర్స్, Facebook/PIB
గంగా విలాస్ అంటే?
గంగా విలాస్ అనేది క్రూయిజ్ నౌక. ‘అంతర లగ్జరీ రివర్ క్రూయిజెస్’ అనే కంపెనీ దీన్ని నడుపుతోంది. అధునాతన సౌకర్యాలతో చాలా ‘లగ్జరీ’గా ఈ షిప్‌ను తీర్చిదిద్దినట్లు సంస్థ చెబుతోంది.
- గంగా విలాస్ పొడవు 62 మీటర్లు, వెడల్పు 12 మీటర్లు.
- ఇందులో 18 విలాసవంతమైన గదులు ఉంటాయి. ఒక్కో గది విస్తీర్ణం 360-380 చదరపు అడుగులు ఉంటుంది.
- మొత్తం 36 మంది ఇందులో ప్రయాణించొచ్చు.
- ప్రతి గది నుంచి నది, ఇతర ప్రకృతి అందాలు కనిపించేలా కిటికీలతో డిజైన్ చేశారు.
- లాంజ్, డైనింగ్ రూం, స్పా, జిమ్ వంటివి ఉంటాయి. బాల్కనీలను ఫ్రెంచ్ శైలిలో డిజైన్ చేశారు.
- నౌక పైకి ఎక్కి ఎండలో తిరగడానికి, ప్రకృతిని ఆస్వాదించడానికి సన్‌డెక్ ఏర్పాటు చేశారు.
- మెయిన్ డెక్‌లో 40 సీట్ల సామర్థ్యం గల రెస్టారెంట్ ఉంది.
- అప్పర్ డెక్‌లో బార్ కూడా ఏర్పాటు చేశారు.
- ఇందులో 40 మంది సిబ్బంది ఉంటారు.

ఫొటో సోర్స్, Facebook/PIB
ఎక్కడ మొదలవుతుంది?
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి గంగా విలాస్ విహారయాత్ర మొదలవుతుంది.
ఎక్కడ ముగుస్తుంది?
అస్సాంలోని దిబ్రూగర్ వద్ద ఈ విహారయాత్ర ముగుస్తుంది.
ఎంత దూరం ప్రయాణిస్తుంది?
భారత్, బంగ్లాదేశ్ కలిపి సుమారు 3,200 కిలోమీటర్లు గంగా విలాస్ ప్రయాణిస్తుంది.
ఎన్ని రోజులు పడుతుంది?
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి అస్సాంలోని దిబ్రూగర్ వరకు మొత్తం విహారయాత్రకు 51 రోజులు పడుతుంది.
ఏమేమీ చూడొచ్చు?
51 రోజుల పాటు సాగే ఈ యాత్రలో 50 పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు. మణికర్ణిక, హరిశ్చంద్ర వంటి ఘాట్లతోపాటు ప్రపంచవారసత్వ కట్టడాలు, జాతీయ పార్కులు వంటి వాటిని చూడొచ్చు.
సందర్శించే ప్రాంతాలు?
వారణాసి(ఉత్తరప్రదేశ్), పట్నా(బిహార్), సాహిబ్‌గంజ్(జార్ఖండ్), కోల్‌కతా(పశ్చిమబెంగాల్), ఢాకా(బంగ్లాదేశ్), గువహటి(అస్సాం), దిబ్రుగర్(అస్సాం) వంటి ప్రాంతాలు ఈ ప్రయాణంలో కవర్ అవుతాయి.

ఫొటో సోర్స్, Facebook/PIB
టికెట్ ధర ఎంత?
ఒక వ్యక్తికి రోజుకు రూ.42,500 చార్జ్ చేస్తారు. దీనికి జీఎస్‌టీ అదనం. నదిలో ప్రయాణం, చుట్టుపక్కల ప్రాంతాల సందర్శన, షిప్‌లో కల్పించే సదుపాయాలు అన్నీ ఈ ప్యాకేజీలో ఉంటాయి. ఒక గదిని ఇద్దరు షేర్ చేసుకుంటే రూ.85 వేలు (జీఎస్‌టీ అదనం) చార్జ్ చేస్తారు. మొత్తం మీద 51 రోజుల ప్యాకేజీ ఖర్చు సుమారు రూ.40 లక్షలు.
ఎలా బుక్ చేసుకోవాలి?
గంగా విలాస్ నౌకను నడిపే ‘అంతర లగ్జరీ రివర్ క్రూయిజెస్’ వెబ్‌సైట్‌లోకి వెళ్లి టికెట్లు బుక్ చేసుకోవాలని నిర్వాహకులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే బుకింగ్స్ అన్ని అయిపోయాయని, మరో రెండేళ్ల వరకు ఖాళీలు లేవని అంతర లగ్జరీ రివర్ క్రూయిజెస్ సేల్స్ డైరెక్టర్(ఇండియా) కాసిఫ్ సిద్ధిఖీ న్యూస్ వెబ్‌సైట్ మనీకంట్రోల్‌కు తెలిపారు.

ఫొటో సోర్స్, Govt.of India
తెలుగు డిజైనర్
అన్నపూర్ణ గరిమెళ్ల డిజైన్ చేసిన ఈ షిప్‌ను భారత్‌లో తయారు చేసినట్లు యాజమాన్యం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలోని నేదునూరు ఆమె స్వస్థలం.
ఆమె చరిత్ర పరిశోధకురాలు, డిజైనర్.
కొలంబియా యూనివర్సిటీ నుంచి ఆర్ట్ హిస్టరీలో పీహెచ్‌డీ చేసిన అన్నపూర్ణ, అనేక యూనివర్సిటీలకు పని చేశారు.

ఫొటో సోర్స్, Antara Luxury River Cruises/Facebook
మార్కెట్ మీద దృష్టి
భారతదేశంలోని క్రూయిజ్ మార్కెట్ మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రస్తుతం క్రూయిజ్ షిప్పుల్లో విహార యాత్రకు వెళ్లే వారి సంఖ్య 4 లక్షలుగా ఉంది. ఈ సంఖ్యను 40 లక్షలకు పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. మార్కెట్ కూడా రూ.8,800 కోట్ల నుంచి రూ.44,000 కోట్లకు పెరిగే అవకాశం ఉంది.
రానున్న 10 ఏళ్లలో భారత క్రూయిజ్ మార్కెట్ 10 రెట్లు పెరిగే అవకాశం ఉందని కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలరహదారుల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ గతంలో తెలిపారు.
దేశంలో క్రూయిజ్ టూరిజమ్‌ను ప్రోత్సహించేందుకు మౌలిక సదుపాయాలను కల్పించడం, పోర్టు ఫీజులను అందుబాటులోకి తీసుకురావడం, ఇ-వీసా సదుపాయం కల్పించడం వంటి చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర జలరవాణాశాఖ తెలిపింది.
ఇప్పటికే ముంబయిలో రూ.495 కోట్లతో క్రూయిజ్ షిప్ టెర్మినల్ నిర్మిస్తున్నారు. 200 షిప్‌లను ఇది హ్యాండిల్ చేస్తుంది. ఏడాదిలో 10 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు జరపొచ్చు.
విశాఖపట్నం, గోవా, చెన్నై వంటి ప్రాంతాల్లోనే టెర్నినల్స్ ఏర్పాటు చేసే ప్రయత్నం జరుగుతోంది.
కేంద్రం నాలుగు విధాలుగా క్రూయిజ్ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తోంది. పశ్చిమ తీరంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక యాత్ర. దక్షిణ తీరాన్ని ఆయుర్వేదిక్ వెల్‌నెస్ సర్క్యూట్‌గా డెవలప్ చేస్తారు. తూర్పు తీరాన్ని హెరిటేజ్ టూరిజంగా తీర్చిదిద్దుతారు.
దేశీయ క్రూయిజ్ మార్కెట్ పది లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పిస్తుందని పరిశ్రమకు చెందిన వ్యక్తులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Facebook/PIB
ప్రపంచ మార్కెట్ ఇలా
ప్రపంచవ్యాప్తంగా చూస్తే రివర్ క్రూయిజ్ మార్కెట్ ప్రతి ఏడాది 5శాతం వృద్ధి రేటును నమోదు చేస్తోంది. 2027నాటికి ప్రపంచ క్రూయిజ్ మార్కెట్‌లో దీని వాటా 37శాతానికి చేరుతుందని అంచనా వేస్తున్నారు.
ప్రపంచ రివర్ క్రూయిజ్ మార్కెట్‌కు యూరప్ కీలకంగా ఉంది. ప్రస్తుతం 60శాతం మార్కెట్ దానిదే. యూరప్‌లోని డాన్యుబ్, చైనాలోని యాంగ్చి నదులు రివర్ క్రూయిజ్‌కు కీలకంగా ఉన్నాయి.
ప్రస్తుతం ప్రపంచ రివర్ క్రూయిజ్ మార్కెట్ 1.45 బిలియన్ డాలర్లుగా ఉందని ఎనలిటిక్స్ సంస్థ ఫ్యూచర్ మార్కెట్ ఇన్‌సైట్స్ చెబుతోంది. 2032 నాటికి 2శాతం వృద్ధితో 1.71 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తోంది.
గ్లోబల్ క్రూయిజ్ టూరిజం మార్కెట్ అంటే నదులు, సముద్రాలు కలుపుకొని ప్రస్తుతం 5.3 బిలియన్ డాలర్లుగా ఉంది. 2032 నాటికి ఇది 17.4 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా.
గంగా విలాస్ మీద విమర్శలు
గంగా విలాస్ రివర్ క్రూయిజ్ మీద విమర్శలు కూడా వస్తున్నాయి.
వారణాసిని డబ్బు సంపాదన కోసం వాడుకుంటున్నారని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. స్థానికులను పట్టించుకోవడం లేదని, గంగా విలాస్ క్రూయిజ్ వల్ల నిషాద్ సముదాయానికి చెందిన ప్రజలు నష్టపోతారని ఆయన అన్నారు.
నిషాద్ సముదాయానికి చెందిన వారు గంగా నదిలో చిన్నచిన్న పడవలు నడుపుతూ జీవనం సాగిస్తుంటారు.
గంగా నదిని శుభ్రం చేయకుండా గంగా విలాస్ వంటి విలాసవంతమైన షిప్పులను తిప్పడం ఏంటని జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్ విమర్శించారు.
ఇవి కూడా చదవండి:
- టాటా నానో: కొత్త ఎలక్ట్రిక్ కారుతో రతన్ టాటా ‘చౌక కారు’ కల నెరవేరుతుందా?
- వాల్తేరు వీరయ్య మూవీ రివ్యూ: బాసు, గ్రేసు బాగున్నాయి, కానీ....
- జవాన్ ఛాతిలో పేలని గ్రెనెడ్, డాక్టర్లు, బాంబ్ స్క్వాడ్‌ను రప్పించాక....
- వాకపల్లి అత్యాచారాల కేసు: సత్వర న్యాయం జరగాల్సిన చోట 15 ఏళ్లుగా విచారణ, బాధితులు ఏమంటున్నారు?
- పవన్ కల్యాణ్: ‘ఒంటరిగా వెళ్లి వీరమరణం పొందాల్సిన అవసరం లేదు’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














