కామారెడ్డి: మాస్టర్ ప్లాన్‌ను రైతులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ప్రభుత్వం ఏం చెబుతోంది?

- రచయిత, ప్రవీణ్ శుభం
- హోదా, బీబీసీ కోసం
కామారెడ్డి మున్సిపల్ ‘మాస్టర్ ప్లాన్’ వివాదంగా మారింది. దీన్ని వ్యతిరేకిస్తూ స్థానిక రైతులు నెలరోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు.
మాస్టర్ ప్లాన్‌లో ప్రతిపాదించిన ఇండస్ట్రియల్ జోన్ వల్ల తన భూమి విలువ పడిపోయిందని పయ్యావుల రాములు అనే రైతు ఆత్మహత్య చేసుకోవడం, ఆ తర్వాత రైతు కుంటుంబాలు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించిన నేపథ్యంతో కామారెడ్డి మాస్టర్ ప్లాన్ చర్చల్లోకి వచ్చింది.
రెండు పంటలు పండే తమ భూములు పోతాయని , మాస్టర్ ప్లాన్ ముసాయిదాను వెనక్కి తీసుకోవాలని ఇక్కడి రైతులు డిమాండ్ చేస్తున్నారు.

ఇంతకూ మాస్టర్ ప్లాన్‌లో ఏం ఉంది?
దేశంలో ఉత్తర-దక్షిణ ప్రాంతాలను కలిపే అతిపెద్ద జాతీయ రహదారి ఎన్ హెచ్-44 పై ఆదిలాబాద్-హైదరాబాద్ మధ్యలో ఉంది కామారెడ్డి జిల్లా.
తెలంగాణలో జిల్లాల పునర్విభజన సమయంలో నిజామాబాద్ నుండి వేరుపడి కొత్త జిల్లాగా ఇది ఏర్పాటయ్యింది.
1987లో మున్సిపాలిటీగా మారిన కామారెడ్డిలో చివరిసారి 2000 సంవత్సరంలో మాస్టర్ ప్లాన్‌ను ఆమోదించారు.
గతంలో 16 చ.కి.మీ లుగా ఉన్న మున్సిపల్ పరిధి 8 విలీన గ్రామాలతో 61.55 చ.కి.మీ కు చేరింది. ప్రస్తుత జనాభా లక్ష20 వేలు ఉంటుందని అంచనా.
2041వ సంవత్సరం వరకు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సవరించిన కొత్త ముసాయిదాకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ 2022 నవంబర్ 1న జీవో నెం. 199 జారీ చేసింది.
మొత్తం 6155 హెక్టార్ల పరిధిలో ప్రాంతాలను ఇండస్ట్రియల్, కమర్షియల్, హరిత, మిక్స్డ్ జోన్ లుగా గుర్తిస్తూ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఒక మ్యాప్ (పటం) విడుదల చేసింది.
ముసాయిదాపై అభ్యంతరాలు, సలహాలు, సూచనల కోసం జనవరి 11 వరకు గడువు ఇస్తున్నట్టుగా మున్సిపాలిటీ శివారులోని మొత్తం 11 గ్రామాల పంచాయతీ కార్యదర్శులకు కామారెడ్డి మున్సిపల్ అధికారులు లేఖలు పంపి నోటీస్ బోర్డ్‌లో పెట్టాలని కోరారు.
కామారెడ్డి కలెక్టరేట్, మున్సిపల్ కార్యాలయం, ప్రధాన రోడ్లపై ముసాయిదా మ్యాప్‌ను ఫ్లెక్సీల రూపంలో ప్రదర్శించారు.
రైతుల అభ్యంతరం ఏంటి?
ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న కొత్త మాస్టర్ ప్లాన్ పరిధిలోకి కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల పరిధిలోని గ్రామాలు వస్తున్నాయి.
ముసాయిదాలో సూచించిన ఇండస్ట్రియల్ జోన్‌లో ఇల్చిపూర్, అడ్లూర్ ఎల్లారెడ్డి, అడ్లూరు గ్రామాలకు చెందిన భూములు, రామేశ్వరపల్లి, లింగాపూర్, టేక్రియాల్ లాంటి గ్రామాల్లో ప్రతిపాదిత కొత్త రోడ్లు ఉన్నాయి.
వివిధ జోన్‌ల పరిధిలో సూచించిన భూములకు నీటి వసతి ఉండి, రెండు పంటలు పండించగల సామర్థ్యం ఉండండం, ఖరీదైన భూములు కావడం.. వాటిని ప్రభుత్వం తమ నుండి తీసుకుంటుందన్న అనుమానం వ్యక్తం చేస్తూ రైతులు మాస్టర్ ప్లాన్‌ను వ్యతిరేకిస్తున్నారు.
ఇక్కడి రైతుల్లో ఎక్కువ మంది రెండెకరాల లోపు భూమి ఉన్న సన్నకారు రైతులే ఉన్నారు. వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉన్న తమకు వరి, చెరుకు, మొక్కజొన్న పంటలు పండే భూములు పోతే జీవనోపాధి పోతుందన్నది రైతుల వైపు నుండి వస్తున్న అభ్యంతరం.
ప్రతిపాదిత కొత్త మాస్టర్ ప్లాన్‌పై తమ అభ్యంతరం తెలియజేస్తూ శివారు గ్రామాలతో పాటు ఇదివరకే మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి.
మాస్టర్ ప్లాన్‌తో భూముల ధరలు తగ్గిపోతాయన్న భయం

మాస్టర్ ప్లాన్ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోని అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రైతు పయ్యావుల రాములు(37) జనవరి 3 న ఆత్మహత్యకు పాల్పడ్డారు.
రాములు శవంతో కామారెడ్డిలో రైతులు ఆందోళన నిర్వహించారు. ఆ మరుసటి రోజు పెద్ద సంఖ్యలో రైతు కుటుంబాలు కామారెడ్డి కలెక్టరేట్‌ను ముట్టడించి ఆందోళనకు దిగడం, కలెక్టర్ తమ వద్దకు రావాలని డిమాండ్ చేయడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దాంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
తమ కుటుంబానికి చెందిన రెండెకరాల భూమిలో కొంత భాగం అమ్మి, ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పు తీరుద్దామనుకున్నామని, కానీ ఇండస్ట్రియల్ జోన్ ప్రకటనతో భూముల ధరలు పడిపోవడంతో తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని రాములు భార్య పయ్యావుల శారద బీబీసీతో చెప్పారు.
గతంలో తమ గ్రామంలోని భూములను అమ్మాలని కొంతమంది నాయకులు కోరారని, అందుకు ఒప్పుకోకపోవడంతో మాస్టర్ ప్లాన్ పేరుతో తమ భూములను కాజేయాలన్న కుట్ర చేస్తున్నారని గ్రామానికి చెందిన కొందరు రైతులు బీబీసీతో అన్నారు.
కామారెడ్డి మున్సిపాలిటీ నుండి ప్రతిపాదిత కొత్త ముసాయిదా వచ్చిందన్న విషయం తమకు తెలియకుండా సర్పంచ్, గ్రామ కార్యదర్శి దాచారని అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామస్థులు ఆరోపించారు.
దీనికి నిరసనగా, గ్రామపంచాయతీ ఉప సర్పంచ్, ఆరుగురు వార్డ్ మెంబర్లు, వ్యవసాయ పరపతి సంఘం డైరెక్టర్ తమ పదవులకు రాజీనామా చేశారు.
రైతులంతా ఐక్య కార్యాచరణ సమితిగా ఏర్పడి ధర్నాలు, రాస్తారోకోలు, అధికార పార్టీ నాయకుల దిష్టిబొమ్మ దహనాలతో నిరసనల ప్రదర్శనలు చేశారు.
జనవరి 6 న కామారెడ్డి పట్టణ బంద్ చేపట్టారు.

"ఈ భూములను నమ్ముకునే పిల్లల చదువులు, పెళ్లిళ్లు చేస్తాం. భూములే మాకు సెక్యూరిటీ. ఇండస్ట్రియల్ జోన్ అనేసరికే భూముల క్రయవిక్రయాలు ఆగిపోయాయి. ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఈ మధ్య కాలంలో భూమి అమ్మకాలకు అడ్వాన్స్ తీసుకున్నవారిని, కొనుకున్నవారు అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయమని అడుగుతున్నారు. తీసుకున్న డబ్బులు ఖర్చు అయిపోయాయి. ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి? కుదుర్చుకున్న పెళ్లిళ్లు ఆగిపోయే పరిస్థితి వచ్చింది. భూమి అంటే కేవలం వ్యవసాయం కోసమే కాదు, ఇంకా చాలా అవసరాలకు ఉపయోగిస్తాం’’ అని అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన స్వప్న అన్నారు.
"పుష్కలమైన నీటి వసతితో ఉన్న మా భూముల్లో పంటలు మంచిగా పండుతాయి. మాకు భూమి తప్ప ఇంకో ఆధారం లేదు. మాస్టర్ ప్లాన్ చేస్తే మేం ఏ గంగలో పోవాలన్నదే మా కొట్లాట. మా భూమి మాకు ఉండాలి. మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేయాలి’’ అంటూ రైతు ఎర్రం మల్లయ్య డిమాండ్ చేస్తున్నారు.
ఇల్చిపూర్, అడ్లూర్ ఎల్లారెడ్డితో పాటు మరికొన్ని గ్రామాల రైతులు ఈ వివాదంపై హైకోర్ట్‌లో కేసు వేశారు.
"మా భూముల్లో భూగర్బ జలాలు తక్కువ లోతులో ఉన్నాయి. చెరుకు, వరి రెండు పంటలు పండే భూమిని తీసుకుని ఏదో జోను, ఇండస్ట్రీలు పెడతాం అంటే మేము రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది. కామారెడ్డి ప్రధాన రోడ్ల మీద మున్సిపల్ వారు పెట్టిన ఫ్లెక్సీ లు చూస్తే తప్ప మాస్టర్ ప్లాన్ విషయం మాకు తెలియలేదు. ఇదేదో అనుమానంగా ఉంది’’ అని ఈ ప్రాంతానికి చెందిన రైతు నర్సింలు సందేహాలు వ్యక్తం చేశారు.

ఇండస్ట్రియల్ జోన్ కాదు నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవండి - ప్రతిపక్షాలు
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ అంశంలో కాంగ్రెస్, బీజేపీ ప్రతిపక్ష పార్టీలు రైతులకు మద్దతు తెలిపాయి.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. రైతులు, కార్యకర్తలతో కలిసి కామారెడ్డి కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు.
"కామారెడ్డి మున్సిపాలిటీకి మాస్టర్ ప్లానే అవసరం లేదు. ఇక్కడి రైతులకు అధునాతన మార్కెట్ సౌకర్యాలను కల్పించాలి. అంతే కానీ రైతుల నుండి బలవంతంగా భూములు తీసుకుని ఇండస్ట్రియలిస్ట్‌లకు అప్పగించడం సరైంది కాదు. చేతనైతే బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలి’’ అని కాంగ్రెస్ కిసాన్ సెల్ నాయకుడు కోదండ రెడ్డి బీబీసీతో అన్నారు.
కామారెడ్డి ఉదంతంపై తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు.
హైదరాబాద్‌లో పట్టణ ప్రగతి కార్యక్రమంపై నిర్వహించిన వర్క్ షాప్‌లో మున్సిపల్ శాఖ అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, "ప్రణాళికబద్దమైన పట్టణాల కోసమే మాస్టర్ ప్లాన్లు తయారు చేస్తున్నాం. ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు ఈ ప్రభుత్వం లేదు. ప్రజలకు అనుకూలంగా మాస్టర్ ప్లాన్‌లు ఉండాలి. ప్రజల నుండి వచ్చిన అభ్యంతరాలపై సమీక్షించి ప్రజాస్వామ్య బద్దంగా నిబంధనల మేరకు మార్పులు, చేర్పులకు అవకాశం ఇవ్వాలని" అధికారులకు సూచించారు.
రైతులు ఆందోళన చెందవద్దు - కామారెడ్డి కలెక్టర్
కొత్త ముసాయిదాపై రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారన్న వాదనలను కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తిరస్కరించారు.
రైతులకు సమాచారం లేదన్నది సరికాదని, వారి నుండి ఇప్పటికే వెయ్యికి పైగా ధరఖాస్తులు వచ్చాయని తెలిపారు.
"అందరి నుండి అభ్యంతరాలను తీసుకునే బాధ్యత మాది. ప్రతి దరఖాస్తును పరిశీలిస్తాం. రైతులకు ఒక విజ్ఞప్తి.. ఇది కేవలం ముసాయిదా మాత్రమే. ఇందులో మార్పులు,చేర్పులు చేశాకే ముందుకు పోతాం. ప్రజాస్వామ్యబద్దంగా ఇది జరుగుతుంది. ఇండస్ట్రియల్ జోన్ అంటే భూసేకరణ కాదు. మీ యాజమాన్య హక్కులకు వచ్చే నష్టం లేదు. రైతుల భూసేకరణే మా ఉద్దేశమైతే, భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చేవాళ్లం కదా" అంటూ కలెక్టర్ వివరించారు.
ఇవి కూడా చదవండి:
- కామెరూన్: ఈ దేశంలో శవపేటికలు అమ్ముకోవడం మంచి వ్యాపారం, ఎందుకంటే....
- రోమియో జూలియట్:‘‘బలవంతంగా మాతో నగ్నంగా నటింపజేశారు’’- 70 ఏళ్ల వయసులో కేసు వేసిన హీరో హీరోయిన్లు
- చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ: ‘నల్ల జీవో తెచ్చి ఉన్మాదుల్లా వ్యవహరిస్తున్నారు.. జీవో-01 ని అడ్డుకోవడంపై చర్చించాం’
- కవల పిండాల్లో ఒకదాన్ని తొలగించాలని కోర్టుకెక్కిన మహిళ...చట్టం ఒప్పుకుంటుందా?
- స్పామ్ కాల్స్: 'హలో... మీకు 5 లక్షల పర్సనల్ లోన్ అప్రూవ్ అయింది, తీసుకుంటారా?'













