చంద్రబాబు నాయుడు: కందుకూరు, గుంటూరు తొక్కిసలాట వెనుక కుట్ర ఉంది... బీబీసీ ఇంటర్వ్యూ

వీడియో క్యాప్షన్, కుప్పం ఘటనపై చంద్రబాబు బీబీసీతో ఏమన్నారంటే..

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో నేడు ఉద్రిక్తకర పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

చంద్రబాబు నాయుడు రోడ్ షోకు అనుమతులు లేవంటూ పోలీసులు ఆయన వాహనాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, పోలీసులు మధ్య ఘర్షణలు జరిగాయి.

ఈ నేపథ్యంలో బీబీసీ కోసం చంద్రబాబు నాయుడుతో తులసీ ప్రసాద్ రెడ్డి మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు...

చంద్రబాబు నాయుడు

ఫొటో సోర్స్, TDP

ప్రశ్న: ఇవాళ్టి ఘటన మీద మీరు ఏమంటారు?

చంద్రబాబు: నేను 45 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా. నేను ఎప్పుడూ ఇలాంటి అరాచకాలు చూడలేదు. ఇప్పటికి ఏడు సార్లు ఎమ్మెల్యే అయ్యాను.

ఇది నా సొంత ఇల్లు. వీరు నా సొంత మనుషులు. ఎప్పుడూ నేను ఓటమి ఎరుగని ప్రాంతం. నేను వచ్చినా రాకపోయినా ప్రజలు నన్ను గెలిపిస్తూ ఉంటారు.

ఒక సైకో, శాడిస్టు ముఖ్యమంత్రి నన్ను అడ్డుకోవాలని చూశాడు.

ఈ ప్రాంతానికి నన్ను రానివ్వకుండా ఈ ముఖ్యమంత్రి విశ్వప్రయత్నం చేశాడు. ఎమర్జన్సీని తలపించేలా చేశారు. వెయ్యి మంది పోలీసులను మోహరించారు.

ఈ రోజు తీసుకొచ్చినవి కూడా నల్ల చట్టాలు. లేని చట్టాన్ని తీసుకొచ్చి, లేని అధికారాన్ని ఉపయోగించి ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నారు.

ఈ ముఖ్యమంత్రి పని అయిపోయింది. జగన్ పని అయిపోయింది. అందుకే ఇలాంటి విపరీత బుద్ధులు. రాబోయే రోజుల్లో ప్రజల తిరుగుబాటు చేసి, తగిన విధంగా బుద్ధి చెబుతారు.

చంద్రబాబు నాయుడు

ఫొటో సోర్స్, TDP

ప్రశ్న: ర్యాలీల్లో ప్రజలు చనిపోయినటువంటి ఘటనలు తిరిగి జరగకూడదనే ఇలా చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు కదా?

చంద్రబాబు: పోలీసులు ఏం చేస్తున్నారు... గాడిదలు కాస్తున్నారా? శాంతి భద్రతలను కాపాడటం వారి డ్యూటీ. అక్కడ చేసింది కుట్ర రాజకీయాలు. వేల మంది ప్రజలు వస్తున్నప్పటికీ పోలీసులు శ్రద్ధ పెట్టలేదు. ఈ రోజు నన్ను అడ్డుకోవడానికి వెయ్యి మంది పోలీసులను తీసుకొచ్చారు. ఆ రోజు కందుకూరులో కనీసం 100 మందినైనా పెట్టి ఉండొచ్చు కదా?

చివరకు ఒక ఎన్‌ఆర్‌ఐ కానుకలు ఇస్తే తగిన బందోబస్తును పెట్టలేక పోయారు. ప్రజలు చనిపోవడానికి కారణం ప్రభుత్వం. గుంటూరు, కందుకూరు ఘటనల్లో కుట్ర జరిగింది.

ప్రభుత్వం తప్పులు చేసి, నేడు నన్ను అడ్డుకోవడానికి జీవోలు తీసుకొచ్చింది.

దెబ్బలు తగిలిన టీడీపీ కార్యకర్తలు

ఫొటో సోర్స్, UGC

ప్రశ్న: వాహనాలు సీజ్ చేశారు... స్పీకర్లు పెట్టనివ్వడం లేదు... ఇప్పుడు మీరు ఏం చేస్తారు?

చంద్రబాబు: నన్ను ఎంత వేధించాలో... ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్నీ చేస్తున్నారు. పోయిన సారి నేను ఇక్కడకు వచ్చినప్పుడు 74 మంది మా మీదకు వచ్చారు. మమ్మల్ని కవ్వించేందుకు ప్రయత్నించారు.

చివరకు మా వాళ్ల మీద తప్పుడు కేసులు పెట్టారు. మా వాళ్లు 30 రోజులు జైలులో ఉన్నారు. అదేవిధంగా మిగతా 74 మంది కేసులు పెట్టారు. వాళ్లు ముందస్తు బెయిల్ తీసుకొని వచ్చారు.

ప్రశ్న: రేపు, ఎల్లుండి మీ కార్యాచరణ ఎలా ఉంటుంది?

చంద్రబాబు: నా కార్యక్రమాలు కొనసాగుతాయి. ఎవరు అడ్డువచ్చినా ఆగేది లేదు.

ప్రశ్న: మీరు అధికారంలోకి వస్తే ప్రతీకార రాజకీయాలు ఉంటాయా?

చంద్రబాబు: నేను ప్రతీకారం కంటే కూడా బ్రష్టు పట్టిన వ్యవస్థను ప్రక్షాళన చేస్తాను. రౌడీ రాజకీయాలను అణచివేస్తాను. రాజకీయాల్లో నేరస్తులు, అవినీతిపరుల విషయంలో ఏ మాత్రం మోహమాట పడం. వారు తగిన మూల్యం చెల్లించాల్సిందే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)