కంఝావాలా కేసు: యువతిని ఈడ్చుకెళ్లిన కారు.. ఆ యువతిదీ, నిందితులదీ ఒకే ప్రాంతం.. ఆ రాత్రి ఏం జరిగింది? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

నిందితులు

ఫొటో సోర్స్, DELHI POLICE

    • రచయిత, దిల్‌నవాజ్ పాషా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కంఝావాలా కేసును విచారిస్తున్న దిల్లీ పోలీసులు మంగళవారం మధ్యాహ్నం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, కొత్త విషయాలను వెల్లడించారు.

"చనిపోయిన అమ్మాయితో పాటు మరో అమ్మాయి ఉంది. ఆమెకు ఎలాంటి గాయలు కాలేదు. ప్రమాదం జరిగిన తరువాత ఆమె లేచి వెళ్లిపోయింది. ఆ అమ్మాయి పోలీసులకు పూర్తిగా సహకరిస్తోంది. సీఆర్‌పీసీ సెక్షన్ 164 కింద ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంటున్నాం" అని దిల్లీ పోలీసు స్పెషల్ కమీషనర్ ఆఫ్ పోలీస్ సాగర్ ప్రీత్ హుడా చెప్పారు. 

మృతురాలికి దిల్లీలోని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీలో పోస్టుమార్టం పూర్తయింది. పోస్టుమార్టం తాత్కాలిక నివేదికను స్పెషల్ సీపీ సాగర్ ప్రీత్ హుడా విడుదల చేశారు.

యువతి మరణానికి కారణం 'షాక్, రక్తస్రావం' అని నివేదికలో వెల్లడించారు. తల, వెన్నెముక, ఎడమ తొడ ఎముక, కాళ్ల దిగువ ఎముకలకు గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. 

యువతిపై అత్యాచారం లేదా లైంగిక దాడి జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని పోస్టుమార్టం రిపోర్ట్‌లో పేర్కొన్నారు. 

మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీలో ముగ్గురు సభ్యుల మెడికల్ బోర్డు మృతురాలి పోస్టుమార్టం నిర్వహించింది. 

"వేగంగా ఢీకొనడం వలన ఆమెకు గాయాలు అయ్యాయి. ఏదైనా వాహనం ఆమెను గుద్ది, ఈడ్చుకెళ్లి ఉండవచ్చు. లైంగిక దాడి జరిగిన ఆధారాలు లేవు. అలాటి గాయాలు ఆమె శరీరంపై లేవు" అని బోర్డు ఈ రిపోర్టులో పేర్కొంది. 

పోస్టుమార్టం తుది నివేదిక తర్వాత వస్తుందని పోలీసులు తెలిపారు.

కంఝావాలా కేసు

ఫొటో సోర్స్, ANI

ఆరోజు రాత్రి ఏం జరిగింది?

శనివారం రాత్రి 8.29 గంటలకు మృతురాలి తల్లి 29 సెకన్ల పాటు కూతురితో మాట్లాడారు. 'ఇంటికి ఎప్పుడు వస్తావు?' అని అడిగారు. 'ఆలస్యమవుతుంది' అని కూతురు సమాధానం ఇచ్చింది.

ఆ తరువాత, తల్లి కూతురితో మాట్లాడలేదు. మరుసటి రోజు ఉదయం ఓ మహిళా పోలీసు తల్లికి ఫోన్ చేసి 'మీ స్కూటీకి యాక్సిడెంట్ అయింది, పోలీస్ స్టేషన్‌కి రండి' అని చెప్పారు.

తల్లి పోలీసు స్టేషన్‌కు బయలుదేరారు. దారిలోనే పోలీసుల వాహనం వచ్చి ఆమెను ఘటనా స్థలానికి తీసుకెళ్లింది. ఆ తరువాత ఆమెను సుల్తాన్‌పురి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. 

"నా కూతురికి ఏం జరిగిందో చెప్పలేదు. నా కూతురిని చూపించమని పోలీసులను ఎంతో వేడుకున్నా. కానీ చూపించలేదు" అని మృతురాలి తల్లి చెబుతున్నారు. 

ఆమె 20 ఏళ్ల కూతురు దిల్లీలో కొత్త సంవత్సరం రోజు (ఆదివారం) తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఘటన జరిగి రెండు రోజులు గడిచినా ఆ రాత్రి ఆమెకు ఏం జరిగిందనేది ఇంకా పూర్తిగా తెలియలేదు. 

తన కూతురే తనకు ఆధారమని, ఆమె తప్ప మరో అండ లేదని మృతురాలి తల్లి విలపిస్తున్నారు. 

ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు దీన్ని హిట్ అండ్ రన్ కేసుగా పరిగణిస్తున్నారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సుల్తాన్‌పురిలోని కృష్ణ విహార్ ప్రాంతంలో స్కూటీపై వెళుతున్న ఆ అమ్మాయిని ఎదురుగా వస్తున్న కారు గుద్దింది. ఆమె కాళ్లు కారులో ఇరుక్కుపోవడంతో వాహనం ఆమెను 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆమె శరీరం వెనుక భాగం చిద్రమైంది.

జనవరి 1వ తేదీ ఉదయం దిల్లీలోని జౌంతీ గ్రామంలో బాలిక మృతదేహం నగ్నంగా కనిపించింది. కారు ఈడ్చుకెళ్లినప్పుడు బట్టలు చిరిగిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు.

మృతురాలి తల్లి

ఫొటో సోర్స్, ANI

'నా కూతురే నాకు దిక్కు'

దిల్లీలోని మంగోల్‌పురి ప్రాంతంలో మృతురాలి తల్లి తన ఇంట్లో నిస్సహాయ స్థితిలో కూర్చున్నారు. కూతురి చావు కబురు తెలిసిన దగ్గర నుంచి ఆమె ఏమీ తినడం లేదు. 

'మా దగ్గర పది రూపాయలు కూడా లేవు. కూతురికి అంత్యక్రియలు చేయడానికి కూడా డబ్బులు లేవు. ఇంట్లో సంపాదించేది నా కూతురే. తనే మాకు ఆధారం" అని మృతురాలి తల్లి చెబుతున్నారు. 

ఆమె భర్త కూడా ఎనిమిదేళ్ల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తన భర్త హత్యకు గురయ్యారని ఆమె నమ్ముతున్నారు. కానీ, అది ఆత్మహత్య అని పోలీసులు తేల్చారు. 

భర్త చనిపోయాక, ఆమె ఆరుగురు పిల్లలను ఒంటరిగా పెంచుతున్నారు. రెండేళ్ల క్రితం ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 

ఆ తరువాత కుటుంబాన్ని పోషించే బాధ్యత భాదితురాలిపై పడింది. పేదరికం కారణంగా మృతురాలి తల్లి తన ఇద్దరు కూతుర్లకు చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసి పంపించారు. 

"మా అమ్మాయి ఎప్పుడూ ఉత్సాహంగా నవ్వుతూ ఉండేది. తనకు రీల్స్ చేయడం సరదా. ఎప్పుడూ సంతోషంగానే ఉండేది. రోజుకు రూ. 500 సంపాదించేది. దాంతో, మా ఇల్లు గడిచేది" అని తల్లి చెప్పారు. 

భాదితురాలు ఈవెంట్స్‌లో వెల్‌కమ్‌ గర్ల్‌గా పనిచేసేవారని, వివాహాలలో అతిథులను ఆహ్వానించేందుకు ఆమెను నియమించుకునేవారని కుటుంబ సభ్యులు తెలిపారు. 

అయితే, ఆమె ఏ ఈవెంట్ కంపెనీలో పని చేసేవారో ఇంట్లో ఎవరికీ తెలీదు. జనవరి 31వ తేదీ రాత్రి ఆమె ఎక్కడికి వెళ్లారో కుటుంబ సభ్యులకు తెలీదు.

"ఆలస్యంగా వస్తానని మాత్రమే చెప్పింది, కానీ ఈవెంట్ ఎక్కడో చెప్పలేదు" అని ఆమె తల్లి చెప్పారు.

కంఝావాలా కేసు

అయిదుగురి అరెస్ట్

సోమవారం మృతురాలి బంధువులతో పాటు పలువురు దిల్లీలోని సుల్తాన్‌పురి పోలీస్ స్టేషన్‌ వద్ద నిరసనలు చేపట్టారు. బాధితురాలికి, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 

కాగా, ఈ కేసులో దిల్లీ పోలీసులు అయిదుగురిని అరెస్టు చేశారు. వీరంతా మంగోల్‌పురిలో నివసిస్తున్నవారే.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దీపక్ ఖన్నా అనే యువకుడు కారు నడుపుతుండగా, అమిత్ ఖన్నా, మనోజ్ మిట్టల్, మిథున్, కృష్ణ కారులో కూర్చున్నారు.

సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కారును గుర్తించి నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 

దీపక్ ఖన్నా వృత్తి రీత్యా డ్రైవర్. అమిత్ ఖన్నా ఒక బ్యాంకులో, కృష్ణ స్పెయిన్ సాంస్కృతిక కేంద్రంలో పనిచేస్తున్నారు. మిథున్ హెయిర్ డ్రెస్సర్. మనోజ్ మిట్టల్ సుల్తాన్‌పురి కేపీ బ్లాక్‌లో రేషన్ దుకాణాన్ని నడుపుతున్నారు. 

మనోజ్ మిట్టల్‌కు బీజేపీతో సంబంధం ఉందని స్థానికులు చెబుతున్నారు. సుల్తాన్‌పురి, మంగోల్‌పురిలలో ఆయన పోస్టర్లు అంటించారని తెలిపారు.

మనోజ్ మిట్టల్ ఫొటో ఉన్న ఒక హోర్డింగ్ సుల్తాన్‌పురి పోలీస్ స్టేషన్‌ బయట ఉంది. నిరసన చేపట్టిన స్థానికులు ఆగ్రహంతో ఆ హోర్డింగ్‌ను చించివేశారు.

నిందితుల ఇళ్లకు, మృతురాలి ఇంటికి మధ్య ఒకటి రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. అందరూ మంగోల్‌పురి నివాసులే.

కంఝావాలా కేసు

'పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదు' - ప్రత్యక్ష సాక్షి

ఈ కేసులో పోలీసుల తీరుపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

సుల్తాన్‌పురిలో నివసిస్తున్న డెలివరీ బాయ్ వికాస్ మెహ్రా డిసెంబర్ 31 అర్థరాత్రి కారు కింద ఆ అమ్మాయి మృతదేహాన్ని చూశానని తెలిపారు. 

"అర్థరాత్రి రెండు, రెండుంపావు అవుతుండగా, నేను కంఝావాల రోడ్డు నుంచి వస్తున్నాను. ముందున్న పోలీస్ చెక్ పోస్ట్ చూసి ఒక కారు వేగంగా వెనక్కు తిరిగింది. నన్ను గుద్దేస్తుంది అనుకున్నా. తృటిలో తప్పించుకున్నాను. ఆ కారు కింద ఒక అమ్మాయి ఉండడం చూశాను. వెంటనే చెక్ పోస్ట్ వద్దకు వెళ్లి పోలీసులకు ఈ విషయం చెప్పాను. 'నీకేం దెబ్బలు తగల్లేదు కదా, కారు సంగతి మేం చూస్తాం. నువ్వు ఇంటికెళ్లు' అని పోలీసులు నాతో చెప్పారు" అని వికాస్ మెహ్రా చెప్పారు. 

మీడియాతో మాట్లాడవద్దని పోలీసులు తన కొడుకుని హెచ్చరించారని వికాస్ తండ్రి ఆరోపించారు.

దీపక్
ఫొటో క్యాప్షన్, దీపక్

'ఎన్నిసార్లు ఫోన్ చేసినా పోలీసులు ఎవరూ రాలేదు'

మరో ప్రత్యక్ష సాక్షి దీపక్ కూడా యువతిని కారు కింద చూశానని తెలిపారు.

దిల్లీలోని లాడ్‌పూర్ గ్రామ నివాసి అయిన దీపక్ పాల వ్యాపారం చేస్తున్నారు.

"తెల్లవారుజామున 3.18 గంటలకు నా షాపు తెరిచాను. అదే సమయంలో ఒక బలేనో కారు మెల్లగా వచ్చింది. టైర్ పగిలితే వచ్చే సౌండ్ లాంటిది కారులోంచి వచ్చింది. కంఝావాలా వైపు నుంచి వచ్చిన ఆ వాహనం క్రమంగా కుతుబ్‌గఢ్ వైపు వెళ్లింది. కారు రెండో టైరు కింద దేహం ఇరుక్కుని ఉండడం గమనించాను. వెంటనే 112 కి కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించాను. 

3:30 అవుతుండగా, అదే వాహనం మళ్లీ వెనక్కి వచ్చింది. మళ్లీ పోలీసులకు ఫోన్ చేసి ఈ వాహనం కంఝావాలా వైపు వెళుతోందని చెప్పాను. వాహనం ఎటు వెళ్తోందో చూడ్డం కోసం నేను స్కూటీలో వాళ్లను వెంబడించాను. ఆ కారు వేగంగా వెళ్లలేదు. కానీ, ఎక్కడా ఆగలేదు" అని దీపక్ చెప్పారు.

కారు గురించి పోలీసులకు ఫోన్‌లో చెబుతూనే ఉన్నానని, కానీ పోలీసులెవరూ రాలేదని దీపక్ తెలిపారు.

"ముందుకెళ్లాక పోలీసులు బారికేడ్లు అడ్డం పెట్టి వాహనాన్ని ఆపుతారని నాకు చెప్పారు" అని వివరించారు.

ఆ వాహనం లాడ్‌పూర్, జౌంతి గ్రామం మధ్య రెండు ట్రిప్పులు వేసిందని, రెండోసారి వాహనం కంఝవాలా వైపు వెళ్లినప్పుడు దాని కింద మృతదేహం లేదని దీపక్ చెప్పారు. 

"కార్ రెండో రౌండ్ వచ్చినప్పుడు నేను నా పికప్ కారులో దాన్ని అనుసరించాను. కంఝవాలా వైపు ఉన్న పీసీఆర్‌కు సమాచారం అందించాను. కాని పీసీఆర్ వాహనాన్ని ఆపడానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదు" అని ఆయన చెప్పారు.

మనోజ్ మిట్టల్ హోర్డింగ్
ఫొటో క్యాప్షన్, మనోజ్ మిట్టల్ హోర్డింగ్

అత్యాచారం, హత్య ఆరోపణలు

యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో ఆమెపై అత్యాచారం జరిగి ఉండవచ్చని ఆమె బంధువులు ఆరోపించారు. 

అన్ని కోణాల నుంచి ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని, అలాంటిదేమైనా జరిగినట్టు పోస్టుమార్టంలో తేలితే అత్యాచారం హత్య సెక్షన్లను కూడా జోడిస్తామని పోలీసులు హామీ ఇచ్చినట్టు యువతి తల్లి చెప్పారు. 

ఇప్పటివరకు నేరపూరిత హత్య, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

కంఝావాలా కేసు

దిల్లీ పోలీసులు ఏం చెబుతున్నారు?

ఘటన జరిగిన సమయంలో యువతితో పాటు మరొక అమ్మాయి కూడా ఉన్నట్టు పోలీసులు మంగళవారం ఉదయం వెల్లడించారు. 

"మృతురాలిని ఈడ్చుకెళ్లిన మార్గాన్ని పరిశీలించినప్పుడు, ఆమె స్కూటీపై ఒంటరిగా లేరని తేలింది. ప్రమాదం జరిగిన సమయంలో మృతురాలితో పాటు ఒక అమ్మాయి కూడా ఉంది. ఆ అమ్మాయికి ఎలాంటి గాయాలు కాలేదు. అక్కడి నుంచి లేచి వెళ్లిపోయింది. ఈ కేసులో ఇది చాలా కీలకం. ఆమె మాతో పూర్తిగా సహకరిస్తున్నారు" అని స్పెషల్ సీపీ సాగర్ ప్రీత్ హుడా తెలిపారు. 

మృతురాలి కాళ్లు కారులో ఇరుక్కుపోవడంతో కారు ఆమెను ఈడ్చుకెళ్లిందని, వాహనం ఆమెను 10-12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిందని చెప్పారు.

వీలైనంత త్వరగా విచారణ జరుపుతామని, నేరస్థులకు కఠిన శిక్ష పడేట్లు చూస్తామని పోలీసులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి: