మందమర్రి సజీవ దహనం కేసు: ‘‘మూడు సార్లు హత్యయత్నం చేసి.. నాలుగోసారి పెట్రోల్ పోసి నిప్పంటించారు’’

మందమర్రిలో దహనమైన ఇల్లు
    • రచయిత, ప్రవీణ్ శుభం
    • హోదా, బీబీసీ కోసం

తెలంగాణలో ఆరుగురి సజీవ దహనం కేసులో పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపెల్లి వెంకటాపూర్‌లో డిసెంబర్ 16 అర్థరాత్రి సమయంలో మంటల్లో కాలిపోయిన ఇంట్లో ఆరుగురు చనిపోయారు.

మృతుడు, సింగరేణి కార్మికుడు శాంతయ్య (57) భార్య శనిగరపు సుజన అలియాస్ సృజన, ఆమెకు సహకరించిన మేడి లక్ష్మణ్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఈ కేసులో ప్రధాన నిందితులని రామగుండం కమిషనరేట్ పోలీసులు వెల్లడించారు.

సుజన, మేడి లక్ష్మణ్‌లతో పాటు వీరికి సహకరించిన శ్రీరాముల రమేష్, వేల్పుల సమ్మయ్య, ఆర్నకొండ అంజయ్యలను పోలీసులు అరెస్ట్ చేశారు.

తెలంగాణ పోలీస్

వివాహేతర సంబంధం, ఆస్థి గొడవలే ప్రధాన కారణం: పోలీసులు

రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం...

మంచిర్యాల జిల్లా లక్షట్టిపేట కు చెందిన శనిగరపు శాంతయ్య(57) ఆర్కే5బీ సింగరేణి బొగ్గుగనిలో కార్మికునిగా పనిచేస్తున్నారు. శాంతయ్య, సుజనలకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు.

లక్షట్టిపేటలోని తమ కుటుంబానికి సంబందించిన ఓ భూమి కొలతల సందర్భంగా 2010వ సంవత్సరం నుండి లక్షట్టిపేటకే చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మేడి లక్ష్మణ్‌తో సుజనకు పరిచయమైంది. వారిద్దరి మధ్య గత కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. లక్ష్మణ్ వద్ద సుజన 4 లక్షల అప్పు చేసింది.

సుజన భర్త శాంతయ్యకు మందమర్రి మండలం గుడిపెల్లి వెంకటాపూర్‌కు చెందిన రాజ్యలక్ష్మిఅలియాస్‌ పద్మతో అప్పటికే సన్నిహిత సంబందం ఉంది. ఈ విషయంలో శాంతయ్యకు భార్య సుజనతోను, అత్తమామలు చంద్రమ్మ, అంజయ్యలతోను గొడవలు ఉన్నాయి. జీతం, ఆస్తులు రాజ్యలక్ష్మికే ఇస్తానని శాంతయ్య చెప్పేవాడు.

పద్మ

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, పద్మ

అయితే గుడిపేట వెంకటాపూర్‌లోని రాజ్యలక్ష్మితోనే ఉంటూ సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో శాంతయ్య, సుజనలు ఒకరిపై ఒకరు పోలీస్ కేసులు పెట్టుకున్నారు. అదే సందర్భంలో పెద్ద మనుషుల సమక్షంలో గతేడాది నుండి పంచాయతీలు జరుగుతున్నాయి.

శాంతయ్య కుటుంబాన్ని పట్టించుకోవడం మానేయడం, కూతురు పెళ్లి ఇంకా చేయకపోవడంతో శాంతయ్యను చంపాలని సుజన, ఆమె తండ్రి అంజయ్య భావించారు.

శాంతయ్య హత్యలో సహకరిస్తే మూడు గుంటల భూమిని ఇస్తామని సుజన, ఆమె తండ్రి అంజయ్యలు మేడి లక్ష్మణ్‌కు ఆశ చూపారు. శాంతయ్యను హత్య చేస్తే తమ ఇద్దరి మధ్య సంబంధానికి అడ్డుతొలగుతుందని, అదే సందర్భంలో గతంలో తాను ఇచ్చిన 4 లక్షల అప్పు తిరిగి వస్తుందని, సింగరేణి కార్మికుడైన శాంతయ్య చనిపోతే భారీ మొత్తంలో వచ్చే డబ్బులో కొంత భాగం తనకు దక్కుతుందని మేడి లక్ష్మణ్ పథకానికి ఒప్పుకున్నాడు.

ఈ క్రమంలో శాంతయ్య తన పేరు మీద ఉన్న ఇంటి జాగాను భార్య సుజనకు తెలియకుండా అమ్మేసాడు. దీంతో లక్ష్మణ్ సహకారంతో సుజన తన భర్త ఆస్థిలో వాటా కోసం శాంతయ్య కుటుంబ సభ్యులపైన, మెయింటెనెన్స్ కోసం భర్త పైన సింగరేణిలో కేసులు వేసింది.

పెట్రోల్ డబ్బాలు

మూడు సార్లు హత్యాయత్నం విఫలం...

శాంతయ్యను చంపడం తన ఒక్కడి వల్ల కాదని భావించిన మేడి లక్ష్మణ్ అప్పటికే ఆర్థిక కష్టాల్లో ఉన్న లక్షట్టిపేటకు చెందిన పందుల వ్యాపారి శ్రీరాముల రమేష్‌కు 4 లక్షలు ఆశ చూపాడు. నెల రోజుల వ్యవధిలో హత్య ప్లాన్‌ను అమలు చేయాలని పథకం వేశారు. తమ చేతికి మట్టి అంటకూడదని యాక్సిడెంట్ చేసి శాంతయ్యను చంపాలని ప్లాన్ వేశారు. ఈ క్రమంలో 40 వేల రూపాయలకు ఓ పాత బొలేరో వాహనం కొన్నారు. ఆ వాహనంతో గుద్ది శాంతయ్యను చంపాలని అనుకున్నారు. అయితే బొలేరోకు సంబందించిన పేపర్స్ లేకపోవడంతో బ్రోకర్ సహాయంతో లక్ష్మణ్ పనిచేయించి బొలేరోను రమేష్‌కు అప్పగించాడు.

రిజిస్ట్రేషన్ పేపర్లు లేని బొలేరోతో యాక్సిడెంట్ చేసి చంపితే శాంతయ్య కుటుంబానికి ఎలాంటి బెనిఫిట్స్ అందవని గ్రహించి బ్రోకర్ సహాయంతో మేడి లక్ష్మణ్ పేపర్లు తయారు చేయించారని రామగుండం సిపి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.

హత్య పథకంలో భాగంగా గుడిపేటలో ఉంటున్న శాంతయ్య కదలికలను తెలుసుకునేందుకు గుడిపేటకు చెందిన వేల్పుల సమ్మయ్య అనే వ్యక్తి తో పరిచయం చేసుకుని అతనికి లక్షన్నర రూపాయలు ఇస్తామని చెప్పారు.

శాంతయ్య హత్యకు ప్లాన్ చేశామన్న విషయం బయట పడొద్దన్న ఉద్దేశంతో గత నాలుగు నెలల నుండి లక్ష్మణ్, సుజనలు ఫోన్‌లో మాట్లాడుకోవడం మానేసారు. ఎప్పటికప్పుడు నేరుగా కలుసుకుని హత్య ప్లాన్‌పై చర్చించేవారు. అయితే ఆరు నెలల కిందటి కాల్ డాటాను పరిశీలించిన పోలీసులు సుజన, లక్ష్మణ్‌ల మధ్య 800 కాల్స్ మాట్లాడినట్టుగా విచారణలో గుర్తించారు.

గత నెలలో మంచిర్యాల నుండి గుడిపేటకు శాంతయ్య, రాజ్యలక్ష్మిలు ఆటోలో బయలుదేరారని వేల్పుల సమ్మయ్య ఇచ్చిన సమాచారంతో RK-5 మైన్ వద్ద వారి ఆటోను బొలేరో తో ఢికొట్టేందుకు రమేష్ ప్రయత్నించే క్రమంలో అదుపుతప్పిన బొలేరో పక్కనే ఉన్న కందకంలో పడిపోయింది. ఈ ప్రమాదం నుండి రమేష్ సురక్షితంగా బయటపడ్డాడు.

ఆ తర్వాత నాలుగు రోజులకు మంచిర్యాలలోని ఓ ఆసుపత్రి నుండి శాంతయ్య, రాజ్యలక్ష్మిలు బయటకు వచ్చి ఓ ఆటోలో వెళ్తున్న సమాచారంతో రమేష్ మరోసారి బొలేరోతో ఢీకొట్టేందుకు ప్రయత్నించి విఫలం అయ్యాడు.

ఈ క్రమంలో యాక్సిడెంట్ ప్లాన్ స్థానంలో కత్తులతో దాడి చేసి నరికి చంపాలని నిర్ణయించుకుని రామకృష్ణాపూర్ మార్కేట్‌లో రెండు కత్తులను కొన్నారు. అయితే అలా చంపితే పోలీసులకు దొరికి పోతామని పెట్రోల్ పోసి కాల్చి చంపాలని ఫైనల్‌గా డిసైడ్ అయ్యారు.

మౌనిక

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, మౌనిక

తప్పుడు సమాచారంతో ఆరుగురు సజీవ దహనం...

డిసెంబర్ 16 మధ్యాహ్నం సమ్మయ్య నుండి వచ్చిన కాల్‌తో శాంతయ్య, రాజ్యలక్ష్మి, ఆమె భర్త మాసు శివయ్యలు గుడిపేటలోని ఇంట్లోనే ఉన్నారన్న సమాచారం ధృవీకరించుకున్న మేడి లక్ష్మణ్, రమేష్‌లు పెట్రోల్ పోసి చంపాలన్న తమ ప్లాన్ అమలు చేసేందుకు సిద్దం అయ్యారు.

లక్షట్టిపేట నుండి మంచిర్యాలకు వచ్చి బార్‌లో మధ్యం సేవించారు. గుడిపేట వెళ్లేందుకు గతంలో తనకు పరిచయం ఉన్న యాదగిరి అనే ఆటో డ్రైవర్‌కు రమేష్ కాల్ చేసాడు. అయితే అతను అందుబాటులో లేకపోవడంతో తన స్నేహితుడైన మరో ఆటో డ్రైవర్‌ను పంపాడు. ఈక్రమంలో మూడు ప్లాస్టిక్ క్యాన్‌లలో సమీపంలోని ఓ పెట్రోల్ బంక్ లో 5,000 రూపాయల పెట్రోల్‌ను నింపుకుని గుడిపేటకు చేరుకున్నారు.

ప్లాన్ అమలు చేసే బాధ్యతను రమేష్, సమ్మయ్య లకు అప్పగించి వచ్చిన ఆటోలోనే మేడి లక్ష్మణ్ మంచిర్యాలకు తిరిగి వెళ్లి ఓ లాడ్జ్‌లో బస చేసి ఫోన్ ద్వారా ప్లాన్‌ను సమీక్షించాడు.

శుక్రవారం (డిసెంబర్ 16) అర్థరాత్రి దాటిన తర్వాత రమేష్, సమ్మయ్యలు రాజ్యలక్ష్మి ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు.

అయితే నిందుతులు ముందుగా ఊహించినట్టు కాకుండా ఆ ఇంట్లో రాజ్యలక్ష్మి, ఆమె భర్త మాసు శివయ్య, శాంతయ్యలతో పాటూ రాజ్యలక్ష్మి అక్క కూతురు మౌనిక (26), ఆమె కూతుర్లు ప్రశాంతి (3), హిమబిందు(2) లు మంటల్లో కాలిపోయారు.

ఘటన రోజు రాజ్యలక్ష్మి తల్లిదండ్రులతో కలిసి మొత్తం 8 మంది ఆ ఇంట్లో ఉన్నారు. అయితే తన తండ్రి పొగాకు నములుతూ పదేపదే ఉమ్మివేస్తుండటంతో రాజ్యలక్ష్మి కోపగించుకోవడంతో అలిగిన తల్లిదండ్రులు అదే గ్రామంలోని బంధువులు ఇంట్లో రాత్రి నిద్రపోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు.

తెలంగాణ పోలీస్

ఫొటో సోర్స్, UGC

‘ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేయాలని కోరుతాం’

ఘటన తర్వాత నిందుతులు భయంతో తప్పించుకుని తిరుగుతుండగా మంగళవారం నాడు మంచిర్యాల రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వద్ద లక్ష్మణ్, రమేష్, సమ్మయ్యలను అరెస్ట్ చేశామని రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు సుజన, ఆమె తండ్రి అంజయ్యలను శ్రీరాంపూర్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు.

ముందుగా అనుమానించినట్టుగా మృతుడు శాంతయ్య ఇద్దరు కొడుకులు, కూతురుకు ఈ హత్యలతో సంబంధం లేదని విచారణలో తేలిందని సీపీ చెప్పారు. కేవలం వెయ్యి రూపాయలు వస్తాయన్న ఆశతో ఆటో డ్రైవర్ వచ్చాడని, హత్య ప్రణాళికలో అతనికి భాగస్వామ్యం లేదని తెలిపారు.

నిందితులులు మేడి లక్ష్మణ్ పై గతంలో ఓ భూ వివాదంలో చీటింగ్ కేసు ఉందని.. రమేష్, అంజయ్య లపై కూడా కేసులు ఉన్నాయని తెలిపారు. సుజన మీద ఆమె భర్త పెట్టిన కేసు ఉంది.

సంచలనం సృష్టించిన ఈ కేసులో త్వరితగతిన విచారణ జరిగి నిందితులకు శిక్షపడేలా చూస్తామని, ఇందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ను ఏర్పాటుచేయాల్సిందిగా కోరుతామని సీపీ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)