2022లో మరిచిపోలేని 5 అత్యంత దారుణ హత్యలు ఇవే...

శ్రద్ధ వాల్కర్

ఫొటో సోర్స్, ANI

    • రచయిత, దిల్‌నవాజ్ పాషా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

నేరాలకు అలవాటు పడి కొందరు హత్యలు, దోపిడీలు చేస్తారు. మరికొన్ని హత్యల వెనుక కొన్ని కారణాలు ఉండొచ్చు. ఈ రెండింటి మధ్య గీత చాలా అస్పష్టంగా ఉంటుంది. అయితే, నేరం ఏదైనా నేరంగానే చూడాలని అంటారు ఫ్రెంచ్ తత్వవేత్త అల్టెర్ట్ కామూ.

నేరాలను అడ్డుకునేందుకు శాంతి, భద్రతల పరిరక్షణ వ్యవస్థలు, బలగాలు పనిచేస్తుంటాయి. మరోవైపు నేరస్థులను శిక్షించేందుకు న్యాయ వ్యవస్థ కూడా పనిచేస్తుంది.

ఇన్ని వ్యవస్థలు ఉన్నప్పటికీ, నేరాలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని నేరాలు అయితే, అసలు ఇలా దారుణాలను ఒడిగడతారా? అని నివ్వెరపోయేలా చేస్తుంటాయి. వీటిలో కొన్ని సంచలనంగా మారితే, మరికొన్ని రాజకీయాలకు కేంద్ర బిందువులు అయ్యాయి.

2022 మరికొన్ని రోజుల్లో ముగిసిపోతోంది. దీంతో ఈ ఏడాది చోటుచేసుకున్న, ప్రజలు ఎప్పటికీ మరచిపోలేని నేరాలను ఒకసారి చూద్దామా?

శ్రద్ధ వాకర్

ఫొటో సోర్స్, ANI

1. శ్రద్ధ వాల్కర్ హత్య

ముంబయికి చెందిన శ్రద్ధ దిల్లీలో 2022 మే 18న హత్యకు గురయ్యారు. ఆమెతో సహజీవనం చేసిన అఫ్తాబ్ పూనావాలను నవంబరు 12న దిల్లీ పోలీసులు అరెస్టు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

దాదాపు ఆరు నెలలపాటు ఈ హత్య మర్మంగానే మిగిలిపోయింది. హత్య అనంతరం, శ్రద్ధ మృతదేహాన్ని 35 ముక్కలుగా కోసి తాము అద్దెకి ఉంటున్న ఇంట్లోని ఫ్రిడ్జ్‌లోనే అఫ్తాబ్ పెట్టాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఈ మృతదేహ భాగాలను నగరంలోని భిన్న ప్రాంతాల్లో విసిరేశాడు.

ఈ విషయాన్ని పోలీసుల దర్యాప్తులో అఫ్తాబ్ అంగీకరించాడు. నేరానికి పాల్పడిన విధానంపై మీడియాలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై ప్రజల నుంచి నిరసన కూడా వ్యక్తమైంది.

శ్రద్ధ హత్య తర్వాత, లివ్-ఇన్, మతాంతర సంబంధాలపై మీడియాలో పెద్దయెత్తున చర్చ జరిగింది. మరోవైపు దీనిలో లవ్ జిహాద్‌ కోణం కూడా ఉందని కొందరు నాయకులు వ్యాఖ్యలు చేశారు.

అఫ్తాబ్‌తో రిలేషన్‌షిప్‌లోకి వెళ్లిన తర్వాత, కుటుంబంతో శ్రద్ధ సంబంధాలు దాదాపుగా తెగిపోయాయి. నెలలపాటు ఆమె నుంచి స్పందన రాకపోవడంతో ఆమె కుటుంబం ముంబయిలో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మే నెలలోనే దిల్లీ మెహ్రౌలీ ప్రాంతానికి కలిసి జీవించేందుకు శ్రద్ధ, అఫ్తాబ్ వచ్చారు. ఇక్కడకు వచ్చిన కొన్ని రోజులకే శ్రద్ధను హత్య చేసినట్లు అఫ్తాబ్ అంగీకరించాడు.

ప్రస్తుతం అఫ్తాబ్ జైలులో ఉన్నాడు. హత్యకు సంబంధించి కీలకమైన ఆధారాలను పోలీసులు సేకస్తున్నారు. వీటిని కోర్టులో సమర్పించి, అఫ్తాబ్‌కు శిక్ష పడేలా చూసేందుకు వారు ప్రయత్నిస్తున్నారు.

బాధితులు రోసిలిన్, పద్మ
ఫొటో క్యాప్షన్, బాధితులు రోసిలిన్, పద్మ

2. కేరళలో నరబలి

దక్షిణాది రాష్ట్రం కేరళలో గత అక్టోబరులో నరబలి వార్త సంచలనం సృష్టించింది. రాష్ట్రంలోని ఇలాథూర్‌లో ఒక ఇంట్లో ఇద్దరి మహిళల మృతదేహ అవశేషాలు మొదట వెలుగులోకి వచ్చాయి.

ఆ తర్వాత విచారణలో ఒక జంట డబ్బులు వస్తాయని మూఢ నమ్మకంతో తాంత్రిక విధానాల్లో కొన్ని నెలల వ్యవధిలోనే ఇద్దరు మహిళలను నరబలి ఇచ్చినట్లు వెలుగులోకి వచ్చింది. ఆ బాధిత మహిళల మృతదేహాలను ఇంటి వెనుక భిన్న ప్రాంతాల్లో కప్పిపెట్టారు.

నిందితుడు, నాటు వైద్యుడు భగావల్ సింగ్ ఇంటి వెనుక 61 మృతదేహ భాగాలను పోలీసులు గుర్తించారు.

ఈ కేసులో భగావల్ సింగ్‌తోపాటు ఆయన భార్య లైలా, మరో మంత్రగాడు మొహమ్మద్ షఫీలను పోలీసులు అరెస్టు చేశారు.

హత్యల తర్వాత స్థానికులు బీబీసీ ఎదుట ఆందోళన, భయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు ఇక్కడ మరో ఇద్దరిని కూడా నరబలి ఇచ్చారనే వార్తలు వచ్చాయి. కానీ, పోలీసుల విచారణలో అలాంటి నేరమేమీ బయటపడలేదు. ప్రస్తుతం రెండు హత్యల వెనుకున్న ముగ్గురు నిందితులూ జైలులో ఉన్నారు.

లఖీంపుర్ ఖీరి

3. లఖీంపుర్ ఖీరీలో దళిత బాలికల హత్య

సెప్టెంబరు 14న ఉత్తర్ ప్రదేశ్‌లోని లఖీంపుర్ ఖీరీలో ఇద్దరు దళితల బాలికల మృతదేహాలు ఒక చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. ఈ ఇద్దరు బాలికలను అత్యాచారం చేసినట్లు వైద్య పరీక్షలు ధ్రువీకరించాయి.

దళిత వర్గానికి చెందిన ఈ ఇద్దరు బాలికల హత్య దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది.

48 గంటల్లోనే ఈ కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు సుహైల్, కరీముద్దీన్, ఆరిఫ్, జునైద్, రెహమాన్‌లు సమీపంలోని గ్రామాలకు చెందినవారు. మరో నిందితుడు చోటు గౌతమ్.. బాలికలు జీవించిన గ్రామంలోనే ఉండేవాడు.

బాలికలను తమ ఇంటి నుంచి ముగ్గురు నిందితులు తీసుకెళ్లారని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత పరిసరాల్లోని పొలాల్లో వారిపై అత్యాచారం చేశారని, ఆ తర్వాత హత్య చేసి, మృతదేహాలను చెట్టుకు వేలాడదీశారని వెల్లడించారు.

ఈ ఘటన తర్వాత ఉత్తర ప్రదేశ్‌లో శాంతి, భద్రతల పరిరక్షణపై విపక్షాలు సందేహాలు లేవనెత్తాయి.

మరోవైపు ప్రధాన నిందితులు ముస్లింలు కావడంతో, ఇక్కడ మతపరమైన ఉద్రిక్తలు చెలరేగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు.

దళిత వర్గానికి చెందిన మహిళలపై నేరాలకు పాల్పడటం, బలహీన వర్గాల మహిళలను లక్ష్యంగా చేసుకోవడం తదితర అంశాలపై మీడియాలో చర్చలు కూడా జరిగాయి.

ఈ కేసులోని ఆరుగురు నిందితులూ ప్రస్తుతం జైలులో ఉన్నారు. బాధిత బాలికల కుటుంబానికి ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది.

అంకిత భండారి హత్య

4. అంకితా భండారి హత్య

ఉత్తరాఖండ్‌లోని మారుమూల గ్రామం డోభ్ శ్రీకోట్‌కు చెందిన 19 ఏళ్ల అంకితా భండారి.. రిషీకేశ్‌లోని చిల్లా కాలువలో సెప్టెంబరు 24న మృతదేహమై కనిపించారు. ఆమె కనిపించడం లేదని ఆరు రోజుల క్రితమే ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రిషీకేశ్‌లో వనంతర రిసార్టులో సెప్టెంబరు 1న కొత్త ఉద్యోగాన్ని అంకిత మొదలుపెట్టారు. అయితే, 20 రోజుల్లోనే ఆమె హత్యకు గురయ్యారు.

ఈ కేసుకు సంబంధించి రిసార్టు యజమాని పుల్‌కిత్ ఆర్యతోపాటు మరో ఇద్దరు సిబ్బందిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

ప్రశాంతంగా కనిపించే ఉత్తరాఖండ్‌లో అంకిత హత్య ప్రకంపనలు సృష్టించింది. గ్రామీణ ప్రాంతానికి చెందిన పేద కుటుంబ యువతి ఇలా దారుణంగా హత్యకు గురికావడంపై ప్రజల నుంచి నిరసన వ్యక్తమైంది.

అయితే, కొన్ని అనైతికమైన పనులు చేయాలని, ప్రత్యేక సేవలకు ఒప్పుకోవాలని అంకితపై ఆ రిసార్టు సిబ్బంది ఒత్తిడి చేశారని, ఆమె నిరాకరించడంతో హత్య చేశారని కొన్ని మీడియా సంస్థలు వెల్లడించాయి. ఇదే విషయాన్ని అంకిత తన స్నేహితులతో చెప్పినట్లు కొన్ని వాట్సాప్ చాట్లు కూడా మీడియాలో కనిపించాయి.

పుల్‌కిత్ ఆర్య రిసార్టును బుల్డోజర్‌తో పరిపాలనా విభాగం ధ్వంసంచేసింది. అయితే, అసలు ఆ రిసార్టు నుంచి తాము ఎలాంటి ఫొరెన్సిక్ ఆధారాలను సేకరించలేదని పోలీసులు వెల్లడించారు.

దీంతో అంత వేగంగా ఆ రిసార్టును కూలదోయించాల్సిన అవసరమేం వచ్చింది? ఆధారాలను ధ్వంసం చేసేందుకేనా ఆ చర్యలు తీసుకున్నారు? అని కొందరు నాయకులు ప్రశ్నించారు.

అసలు అంకిత ప్రత్యేక సేవలు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఆ ప్రత్యేక అతిథి ఎవరు? అని కూడా ప్రశ్నలు వ్యక్తంఅయ్యాయి.

ఈ కేసులో ప్రధాన నిందితుడైన పుల్‌కిత్ ఆర్య తండ్రి వినోద్ ఆర్య.. బీజేపీలో ప్రధాన పాత్రలు పోషించారు. ఇదివరకు ఆయన రాష్ట్ర మంత్రిగానూ పనిచేశారు. ఘటన అనంతరం వినోద్‌ను పార్టీ బహిష్కరించింది.

ప్రస్తుతం పుల్‌కిత్‌తోపాటు మరో ఇద్దరు నిందితులు జైలులో ఉన్నారు. హత్యపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది.

కన్నయ్య లాల్

ఫొటో సోర్స్, PTI

ఫొటో క్యాప్షన్, కన్నయ్య లాల్

5. ఉదయ్‌పుర్ దారుణ హత్య..

రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో జూన్ 28న ఒక వీడియో ప్రజల్లో భయాన్ని పుట్టించింది. టైలర్‌గా పనిచేసే కన్నయ్య లాల్‌ను దారుణంగా హత్య చేస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపించింది.

ఈ వీడియోలో హత్యను రికార్డు చేసి, దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ప్రజల్లో ఆగ్రహం, ఆందోళన, భయం వ్యక్తమయ్యాయి.

మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నాయకురాలు వివాదాస్పద వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా చర్చలు నడుస్తున్నప్పుడే ఈ హత్య చోటుచేసుకుంది.

మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలకు స్పందనగానే ఈ హత్య చేసినట్లు నిందితులు గౌస్ మహమ్మద్, రియాజ్ మహమ్మద్ వెల్లడించారు.

గౌస్, రియాజ్‌లతోపాటు మరో నిందితుడు మహమ్మద్ షేక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ధన్‌మండీ పోలీసు స్టేషన్‌లో ఘటనపై మొదట కేసు నమోదైంది. ఆ తర్వాత దీన్ని జాతీయ దర్యాప్త సంస్థ (ఎన్ఐఏ)కు బదిలీ చేశారు.

ఈ కేసులో 11 మందిపై ఆరోపణలతో ఎన్ఐఏ చార్జిషీటు దాఖలుచేసింది. వీరంతా టెర్రరిస్టు ముఠాలా వ్యవహరించారని, ప్రతికారం తీర్చుకునేందుకే ఈ హత్య చేశారని ఎన్ఐఏ ఆరోపణలు చేసింది.

ఘటన జరిగిన నాలుగు నెలల తర్వాత కన్నయ్య లాల్ కుమారుడు బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘అది చాలా దారుణమైన వీడియో. ఇప్పటికీ మా అమ్మ దాన్ని చూడలేదు. మేం ఇంట్లో టీవీని కూడా ఆన్ చేయడం లేదు. ఆ భయం నుంచి ఇప్పటికీ మేం కోలుకోలేదు’’అని చెప్పారు.

వీడియో క్యాప్షన్, కత్తితో బ్యాంకు దోపిడీకి వచ్చిన దొంగను ఎదుర్కొన్న లేడీ మేనేజర్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)