కవల పిండాల్లో ఒకదాన్ని తొలగించాలని కోర్టుకెక్కిన మహిళ...చట్టం ఒప్పుకుంటుందా?

గర్భం

ఫొటో సోర్స్, JOHN FEDELE/GETTYIMAGES

    • రచయిత, సుశీలా సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తన గర్భంలో పెరుగుతున్న కవల పిండాల్లో ఒకదాన్ని తొలగించాలని ఒక మహిళ బాంబే హైకోర్టును ఆశ్రయించారు.

మహిళలు తమ 24 వారాలలోపు గర్భాన్ని తొలగించుకునేందుకు మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (సవరణ) చట్టం 2021 అనుమతిస్తోంది.

ఇదివరకు 20 వారాలలోపు గర్భాన్ని తొలగించేలా నిబంధనలు ఉండేవి. అయితే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో 24 వారాల వయసున్న గర్భాన్ని తొలగించొచ్చని ప్రభుత్వం ఈ చట్టానికి సవరణ తీసుకొచ్చింది.

అయితే, ప్రస్తుతం కోర్టును ఆశ్రయించిన మహిళ 25 వారాల గర్భిణి.

ఈ విషయంపై సదరు మహిళ తరఫు న్యాయవాది అదితీ సక్సేనా బీబీసీతో మాట్లాడారు. ‘‘ఆమె కడుపులోని రెండు పిండాల్లో ఒక దాన్ని తొలగించడానికి వీలుపడుతుందా? ఇది తల్లి లేదా కడుపులోని రెండో పిండంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది? లాంటి అంశాలను పరిశీలించాలని బాంబే హైకోర్టు ఒక మెడికల్ బోర్డును ఏర్పాటుచేసింది’’అని అదితి చెప్పారు.

భారత్‌లో ఇలాంటిది ఇది రెండో కేసని అదితీ వివరించారు.

‘‘2020లో ఇలాంటి కేసు ఒకటి వచ్చింది. కడుపులోని కవల పిండాల్లో ఒకదానిలో లోపం ఉందని చెబుతూ..దాన్ని తొలగించేందుకు అనుమతించాలని ఒక మహిళ కోర్టును ఆశ్రయించారు’’అని ఆమె చెప్పారు.

‘‘అయితే, కవల పిండాల్లో ఒకదాన్ని తొలగించేందుకు బాంబే హైకోర్టు అనుమతించలేదు. దీంతో ఆ మహిళ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అక్కడ లోపాలున్న ఆ పిండాన్ని తొలగించాలని కోర్టు సూచించింది’’అని ఆమె వివరించారు.

గర్భం

ఫొటో సోర్స్, ANKIT SAH/GETTY IMAGES

అసలేమైంది?

ముంబయికి చెందిన ఆ మహిళ ఐవీఎఫ్ విధానంలో గర్భం దాల్చారు.

ఐవీఎఫ్‌ విధానంలో ల్యాబ్‌లో వీర్యం, అండాలను ఫలదీకరణం చెందిస్తారు. ఆ తర్వాత పిండాన్ని తల్లి గర్భంలో ప్రవేశపెడతారు.

సదరు మహిళ భర్త అమెరికాలో ఉంటారు. గత ఆగస్టులో తన కడుపులో కవల పిండాలు ఉన్నట్లు ఆమె గుర్తించారు.

అయితే, గత నవంబరులో పరీక్షలు నిర్వహించినప్పుడు ఒక పిండానికి జన్యుపరమైన లోపాలు ఉన్నట్లు బయటపడింది.

సాధారణంగా బిడ్డకు తల్లి నుంచి సగం, తండ్రి నుంచి సగం జన్యువులు వస్తాయి. మొత్తంగా ఒక జన్యువులో 46 క్రోమోజోమ్‌లు ఉంటాయి.

అయితే, జన్యువుల్లోని ఈ క్రోమోజోమ్‌లలో ఏవైనా లోపాలు కనిపిస్తే జెనెటిక్ క్రోమోజోమల్ అబ్‌నార్మాలిటీగా పిలుస్తారు.

ఒక పిండంలో ఇలాంటి రుగ్మత ఉన్నట్లు గుర్తించిన వెంటనే దాన్ని తొలగించాలని ఆమె వైద్యులను ఆశ్రయించారు.

అయితే, అప్పటికే గర్భం 25 వారాలు దాటిపోవడంతో ఆ దంపతులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు.

‘‘రాష్ట్రం ఇలాంటి కేసుల కోసం మెడికల్ బోర్డు ఏర్పాటుచేయాలి. కానీ, బోర్డు లేకపోవడంతో ఆ దంపతులు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఒక బోర్డు ఏర్పాటుచేయాలని కోర్టు సూచించింది’’అని అదితి చెప్పారు.

గర్భం

ఫొటో సోర్స్, ANAND FERNANDO / EYEEM

ఇప్పుడు ఏం అవుతుంది?

కవల పిండాల్లో ఒక దానిలో కనిపిస్తున్న లోపాలతో బిడ్డ పుడితే కొన్ని రకాల వ్యాధులు వచ్చే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. ఆ వ్యాధులు ఏమిటంటే..

  • డౌన్ సిండ్రోమ్
  • గుండె జబ్బులు
  • గ్రహణం మొర్రి
  • మేధోపరమైన సమస్యలు
  • రక్తంలో కాల్షియం లోపం
  • వినికిడి సమస్యలు
  • కిడ్నీ వ్యాధులు 
గర్భం

ఫొటో సోర్స్, ANINDAM GHOSH / EYEEM

బిడ్డను తొలగించొచ్చా?

ఇలాంటి సమస్యలతో కనిపించే పిండం వయసు 24 వారాల లోపల ఉంటే, సహజంగా వైద్యులు గర్భాన్ని తొలగించుకోవాలని సూచిస్తారని ఆసియా సేఫ్ అబార్షన్ సంస్థ కోసం పనిచేస్తున్న డాక్టర్ సుచిత్ర దేవి చెప్పారు.

‘‘ఇక్కడ కడుపులో బిడ్డ పెరిగేకొద్దీ ఇటు బిడ్డ, ఇటు తల్లి ఇద్దరికీ సమస్యలు వస్తాయి’’అని ఆమె చెప్పారు.

‘‘ఇలాంటి కేసుల్లో ఒక్కోసారి గర్భంలో ఒకటి కంటే ఎక్కువ పిండాలు కనిపిస్తాయి. అప్పుడు పరిస్థితి కష్టం అవుతుంది. ఎందుకంటే సమస్యలున్న పిండాన్ని తొలగించేటప్పుడు ఆరోగ్యకర పిండంపైనా ప్రభావం పడొచ్చు. ప్రస్తుత కేసులోనూ ఇలానే కడుపులో రెండు పిండాలు ఉన్నాయి’’అని ఆమె వివరించారు.

‘‘ఐవీఎఫ్ విధానంలో ఇలా ఒకటి కంటే ఎక్కువ పిండాలు తల్లి కడుపులో ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది’’అని గుజరాత్‌లోని ఆనంద్‌లో ఐవీఎఫ్ క్లినిక్ నడుపుతున్న డాక్టర్ నయనా పటేల్ చెప్పారు.

‘‘ఒక్కోసారి మూడు లేదా నాలుగు పిండాలను ప్రవేశపెడుతుంటారు. ఫలితంగా కొన్ని పిండాలను తొలగించాల్సి రావొచ్చు. కొన్నిసార్లు ఇప్పటికే ఒక బిడ్డ జన్మించిన జంటలు రెండో బిడ్డ కోసం ఐవీఎఫ్‌ను ఆశ్రయిస్తుంటాయి. అప్పుడు తల్లి కడుపులో రెండు ఆరోగ్యకర పిండాలు పెరిగితే, ఒకదాన్ని తొలగించాల్సి రావచ్చు’’అని నయన వివరించారు.

గర్భం

ఫొటో సోర్స్, RASI BHADRAMANI/GETTYIMAGES

ఎలా తొలగిస్తారు?

కడుపులో పిండాన్ని ఎలా తొలగిస్తారనే విషయంపై డాక్టర్ నయన మాట్లాడుతూ.. ‘‘తల్లి కడుపుపై మొదట పొటాషియం క్లోరైడ్ ఇంజక్షన్‌ను ఇస్తారు. ఇది పిండం గుండెలోకి వెళ్లేలా చూస్తారు. ఫలితంగా ఆ పిండం గుండె ఆగిపోతుంది’’అని ఆమె చెప్పారు.

‘‘ఆ మహిళలను 24 గంటలపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతారు. ఆ సమయంలోనే గర్భంలోని ద్రవాలతోపాటు ఆ పిండం బయటకు వచ్చేస్తుంది’’అని ఆమె తెలిపారు.

ఒకవేళ పిండం వయసు ఆరు నుంచి ఏడు వారాలు మాత్రమే ఉంటే... వెజైనల్ సక్షన్ నీడిల్‌తో దాన్ని బయటకు తీసేయొచ్చు.

వీడియో క్యాప్షన్, Cup of Life:మగాళ్లకు పీరియడ్స్ నొప్పులు ఎందుకు వస్తున్నాయి?

ప్రమాదకరమైనది..

25 వారాలు దాటితే డెలివరీ చేయొచ్చా? ఈ ప్రశ్నపై డాక్టర్ సుచిత్రా దేవి మాట్లాడుతూ.. ‘‘ సాధారణంగా మొదట ప్రసవం ద్వారా పిండాన్ని బయటకు తీస్తారు. అయితే, అప్పటికీ ఊపిరితిత్తులు పూర్తిగా రూపుదిద్దుకోవు. కాబట్టి ఎన్ఐసీయూలో పెట్టి పిండానికి ఆక్సిజన్ అందించాల్సి ఉంటుంది’’అని ఆమె వివరించారు.

‘‘ఆక్సిజన్ సరిపోకపోయినా లేదా ఏదైనా అసమతౌల్యం ఏర్పడినా, ఆ శిశువుకు ఐక్యూ లేదా కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది’’అని ఆమె చెప్పారు.

‘‘ఇలా నెలలు నిండకుండానే ప్రసవం చేయడం బిడ్డకు చాలా ప్రమాదకరం. ప్రస్తుత కేసు విషయంలో ఏం చేస్తారో చూడాలి. ఎందుకంటే కడుపులోని బిడ్డ, తల్లి ఆరోగ్యాన్ని పూర్తిగా పరిశీలించి ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది’’అని ఆమె వివరించారు.

ఈ కేసులో తదుపరి విచారణను జనవరి 16కు కోర్టు వాయిదా వేసింది.

వీడియో క్యాప్షన్, వీర్యం, అండం లేకుండా సృష్టించిన ఈ పిండం గుండె కొట్టుకుంటోంది

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)