భారత క్రికెట్ జట్టులో ప్రతిభ ఎక్కువైపోయి సమస్యగా మారిందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సురేష్ మీనన్
- హోదా, స్పోర్ట్స్ రైటర్
భారత జట్టు ఐసీసీ ట్రోఫీ గెలిచి ఇప్పటికి పదేళ్లు అవుతోంది. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో భారత్ 50 ఓవర్ల ప్రపంచ కప్ ఆడేందుకు సిద్ధమవుతోంది. ఈ సమయంలో భారత క్రికెట్ జట్టు రెండు ప్రశ్నలను వేసుకోవాలి.
ఒకటేమిటంటే.. మహేంద్ర సింగ్ ధోని చివరి సిక్స్ 2011లో భారత దిగ్విజయానికి ప్రతీకగా నిలిచిపోయింది. అలాంటి ఇమేజ్‌ను టీమిండియా మళ్లీ ఈ ఏడాది సంపాదించగలదా?
రెండు: భారత క్రికెట్ ప్రస్తుతం పరివర్తన క్రమంలో ఉందా?
క్రీడల్లో మార్పు అనేది రాత్రికి రాత్రి జరగటం చాలా అరుదు. కొన్నిసార్లు.. స్థిరంగా విజయాలు సాధిస్తున్నపుడు సీనియర్ ఆటగాళ్లు వైదొలిగి యువతరానికి చోటు ఇస్తూ ఉంటారు. కానీ, ఓటమి కారణంగానే మార్పు రావటం ఎక్కువగా జరుగుతుంటుంది.
2022 ఏడాదిలో భారత క్రికెట్ విజయాలు మధ్యస్థంగా ఉన్నాయి. అంటే ఆటగాళ్లు చాలా బాగా ఆడారని కానీ, చెత్తగా ఆడారని కానీ లేదు. టెస్టు మ్యాచ్‌లలో, వన్డే ఇంటర్నేషనల్స్‌లో దాదాపు 58 శాతం చొప్పున, టీ20 మ్యాచ్‌లలో 70 శాతం విజయాన్ని భారత ఆటగాళ్లు సాధించారు.
ఈ ఏడాది చివరిలో జరగబోయే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఆడేందుకు భారత ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. ప్రపంచ కప్ గెలిచే ఫేవరేట్లుగా ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అయినప్పటికీ, భారత్ తనకున్న సత్తా కంటే తక్కువగానే ఆడుతున్నదన్న భావన ఉంది.
టాప్ బ్యాట్స్‌మన్ ఆటలో రాణించటానికి ఆపసోపాలు పడ్డారు. బౌలింగ్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. కీలకమైన ఆటగాళ్లు గాయాలు పాలవ్వడం మరో సమస్య.
అన్ని ఫార్మాట్లలో ఈ సమస్యలు ఉన్నప్పటికీ, భారత్ టెస్టులలో నెంబర్ 2 ర్యాంకును, టీ20లలో నెంబర్ 1ను, వన్డే మ్యాచ్‌లలో నెంబర్ 4 స్థానాన్ని దక్కించుకుంది. ఈ పరిస్థితులతో కొన్ని టీమ్‌లు సంతోషపడవచ్చు.
అంచనాలు అధికంగా ఉండటం ఒక సమస్య. ఎందుకంటే భారత జట్టు ప్రతి మ్యాచ్‌లో గెలవాలని అభిమానులు ఆశిస్తూ ఉంటారు. ఈ అంచనాలకు ఏ మాత్రం తగ్గినా కోట్లాది మంది నిరాశకు లోనవుతారు. ఈ జనం తమ జీవితాల్లో స్వీయ ఓటములను క్రికెట్‌లో భారత జట్టు విజయంతో భర్తీ చేసుకుంటారు. అందుకే భారత జట్టు ఓడిపోతే వీరు డీలాపడతారు.
మరో సమస్య ఏమిటంటే క్రికెట్ షెడ్యూల్. ఆకలితో రగిలిపోతూ ఉండే టెలివిజన్‌కు నిరంతరం ఆహారం అందించటానికి అత్యధికంగా మ్యాచ్‌లను ఆడాల్సి వస్తోంది.
ఉదాహరణకు, గత ఏడాది టీ20 ప్రపంచ కప్ జరిగింది. ఈ ఏడాది వన్డే ప్రపంచ కప్ జరుగబోతోంది. ఈ తరుణంలో ఇప్పుడే ఇన్ని టీ20 మ్యాచ్‌లు ఆడాల్సిన అవసరం లేదు.
మార్చి ముగిసే నాటికి భారత జట్టు సొంత గడ్డ మీద శ్రీలంక, న్యూజీలాండ్, ఆస్ట్రేలియాలతో 9 వన్డేలు ఆడుతుంది. ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత ఐపీఎల్ మొదలవుతుంది.
దీనివల్ల, సరైన జోడీలను గుర్తించటం, ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి కల్పించటం, ఏమైనా గాయాలైతే తగిన చికిత్స, జాగ్రత్తలు తీసుకోవటం సవాలుగా మారుతుంది.
ఇంతకుముందు గాయపడిన ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాను హడావుడిగా జట్టులోకి తేవాలని భావించారని చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ చెప్పటం ఆందోళన కలిగిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
సచిన్ టెండూల్కర్ రిటైర్ అయి ఈ ఏడాది నవంబర్ నాటికి ఒక దశాబ్దం అవుతుంది. అప్పటివరకూ సచిన్ పేరుతో సాగిన భారత్ క్రికెట్ శకం ఆయన రిటైర్‌మెంట్‌తో ముగిసిందని చెప్పొచ్చు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. టెండూల్కర్ చివరి టెస్ట్ మ్యాచ్‌లో ఆడినపుడు అతడితో పాటు భారత జట్టులో ఆడిన ఆటగాళ్లలో ఏడుగురు ఇంకా అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడుతున్నారు. రాణిస్తున్నారు కూడా.
రవిచంద్రన్ అశ్విన్ (37 ఏళ్లు), చటేశ్వర్ పుజాార (35 ఏళ్లు), విరాట్ కోహ్లి (34 ఏళ్లు), రవీంద్ర జడేజా (34 ఏళ్లు), శిఖర్ ధావన్ (37 ఏళ్లు) కొనసాగుతున్నారు.
అంటే యువ ఆటగాళ్లు తగినంత బలంగా ముందుకు రావటం లేదనుకోవాలి. లేదంటే.. ఒకవేళ బలంగా ముందుకు వచ్చినా కూడా.. బిగ్ లీగ్‌లో చోటు దక్కటం కోసం.. ఈ సీనియర్ ప్లేయర్లు కొందరు తొలుత అవకాశం కోసం నిరీక్షించిన దానికన్నా ఎక్కువ కాలం వేచి ఉండాల్సి వస్తోందేమో.
ఎడమ చేతి మీడియం పేసర్ హర్షదీప్ సింగ్ వచ్చే నెలలో 24వ ఏడాదిలోకి అడుగు పెడతాడు. అలాగే, టీ20లో ప్రపంచ గుర్తింపు పొందిన బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్‌కి 32 ఏళ్లు.
టాప్ ఆర్డర్ సత్తా చూపటంలో ఇబ్బంది పడితే, సొంత గడ్డపై జరిగే టెస్ట్ సిరీస్‌లలో వీరు బరిలో దిగే అవకాశం ఉంది.
ప్రస్తుతం భారత జట్టు.. ఒక ఆల్ రౌండర్ కోసం కానీ, టెస్ట్ మ్యాచ్‌లలో బౌలింగ్ కూడా చేయగలిగిన ఐదుగురు బ్యాట్స్‌మన్ కోసం కానీ చూస్తోంది. ఈ పాత్రలకు హార్దిక్ పాండ్యా, జడేజా సరిపోతారు. టీ20, వన్డే ఫార్మాట్లలో అక్షర్ పటేల్ కూడా ముందుకు వస్తున్నాడు.
బౌలింగ్ చేయటానికి తగినన్ని ప్రత్యామ్నాయాలు లేనపుడు టీమిండియా బాగా ఇబ్బందిపడింది. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఈ కారణం వల్లనే భారత జట్టు ఓడిపోయింది.

ఫొటో సోర్స్, MICHAEL STEELE-ICC
టీ20 వరల్డ్ కప్‌లో ఓడిపోవడం భారత్‌కు పాఠమా..?
టీ20 వరల్డ్ కప్‌లో ఓటమి భారత జట్టుకు ఒక పాఠం చెప్పిందంటే.. ఆ పాఠం ఇదీ:
టీ20 అనేది యువకుల ఆట. 2007లో భారత్ ఈ టైటిల్ గెలుచుకోవడం ఒక అదృష్టం.
గత ఏడాది మెల్‌బోర్న్‌లో జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఓడిండచం కూడా యాధృచ్ఛికమే.
ఇలాంటి యాదృచ్ఛిక విజయాల వల్ల, జట్టులో తమ సామర్థ్యాలపై భ్రమలు పెరుగుతాయి.
టీ20 క్రికెట్‌ను మొత్తంగా వేరుగా చూడాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ ఫార్మాట్‌కు ప్రత్యేక కెప్టెన్, ప్రత్యేక స్పెషలిస్ట్ ప్లేయర్లు, ప్రత్యేక కోచ్, ప్రత్యేక సపోర్టింగ్ స్టాఫ్ ఉండాలి.
ఇంగ్లండ్ జట్టు ఆ పని చేసింది. దాని ప్రయోజనాలు పొందింది.
క్రికెట్‌లో విభజన అనేది రెడ్ బాల్, వైట్ బాల్ మధ్య కాదు. టెస్టులు, వన్డేలు ఒకవైపున.. టీ20లు మరోవైపున ఉంటాయి.
టీ20 క్రికెట్‌కి ఆ ఫార్మాట్‌లో ఆలోచించగలిగే కోచ్‌లు కావాలి. ఈ మ్యాచ్‌లలో కోచ్‌ల కంటే కూడా.. డేటా అనలిస్టులు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
వన్డే క్రికెట్‌లో భారత్‌కు స్థిరమైన టీమ్ లేదు. కానీ, ప్రపంచ కప్‌కి ముందే తమ తప్పులు తెలుసుకుని సరిదిద్దుకునేందుకు మాత్రం అవసరమైనంత సమయం ఉంది.
టీ20లలో యాదవ్ ఆడినట్టుగా వన్డే క్రికెట్‌లోనూ ఎవరైనా ఆడాలి. అది యాదవ్‌నే కావచ్చు. తద్వారా జట్టులో స్ఫూర్తి నిండుతుంది.
ప్లేయర్లకు ఆరంభంలో మద్దతుగా ఉండాలి. వారు కూడా టీమ్‌లో భాగమేనన్న విశ్వాసం కల్పించాలి.
బంగ్లాదేశ్‌తో టెస్ట్ మ్యాచ్‌లలో తొలి మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ఎడమచేతి స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్‌ను రెండో టెస్ట్‌లో తప్పించారు. ఇలా చేయటం ఆ విశ్వాసాన్ని కల్పించదు.
ఫార్మాట్ ఏమిటన్న దానితో సంబంధం లేకుండా.. జట్టులో బ్యాలన్స్ కోసం కోచ్, కెప్టెన్ ఇద్దరూ నిరంతరం పాటుపడుతూ ఉండాలి.
ఎక్స్‌ట్రా బ్యాట్స్‌మని ఆడించాలా? అప్పుడప్పుడూ రాణించే ప్లేయర్ బాగా ఆడతాడేమోనని ఆడించాలా? రన్స్ తెచ్చిపెట్టగలడని నాన్ రెగ్యులర్ వికెట్‌కీపర్‌ను ఆడిస్తూ.. క్యాచ్‌లు వదలకుండా ఉంటాడని ఆశించాలా? టూ ఫింగర్ స్పిన్నర్‌ని తీసుకోవాలా, వన్ ఫింగర్ స్పిన్నర్‌ని ఆడించాలా, రిస్ట్ స్పిన్నర్‌ని ఎంపిక చేయాలా, ఎక్స్‌ట్రా మీడియం పేసర్‌కు చోటివ్వాలా?
సీనియర్ ఆటగాళ్ల సంగతేమిటి? ‘నన్ను తప్పించడానికి నీకెంత ధైర్యం’ అంటే దాన్ని సీరియస్‌గా తీసుకోవాలా?
జీవితం లాగా క్రికెట్ కూడా ముందుకు సాగుతుంది. ముగిసిన తర్వాతే జరిగిన దానిని అర్థం చేసుకోగలం. భారత తుది మ్యాచ్ అయ్యాకనే ఆదర్శవంతమైన జట్టు ఏమిటన్నది తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి:
- కోడి పందాలు: పోలీసులు హెచ్చరిస్తున్నా రూ.కోట్లలో పందాలు ఎలా జరుగుతున్నాయి?
- బ్రిటన్: ‘మా అమ్మ డయానా మరణం వెనుక అసలు కారణాలపై నా ప్రశ్నలు ఇంకా అలాగే ఉన్నాయి’ - ప్రిన్స్ హ్యారీ
- మెగలొడాన్: తిమింగలాలనే మింగేసే అతి పెద్ద షార్క్ కోరను వెదికి పట్టుకున్న 9 ఏళ్ల బాలిక
- Naatu Naatu Song: తెలుగు సినీ సంగీత ప్రపంచానికి 'పెద్దన్న' ఎంఎం కీరవాణి
- ‘‘నన్ను కెమెరా ముందు కూర్చోబెట్టి నీ సెక్స్ సంబంధాల గురించి చెప్పు అని అడిగారు’’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














