కోడి పందాలు: పోలీసులు హెచ్చరిస్తున్నా రూ.కోట్లలో పందాలు ఎలా జరుగుతున్నాయి?

కోడి పందాలు
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

పౌరుషాలకు, పంతాలకు ప్రతీకగా భావించే కోడి పందాల కాలం ఎప్పుడో పోయింది. ఇప్పుడు కోడి పందాలంటే కోట్లు కుమ్మరించే వ్యాపారం.

కోళ్ల అమ్మకాల నుంచి బరిలో దింపిన కోడిపుంజులపై కాసే పందాల వరకూ చాలా హంగామా ఉంటుంది. రానురాను ఇది పెరుగుతూ వస్తోంది. హంగులు, ఆర్భాటాలు ఎక్కువవుతున్నాయి.

ఏటా సంక్రాంతి సమయంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగే కోడి పందాలను అడ్డుకుని తీరుతామంటూ పోలీసులు హెచ్చరిస్తుంటారు.

పండగకు కొద్దిరోజుల ముందు కాస్త హడావుడి చేస్తారు. కానీ, ఆ మూడు రోజులు మాత్రం పోలీస్ స్టేషన్లకు అతి సమీపంలోనే పందాలు జరుగుతున్న చూసీచూడనట్టు ఉంటారు.

ఈ ఏడాది కూడా కోడి పందాల నిర్వహణకు అనుమతిలేదంటూ పోలీసులు చెబుతున్నారు. అదే సమయంలో బహిరంగంగానే భారీ ఏర్పాట్లు మరోవైపు సాగుతున్నాయి. ఎందుకిలా జరుగుతుందనేది ఆసక్తికరం.

ఆర్థిక, రాజకీయ వ్యవహారాలతో ముడిపడిన కోడి పందాల విషయంలో నియంత్రణ సాధ్యమేనా అనేది చర్చనీయాంశం.

కోడి పందాలు

లక్షల్లో ఆదాయం..

కోడి పందాలు ఒకనాడు సరదా. ఆ తర్వాత సంప్రదాయంగా మారింది. కానీ వర్తమానంలో ఇదో పెద్ద ఉపాధి మార్గం అయింది. అంతకుమించిన వ్యాపారంగా తయారయ్యింది.

పందాల కోసం కోళ్లను తయారుచేయడం. కత్తులను సిద్ధం చేయడం వంటి వృత్తుల్లో వందల మంది ఉన్నారు. ఏడాది పొడవునా కోళ్లను పందాలకు సిద్ధం చేసే ప్రక్రియలో అనేకమంది ఉపాధి పొందుతున్నారు.

పందెం కోడిని గుర్తించడం, దానికి తగిన ఆహారం అందించడం, కసరత్తులు చేయించి, పందాలకు పురిగొల్పడం ఓ విద్యగా మారింది. అది తెలిసిన వారికి గ్రామాల్లో కొంత గిరాకీ కూడా ఉంటుంది.

పందాలకు బరులు ఏర్పాటు చేయడం, ఆ ప్రాంతంలో ఓ జాతర మాదిరిగా తినుబండారాలు, మద్యం షాపుల నిర్వహణతో పాటుగా అవకాశం ఉంటే గుండాటకి సిద్ధం చేయడం వంటివి పెద్ద వ్యవహారాలు. వాటి ద్వారా కోట్లలో వ్యాపారం జరుగుతుంది.

పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడు మండలంలో 2022 సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ బరి సమీపంలో బెల్ట్ షాప్ నిర్వహణకు ఏర్పాటు చేసిన వారికి సుమారుగా రూ.12 లక్షలు ఇవ్వాల్సి వచ్చిందని చెరుకుమిల్లికి చెందిన ఎం.విష్ణుకుమార్ రాజు బీబీసీతో అన్నారు.

కోడి పందాలు

"బరులు వివిధ కేటగిరీలుగా ఉంటాయి. పెద్ద బరులు అంటే బడా నాయకులు, సెలబ్రిటీలు వస్తూ ఉంటారు. అలాంటి బరుల్లో రోజుకి ఒక్కో చోట నాలుగైదు కోట్ల రూపాయల పందాలు జరుగుతాయి.

మధ్య తరహా బరులు కూడా ఉంటాయి. అక్కడయితే రూ. 50 లక్షల నుంచి కోటి వరకూ పందాలు జరుగుతాయి. సామాన్యులు కూడా చిన్న చిన్న బరులు నిర్వహిస్తుంటారు. అక్కడ మొత్తం రోజంతా కలిపితే రూ. 10, 15 లక్షల పందాలు జరుగుతాయి.

మూడు రోజులకు కలిపి పెద్ద బరుల్లో రూ. 15 కోట్ల వరకూ పందాలు జరుగుతాయి"అంటూ ఆయన వివరించారు.

"పందాలతో పాటుగా గుండాటలో కూడా లక్షల రూపాయలు చేతులు మారుతాయి. మద్యం అమ్మకాలు, మాంసం సహా ఇతర సరుకుల అమ్మకాలు కూడా విస్తృతంగా ఉంటాయి. వాటిని అమ్ముకునే వారు బరి నిర్వహాకులకు ముందుగా అడ్వాన్సులు ఇవ్వాల్సి ఉంటుంది" అని ఆయన తెలిపారు .

పెద్ద బరుల దగ్గర ఫ్లడ్ లైట్లు, ఫెన్సింగ్, స్టేజీ ఏర్పాట్లుంటాయి. వాటన్నింటినీ పది పదిహేను రోజుల ముందు నుంచే సిద్ధం చేస్తారు. వాటి ఏర్పాట్ల కోసం నిర్వాహకులు లక్షల రూపాయలు వెచ్చిస్తారు.

ఒక్కో బరిలో కనీసంగా గంటకు నాలుగైదు పందాలు నడుస్తాయి. రోజులో 100 పందాల వరకూ సాగేందుకు అవకాశం ఉంటుంది. ప్రతీ పందెంలోనూ గెలిచిన వారు అందులోంచి కొంత మొత్తం నిర్వాహకులకు అందించాలి.

ఒక్కో ప్రాంగణంలో మూడు, నాలుగు బరులు కూడా ఏర్పాటు చేస్తుంటారు. ఇతర వ్యాపారాలు కూడా నిర్వాహకులకు పెద్దమొత్తంలో అందించాలి.

ఒక్కో బరి ఏర్పాటు చేసిన వారికి పెద్ద బరులయితే మూడు రోజులకు కనీసం రూ. 20లక్షల పైబడి ఆదాయం వస్తుందని అంచనా.

కోడి పందాలు

వందల కోట్లు దాటే పందాలు

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా నుంచి బాపట్ల జిల్లా వరకూ ఈ కోడిపందాల ప్రభావం కనిపిస్తుంది. అందులోనూ కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో ఎక్కువగా ఉంటుంది.

భీమవరం వంటి పట్టణాల్లో పెద్ద మొత్తంలో జరిగే పందాల మూలంగా ఆంధ్రా లాస్ వెగాస్ అనిపించుకునే దశకి చేరింది.

ఏటా సంక్రాంతి సమయంలో 200 వరకూ పెద్ద బరులు, మరో 500 వరకూ ఓ మాదిరి బరులు ఏర్పాటు చేస్తుంటారు. పెద్ద బరుల ద్వారానే నిర్వాహకులకు రూ. 40 కోట్ల వరకూ ఆదాయం వస్తుందని ఓ అంచనా.

బరుల నిర్వాహకుల నుంచి పోలీసులకు, ప్రజా ప్రతినిధులకు కూడా మామూళ్లు అందించాల్సి ఉంటుందని బాపట్ల జిల్లా రేపల్లె మండలానికి చెందిన కిలారి తమ్మారావు అన్నారు.

"బరి ఏర్పాటు చేయాలంటే చాలా తతంగం ఉంటుంది. ముందుగా అధికార పార్టీ నాయకుల నుంచి అనుమతి ఉండాలి. ఆ తర్వాత పోలీస్ అధికారుల నుంచి కూడా అధికారికంగా మన జోలికి రారనే ధీమా ఉండాలి. లేదంటే ఏర్పాట్లు చేసిన తర్వాత అందరికీ సమాచారం ఇచ్చి, తీరా బరి నడపకపోతే నమ్మకం పోతుంది. మళ్లీ మరుసటి ఏడాది కూడా రారు. అందుకే 15రోజుల ముందుగానే క్లారిటీ తీసుకుంటాం. పైకి ఎన్ని చెప్పినా పండగ మూడు రోజులూ తప్పదు కాబట్టి పర్మిషన్ వచ్చేస్తుంది. మా జోలికి ఎవరూ రాకుండా స్టేషన్ వారిని, లోకల్ లీడర్లను సంతృప్తి పరచాల్సి ఉంటుంది" ఆయన బీబీసీకి వివరించారు.

ఇదంతా బహిరంగ రహస్యమేనని, దానికి ఆధారాలు అంటే ఎవరూ చూపించలేరని తమ్మారావు అన్నారు.

కోడి పందాలు

ఫొటో సోర్స్, AP Police

రాజకీయాలకు కూడా ...

కోడిపందాల ద్వారా లభించే ఆదాయం మాత్రమే కాకుండా పల్లెల్లో పందాలకు అనుమతించడం అనేది రాజకీయాలతో కూడా ముడిపడి ఉంటుంది.

ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆపార్టీకి సంబంధించిన వారే ఎక్కువగా కోడిపందాల బరులు ఏర్పాటు చేస్తుంటారు. పాలక పార్టీకి చెందిన వారి బరులకు ఆటంకాలు కూడా ఉండవు.

గ్రామాల్లో కొందరు రాజకీయ నేతలు కూడా బరులు విషయంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలంటూ ఎమ్మెల్యేలు, పోలీస్ అధికారులపై ఒత్తిడి తీసుకురావడం ఏటా జరిగే వ్యవహారమే.

కనీసం భోగి, సంక్రాంతి, కనుమ మూడు రోజుల పాటు పోలీసులు చూసీ చూడనట్టుగా ఉండాలనే మౌఖిక ఆదేశాలు వస్తుంటాయి. కొన్ని సార్లు పోలీస్ సిబ్బంది కొందరు క్షేత్రస్థాయిలో నిబంధనల పేరుతో కోడి పందాలను అడ్డుకోవడం రాజకీయ వివాదాలకు కూడా దారితీస్తుంది.

కోడిపందాల కేసుల్లో అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలంటూ గతంలో పశ్చిమ గోదావరి జిల్లా జెడ్పీ సమావేశాన్ని కూడా బహిష్కరించిన నాయకులున్నారు.

కోడి పందాలు

ఫొటో సోర్స్, AP Police

"కోడి పందాలకు అడ్డంకులు సృష్టిస్తే రాజకీయంగానూ ఇబ్బందులుంటాయని నాయకులు భావిస్తారు. అందుకే గ్రామ స్థాయిలో కార్యకర్తల నుంచి వచ్చే ఒత్తిళ్లకు అనుగుణంగా వ్యవహరిస్తారు. కొందరు ఎమ్మెల్యే స్థాయి నాయకులే బరులను ప్రోత్సహించిన అనుభవాలున్నాయి. సంక్రాంతి ముందు వరకూ పోలీసులు బ్యానర్లు కట్టడం, కొన్ని చోట్ల పందాలు అడ్డుకోవడం చేస్తారు. కానీ తీరా ఆ మూడు రోజులు ఏమీ మాట్లాడకపోవడానికి కారణం ఉన్నతస్థాయి ఆదేశాలే. ఇది పోలీస్ వ్యవస్థ ప్రతిష్టను తగ్గించే వ్యవహారం అయినప్పటికీ ఏటా అలానే జరుగుతోంది" అంటూ కాకినాడకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ పి.రాజు అన్నారు.

ఎన్నికల ఏడాది సహజంగానే కోడిపందాలు ఉధృతంగా సాగుతుండడానికి ఇదో కారణమని ఆయన అన్నారు. ఈసారి కూడా ఎన్నికల వాతావరణం మొదలుకావడంతో కోడి పందాలకు పెద్ద స్థాయిలో ఏర్పాట్లు జరిగాయని తెలిపారు.

వీడియో క్యాప్షన్, ఆ సింహానికి ఇయర్ డ్రాప్స్ వేయాల్సి వచ్చినప్పుడు ఏం చేశారు?

పండగ వాతావరణం అక్కడే...

కోడిపందాల నిర్వహణ పట్ల గతంలో కొంత ఆటంకాలు కల్పించడంతో కోర్టుల వరకూ ఈ వ్యవహారం వెళ్లింది. వైఎస్సార్సీపీకి చెందిన ప్రస్తుత ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టులో కూడా కేసు వేశారు. సంప్రదాయ క్రీడగా కోడిపందాలను అనుమతించాలని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. కోళ్లకు కత్తులు కట్టకుండా పందెం నిర్వహించుకోవడానికి తాత్కాలిక అనుమతిపొందారు.

గోదావరి, కృష్ణానదీ తీరాల వెంబడి సంక్రాంతి అంటే కోడిపందాలు అన్నట్టుగా మారిపోయింది. చాలా చోట్ల సందడి అంతా పందాల బరుల దగ్గరే కనిపిస్తుంది. జనసందోహంతో పగలూ, రాత్రి తేడా లేకుండా సాగిపోతుంది.

"కోడిపందాలంటే గడిచిన రెండు దశాబ్దాల్లో బాగా క్రేజ్ పెరిగింది. మీడియా వచ్చిన తర్వాత ప్రచారం విస్తృతమయ్యింది. సెలబ్రిటీలు కూడా వచ్చి పాల్గొనడంతో చాలామంది కోడిపందాల వైపు మళ్లారు.

కోళ్లను కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకుని, వాటికి మనిషికన్నా అధికంగా పౌష్టికాహారం అందించే స్థాయికి చేరింది. అంతకుముందు కోడిపందాలు సాధారణ స్థాయిలో, కొన్ని చోట్ల మాత్రమే సాగేవి. కానీ ఇప్పుడు బాగా విస్తరించాయి. కార్పోరేట్ హంగులన్నీ వచ్చేశాయి. కోడిపందాల బరులే జాతరను తలపించే దిశకు చేరాయి.

అధికార వ్యవస్థ కూడా ఆ మూడు రోజుల పాటు అనధికారికంగా అనుమతులు ఇచ్చేస్తున్న దశలో అడ్డూ అదుపులేకుండా పోయింది" అని రాజమహేంద్రవరం రూరల్ మండలానికి చెందిన పెసింగి రమేశ్ అన్నారు.

జంతు ప్రేమికుల అభ్యంతరాలు, ఇతర చట్టాలన్నీ అమలు చేసే పరిస్థితి ఉండడం లేదని ఆయన బీబీసీకి తెలిపారు.

నియంత్రణ ఉండబట్టే....

పోలీసులు తొలుత పల్లెల్లో హెచ్చరికలు చేసేవారు. ఆ తర్వాత బోర్డులు పెట్టారు. ఇటీవల దాడులు చేసి బరులు దున్నేయడం వంటివి కూడా అడపాదడపా చేస్తున్నారు.

ఈ ఏడాది కొన్ని జిల్లాల్లో పోలీసులు జూద క్రీడలు వద్దనే ప్రచారంతో సరిపెట్టకుండా సంక్రాంతి ఆటలపోటీలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే అవి కూడా సంక్రాంతికి ముందే పూర్తి చేస్తుండడం విశేషం.

"పోలీసుల హెచ్చరికలు కారణంగానే అదుపులో ఉంటున్నాయి. హద్దు మీరకుండా పోలీసుల నియంత్రణ ఉపయోగపడుతోంది. చట్టాన్ని అమలు చేయడానికి పోలీసులు చాలా సందర్భాల్లో ప్రయత్నిస్తారు. లేదంటే కోడిపందాలు, ఆ సందర్భంగా జరిగే జూదం మూలంగా చాలామంది నష్టపోతారు. పోలీస్ చర్యల కారణంగానే అనేక చోట్ల పరిధి దాటకుండా వ్యవహరిస్తుంటారు"అని రిటైర్డ్ డీఎస్పీ పి రవీంద్ర కుమార్ అన్నారు.

పోలీసులు కూడా చట్టం అమలు చేసేందుకు శక్తిమేరకు ప్రయత్నిస్తారని, కానీ వారు కూడా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన బీబీసీతో అన్నారు.

తాను పనిచేస్తున్న సమయంలో గ్రామంలో కొద్దిమందికి మాత్రమే కోడిపందాలు ఎక్కడ జరుగుతున్నది తెలిసేదని, ఇప్పుడు లైవ్ ఇచ్చుకుంటూ ప్రచారం చేసుకునే పరిస్థితి వచ్చిందని రవీంద్రకుమార్ తెలిపారు.

ప్రచారం నిలిపివేస్తే కోడిపందాల నుంచి కొత్త తరం దృష్టిని మళ్లించడం, పందెం నిర్వాహకులను నియంత్రించడం కష్టం కాదని అభిప్రాయపడ్డారు.

వీడియో క్యాప్షన్, కాకినాడ జిల్లా ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్న రాయల్ బెంగాల్ టైగర్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)